ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

26, ఫిబ్రవరి 2009, గురువారం

పద్య కవులారా! "తొ" కాదు - "తో"

పద్య కవులారా! "తొ" కాదు - "తో"
-------------------------------------
డా.ఆచార్య ఫణీంద్ర

ఇటీవల అంతర్జాలంలో చాల మంది పద్య కవులు "కరుణతొ", "సీతతొ" అని పద్యాలలో వ్రాస్తున్నారు. అది తప్పు. "కరుణతో", "సీతతో" అని వ్రాయాలి. "తొ" అన్నది సాధు రూపం కాదు. తృతీయ విభక్తిలో - "చేతన్, చేన్, తోడన్, తోన్" అన్న రూపాలే ఉన్నాయి కాని, "తొన్" లేదు కదా! (వచనంలో కూడా ఇలా వ్రాయడం తప్పే అవుతుంది సుమా!) ఇలాంటిదే - షష్ఠీ విభక్తిలోని "లోన్" కూడా. "గదిలొ" అని వ్రాయకూడదు. "గదిలో" అని వ్రాయాలి.


అయితే ఈ విషయంలో గణాల కోసం ఇబ్బంది పడే పద్య కవులకు ఒక చిన్న సలహా!

ఒకవేళ "కరుణతొ బ్రోచె" అని వ్రాయాలి అనుకొందాం. అప్పుడు "కరుణను బ్రోచె" అని వ్రాయవచ్చు.
అలాగే "సీతతొ చెప్పె" అని వ్రాయాలనుకోండి. అప్పుడు "సీతకు చెప్పె" అని వ్రాయవచ్చు.
అదే విధంగా "గదిలొ" అని వ్రాయాలి అనుకొందాం. అప్పుడు "గదిని" అని వ్రాయవచ్చు.
ఇలాంటి మెలకువలు పాటించి పద్య కవులు తప్పులు లేకుండా పద్య రచన చేస్తారని ఆశిద్దాం.

" పద్యం రక్షతి రక్షితమ్ "

20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

సమస్యను పరిష్కరించండి - ఫిబ్రవరి 2009

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని, చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది. ప్రతి నెలా ఈ శీర్షిక కింద ఒక సమస్య ఇచ్చి పూరణలను ఆహ్వానిస్తామని లోగడ తెలియజేశాను.

ఫిబ్రవరి
నెలలో ఇచ్చిన సమస్య , దానికి వచ్చిన పూరణలు ఇలా ఉన్నాయి.

సమస్య : సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్ !

జిగురు సత్యనారాయణ గారి
పూరణ :

ఆకృతి దాల్చగ కూటమి
ఆ కలన సమయము వచ్చినంత తెరాసా
కైకొనెను పెక్కు సీట్లన్ -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!!

ఆత్రేయ గారి
పూరణ :

పైకము, పదవులు చాలక
శోకించెడి రైతుల వ్యధ చూడక రాజుల్
మైకున అరచిరి ఓటిడ -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!

సంపాదకుని ( డా.ఆచార్య ఫణీంద్ర ) పూరణ :

నాకిడవలె పలు సీట్లని,
లేకున్నను పొత్తులింక లేవని చెప్పెన్
ఆ కే.సీ.ఆర్. బాబుకు -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!

మార్చ్ మాసంలో మరొక కొత్త సమస్యతో మళ్ళీ కలుద్దాం.

- సంపాదకుడు

9, ఫిబ్రవరి 2009, సోమవారం

ఈ మాసం పద్య కవిత

teluguthalli2

తెలుగు వెలుగు
- డా.ఆచార్య ఫణీంద్ర

భాష ఎయ్యది దేవభాషతో పెనగూడి
జంట నాగుల నాట్య జతులు పలికె-
భాష దేనిని యతిప్రాసలే ఒనగూడి
కవచ కుండల దివ్య కాంతులొలికె-
భాష ఎద్దానికిన్ ద్వ్యర్థి మరియు త్ర్యర్థి
సత్కావ్య నిర్మాణ సత్త్వ మమరె-
కరము నే భాషరా కర్ణాట సంగీత
వాగ్గేయ కళకయ్యె పట్టుగొమ్మ-

భాష దేనిలో అవధాన భాసుర కళ
విశ్వ భాషీయులకు నెల్ల విస్తు గొలిపె-
అద్ది నాదు తెలుగు భాష! అమృత ధార!
తెలుగు గాక ఇంకెందునీ వెలుగు గలదు?

ఒక విదేశీయుడే ఉప్పొంగి స్తుతియించె
ఇది ’ఇటాలియ నాఫ్ ద ఈస్ట’టంచు -
ఒక విదేశీయుడే ఊడిగమ్మును చేసె
జీవితాంతము, దీని ఠీవి మెచ్చి -
ఒక విదేశమునందు నుత్సవా లగుచుండె
’ఆట’,’తానా’లకై ఆట పట్టు -
ఒక దేశమని కాదు - సకలావనిని నేడు
తెలుగు భాషా జ్యోతి తేజరిల్లె -

’దేశ భాషలందు తెలుగు లెస్స’ యనుట
ప్రాత వడిన మాట - శ్రోతలార!
దేశ భాషలును, విదేశ భాషలు నెల్ల
విశ్వ భాషలందు వెలుగు తెలుగు!


* ఈ శీర్షికలో ప్రచురణార్థం పద్య కవులు తమ పద్య కవితలను తెలుగు(యూనికోడ్)లో టైపు చేసి, dr.acharya_phaneendra@in.com కు ఈ-మెయిల్ చేయగలరు.

- డా.ఆచార్య ఫణీంద్ర ( సంపాదకుడు )

7, ఫిబ్రవరి 2009, శనివారం

సంపాదకీయం

మహాకవి కీ.శే. డా.నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య ప్రచారం, ఆ మహనీయుని ఆదర్శాల ప్రచారం మరియు జీవితాంతం వరకు ఆయన కృషి చేసిన పద్య కవితా ప్రచారం కోసం "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" అధికార ’బ్లాగు’గా దీనిని ప్రారంభిస్తున్నాం.
ప్రతి నెలా పీఠానికి సంబంధించిన ’వార్తా విశేషా’లతోబాటుగా, ’సులువుగా పద్యం వ్రాయడం ఎలా?’, ’సమస్యా పూరణం’, ’ఆణి ముత్యం’ వంటి అనేక ఆకర్షణీయమైన శీర్శికలతో ఈ బ్లాగు నిర్వహించబడుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
అలాగే ప్రతి నెలా 'ఈ మాసం పద్య కవిత' శీర్షికలో పాఠకులు పంపిన ఒక పద్య కవితను ప్రచురించదలచాం. పద్య కవులు సమకాలీన సామాజికాంశాలపై, ఆ మాసంలోని పండుగలపై, సార్వ కాలీన సర్వ జనామోద అంశాలపై చక్కని పద్య కవితలను dr.acharya_phaneendra@in.com కు తెలుగు (యూనికోడ్) లో టైపు చేసి, ఈ-మెయిల్ చేయగలరు.
ఆచార్యుల వారి శిష్యులు, అభిమానులు మరియు సాహితీ ప్రియులందరూ ఈ బ్లాగును తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను. బ్లాగు వీక్షకులు తమకు తోచిన ఉచిత సూచనలను వ్యాఖ్యల ద్వారా అందించి, ఈ బ్లాగు అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడగలరని ఆకాంక్షిస్తున్నాను.
- డా.ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి
నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం

వార్తా విశేషం

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా "డా.నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభ" ను 29 ఏప్రిల్ 2009 నాడు హైదరాబాదులో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు కీ. శే. నండూరి రామకృష్ణమాచార్య శిష్యులు, సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి డా.ఆచార్య ఫణీంద్ర తెలియజేసారు. ఆ రోజు ఒక ప్రముఖ పద్య కవిని నండూరి వారి స్మారక పురస్కారంతో సత్కరించడంతోబాటు, పద్య పఠన పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతీ ప్రదానం చేయనున్నట్టు ఆయన వివరించారు. కార్యస్థలం, కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని త్వరలో అందించగలమని డా.ఫణీంద్ర చెప్పారు.

6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

సులువుగా పద్యం వ్రాయండి

పద్యం వ్రాయడమంటే 'ఛందస్సు', 'గణాలు', 'యమాతారాజభానస', 'నజభజజజర'- అబ్బో! పెద్ద గోల అనుకోవడం సహజం. కాని ఆ బాధలేమీ లేకుండా పాట వ్రాసినంత హాయిగా, ఆటపట్టులా, అలవోకగా పద్యాలల్లే మార్గాన్ని ఈ శీర్షిక ద్వారా ప్రతి నెలా ఒక చిన్న'లెస్సన్' తో నేర్పించబోతున్నాను. ఆసక్తి గల వారు నేర్చుకొని పద్యకవులుగా రూపొందవచ్చు.
వచ్చే నెలలోనే ప్రారంభం. ఈ లోపు ముందుగా మానసికంగా సిద్ధం కండి.

సమస్యను పరిష్కరించండి

పద్యాన్ని పూరించి ఈ సమస్యను పరిష్కరించండి.
'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని, చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది. ప్రతి నెలా మేమిచ్చే ఒక 'సమస్య'ను పూరించి, పద్యాన్ని మీ 'వ్యాఖ్య' గా అందించండి.

ఈ నెల సమస్య : సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!
-------------------------------------------------

"ఆణి ముత్యం"

శీర్షికలో ప్రతి నెలా, మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్యచే విరచితమైన ఒక ఆణి ముత్యం లాంటి పద్యాన్ని అందించనున్నాం.

* ఏను తరచు మార్చి తెన్నొ ఉద్యోగముల్,
ఊళ్ళు, ఇళ్ళు, కార్లు, కళ్ళ జోళ్ళు -
మార్చినాడ నెన్నొ మా శ్రీమతిని తప్ప!
మధుర కవిత మీద మమత తప్ప!!