12, ఏప్రిల్ 2009, ఆదివారం

సులువుగా పద్యం వ్రాయండి ... (ఏప్రిల్ 2009)

ఇప్పుడిక పద్యాలలో యతి, ప్రాసలను ఎలా వేయాలో తెలుసుకొందాం.
మన అక్షరాలను మనం ’అచ్చులు’, ’హల్లులు’ అని రెండు విభాగాలుగా నేర్చుకొన్నాం.
’అ’ నుండి ’ఆః’ వరకు ఉన్నవి అచ్చులు -
’క’ నుండి ’ఱ’ వరకు ఉన్నవి హల్లులు.
మన భాషలోని పదాలలో ప్రతి అక్షరంలో అచ్చు, హల్లు రెండు మిళితమై ఉంటాయి. అందుకే మనం ’గుణింతా’లని నేర్చుకొనేది.
మనం పద్యాలలో ’యతి మైత్రి’ వేసేప్పుడు అటు ’స్వర (అచ్చు) మైత్రి’, ఇటు ’వ్యంజన (హల్లు) మైత్రి’ రెండూ కుదిరేలా చూసుకోవాలి.
అచ్చులలో క్రింద పేర్కొన్న జట్టులలో వాటిలో వాటికే యతి కుదురుతుంది కానీ , వేరే వాటితో కుదరదు.
* అ,ఆ,ఐ,ఔ,అం,ఆః,య,హ
ఉదా|| ’అ’ల్పుడెపుడు పలుకు ’ఆ’డంబరముగాను
* ఇ,ఈ,ఎ,ఏ,ఋ,ౠ,
ఉదా|| ’ఇ’తరులెరుగకున్న ’ఈ’శ్వరు డెరుగడా?
* ఉ,ఊ,ఒ,ఓ
ఉదా|| ’ఉ’ప్పు కప్పురంబు ’ఒ’క్క పోలిక నుండు
పై మూడు జట్టులలోని అక్షరాలను గుర్తుంచుకొని, ఉదాహరణలను పరిశీలిస్తే విషయం బోధపడుతుంది.
’య’,’హ’ హల్లులైనా ఉచ్చారణ దగ్గరగా ఉండడం వలన ’అ’ జట్టులోని అచ్చులతో కూడి ఉంటే, ఆ అచ్చులతో యతి మైత్రి కుదురుతుంది.
ఉదా|| ’అ’ల్లరి మూక నేతలు మ’హా’త్ములటన్నను నమ్మ శక్యమే?
ఇందులో ’అ’కి, ’హా’కి యతి కుదిరింది. అలాగే మరొక
ఉదా|| ’య’జ్ఞ ఫలము నందుకొనిరి ’ఆ’తని పత్నుల్!
ఇక్కడ ’య’కి, ’ఆ’కి యతి మైత్రి కుదిరింది.
ఇక హల్లులలో ఏ ఏ జట్టులలో ఏ ఏ అక్షరాలకు యతి కుదురుతుందో చూద్దాం.
* క, ఖ, గ, ఘ, క్ష
ఉదా|| ’కం’చు మ్రోగినట్లు ’క’నకంబు మ్రోగునా?
ఇలాగే మిగితా జట్టులు ...
* చ, ఛ, జ, ఝ, శ, ష, స, క్ష, జ్ఞ
* ట, ఠ, డ, ఢ
* త, థ, ద, ధ
* న, ణ, o
* ప, ఫ, బ, భ, వ
* మ, oప, oఫ, oబ, oభ (ప్రత్యేకంగా... పు, పూ, పొ, పో, ఫు, ఫూ, ఫొ, ఫో, బు, బూ, బొ, బో, భు, భూ, భొ, భో- లతో ... ము, మూ, మొ, మో లకు యతి కుదురుతుంది.)
ఉదా|| ’మా’దు జనని! దుర్గమ్మ! అ’oబ’! దయ జూడు
అలాగే, మరో ఉదా|| ’పు’లతి అందమైన ’మో’ము జూడు
ఇంకా మిగిలిన జట్టులు ఇవి -
* ర, ఱ
* ల, ళ
* య, హ, అ,ఆ, ఐ, ఔ, అం, ఆః
ఒక ముఖ్య విషయమేమిటంటే, యతి మైత్రి అంటే - అచ్చు మైత్రి, హల్లు మైత్రి రెండూ తప్పకుండా కుదరాలి.
ఉదా|| ’దే’శ భాషలందు ’తె’లుగు లెస్స
ఇందులో ’ద’ కి, ’త’ కి హల్లు మైత్రి, అందులోని ’ఏ’ కి, ఇందులోని ’ఎ’కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి.
ఉదా|| ’స’జ్జనుండు పలుకు ’చ’ల్లగాను
ఇందులో ’స’ కి ’చ’ కి మధ్య హల్లు మైత్రి - మళ్ళీ అందులోని ’అ’ కి, ఇందులోని ’అ’ కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి. మరొక ఉదా||
’చి’త్త శుద్ధి లేని ’శి’వ పూజలేలయా?
ఇందులో ’చ’ కి ’శ’ కి హల్లు మైత్రి మరియు అందులోని ’ఇ’ కి, ఇందులోని ’ఇ’ కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి గదా!
ఇవి గాక ’ప్రాస యతి’ అని ఒకటుంది. ఇది అన్ని ఛందస్సులలో పనికి రాదు. కొన్ని ఛందస్సులలో అంగీకరింపబడుతుంది. ఉదాహరణకు ’సీసము’, ’తేట గీతి’, ’ఆట వెలది’ మొ||వి. పైగా, ఈ ఛందస్సులలో ప్రాస యతి వాడితే ఆ పద్యాలకు మంచి అందం కూడా వస్తుంది.
’ప్రాస యతి’ అంటే, ఆ యా అక్షరాలకు మధ్య యతి బదులు వాటి ప్రక్క అక్షరాలకు ప్రాస వేయడం.
ఉదా|| ’ఇల్లు’ మొత్తమపుడు ’గుల్ల’యయ్యె
ఇందులో ’ఇ’ కి ’గు’ కి యతి కుదర లేదు. కాని వాటి ప్రక్కన రెండు చోట్లా ’ల్ల’ అన్న ప్రాస పడింది. ఇది ’ప్రాస యతి’
’యతి’ గురించి ఈ జ్ఞానం సరిపోతుంది.
ఇక ’ప్రాస’ - ఇది ఇంతకు ముందు పాఠంలో చెప్పుకొన్నట్టు పద్యంలోని ప్రతి పాదంలో రెండవ అక్షరం ఒకటే అదే హల్లుకు సంబంధించినది ఉండడం. అందులోని అచ్చు మారినా ఫరవా లేదు.
ఉదా|| క’oదు’కము వోలె సుజనుడు
క్రి’oదం’బడి మగుడి మీది
కెగయు జుమీ
మ’oదు’డు మృత్పిండము వలె
గ్రి’oదం’బడి యడగి యుండు
గృపణత్వమునన్
ఈ పద్యంలో బిందు పూర్వక దకార( oద) ప్రాస వేయబడింది. గమనించారు కదా!
ఈ విషయాలన్నీ మనసులో ఆకళించుకొని, ఈ మాసమంతా ఎక్కడ ఏ పద్యం కనిపించినా దానిలో యతి ప్రాసలు ఎలా వేసారో గమనిస్తూ, సాధికారతను సాధించండి.
వచ్చే నెలలో సులభంగా వృత్త పద్యాలు వ్రాయడం నేర్చుకొందాం మరి. ఇప్పటికిక సెలవు.
- డా.ఆచార్య ఫణీంద్ర
(సంపాదకుడు)

8, ఏప్రిల్ 2009, బుధవారం

"ఆణిముత్యం" ... ఏప్రిల్ 2009

మెదడులోన ’మార్క్సు’, హృదిలోన బుద్ధుడై -
విప్లవమ్ము, కరుణ వింగడించి
పుట్టవలయు సుకవి భువనైక పౌరుడై
ప్రగతి కొరకు - నూత్న జగతి కొరకు!


వేమన వలె మా గురువు గారు రచించిన వేలాది ఆటవెలది ముక్తక పద్యాలలో ఇది ఒకటి.
మా గురువు గారు - స్వర్గీయ ’నండూరి రామకృష్ణమాచార్య’ సాహిత్య లోకంలో బహుళ ప్రసిద్ధి చెందిన మహాకవి. వీరు రచించిన ’శీర్ణ మేఖల’ ఖండ కావ్యం ఏభయ్యేళ్ళ క్రితం ఒక ఊపు ఊపింది. అందులోని కర్ణ, సుయోధన మైత్రికి సంబంధించిన ఘట్టం వీరి స్వీయ కల్పితం. ఈనాటికీ ఇది నీరాజనాలందుకొంటూనే ఉంది. మా గురువు గారు డా.నండూరి రామకృష్ణమాచార్య ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ’అధికార భాషా సంఘం’ అధ్యక్షులుగా 1987- 1990 మధ్య పని చేసారు.
వీరి ప్రసిద్ధ రచనలలో ’తారా తోరణం’, ’ఆలోచనం’, ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’,’ముత్యాల గొడుగు’, ’కచ్ఛపీ కింకిణీకం’ వంటి కవితా సంపుటులు; ’శివాజీ’, ’ధర్మ చక్రం’, ’జ్యోత్స్నాభిసారిక’, ’గోదావరి’ వంటి నాటికలు; ’కావ్యాలోకం’ అనే లక్షణ గ్రంథం; ’కవిత్రయం’, ’పద్య శిల్పం’ వంటి విమర్శన గ్రంథాలు ప్రముఖమైనవి. ఇవి గాక ఆంగ్లంలో 'Maha Bharata', 'Gandhian Era' ప్రసిద్ధ రచనలు. మహాకవి ’కరుణశ్రీ’, వీరు ఆత్మీయ మిత్రులు. ’కరుణశ్రీ’ గ్రంథాలన్నిటికీ ’నండూరి’ వారే పీఠికలు వ్రాసారు.
’కేంద్ర సాహిత్య అకాడమి’ 1955 ప్రాంతంలో ’జాషువ’, ’కరుణశ్రీ’ మరియు మా గురువు గారిని ’నవ్య సంప్రదాయ కవులు’గా గుర్తించింది.
ఆచార్యుల వారు ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా ఆమరణాంతం పద్య కవితాభివృద్దికై విశేష కృషిని సలిపారు.
మెదడులోని ఆలోచనా విధానంలో ’కార్ల్ మార్క్స్’ ప్రబోధించిన సామ్యవాదాత్మక విప్లవ భావాలను, అంతరంగంలో ’బుద్ధుడు’ బోధించిన కరుణ తత్త్వాన్ని కలిగి - సత్కవియైన వాడు ఈ ప్రపంచంలో ఒక విశిష్ట వ్యక్తిగా అవతరించి, ప్రగతిని సాధించేందుకు పాటుపడుతూ, ఒక నవ సమాజ నిర్మాణానికి దోహదపడాలని ఈ పద్య భావం. వైరుధ్య భావాలలో కూడా ఉన్న ’మంచి’ని గ్రహించి కవి ముందుకు సాగాలని గురువు గారు ఈ పద్యంలో కవిలోకానికి సందేశం అందించారు.
- డా.ఆచార్య ఫణీంద్ర

5, ఏప్రిల్ 2009, ఆదివారం

ఈ మాసం పద్య కవిత ...(ఏప్రిల్ 2009)


అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రజ్ఞులు ఆచార్య వి.ఎల్.ఎస్. భీమ శంకరం గారు సాహిత్య లోకంలో ప్రౌఢ పద్య కవిగా ప్రసిద్ధులు. "రసస్రువు","శివానంద మందహాసం", "ద్రాక్షారామ భీమేశ్వర శతకం" మొదలైన రచనలతో ఆయన ఎనలేని ప్రఖ్యాతిని సాధించారు. ఆయన రచించిన "వసంత సభ" అన్న పద్య కవితను "ఈ మాసం పద్య కవిత"గా అందిస్తున్నాను.
ఈ శీర్షికలో ప్రచురణార్థం పద్య కవులు దయచేసి కొత్త విషయాలపై వ్రాసిన తమ పద్య కవితలను తెలుగు(యూనికోడ్)లో టైపు చేసి, dr.acharya_phaneendra@in.com కు ఈ-మెయిల్ చేయగలరు.
- డా.ఆచార్య ఫణీంద్ర

విరోధి నామ సంవత్సర వసంత సభ
-------------------------------------
రచన: ఆచార్య వి.ఎల్.ఎస్. భీమశంకరం
----------------------------------------

తెలతెలవారుచుండె, మది తీయని స్వప్నము తోడ నిండె, నే
తులుచన లేచి చెంత గల తోటకు నేగితి దైవ పూజకై
అలరులు కోయగా - నచట నబ్బుర మొప్పగ ప్రస్ఫురిల్లె క
న్నులు మిరుమిట్లు గొల్పగ వినూతన దృశ్యము లొక్క పెట్టునన్.

అపుడె ఉదయించు నాదిత్యు నరుణ కాంతి
కొలది కొలదిగ నన్ని దిక్కులకు కవిసి
నేల తల్లికి పారాణి నిమిరె ననగ -
ప్రకృతి కాంత కన్బడె నవ వధువు వోలె.

మొల్ల, సంపంగి, తంగేడు, పొగడ, మల్లె
మొల్లముల నుండి బహువర్ణ పుష్ప వృష్టి
నింగి హరివిల్లు నేలకు వంగుచుండె
ననగ నానంద పరిచె నా మనము నపుడు.

రంగు రంగుల అవనతాంబురుహ కుట్మ
లాంగనలు ఫుల్లమై లేచి భృంగ తతికి
నధర మకరంద నిష్యంద మధురమైన
చెరకు విలుతు లకోరీల బరపె నపుడు.

రంగు రంగుల పువ్వుల రంగశాల ,
రంగశాలను నర్తించు భృంగ చయము
లింపుగా తోచె కమనీయ దృశ్యముగను
హోలి యాడెడు రంగారు యువత వోలె

పిల్లగాలికి పూబాల ప్రేంకణములు,
ప్రేంకణంబుల చెలరేగి ప్రీతి గొల్పు
సరస పరిమళ సుమగంధ సౌరభంబు
లపుడు ప్రకటించె నామని ఆగమనము.

ఏమది! నేడు భూమి వసియించెడు స్థావర జంగమ వ్రజం
బామని శోభ దేలుచు సుఖాయుత దివ్య మనోజ్ఞ నాట్య గీ
తామృత మాస్వదించుటకునై మది నీవిధి నిశ్చితార్థులై
కామనతో వసంత సభ కాముని పండువుగా రచించిరో!

అవిగో - అల్లవిగో - అవే! నవ వసంతారంభ సంరంభముల్
రవిబింబం బరుణ ప్రియంగువులతో ప్రాచీ దిశన్ గప్పెడున్,
శ్రవణానంద మహోదయాగమున సంరావంబు విన్వచ్చెడున్,
భువి నేతెంచె 'విరోధి' ఆంధ్ర జన సమ్మోద ప్రమోదంబుగాన్.

పేరులో 'విరోధి'యె గాని ప్రేమ తోడ
జనుల సాకగా వచ్చిన సౌమ్య మూర్తి ,
మనల కాయురారోగ్య కామనల దీర్చు
వత్సరంబని నా మన ముత్సహించె.
--- *** ---

4, ఏప్రిల్ 2009, శనివారం

సమస్యను పరిష్కరించండి ... (ఏప్రిల్ 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :

"జెండాలే వేరు - మరి ఎజెండా లొకటే!"

ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 ఏప్రిల్ 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)