31, మార్చి 2009, మంగళవారం

పద్య కవిత్వం - కొన్ని సందేహాలు (డా. ఆచార్య ఫణీంద్ర తో 'haaram.com' భాస్కర రామిరెడ్డి ముఖాముఖి) - మూడవ భాగం

భా.రా.:సంస్కృత పదాలను సులభంగా ఎలా గుర్తించాలి? సంధిచేసేటప్పుడు ప్రతిసారి నాకు ప్రశ్న వుత్పన్నమౌతుంది.
..:సంస్కృత పదాలను, తెలుగు పదాలను కలిపి మిశ్రమ సమాసాలు చేయడం తప్పు. పండితులు వీటిని 'దుష్ట సమాసాలు' అంటారు. వార్తా పత్రికలలో భాషా ప్రమాణాలు మరీ దిగజారి ఈ మధ్య ఇవి బాగా వ్యాపించి భాషను ఖూనీ చేస్తున్నాయి. ఉదాహరణకు ఈ మధ్య ఏ వార్తా పత్రికను చూసినా 'పాలాభిషేకం' అని వ్రాస్తున్నారు. ఇక్కడ 'పాలు'- తెలుగు పదం; 'అభిషేకం'- సంస్కృత పదం. వీటిని సమాసం చేయకూడదు. దీనిని 'క్షీరాభిషేకం' అనాలి. దురదృష్ట మేమిటంటే ఇప్పుడు పొద్దున్న లేచి చూస్తే, ప్రసిద్ధి చెందిన వార్తా పత్రికలలోనే ఇలాంటి దోషాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అయితే వ్యవహార భాషలో ఎలా 'ఏడ్చినా', పద్యాలలో వీటిని పండితులు అంగీకరించరు. మరి ఈ తప్పులు చేయకుండా ఉండాలంటే ఏది సంస్కృత శబ్దం, ఏది తెలుగు శబ్దం అన్న పరిజ్ఞానం ఉండాలి.
ఒక చిన్న బండ గుర్తు ఉంది. మన అక్షరాలలో 'అల్ప ప్రాణాలు', 'మహా ప్రాణాలు' అని ఉన్నాయి. 'క, గ, చ, జ, త, ప, బ, మ, య, ల...' మొ||వి అల్ప ప్రాణాలు. ' ఖ, ఘ, ఛ, ఝ, థ, ధ, ఫ, భ...' మొ||వి మహాప్రాణాలు. అన్ని అల్ప ప్రాణాలున్న పదాలు 'తెలుగు పదాలు' అని చెప్పలేం గానీ - పదంలో ఒక్క మహాప్రాణమున్నా అది సంస్కృత పదమని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగులో మహాప్రాణ అక్షరాలు లేవు. అవి సంసృతం నుండి గ్రహించినవే. 'బడి, గుడి, బండ, మల్లె, పువ్వు, తీగ ... ఇలా అన్నీ తెలుగు పదాలు. అంత మాత్రాన 'లత, దేవాలయం, కాలం, జగతి...' కూడా తెలుగు పదాలు కావు. ఎందుకంటే సంస్కృతంలో కూడా అల్పప్రాణ అక్షరాలు ఉంటాయి. కానీ, 'ధర్మం, ఫలం, మోక్షం, భయం...' ఇలా మహాప్రాణం ఒక్కటున్నా అది కచ్చితంగా సంస్కృత శబ్దమే! అయితే ఈ అయోమయమేమీ లేకుండా ఉండాలంటే ' శబ్ద రత్నాకరం' లేదా 'సూర్య రాయాంధ్ర నిఘంటువు' - ఈ రెండు నిఘంటువులలో ఏది చూచినా, ప్రతి పదం పక్కన అది సంస్కృత పదమా, లేక తెలుగు పదమా వ్రాసి ఉంటుంది. సమాసం చేసేప్పుడు ఏదైనా సందేహం వస్తే వాటిలో చూసుకోవచ్చు.
భా.రా.:నానార్థాల,వ్యుత్పత్తి అర్థాల కొరకు మంచి నిఘంటువులేమైనా వుంటే తెలియ జేయండి.
..: తెలుగులో ఇటీవల నానార్థాలపై ఒక చక్కని గ్రంథం వచ్చింది. డా. పి. నరసింహా రెడ్డి రచించిన 'తెలుగు నానార్థ పద నిఘంటువు' అది. ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాదు వారి ప్రచురణ. అలాగే పర్యాయ పదాలపై జి. ఎన్. రెడ్డి గారి 'తెలుగు పర్యాయ పద నిఘంటువు' కూడా ఒక మంచి గ్రంథం. ఇక తెలుగు పదాలకు వ్యుత్పత్తి అర్థాలు ఉండవనే చెప్పాలి. 'చెంబు, గుడి, బండ...' మొ||న పదాలకు ఏం వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి. సంస్కృత పదాలకే వ్యుత్పత్తి అర్థాలు చెప్పవచ్చు. వీటి గురించి తెలుసుకోవాలంటే శ్రీ చలమచర్ల వేంకట శేషాచార్యులు రచించిన 'అమర కోశం- సంస్కృతాంధ్ర వివరణము' అన్న గ్రంథం చాలా అమూల్యమైనది.
భా.రా.: ఆచార్య ఫణీంద్ర గారు! సహృదయంతో శ్రమకోర్చి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఓర్పుతో నా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సదా కృతఙ్ఞుడను.
..: రామిరెడ్డి గారు! మీ వల్ల బ్లాగు మిత్రులకు తెలుగు భాష గురించి, తెలుగు పద్యాల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే అవకాశం లభించింది. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి.
(పరిసమాప్తం)

27, మార్చి 2009, శుక్రవారం

సంపాదకీయం (మార్చి 2009) - డా.ఆచార్య ఫణీంద్ర

సంపాదకీయం (మార్చి 2009)
- డా.ఆచార్య ఫణీంద్ర

గత నెల ప్రారంభించిన ఈ మా ’పీఠం’ అధికార (బ్లాగు) సంచిక విశేషాదరణను పొందిందనే చెప్పాలి. ఫిబ్రవరిలో వాగ్దానం చేసిన మేరకు, ఈ నెల ’సులువుగా పద్యం వ్రాయండి’ శీర్షిక ద్వారా పద్య రచనను బోధించే పాఠాలను ధారావాహకంగా ప్రారంభించాను. అంతర్జాలంలో చాలా మంది పద్య కవులు చేస్తున్న తప్పులను తెలియజెప్పే ఒక టపాను కూడా అందించాను. భావిలో ఇలాంటి టపాలను అడపా దడపా అందిస్తూ పద్య కవితాభివృద్ధికి నా వంతు ’ఉడుత’ సాయం చేయదలిచాను.ఇవి గాక ’హారం.కాం’ భాస్కర రామిరెడ్డి గారు "ఇలాంటి బ్లాగు కోసం చాలా రోజుల నుండి వెదుకుతున్నా" నంటూ, పద్య రచన గురించి అడిగిన కొన్ని సందేహాలకు సమాధానాలను ’ముఖాముఖి’ గా అందిస్తున్నాను.
గత మాసంలాగే ఈ మాసం కూడా మా గురువు గారు దివంగత మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్యచే విరచితమైన ఒక మంచి పద్యాన్ని ’ఆణిముత్యం’ శీర్షిక ద్వారా అందించాను. అయితే వచ్చే నెల నుండి దీనిని వ్యాఖ్యాన సహితంగా అందించే ప్రయత్నం చేస్తాను.అప్పుడు పాఠకులకు ఆ పద్యాల వైశిష్ట్యం సుబోధకమవుతుంది.
’ఈ మాసం పద్య కవిత’ శీర్షికలో ప్రచురణార్థం పాఠకులు తమ పద్య కవితలను dr.acharya_phaneendra@in.com కు మెయిల్ చేయమని మరొకమారు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇక ఈ నెల ’సమస్యను పరిష్కరించండి’కి ఒక్క పూరణ మాత్రమే వచ్చింది. బహుశః పాఠకులు సమస్య కాస్త క్లిష్టంగా ఉందని భావించారేమో! అయితే అందరిలా కాక, నేను సమకాలీన, నవీన విషయాలకు సంబంధించిన సమస్యలనే ఈయ దలిచాను. దీని వలన పద్యంలో ఆధునిక భావాలను వెల్లడించడంలో పాఠకులకు అభ్యాసం అయి, పద్యాన్ని సార్వ కాలీన ప్రక్రియగా నిలబెట్టే మహదాశయానికి దోహదం చేసిన వారమవుతాం.

"పది రూపాయలు సన్న బియ్యమన కంపంబెత్తి రాంధ్ర ప్రజల్" అన్న సమస్యకు శ్రీ ’హరి దోర్ణల’ గారి పూరణ ప్రశంసనీయంగా ఉంది. హరి గారి పూరణ ఇది -

"పది రూపాయల నోటుతో నిపుడు ఏ పాటైన నిండేన కు
క్షి? ది గ్రేట్ సీ.యము.రాజశేఖరుని సాక్షిన్, కొద్ది బియ్యంబునే
ఇదిగో యంచిడె రెండు రూప్యములకే - ఏ మూల కౌనద్ది? ము
ప్పది రూపాయలు సన్న బియ్యమన కంపంబెత్తి రాంధ్ర ప్రజల్!"

సమస్యను రూపొందించిన సంపాదకునిగా, నా పూరణ ఇలా ఉంది -

"ఎదియో కొందరికంట బియ్య మిక రెండేరెండు రూపాయలే -
అదియున్, మొత్తము నిత్తు రిర్వది కిలో లంతే! మరా పైన - ఏ
బది కొట్టుల్ వెదుకాడిన, న్నొక కిలో బాజారులో చూడ - ము
ప్పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్ర ప్రజల్!"

ఈ బ్లాగుకు నేను సంపాదకుడను మాత్రమే. ఇందులో నా రచనల కన్న, ఎక్కువగా పాఠకుల రచనలను ప్రచురించడానికే ప్రాధాన్యతనిస్తాను. కాబట్టి పాఠకులు - ముఖ్యంగా పద్య కవులు, పద్య ప్రియులు అత్యధికంగా ఈ బ్లాగులోని వివిధ శీర్షికలలో బహుళంగా పాలు పంచుకొని పద్య కవితాభివృద్ధికి తోడ్పడాలని వేడుకొంటున్నాను.

పాఠకులందరికీ ’విరోధి’ నామ సంవత్సర ’ఉగాది’ శుభ కామనలు

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

23, మార్చి 2009, సోమవారం

పద్య కవిత్వం - కొన్ని సందేహాలు (డా. ఆచార్య ఫణీంద్ర తో 'haaram.com' భాస్కర రామిరెడ్డి ముఖాముఖి) - రెండవ భాగం

భా.రా.: గణాలు చూసుకుంటూ పద్యం రాస్తారా లేక పద్యం వ్రాసే టప్పుడు వచ్చే పదాల గణాలను చూసుకొని పద్యం మారుస్తారా?
..:"కవి యన్న వాడు ఆర్తితో అరిస్తే అది ఏదో ఒక ఛందస్సులో ఉంటుంది" అన్నారు ఆరుద్ర . ఇంతకు ముందు ప్రశ్నకు చెప్పిన సమాధానంలో అన్నట్టు 'ఉత్పల మాల', చంపక మాల', 'కందం', 'సీసం' మొదలైన ఛందస్సులలో పూర్తి సాధికారత పొందేలా అభ్యాసం చేసిన వారికి - తొలి భావం ఏ ఛందస్సులో పలుకుతుందో, అదే ఛందస్సులోనే మిగితా భావం కూడా సునాయాసంగా సాగిపోతుంది. అప్పుడు ఆ కవి దృష్టి - గణాలు, ఛందస్సుపై ఉండదు. సముచితమైన పదాలను వాడుతున్నానా? లేక ఇంకా మెరుగైన పదాలను వాడగలనా? అనుకొన్న భావాన్ని పలికించ గలుగుతున్నానా? లేక ఇంక మెరుగైన భావ వ్యక్తీకరణ సాధ్యమా? - అని ఆలోచిస్తాడు. తాను ఇదివరకే చేసిన అభ్యాస ఫలితంగా ఎలాంటి దోషాలు లేకుండా గణాలు పరిగెత్తుతుంటాయి. తన అభివ్యక్తిలో పరిపక్వత కోసం కవి పద్యాన్ని పునస్సమీక్షించుకొంటూ పద్యంలో అవసరమనుకొన్న చోట్ల మార్పులు చేస్తూ పరిపూర్ణంగా సంతృప్తి కలిగే వరకు దానిని చెక్కుతూనే ఉంటాడు.
భా.రా.: యతి
చాలా రకాలుగదా ? సులభంగా గుర్తుంచుకొనే మార్గాలు ఏమైనా వున్నాయా?
..: నిజమే! యతులలో చాలా రకాలున్నాయి. అందులో 'ప్రాస యతి' వృత్తాలలో, 'కందం'లో చెల్లుబాటు కాదు. కాని 'సీసం'లో, 'ఆట వెలది', 'తేట గీతి' మొదలైన పద్యాలలో అది చాల అందాన్ని సమకూరుస్తుంది. 'ప్రాస యతి' అంటే 'యతి' బదులు ప్రక్క అక్షరంతో ప్రాస వేయడం. ఉదాహరణకు - "ఇల్లు మొత్త మతడు గుల్ల చేసె". ఇందులో 'ఇ'కి, 'గు'కి యతి కుదర లేదు. వాటి ప్రక్క అక్షరాలకు ప్రాస(ఇల్లు - గుల్ల) పడింది.
'అఖండ యతి' అని ఉంది. దీనిని 'అప్ప కవి' వంటి లాక్షణికులు అంగీకరించ లేదు. కానీ ప్రాచీన కవులలోనే కొంత మంది ఆయన మాటను పెడ చెవిన పెట్టి దీనిని ప్రయోగించారు. సరే - ఇవన్నీ కవికి వెసులుబాటు కల్పించేందుకు ఉన్నవే కాని, కవి తప్పకుండా తెలుసుకొని ప్రయోగించాలన్న నియమమేమీ లేదు. వీటి కన్నా కవి డైరెక్టుగా 'యతి మైత్రి' వేస్తేనే పండితులు హర్షిస్తారు. కాబట్టి కవి 'యతి' వేయ వలసిన స్థానంలో 'స్వర(అచ్చు) మైత్రి, వ్యంజన(హల్లు) మైత్రి కుదిరిందా చూసుకొంటే సరిపోతుంది. (సశేషం)

19, మార్చి 2009, గురువారం

పద్య కవిత్వం - కొన్ని సందేహాలు (డా||ఆచార్య ఫణీంద్ర తో 'haaram.com' భాస్కర రామిరెడ్డి ముఖాముఖి) - మొదటి భాగం

భాస్కర రామిరెడ్డి: ఫణీంద్ర గారు! ఈ రోజు మీ 'నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం' బ్లాగును చూశాను. పద్య కవిత్వ వ్యాప్తికి ఈ బ్లాగు ద్వారా మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. బ్లాగులోని మీ పాఠాలు చదవడం వల్ల పద్య కవిత్వానికి , తెలుగు భాషకు సంబంధించిన సందేహాలు తీరుతాయి. ఇటువంటి బ్లాగు కోసం గత రెండు నెలలుగా వెదుకుతున్నాను. ముందు ముందు నాకున్న సందేహాలన్నింటికి మీ బ్లాగు సమాధానాలు ఇస్తుందని ఆశిస్తాను.
అయితే ఈ ముఖాముఖి ద్వారా ముందుగా మాలాంటి వారికి ఉండే కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకొంటున్నాను.
ఆచార్య ఫణీంద్ర: చాలా సంతోషం. ఆనందంగా అడగండి.
భా.రా.:పద్యం ఎన్నుకొని వర్ణన చేస్తారా? లేక వర్ణనకి కొన్ని రకాల పద్యాలు బాగా అతుకుతాయా?
. : కవితకైనా ముందు వస్తువు, దాని గురించి ఏం చెప్ప దలచుకొన్నామో ఆ భావం ముఖ్యం. అది వచన కవిత్వమయినా, పద్య కవిత్వమయినా లేక మరేదైనా. ఆ భావం ఒక గాఢమైన స్పందన వల్ల కలుగుతుంది. ఏ కవికైనా ఆ భావం ఒక సమగ్ర రూపం సంతరించుకోగానే అది పదాల రూపంలో దొర్లుకొంటూ వస్తుంది. శిల్పి శిల్పం చెక్కినట్లుగా కవి అప్పుడు ఆ పదాల ప్రవాహాన్ని భావంతో సమన్వయం చేస్తూ కవితను చెక్కుతాడు. ఏ కవైనా ఒకే దెబ్బలో కవిత రాసి పారేసానంటే అతనికి పరిపక్వత లేనట్టే. శిల్పి ఒక సుందరి ముక్కు చెక్కాలనుకొంటే, ముందుగా ముఖ భాగంలో ఒక ముద్దలాంటి బొడిపెను చెక్కుతాడు. తరువాత సన్నగా, పొడువుగా మృదువుగా మొనదేలేలా చెక్కుతాడు. ఆ పైన చెలిమలు అందంగా చెక్కుతాడు. అలా సంతృప్తికరంగా వచ్చే దాకా చెక్కుతూనే ఉంటాడు.కవిత కూడా అంతే. పద్యం గురించి చెప్పమంటే ఇదంతా చెప్పుతారేంటి అనుకోకండి. అక్కడికే వస్తున్నా. అన్ని రకాల ఛందస్సులపై బాగా అభ్యాసం చేసి సిద్దంగా ఉంటే, ప్రవాహంలా దొర్లుకు వచ్చే పదాలు ఏదో ఒక ఛందస్సు ప్రారంభ గణాలలో ఒదిగి ఉంటుంది. ఇక
అక్కడి నుండి శిల్పిలా చెక్కుతూ పోవడమే.పద్యం పూర్తయినా సంతృప్తికరంగా వచ్చేవరకు అక్కడక్కడా మారుస్తూ చెక్కుతూ ఉండాలి. పూర్తిగా సంతృప్తిగా వచ్చాక శిల్పి శిల్పాన్ని ప్రదర్శనకు ఉంచినట్టు, అప్పుడు కవితను ప్రచురించాలి. ఇది సాధారణంగా ఒక మంచి పధ్ధతి.
అయితే
అన్ని రకాల ఛందస్సులను అభ్యాసం చేసి అధికారం సాధించడం కొంచం కష్టమే. కాబట్టే మన ప్రాచీన కవులు కూడా 'ఉత్పల మాల','చంపకమాల', 'శార్దూలం', 'మత్తేభం', 'కందం', 'సీసం', 'ఆట వెలది', 'తేట గీతి' , అప్పుడప్పుడు 'మత్త కోకిల' - ఈ ఛందస్సుల లోనే విరివిగా వ్రాసేవారు. ఆధునికులు కూడా ఈ ఛందస్సులలో అధికారం సాధిస్తే చాలు. మిగితావి కావాలనుకొన్నప్పుడు కాస్త శ్రమ పడైనా ఒకటి అరా వ్రాయవచ్చు.
అయితే కొన్ని మార్లు పద్యం ఎన్నుకొని కూడా రచన చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక విషయాన్ని గూర్చి నాలుగు పాదాలలో నాలుగు రకాలుగా వర్ణించి తుదిలో conclusion లాంటిది ఇవ్వాలనుకొంటే , సీస పద్యం బాగా ఒదుగుతుంది. అలాగే కొన్ని పేర్లను పొదుగాలి అనుకోండి. ఆ పేర్లు ఏ గణాలలో, ఏ ఛందస్సులో ఇముడుతాయో వాటినే ముందుగానే ఎన్నుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు మీ పేరే తీసుకోండి. 'భాస్కర రామిరెడ్డి'. ఇది 'ఉత్పలమాల' లో ప్రారంభ గణాలలో గాని, 'తేట గీతి' పాదం చివరి గణాలలో గాని, సరిగ్గా ఒదుగుతుంది. (సశేషం)

15, మార్చి 2009, ఆదివారం

వార్తా విశేషం - (మార్చి 2009)

ప్రఖ్యాత పద్య కవి, పండితులు, తిరుపతి వాస్తవ్యులు శ్రీ 'ముదివర్తి కొండమాచార్య' గారికి, 2009 సంవత్సరానికిగాను 'నండూరి రామకృష్ణమాచార్య స్మారక పద్య కవితా పురస్కారం' అందించడానికి 'నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం' నిర్ణయించిందని 'పీఠం' కార్యదర్శి డా.ఆచార్య ఫణీంద్ర తెలియజేసారు. 2009 ఏప్రిల్ 29 నాడు హైదరాబాదులో జరిగే నండూరి వారి జయంతి సభలో ఈ పురస్కార ప్రదానం జరుగుతుందని ఆయన వివరించారు. ఇదే సభలో పద్య పఠనం పోటీలలో విజేతలైన ఈ క్రింది విద్యార్థినీ , విద్యార్థులకు బహుమతీ ప్రదానం కూడా చేయబడుతుంది అని ఆయన చెప్పారు.
బహుమతీ విజేతల వివరాలు : -
ప్రథమ బహుమతి : జి. రామకిషన్ (నిజామాబాద్)
ద్వితీయ బహుమతి : బి. శ్వేత గౌడ్ (హైదరాబాద్)
తృతీయ బహుమతి : జి. శ్వేత (ఒంగోలు)
ప్రోత్సాహక బహుమతులు : -
1) కే. కుమారా స్వామి (నల్గొండ)
2) ఎం. వెంకన్న (వరంగల్)
3) పి. కుసుమ (మహబూబునగర్)
4) డి. జితేంద్ర (గుంటూరు)
5) కే. మహేష్ (వరంగల్)
సభాస్థలి , కార్యక్రమ వివరాలు త్వరలో తెలుప గలమని డా. ఫణీంద్ర అన్నారు.

11, మార్చి 2009, బుధవారం

సులువుగా పద్యం వ్రాయండి ... (మార్చి 2009)

ఛందస్సు , గణాలు , 'యమాతారాజభానస' ల గోల లేకుండా పాట వ్రాసినంత సులువుగా పద్యం వ్రాయడం నేర్పుతానని గత నెలలో చెప్పడం జరిగింది. అయితే అంతకు ముందు 'యతి' , 'ప్రాస' ల గురించి కాస్త తెలుసుకోవలసిన అవసరం ఉంది.
తెలుగు భాషకు ఎంతో అందాన్ని కొనితెచ్చిన అమూల్య వరాలు యతిప్రాసలు. తెలుగు భాషకు అవి సహజ కవచ కుండలాల వంటివని మా గురువు గారు కీ. శే. నండూరి రామకృష్ణమాచార్య చమత్కరించే వారు. ఈ యతి ప్రాసలు కేవలం పద్యాలలోనే ఉంటాయనుకొంటే పొరపాటే. మన భాషలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు ఊళ్లలో నిరక్షరాస్యులు చెప్పుకొనే సామెతల్లో అవి విరవిగా కనిపిస్తాయి.
"కడుపు చించుకొంటే కాళ్ళ మీద పడుతుంది." - ఇందులో ప్రారంభాక్షరం 'క' ఉంటే, కొంత విరామం తరువాత 'కాళ్ళ' అనే పదంలో 'కా' అన్న అక్షరం ఉంది. అంటే ఇక్కడ 'క'కి, 'కా'కి యతి కుదిరిందన్న మాట. దీనినే 'యతి మైత్రి' అంటారు.
"ధిల్లీకి రాజైనా -
తల్లికి కొడుకే." - ఇందులో మొదటి లైన్లో (పద్యంలో దీనినే పాదం అంటారు) రెండో అక్షరం 'ల్ల' ఉంటే రెండో పాదంలో కూడా అదే 'ల్ల' అక్షరం ఉంది. దీనినే 'ప్రాస' అంటారు. 90 శాతం పద్యాల్లో ఈ ప్రాస నియమం ఉంటుంది. కొన్ని రకాల పద్యాల్లో ఈ నియమం అవసరం లేదు. అంటే అవి వ్రాయడం మరింత సులువన్న మాట.
'' కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు" అన్న అన్నమాచార్య కీర్తనలో 'కొం'కి , 'కోనేటి' లోని 'కో'కి యతి మైత్రిని గమనించారా?
"ఇందరికీ అభయమ్ము నిచ్చు చేయి -
కందువగు మంచి బంగారు చేయి !" అన్న అన్నమయ్య కృతిలో పై పాదంలో రెండో అక్షరం (సున్నాతో కూడుకొన్న) 'ద' రెండో పాదంలోనూ అదే ఉంది. ఇదే ప్రాస. అలాగే మొదటి పాదంలో 'ఇం'కి , 'ఇచ్చు'లోని 'ఇ'కి యతి మైత్రి. రెండో పాదంలో 'కం'కి 'బంగారు'లోని 'గా'కి యతి మైత్రి'.
ఇది గమనించకుండా మనలో చాలా మంది "పద్యాల్లో యతి ప్రాసలు - అవి చాలా కష్ట"మంటూ భయపెడుతూ ఉంటారు. ఆ భయం పోవాలంటే భాషలో పలు చోట్ల వచ్చే యతి ప్రాసలను అవి భాషకు తెచ్చే అందాలను గమనించండి.
ఈ నెలంతా ఈ దృష్టితో ఒక కంట భాషను గమనిస్తూ, మీ పనులు మీరు చేసుకొంటూ పొండి. మీరు రోజూ మాటాడే భాషలోనే యతిప్రాసలను చేరుస్తూ భాషకు చేకూరే సొగసును గమనించండి. వచ్చే నెలలో పద్యాల్లో యతి ప్రాసలను ఎలా వేయాలన్న విషయాలను తెలుసుకొని ఆపైన పద్య రచనకు ఉపక్రమిద్దాం.
- డా. ఆచార్య ఫణీంద్ర ( సంపాదకుడు)

10, మార్చి 2009, మంగళవారం

"ఆణిముత్యం" ... మార్చి 2009

మహాకవి కీ.శే. డా. నండూరి రామకృష్ణమాచార్యచే విరచితమైన ఆణిముత్యం వంటి ఈ పద్యాన్ని ఆస్వాదించండి.
'కమ్యూనిజం' మొత్తం సారాన్ని పిండి, ఒక చిన్న పద్యంలో పొదిగి అందించిన ఘనత ఆచార్యుల వారిది.

ఎంత
మంది చెమట, ఎందరి రక్తమ్ము
పీల్చకుండ నెవడు పేర్చె ధనము?
దొరలు చేయునట్టి దోపిడీయే ఆస్తి!
అంతరించ వలయు 'ఆస్తి హక్కు' !!


పద్యంపై మీ మీ స్పందనలను, విశ్లేషణలను వ్యాఖ్యల ద్వారా తెలియజేయండి.

3, మార్చి 2009, మంగళవారం

సమస్యను పరిష్కరించండి (మార్చి 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని, చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది. ఈ మాసం సమస్య :
" పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్ర ప్రజల్ ! "
ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 మార్చి 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

2, మార్చి 2009, సోమవారం

ఈ మాసం పద్య కవిత (మార్చి 2009)

“శివాత్మకమ్”

shivatmakam

తెలుగు ప్రజలంతా తెలుసుకోవలసిన విషయమేమిటంటే -

శివాంశయే “త్రిలింగ” భాషగా రూపుదిద్దుకొన్నది.
శివాత్మకమైనది మన తెలుగు భాష!

“శివాత్మకమ్”
—————
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
——————————–

నెలవంక రూపమే ’తలకట్టు’గా వెల్గె -
శూలమే ’దీర్ఘ’మై శోభ గూర్చె -
మెడను నాగేంద్రుడే ’గుడి దీర్ఘ’మై నిల్చె -
’కొమ్ము’లాయెను నంది కొమ్ము లలరి -
’ఏత్వంబు’,’లోత్వంబు’లే నాగ భూషణాల్ -
’ఋత్వాలు’ జంగమ ఋషులు గాగ -
’పూర్ణ బిందువె’ అన్నపూర్ణ ముఖంబయ్యె -
ప్రమథ గణపతియే ’ప్రణవ’మయ్యె -

అక్షరములౌ ఘన శివ లింగాకృతులయె
అక్షరంబులుగా ’త్రిలింగావని’పయి -
చెలువముగ నలరారుచున్ వెలుగ లిపిని,
వరలగ ’త్రిలింగ భాష’యై తరతరాలు!

*** నిజానికి ఇది పద్య కవులైన పాఠకులు పంపే పద్య కవితలను ప్రచురించే శీర్షిక. ఈ మాసానికి ఏ కవితా అందక పోవడం వలన సంపాదకుని పద్య కవితనే ప్రచురించ వలసి వచ్చింది. ఈ శీర్షికలో ప్రచురణార్థం పద్య కవులు దయచేసి కొత్త విషయాలపై వ్రాసిన తమ పద్య కవితలను తెలుగు(యూనికోడ్)లో టైపు చేసి, dr.acharya_phaneendra@in.com కు ఈ-మెయిల్ చేయగలరు. కొలది పాటి తప్పులున్నా సరిదిద్ది ప్రచురించగలను. పద్య కవులను ప్రోత్సహించి, పద్య కవితా వ్యాప్తికి చేసే ప్రయత్నానికి సహకరించ ప్రార్థన.

- డా.ఆచార్య ఫణీంద్ర ( సంపాదకుడు )