23, ఆగస్టు 2009, ఆదివారం

ఈ మాసం పద్య కవిత ... ( ఆగస్టు 2009 )

బాల గణేశునికి వందనం
( ఈ మాసం పద్య కవిత )
" అంకము జేరి శైలతనయా స్తన దుగ్ధము లాను వేళ, బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి, యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్ ! "




ఇది ’ మను చరిత్రం ’ లో అల్లసాని పెద్దన కవి వ్రాసిన ప్రసిద్ధ గణేశ స్తుతి పద్యం.
అందరిలా మామూలుగా స్తుతిస్తే అది అల్లసాని వారి పద్యం ఎలా అవుతుంది ?
అందుకే పెద్దన కవి అందులో విశేషమైన భావుకతను జోడించి కమనీయమైన స్తుతి పద్యంగా తీర్చిదిద్దాడు.
ఇక ఆ పద్యంలోనారసి చూద్దాం -
బాల గణేశుడు పార్వతీ దేవి ఒడికి చేరి ఆమె పాలు త్రావుతూ, బాల్య చాపల్యంతో తన తొండంతో ఆమె మరొక చన్నును అందుకోబోయి, అదెక్కడుందో కనరాక, అడ్డుగా ఆమె మెడలో ఆభరణంగా ఉన్న నాగరాజును చూచి,"ఇదేమిటి - తామర తూడా?" అన్న అనుమానంతో తాకి చూచే గజాననుని తన ఇష్ట సిద్దికై కొలుస్తానంటాడు కవి.
ఎంత రమణీయమయిన భావన !
ఈ వినాయక చవితి పర్వదినం నాడు ఈ పద్యాన్ని పఠించిన వారందరికీ ఆ విఘ్ననాయకుని కరుణా కటాక్షం ప్రాప్తించి, అభీష్ట సిద్ధి కలుగు గాక !
- డా. ఆచార్య ఫణీంద్ర

15, ఆగస్టు 2009, శనివారం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు !

విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి వెలుగులీనుతున్న భారతీయులందరికీ
63వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు !



అగ్ర భాగమ్ములో అమరి కాషాయంబు,
హరిత వర్ణ మమరి అడుగునందు,
చేరి రెంటి నడుమ శ్వేత వర్ణ, ’మశోక
చక్ర’ మమరి మధ్య చక్కగాను -
పాతాళమందుండి పైపైకి ఎగబ్రాకి
ఆకాశ హర్మ్యాల తాకునట్లు
నిలువెత్తు ధ్వజముపై నిలుచుండి నింగిలో
మన్ననల్ పొందెరా మన పతాక!

పూర్ణ విశ్వమందు పుడమి భారతి మిన్న -
దీటు లేదు భువిని దీని కేది! -
అన్న రీతి నెగిరె ఆకాశమందునన్
మూడు వన్నె లొలుకు ముద్దు జెండ!

9, ఆగస్టు 2009, ఆదివారం

సులువుగా పద్యం వ్రాయండి ... ( ఆగస్టు 2009 )



’ ఉత్పలమాల ’ పద్యాన్ని వ్రాయడం మరికొంత అభ్యాసం చేద్దాం.
ట్యూన్ గుర్తుందిగా ...
" తానన తాననా తనన తానన తానన తాన తాననా "
యతి - 10 వ అక్షరం.
ఇప్పుడొక భావాన్ని ఇస్తాను. దాన్ని ’ ఉత్పలమాల ’ పద్యంలో ఇమిడ్చే ప్రయత్నం చేయండి.
" పాండవులు కూడా సహోదరులే. పాపమని దయజూపి, వారితో యుద్ధమేదీ ఏర్పడవద్దని యెంచుతూ, ఏవో ఐదు ఊళ్ళు, అవీ ... ఎండిన భూములున్నవైనా, ఎందుకూ కొరగానివైనా, నీ గుండెను నిండు చేసుకొని దానం చేయ్ - ఓ సుయోధనా ! " అని శ్రీ కృష్ణుడు రాయబారంలో దుర్యోధనునితో అన్న మాటలను ’ ఉత్పలమాల ’ పద్యంలో పెట్టండి.
మీ అభ్యాస ఫలితంగా వచ్చిన పద్యాలను వ్యాఖ్యలుగా అందించండి. తప్పొప్పులను నేను తెలియజేసి సరిదిద్దగలను. ఇలా సన్నివేశ పరమైన అంశాలను పద్యాల్లో పెట్టగలిగితే, రేపు కావ్యాలను వ్రాయగలిగే శక్తి మీకు వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ? ఉపక్రమించండి.

2, ఆగస్టు 2009, ఆదివారం

సమస్యను పరిష్కరించండి ... (ఆగస్టు 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :

" పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు ! "

ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 ఆగస్టు 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)