23, సెప్టెంబర్ 2009, బుధవారం

ఆణిముత్యం ( సెప్టెంబరు 2009 )

విత్తనమ్మునౌచు వృక్షమ్ముగా మారి
ఆవరింపదలతు నాకసమును;
వీలు కాని యెడల - వేరు విత్తున కేను
ఎరువునగుట కైన ఇచ్చగింతు !


ఇది గురువుగారు డా. నండూరి రామకృష్ణమాచార్య రచించిన ఆణిముత్యాల్లాంటి పద్యాలలో ఒకటి.
తానొక విత్తనం. పెద్ద వృక్షమై ఆకాశమంతా విస్తరించాలని తన ఆశ. అది సహజం కూడా! నిజానికి ప్రతి మనిషి కూడ అలాంటి ఆశ, ఆశయంతోనే ముందుకు సాగాలి. అలా ప్రతి వ్యక్తి కృషి చేస్తేనే, ఆ వ్యక్తితోబాటు, ఈ సమాజమూ అభివృద్ధి చెందుతుంది.
కాని ఆ తరువాతి వాక్యమే, గురువుగారిలాంటి వారే అనగలరు. ఆ విత్తనం ఒక వేళ తాననుకొన్న ఆశయాన్ని నెరవేర్చుకోలేకపోతే ? వేరే విత్తనమైనా ఒక మహా వృక్షంగా ఎదిగేందుకు తాను ఎరువునవడానికైనా ఇష్టపడతాను - అంటారాయన. తానెదగక పోయినా ప్రక్కవాడు ఎదగడం చూచి ఓర్వలేని ఈ లోకంలో గురువుగారి భావన ఎంత ఉదాత్తంగా ఉంది ? ప్రతి మనిషి ఈ ఆదర్శాన్ని పాటిస్తే ఈ సమాజాభివృద్ధిని ఆపడం ఎవరి తరం ?

18, సెప్టెంబర్ 2009, శుక్రవారం

ఈ మాసం పద్య కవిత (సెప్టెంబరు 2009)

అవినీతి
రచన : డా. జె. బాపురెడ్డి, IAS (Retd.)

లేదు అవినీతి లేని తావేది ఇలను
కాని, మన ప్రియ భారత ఖండమందు -
దాని అవతారములు లెక్క లేని యన్ని !
పట్టుబడి, పట్టుబడనట్టి గుట్టులెన్నొ !!

అంతొ ఇంతయో తినకయే సంతకమ్ము
చేయు వారల సంఖ్య కాసింత యౌను !
ముందు ముందు ఆఫీసుల యందు - నీతి
మంతులగుపించు టది గొప్ప వింత యౌనొ !

రౌడీల రాజ్య మిదియని
రౌడీలే చాటుకొనగ, రక్షణ కొరకై
రౌడీల అండ చేరగ
దౌడులు తీసెదరొ ప్రజలు దయనీయముగాన్ !

తెలియక తప్పులు చేసిన
తెలుపుట సాధ్యమ్మె కాని, తెలిసి తెలిసియే
తెలిసిన తప్పులు చేసెడి
తెలివికి తెలుపునది చావు దెబ్బ యొకటియే !

చూడు ! చట్టాలు విలపించుచుండె - వాని
వంచనల, దూషణల, మాన భంగములకు
పాల్పడెడి దుర్మతుల పని బట్టనట్టి
సంఘమున తాము పుట్టిన శాపమునకు !

----- *** -----

12, సెప్టెంబర్ 2009, శనివారం

జంట నగరాల సాహిత్యాభిమానులకు ఆహ్వానం

ప్రాచీన కావ్య ప్రక్రియలలో ’ ఉదాహరణ కావ్యం ’ విశిష్టమైనది. అయితే ఇటీవల పద్య కవులు ఈ ప్రక్రియలో అరుదుగా రచనలు చేస్తున్నారు. ప్రముఖ కవి - ’ ప్రౌఢ పద్య కళానిధి ’ ఆచార్య వి.యల్.యస్. భీమ శంకరం గారు ఇప్పుడు ఒక ఉదాహరణ కావ్యాన్ని రచించారు. దాని పేరు - ’ శ్రీ దక్షారామ భీమేశ్వరోదాహరణ కావ్యము ’.
’ నవ్య సాహితీ సమితి ’, ’ వి.యల్.యస్. సాహిత్య, వైజ్ఞానిక పీఠం ’ సంయుక్తాధ్వర్యంలో ఆ గ్రంథావిష్కరణ సభను నిర్వహిస్తున్నాం.
16 సెప్టెంబరు 2009 నాడు సాయంత్రం 5 - 30 గం || లకు
అశోక్ నగర్ ’ నగర కేంద్ర గ్రంథాలయం ’ ( చిక్కడ పల్లి, హైదరాబాదు ) లో ఈ సభ జరుగుతుంది
జంట నగరాలలో నివసిస్తున్న సాహిత్యాభిమానులు, ముఖ్యంగా పద్య కవితాభిమానులంతా ఆ సభకు విచ్చేసి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర

ఆహ్వాన పత్రం :

11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

సులువుగా పద్యం వ్రాయండి ... ( సెప్టెంబరు 2009 )

ఈ మాసం మనం మరో ఛందస్సులోకి ప్రవేశిద్దాం -
దాని పేరు :" చంపక మాల "
ఉత్పల మాలకు, దీనికి కొంచమే తేడా !
ఉత్పల మాల ట్యూన్ మీకు తెలుసు -

" తానన తాననా తనన తానన తానన తాన తాననా "

ఇక ఇప్పుడు నేర్చుకోబోయే " చంపక మాల " కు ట్యూన్ :

" తననన తాననా తనన తానన తానన తాన తాననా "
( అంటే మొదట్లో ఒక దీర్ఘాక్షరం బదులు రెండు హ్రస్వాక్షరాలు వేయాలన్న మాట. )

ప్రారంభంలో ఒక అక్షరం పెరిగింది కాబట్టి యతి స్థానం ఒక అక్షరం ముందుకు జరుగుతుంది.
ఉత్పల మాలకు యతి 10 వ అక్షరమైతే, దీనికి 11 వ అక్షరం. ప్రాస నియమం ఎలాగూ ఉంటుంది కదా !
అంతే - నాలుగు పాదాలు ఒకే విధంగా వ్రాసుకు పోవడమే !

ఉదాహరణకు నన్నయ గారి పద్య మొకటి చూద్దాం -

నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటె సూనృత
వ్రత యొక బావి మేలు; మరి బావులు నూరిటి కంటె నొక్క స
త్క్రతువది మేలు; తత్క్రతు శతంబున కంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు సూడగాన్ !


ఇందులో ఒక పాదాన్ని విడమరచి ట్యూన్ తో పోల్చి చూద్దాం -

తననన : నుత జల
తాననా : పూరితం
తనన : బులగు
తానన : నూతులు
తానన : నూరిటి
తాన : కంటె
తాననా : సూనృత*

( * ఇక్కడ ’ సూనృత ’ లోని చివరి అక్షరం ’ త ’ తరువాత, రెండవ పాదం మొదటి అక్షరం ’ వ్ర ’ సంయుక్తాక్షరం కాబట్టి, దాని ముందుండడం వలన ’ త ’ దీర్ఘాక్షర సమానమే అవుతుంది. ఆ విధంగా ’ తాననా ’ ట్యూన్ కి ’ సూనృత ’ సరిపోయింది. ఇలాంటివి ఇది వరకు కూడా చెప్పుకొన్నాం కదా ! )

ఇలాగే ఇదే ట్యూన్ లో మిగితా మూడు పాదాలను కూడా పోల్చి చూసుకోండి.
చంపక మాల పద్యం ట్యూన్ ని, పైన పేర్కొన్న నన్నయ గారి పద్య గమనాన్ని బాగా ఆకళించుకొని, ఆ పైన మీకు తోచిన భావాన్ని చంపక మాల పద్యంలో వ్రాసేందుకు అభ్యాసం చేయండి. పద్యాలను వ్యాఖ్యలుగా అందిస్తే తప్పొప్పులను సరిదిద్ది వివరిస్తాను. All the best !

- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

9, సెప్టెంబర్ 2009, బుధవారం

ఇదండీ ఈయన గారి సంస్కారం !

తెలుగు బ్లాగు మిత్రులారా !
మీకు తెలుసు - ఈ బ్లాగు ద్వారా కొత్తగా పద్యాలు వ్రాయడంపై ఆసక్తి గల వారి కోసం, సులభంగా పద్యాలు వ్రాసే విధానం బోధిస్తూ, అభ్యాసం కొరకు సమస్యల నిచ్చి పూరించమని నేను కోరుతున్న సంగతి. ఆ పరంపరలో భాగంగా, ఈ మాసం, తెలుగు బ్లాగులను ప్రశంసిస్తూ పూరించమని, " బ్లాగులందు తెలుగు బ్లాగులే వేరయా ! " అన్న సమస్య నిస్తే, మన కవి మిత్రులు తమకు తోచిన రీతిలో పూరణలను అందించారు. ఆ పూరణలను చూసి, ఎవరో ’ జల సూత్రం ’ వారట - బ్లాగు నిర్వాహకుడనైన నన్ను, పూరణలను చేసిన కవులను వెటకారం చేస్తూ ఇలా వ్యాఖ్య చేసారు -

[Jalasutram చెప్పారు...

అంతా బానే, అంతా బాగుంది కానీండి, మీ సమస్యా, దానికి తగిన పూరణలు. వందనం, అభివందనం, తకధిమితోం.

ఎందుకో చిలకమర్తివారి పద్యం ఒకటి గుర్తుకొస్తోంది.

తోటకూర దెచ్చి దొడ్డిలోన తరిగి
కుండలోన బెట్టి కుదురుగాను
క్రింద మంటబెట్ట వుడకకేంజేస్తుంది?
దాని కడుపుకాల ధరణిలోన

అని. అదండీ సంగతి. మరి వుంటాను. మళ్ళీ వస్తాను. ఈ మధ్య కవితలన్నీ " అద్భుతం " గా వుంటున్నాయి ఏమిటో ఈ మాయ.
September 9, 2009 6:01 AM ]

ఆ వ్యంగ్యానికి నేనూ వ్యంగ్యంగానే ఇలా సమాధానమిచ్చాను.

[ డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

అయ్యా ’ జలసూత్రం ’ గారూ !
అవును మరి ! మీకు ఒక చిన్న ’ సమస్యా పూరణం ’ లోనే
’ కాళిదాస కావ్య రసాలు ’, ’ చేమకూర చమత్కారాలు ’ పిండుకోవాలన్న అత్యాశ !
మాకంత పెద్ద ఆశలు లేవు మరి.
అసలే ఇంగ్లీషు మీడియం చదువులతో తెలుగు పద్యాలు వ్రాసే వారే కరువౌతుంటే, మీలాంటి పండితమ్మణ్యులు ఇలా బెదరగొడితే గాని, మీ తరువాతి తరంలో పద్యం నామ రూపాల్లేకుండా చేయ లేరు మరి !
కానీయండి ... ఇంకా విజృంభించండి.
ఎందుకంటే మీరాశించిన స్థాయి పద్య కవులను ఈనాటి ఇంగ్లీషు మీడియం విద్యార్థులనుండి తయారుచేయడం మీ కెలాగూ చేత కాదు.
రోడ్డెక్కితే గదా ఎత్తు పల్లాలలో డ్రైవ్ చేయడం ! రోడ్డే ఎక్కనివ్వకపోతే సరి !
ఏమంటారు ?
September 9, 2009 7:00 AM ]

[ డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

’ జల సూత్రం ’ వంశాంబుధీ సోమా !
అప్రతిమాన పండిత కవి భీమా !
అన్నట్టు ...
" పది రూపాయలు సన్న బియ్యమన కంపం బెత్తి రాంధ్ర ప్రజల్ ! "
" కసభాధ్యక్ష్యమ్ము దక్కె కాంతామణికే ! "
" అవధానంబొక 'ట్వెంటి ట్వెంటి క్రికెటై' ఆహ్లాదమున్ గొల్పెడిన్ ! "
వంటి సమస్యలిచ్చినపుడు మీరెక్కడున్నారు స్వామీ ?
మీ పూరణలను మాకు కటాక్షించ లేదే !
సరే ! ఇప్పుడైనా ఈ సామాన్య సమస్యను అసామాన్యంగా పూరించి, మా బోంట్లకు వెలుగు చూపవచ్చు కదా !
September 9, 2009 7:21 AM ]

వ్యంగ్యంలో కూడా నా లక్ష్యం ఏమిటో స్పష్టంగా చెబుతూ, ఈనాటి ఇంగ్లీష్ మీడియం చదువుల కాలంలో పద్య కవిత్వంపై ఆసక్తి గలవారిని ప్రోత్సహించ వలసిన అవసరాన్ని నొక్కి చెప్పాను.
ఇతరులపై అలవోకగా వ్యంగ్యాన్ని ఒలకబోసిన ’ జల సూత్రం ’ వారు తనపై వ్యంగ్యాన్ని ప్రయోగిస్తే మాత్రం ఓర్చుకోలేక పోయారు. పొంతన లేని ఉపమానంతో ఆయన ఆక్రోశాన్ని ఎలా వెళ్ళగ్రక్కారో చూడండి.

[Jalasutram చెప్పారు...

వెనకటికి ఒకాయన మాతాత కౌపీనం ఆకాశమంత వుందని అన్నాట్ట. అది విని తట్టుకోలేని ఇంకొకాయన ఒరే మా తాత కౌపీనం కొంచెం చిరిగితే మీ తాత కౌపీనం అతుకెయ్యటానికి పనికొచ్చింది అన్నాడత. అలాగున్నది మన "ఆవు" (కౌ) ల పరిస్థితి.వాచామగోచరంగా ఉంటున్నవి ఈ మధ్య కైతల్లన్నీ. ఆ రసమేమిటి, పాకమేంఇటి, భావమేమిటి, యతులేమిటి, ప్రాసలేమిటి, శబ్దరత్నాకరాలేమిటి - ఒహటా రెండా - వెయ్యితలల ఆదిశేషువే దిగిరావాలి కిందకు. ఇక నేను కపిత్వము చెప్పెదను అని ఎక్కడయినా చెపితినా మాష్టారు ? ఉమ్మెతకాయలు తిన్నవారు ఎక్కువవుతున్నారు ఆవుల(కౌ) లోకంలో అని దీనిభావం. ఆ పైన కాకులు ముట్టని ఉప్పు పిండి అదేనండీ ఉప్పుమాకు తీసిపోకుండా తెగ అల్లుతున్నారు అని వాదించటమే.

పొలములో నక్కలు కూసెగా
మనసులో భయమెంతో వేసెగా
పాలేరు యిట్టట్టె చూసెగా
గంగన్నా నీ ____ మోసెగా

లాగా ఉంటున్నవి మరి - ఏమి " చెప్పు "మందురు !
September 9, 2009 6:52 PM ]

ఇంతా చేసి ఈయన గారికి కవిత్వమే కాదు, కపిత్వం కూడా చేత కాదట. కాని కవులను మాత్రం ’ పశువులు ’ ( ఆవులు - ’ కౌ ’ లు ) అని తిడుతాడట. కవిత్వం నచ్చితే ప్రశంసించడం, నచ్చక పోతే సంస్కరించుకోవడానికి తగిన సలహాలివ్వడం, లేదంటే మిన్నకుండడం - రసజ్ఞుల సంస్కారం. అవేవీ చేత కాక పోయినా, " ఉమ్మెత్త కాయలు తిన్న వారు ", " కాకులు ముట్టిన ఉప్పు పిండి " అంటూ తిట్ల పురాణం మాత్రం ఈయనకు చేతనౌతుంది.
చివరలో " చెప్పు " ను గమనించారా ? - ఇదీ ఈయన గారి సంస్కారం ! నలుగురిలో ఈ కుసంస్కారిని ఎండగడుతూ
ఇదంతా టపాగా ఎందుకు అందిస్తున్నానంటే - నాతోబాటు నా ఈ బ్లాగులో అడుగు పెట్టిన నా అతిథులైన కవి మిత్రులను కూడా తిడుతుంటే, మిన్నకుండడం అమానుషం కాబట్టి.
- డా. ఆచార్య ఫణీంద్ర

8, సెప్టెంబర్ 2009, మంగళవారం

సమస్యను పరిష్కరించండి ... ( సెప్టెంబరు 2009 )



'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :

" బ్లాగులందు తెలుగు బ్లాగులే వేరయా! "

ఇది ’ ఆట వెలది ’ పద్యంలో మొదటి లేక మూడవ పాదంగా ఇముడుతుంది.
తెలుగు బ్లాగులను ప్రశంసించేలా పై పాదాన్ని ప్రయోగిస్తూ ఒక ’ ఆట వెలది ’ పద్యాన్ని పూరించండి.
పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

3, సెప్టెంబర్ 2009, గురువారం

శాంతి ! ఓం శాంతి ! ఓం శాంతి ! శాంతి ! శాంతి !



మన దివంగత ప్రియ ముఖ్యమంత్రి వర్యు
డైన " రాజశేఖర రెడ్డి " ఆత్మ కగుత
శాంతి యని కోరుదము భగవంతు నింక -
శాంతి ! ఓం శాంతి ! ఓం శాంతి ! శాంతి ! శాంతి !

- డా. ఆచార్య ఫణీంద్ర