ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

26, జులై 2010, సోమవారం

ఆణిముత్యం ( జులై 2010 )చదువుకొన్నవాడు, సంపన్నుడగువాడు
చేయ తప్పు - శిక్ష వేయవచ్చు!
పేదవాని తప్పు ఔదార్య హృదితోడ
సైపవలయు మనుజ సంఘమెల్ల!


ఈ ఆణిముత్యం మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య కలం నుండి జాలువారినది.
విద్యావంతుడు, ధనవంతుడు చేసే తప్పు తెలిసి.. తెలిసి చేసే తప్పు. పైగా "నన్నెవడు అడిగేవాడు?" అన్న అహంకారంతో చేసేది. కాబట్టి అది క్షమార్హం కాదు. కానీ ... పేదవాడు చేసే తప్పు, వాడు చేసేది కాదు. వాని ఆర్థిక స్థితి గతులు వానితో తప్పును చేయిస్తాయి. కాబట్టి ఆ ఆర్థిక అసమానతలకు మూల కారణమైన సంఘానిదే ఆ తప్పు. అందుకే అది శిక్షార్హం కాదు. ఆ తప్పును మనుజ సంఘం తనదిగా భావించి, భరించాలంటారు కవి.
సరళ సుందరంగా, అభ్యుదయాత్మక సందేశం ఇమిడిన ఇలాంటి పద్యాలే మా గురువు గారిని ’ఆధునిక వేమన’గా మన్ననలందుకొనేందుకు దోహదపడ్డాయని నా భావన!

- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

21, జులై 2010, బుధవారం

డా. దాశరథి పై డా. సి.నా.రె. వ్రాసిన స్తుతి పద్యాలు

ఈ మాసం పద్య కవిత ( జులై 2010 )
దాశరథీ! మనోజ్ఞ కవితా శరధీ! శరదిందు చంద్రికా
పేశల కావ్య ఖండముల పిండిన నీ కలమందునన్ మహో
గ్రాశనిపాతముల్ వెలయు నౌర! మహేశుని కంటిలో సుధా
రాశి తరంగముల్, కటు హలాహల కీలలు పొంగినట్లుగాన్!

నా తరుణ కావ్య లతిక లానాడు పైకి
ప్రాక లేక దిక్కులు సూడ, నీ కరాలు
సాచి, లేత రేకులకు కెంజాయ లద్ది,
మించు పందిళ్ళ పైకి ప్రాకించినావు!

రచన : డా. సి. నారాయణ రెడ్డిసేకరణ : డా. ఆచార్య ఫణీంద్ర

( 22 జులై - డా. దాశరథి గారి జయంతి సందర్భంగా ... )

6, జులై 2010, మంగళవారం

సరస సల్లాపం - 2మా గురువుగారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య గోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన గురువుగారు డా. కట్టమంచి రామలింగారెడ్డి రాయలసీమకి చెందినవారు. ఒకరోజు నండూరివారు తమ ప్రాంతానికి చెందిన ఆదికవి నన్నయ గురించి గొప్పగా చెప్పుకపోతున్నారు. అది విని కట్టమంచివారు తమ ప్రాంతానికి దగ్గరలో ఉన్న నెల్లూరుకు చెందిన తిక్కన చాలా గొప్పకవి అని వాగ్వివాదానికి దిగారు. చర్చ కొద్దిగా వేడెక్కింది. రామలింగారెడ్డిగారు " ఏమిటయ్యా మీ నన్నయ గొప్ప ?
పద్యమంతా సంస్కృతం పులమడమేనా ? మా తిక్కనను చూడు - తేట తేట తెలుగు మాటలలో ఎంత చక్కగా వ్రాస్తాడో - " అన్నారు. దానికి నండూరివారు తిక్కన వ్రాసిన "దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ ... " అన్న పద్యాన్ని ఉటంకిస్తూ, " ఇది సంస్కృతం పులమడం కాదేమిటి ? " అని అడిగారు. అప్పుడు రామలింగారెడ్డిగారు ఏం మాట్లాడాలో తెలియక కాసేపు నిశ్శబ్దంగా ఉండి, తరువాత తేరుకొని, " ఆహా ! ద్రౌపదీ ! నీ ఊపిరి తిత్తులు ఎంత బలమైనవి ! " అని నవ్వుతూ అన్నారు. దానితో రామకృష్ణమాచార్యులుగారు కూడా నవ్వాపుకోలేక ఆయనతో శ్రుతి కలిపారు. వాతావరణం ఒక్కసారి చల్లబడింది.

2, జులై 2010, శుక్రవారం

సరస సల్లాపము - 1


నిన్న నా పాత మిత్రుడైన ఒక అర్ధజ్ఞాని కలిసాడు. ’జ్ఞాని’ విన్నాం - ’అజ్ఞాని’ విన్నాం. ఈ ’అర్ధజ్ఞాని’ ఏంటి - అనుకొంటున్నారా ? సగం తెలిసి, సగం తెలియనివాణ్ణి ఏమనాలో తెలియక ఆ పదబంధాన్ని సృష్టించాను మరి.
రావడం, రావడమే వాడు నాపై దాడి చేస్తూ, " మీ కవులు - ఎక్కడో ఆకాశంలో ఉన్న సూర్యునికి, నేలపై కొలనులో ఉన్న కమలానికి సంబంధాన్ని అంటగడతారు. వాటి మధ్య ప్రేమ ... దోమ ... అంటూ కథలు చెబుతారు. నిజానికి సూర్యుని దగ్గరగా కమలం వెళితే చచ్చి ఊరుకొంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే, మాడి మసైపోతుంది. " అన్నాడు.
" దాన్ని ’కవి సమయం’ అంటారు నాయనా ! సూర్యుని కిరణాలు సోకి, కమలం ఆనందంగా వికసిస్తుంది కాబట్టి అది సూర్యునికి ప్రేమికురాలుగా మనం భావించాలి. అంతే! " అని వివరించాను. వెంటనే వాడు " కమలం ప్రేమికురాలైతే ... మరి ’పొద్దు తిరుగుడు’ పువ్వు, సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది.- దాన్ని ’కామ పిశాచి’ అనాలా ? " అన్నాడు. ఇక వాడికేమి చెప్పను ?

1, జులై 2010, గురువారం

సమస్యను పరిష్కరించండి ... ( జులై 2010)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని, చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
చాలా రోజులు ఈ శీర్షికను నిర్వహించడంలో ఆటంకం ఏర్పడినందుకు మన్నించండి. మళ్ళీ ఇదివరకులాగే ఈ శీర్షికను విశేషంగా ఆదరిస్తారని ఆశిస్తూ ...ఈ మాసం సమస్య :
" కోడిని కరకర నమిలె కోడలమ్మ! "
పై సమస్యను పరిష్కరించి, పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)