25, ఏప్రిల్ 2010, ఆదివారం

నండూరి వారి జయంతి సభ

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా, మా పీఠం ద్వారా ఈ నెల 29 వ తేది నాడు మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యుల వారి జయంతి సభ హైదరాబాదులో నారాయణగూడ YMCA హాలులో వైభవోపేతంగా నిర్వహించ బోతున్నాం. ఈ సారి ప్రముఖ కవి శ్రీమాన్ 'నల్లాన్ చక్రవర్తుల శేషాచార్యుల' కు నండూరి వారి స్మారక పద్య కవితా పురస్కారం అందజేస్తున్నామని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం. ఈ కవి ప్రముఖ బ్లాగరు 'నల్లాన్ చక్రవర్తుల కిరణ్' ( నచకి ) తాత గారని తెలియజేయడానికి మరింత సంతోషిస్తున్నాం. ఈ మారు నండూరి వారి 90 వ జయంతి ( మహా అమృతోత్సవం ) ని పురస్కరించుకొని, వారి పద్య కవితలు 'శీర్ణ మేఖల', 'అజ్ఞాత కౌంతేయం' రెండింటిని ప్రముఖ గాయకులు శ్రీ అమలాపురం కన్నారావు గారిచే గానం చేయించి C.D. లుగా రూపొందించాం. ఆ C.D.లను ఆ రోజు ఆవిష్కరింపజేయడం జరుగుతుంది. సభకు విచ్చేసే ప్రతి ఒక్కరికీ ఆ C.D. ని ఉచితంగా అందజేయాలని మా సంకల్పం. హైదరాబాదు, ఆ పరిసర ప్రాంతాలలోని సాహితీ, సాంస్కృతిక ప్రియులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మా పీఠం తరపున ఆహ్వానిస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర , ప్రధాన కార్యదర్శి - నం. రా.సాహిత్య పీఠం.

17, ఏప్రిల్ 2010, శనివారం

సులువుగా పద్యం వ్రాయండి ... (ఏప్రిల్ 2010)

చాలా రోజులుగా బ్లాగు మిత్రులకు దూరంగా ఉన్నందుకు మన్నించండి.
ఇతర కార్యకలాపాలలో ఎడతెరపి లేక తప్పలేదు.
ఇక మన పద్య రచన పాఠాలకు వద్దాం.
ఇంతవరకు మనం ’ ఉత్పల మాల ’, ’ చంపక మాల ’ వంటి వృత్త పద్యాల రచన సులువుగా ఎలా చేయాలో తెలుసుకొన్నాం. మరి ఇప్పుడు అంత కన్న సులువైన పద్యాలు నేర్చుకొందాం. వీటిని ’ ఉప జాతులు ’ అన్న పద్యాలుగా పిలిస్తారు. వీటిలో ట్యూన్ కి పదాలు వేయడంలో మరింత వెసులుబాటు ఉంటుంది.
ఇక్కడ ట్యూన్ లో ’ తాన ’ అని ఉన్న చోట ’ తనన ’ అని కూడా వేసుకోవచ్చు. ( మొత్తం 3 మాత్రలు అన్న మాట ).
ఉదాహరణకు ’ తాన ’ అని ఉన్న ట్యూన్ లో ’ కావ్య ’ అనిగాని, లేక ’ కవన ’ అని గాని వేసుకోవచ్చు. వృత్తాలలో అలా కుదరదు.
అలాగే, ’ తానాన ’ అని ఉన్న చోట ’ తనననా ’, ’ తననాన ’, ’ తాననా ’ ( మొత్తం 5 మాత్రలు ) వేసుకోవచ్చు.
అయితే 5 మాత్రలైనా, దీర్ఘం లేకుండా ’ తనననన ’ అని వేయడం కుదరదు. ( ఇది ఒక exemption. )
ఉదాహరణకు ’ తానాన ’ అని ఉన్న చోట ... ’ మా వాడు ’ అని,
’ మనసులో ’ అని,
’ మన వాడు ’ అని,
’ మానవా ’ అని కూడా వేసుకోవచ్చు.
’ మన మనసు ’ అని మాత్రం వేయకూడదు.
ఇక పద్యంలోకి వద్దాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఛందస్సు ’ ఆట వెలది ’.
దీని ట్యూన్ ... (తా)న తాన తాన (తా)నాన తానాన
(తా)న తాన తాన (తా)న తాన
(తా)న తాన తాన (తా)నాన తానాన
(తా)న తాన తాన (తా)న తాన

ఇలా 1, 3 పాదాలు ఒకలాగా, 2, 4 పాదాలు ఒకలాగా ఉంటాయి.
ప్రతి పాదంలో బ్రాకెట్లలో ఉన్న అక్షరాల మధ్య యతి కుదరాలి. ఇక్కడ ఇంకో వెసులుబాటుంది. యతి కుదరక పోతే, ఆ ప్రక్కనే ఉన్న అక్షరాలు ఒకటే అయితే చాలు. అయితే ఈ ఒకే ప్రాస అక్షరాలకు ముందు దీర్ఘముంటే రెండు చోట్లా దీర్ఘమే ఉండాలి. హ్రస్వముంటే రెండు చోట్లా హ్రస్వమే ఉండాలి. దీనిని ’ ప్రాస యతి ’ అంటారు. ఇది వృత్త పద్యాలలో చెల్లదు.
ఈ పద్యంలో మరొక సులువైన పని ... ప్రాస వేయనక్కర లేదు.
ఇక ప్రసిద్ధ పద్యం ఉదాహరణగా చూద్దాం. మనకు బాగా పరిచయమున్న ’ వేమన ’ పద్యాలన్నీ దాదాపుగా ...
ఆట వెలదులే ! ఒక పద్యం చూద్దాం...



(ఉ)ప్పు కప్పురంబు (ఒ)క్క పోలికనుండు
చూ(డ) చూడ రుచుల జా(డ) వేరు
( ప్రాస యతి )
(పు)రుషులందు పుణ్య (పు)రుషులే వేరయా !
(వి)శ్వదాభి రామ ! (వి)నుర వేమ !

చూసారుగా పై ట్యూన్ కి ఎలా సరిపోయిందో ... !
ఇక ఇప్పుడు మీరు మీకు నచ్చిన వస్తువుపై ఆట వెలది పద్యాన్ని వ్రాయడానికి ప్రయత్నిస్తారు కదూ !
మీ పద్యాలను వ్యాఖ్యలుగ పోస్ట్ చేస్తే, తప్పులుంటే సరిదిద్దుతాను ... All the best !