30, అక్టోబర్ 2010, శనివారం

సరస సల్లాపము-8



హైదరాబాదులో ఒకానొక సాహిత్య సమావేశాలలో పాల్గొనడానికి వెళ్ళాను. చాలా మంది రచయిత్రులు, కవులు విచ్చేసారు. సమావేశాల ప్రారంభానికి ముందు పెద్ద సందడిగా ఉంది. నేను, డా. ద్వానాశాస్త్రి గారు కలిసి కబుర్లు చెప్పుకొంటున్నాము. మా చుట్టూ మరో పది మంది చేరారు.
ఇంతలో ఒక రచయిత్రి అందరినీ కలుస్తూ, పలుకరిస్తూ హడావుడి చేస్తున్నది. నేను ద్వానాశాస్త్రి గారితో "ఎవరీవిడ?" అన్నాను. ద్వానాశాస్త్రి గారు నవ్వుతూ "ఆమె ఒక స్త్రీవాద రచయిత్రి. పురుషుణ్ణి ఉతికి ఆరేసి, మడతబెట్ట గలదు." అన్నారు.
వెంటనే నేను "అప్పు డామెను ’స్త్రీవాది’ అనకూడదు. ’ఇస్త్రీ వాది’ అనాలి." అన్నాను.
ఒక్కసారిగా మా చుట్టూ నవ్వులు వెల్లివిరిసాయి.

12, అక్టోబర్ 2010, మంగళవారం

మరణ మంగళాశాసనము

మరణ మంగళాశాసనము
[మరణించేప్పుడు వారసులకు తన ఆస్తులను పంచుతూ వీలునామా వ్రాసేవాళ్ళను ఎంతో మందిని చూస్తుంటాం. కాని మా గురువుగారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య మరణించే ముందు పద్య రూపకంగా వ్రాసిన వీలునామా ఇది. ఒక్కసారి చదివి చూడండి - ]




మరణ సమయమందు మధుర గానము చాలు -
వద్దు - మందులేవి వాడవద్దు !
ఏ గతించినప్పు డేడ్వరా దెవరేని -
ఏడ్పటన్న నాకు ఏవగింపు !

మైల పట్టవద్దు - మంత్ర తంత్రము వద్దు -
స్నాన శౌచ నిరతి చాలు - చాలు !
జరుపవచ్చు సుకవి సత్కార మొకనాడు
దుఃఖ లవము సుంత దొరలకుండ !

భార్య మ్రగ్గ రాదు, పసుపు కుంకుమ వీడి -
పదవ నాటి తంతు వద్దు - వద్దు !
భర్త చావు బాధ భార్య ఓర్చుట చాలు -
వికట కర్మకాండ వేరు నేల ?

జరుప వద్దు నాకు శ్రాద్ధ కర్మల నేవి -
వద్దు పెట్టవద్దు తద్దినాలు !
బాల బాలికలకు బహుమానముల తీర్చి,
ఏ దినముననైన నీయవచ్చు !

అంతము చెందు ఈ భువి సమస్తము, సృష్టియు దిగ్దిగంత వి
శ్రాంత మశాశ్వతము రవిచంద్రులతోడ - మనుష్యు చావు నో
వింత ఉదంతమా ? వికట వేదనలెందుకు ? సర్వ తాప ని
ష్క్రాంత మవశ్య మంగళము ! చావొక స్వస్తి వర ప్రసాదమే !
___ *** ___

10, అక్టోబర్ 2010, ఆదివారం

సరస సల్లాపము - 7



వ్రాసింది పద్య కవిత్వమైనా, మా గురువుగారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య అభ్యుదయకవిగా బహుళ ప్రసిద్ధి చెందారు. ఆయన రచించిన ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’, ’ఆలోచనము’ మొదలైన గ్రంథాలలోని వేలాది ముక్తక పద్యాలలో ఆలోచనాత్మకమైన తాత్త్వికత, హేతువాదంతోబాటు అక్కడక్కడా మార్క్సిస్ట్ దృక్పథం కూడా తొంగి చూస్తుంటాయి. ఆ లక్షణాలే ఆయనను ఆధునిక పద్య కవులలో ఒక విశిష్ట కవిగా అగ్రేసర స్థాయిలో నిలబెట్టాయి.
అలాంటి ఆయన ఒకసారి శ్రీ సత్యసాయిబాబా గారి ఆహ్వానం మేరకు, పుట్టపర్తికి వెళ్ళి ఆయనను సందర్శించుకొన్నారు. ఈ రోజుల్లో విలేకరులకు ఇలాంటి విషయాలలో అంత నిశిత పరిశీలన, వివేచన ఉండడం అరుదు. కాని, ఆ రోజుల్లో ఒక విలేకరి మా గురువుగారు బాబా గారి ఆశ్రమం నుండి బయటకు రాగానే, ఆయనను ఇంటర్వ్యూ పేర పట్టుకొని, ఇరుకునబెట్టే ప్రయత్నంగా - " మీరు బాబాను దైవంగా భావిస్తున్నారా ? " అని ప్రశ్నించాడు. దానికి గురువుగారి సమాధానం : " ఆయన నిజంగా దైవమే అయితే, ఆయనలోని మానవత్వానికి నేను నమస్కరిస్తున్నాను. ఆయన మనలాంటి మానవుడే అయితే ఆయనలోని దైవత్వానికి నేను నమస్కరిస్తున్నాను. " అంతే ... ఆ విలేకరి మరో ప్రశ్న వేయలేకపోయాడు.

2, అక్టోబర్ 2010, శనివారం

సరస సల్లాపము - 6













’చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి’



1950వ దశాబ్దిలోని మాట.
మా గురువుగారు ’నండూరి రామకృష్ణమాచార్య’ గారిని భీమవరంలో ఒక సాహిత్య సంస్థ ఘనంగా సన్మానించాలనుకొంది. మా గురువుగారి గురువుగారు ’పింగళి లక్ష్మీకాంతం’ గారిని సన్మాన కర్తగా ఆహ్వానించారు. అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి ...
ఇంతలో ఒక దుర్వార్త ... మహాకవి, గురువులకే గురువు ’చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి’ గారు పరమపదించారని నిర్వాహకులకు తెలిసింది. వెంటనే ఒక వార్తాహరుని మా గురువుగారి వద్దకు పంపారు. " చెళ్ళపిళ్ళ వారు మరణించిన సందర్భంలో సన్మాన కార్యక్రమం జరుపడం బాగుండదు. ఎలాగు ... లక్ష్మీకాంతం గారు వస్తున్నారు కాబట్టి, వారి ఆధ్వర్యవంలోనే ఆ సభను చెళ్ళపిళ్ళ వారి సంతాప సభగా జరుపాలనుకొంటున్నాం. మీరూ తప్పకుండా రావాలి " అని అతడు చెప్పాడు. నిండు యవ్వనంలో అప్పుడప్పుడే ’కీర్తి’ రుచి చూస్తున్న మా గురువుగారికి ఈ వార్త అశనిపాతంలా తగిలింది.
ఇంతలో లక్ష్మీకాంతం గారు మా గురువుగారి ఇంట్లోనే దిగారు. చిన్నబోయి ఉన్న శిష్యుని నుండి విషయం తెలుసుకొన్న లక్ష్మీకాంతం గారు, " సరే ! నువ్వయితే పద ! చూద్దాం ! " అని శిష్యుని వెంటదీసుకొని బయలుదేరారు.
సభ ప్రారంభమయింది. పింగళి లక్ష్మీకాంతం గారు ప్రసంగిస్తున్నారు ...
" చెళ్ళపిళ్ళ వారు జగద్గురువులు. నేను వారి శిష్యుణ్ణి అయినందుకు గర్విస్తున్నాను. ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ప్రాచీన యుగానికి భరత వాక్యం; నవీన యుగానికి నాందీ వాక్యంలాంటి వారు. వారికి మరణం లేదు. ఆ మాటకు వస్తే, ప్రతిభకు మరణం ఉండదు. అది ఒక జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. నిన్నటి వరకు మా గురువుగారిలో ఉన్న ప్రతిభ, ఈ రోజు నాలో, తరువాత నా శిష్యుడు నండూరి రామకృష్ణమాచార్యలో ప్రకాశిస్తూనే ఉంటుంది. అంచేత మా శిష్యుణ్ణి సన్మానిస్తే, పైనున్న మా గురువుగారు తనను సన్మానించినట్టుగా సంతోషిస్తారు. పాపం ! ఈ నిర్వాహకులు నండూరి రామకృష్ణమాచార్యను సన్మానించుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకొన్నట్టున్నారు. ఇప్పుడా కార్యక్రమాన్ని జరుపుకొందాం ! " అని లక్ష్మీకాంతం గారు నిర్వాహకుల వైపు తిరిగారు. నిర్వాహకులు కాసేపు అవాక్కయి, తరువాత తేరుకొని, సన్మాన సామాగ్రిని ఆయన ముందుంచారు. లక్ష్మీకాంతం గారు శిష్య వాత్సల్యంతో తన చేతుల మీదుగా నండూరి వారిని ఘనంగా సన్మానించారు. తరువాత లక్ష్మీకాంతం గారు, " ఇన్నాళ్ళు నేను ’చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి’ గారి శిష్యునిగా చెప్పుకొని జీవించాను. ఇక ఈ రోజు నుండి ’నండూరి రామకృష్ణమాచార్య’ గురువుగా చెప్పుకొని గర్విస్తాను. " అని తన ప్రసంగానికి ముక్తాయింపు పలికి, కూర్చున్నారు.