26, సెప్టెంబర్ 2011, సోమవారం

గుర్రం జాషువా జయంతి సభ

మహాకవి పద్మభూషణ్ "గుర్రం జాషువా" జయంతి సభ హైదరాబాదులోని సుల్తాన్ బజారులో గల శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో రేపు (27 సెప్టెంబర్ 2011) సాయంత్రం, ప్రముఖ సంస్థ "నవ్య సాహితీ సంస్థ" నిర్వహించనుంది. సాహిత్యాభిమానులు తప్పక పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన -
- డా. ఆచార్య ఫణీంద్ర

30, ఆగస్టు 2011, మంగళవారం

ఈనాటి ’ఈనాడు’ లో...

మహాకవి, ’అభినవ పోతన’ బిరుదాంకితులు కీ.శే. వానమామలై వరదాచార్యుల శత జయంత్యుత్సవాల ప్రారంభ సభ వివరాలను ఈనాటి ’ఈనాడు’ దిన పత్రికలో ప్రచురించారు. రేపు (31 ఆగస్ట్ 2011) సాయంత్రం 6 గం.లకు ’రవీంద్ర భారతి’ (హైదరాబాదు)లో జరిగే ఈ కార్యక్రమానికి జంట నగరాలలోని సాహిత్యాభిమానులంతా విచ్చేసి, జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర

22, ఆగస్టు 2011, సోమవారం

sarasa sallaapamu - 16



1953. అక్కినేని నటించిన 'దేవదాసు' విడుదలై, ఆ చిత్రంలోని పాటలు మారుమ్రోగుతున్నాయి. ఆ చిత్రానికి మాటలు, పాటలు రచించిన సముద్రాల రాఘవాచార్య చెన్నపట్నంలో ఒకరోజు బంధువుల ఇంటికి వెళ్ళడానికి రిక్షా ఎక్కారు. ఆ రిక్షా కార్మికుడు అయ్యవారిని గుర్తించి రిక్షా తొక్కుతున్నంత సేపు ఆ చిత్రంలోని మాటలు, పాటల గురించి ఒకటే పొగుడుతూ ఉన్నాడు. రిక్షా దిగుతున్న సముద్రాల వారితో ఆ రిక్షా కార్మికుడు " అన్నీ బాగా అర్థమయ్యాయి గాని - ఆ 'కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్' అన్న పాటే సరిగా అర్థం కాలేదు బాబయ్య - ఆ పాట అర్థం ఏంటండి? " అని అడిగాడు. ఎంతో తాత్త్విక దృష్టితో వ్రాసిన ఆ పాటకు అర్థం వివరించే ఓపిక, సమయం లేకో, లేక ఆ వివరణను అందుకొనే స్థాయి వాడికి లేదనుకొన్నారో గాని, ఆచార్యుల వారు నవ్వుతూ - " తాగుబోతు పాడే పాటకు అర్థమేముంటుందిరా అబ్బీ!" అంటూ వాడి చేతిలో డబ్బులు పెట్టి, ఇంటిలోకి వెళ్ళిపోయారు.

18, ఆగస్టు 2011, గురువారం

సరస సల్లాపము - 15




చాలా కాలం క్రితం ఆంధ్ర సచిత్ర వార పత్రికలో చదివిన జ్ఞాపకం -
’భక్త కన్నప్ప’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కథానాయిక వాణిశ్రీ డైలాగ్ చెబుతున్నారు ...
" నా మావను బ్రతికించు సామీ! "
దర్శకులు బాపు మాటల రచయిత ముళ్ళపూడి వెంకటరమణ వంక చూసారు.
ముళ్ళపూడి వాణిశ్రీతో " చూడమ్మా! ’బ్రతుకు’ కాదు - ’బతుకు’ అనాలి." అన్నారు.
వాణిశ్రీ మళ్ళీ చెబుతూ - " నా మావను బ్రతికించు సామీ! " అన్నారు.
బాపు గారు -" ఇది గిరిజన కన్య పాత్ర కదా! ’బ్రతుకు’ అనకూడదు. ’బతుకు’ అనాలి " అని వివరించారు.
సరేనన్న వాణిశ్రీ మళ్ళీ యథాలాపంగా - " నా మావను బ్రతికించు సామీ! " అనేసారు.
వెంటనే బాపు గారు చిరాకుగా - " చూడమ్మా! ఆ 'బ్ర' తీసేయ్ " అన్నారట.
షూటింగ్ సిబ్బంది పగలబడి నవ్వకుండా ఎలా ఉండగలరు?

1, ఆగస్టు 2011, సోమవారం

సరస సల్లాపము - 14











మహాకవి శ్రీశ్రీ కి ప్రసిద్ధ కవి ఆరుద్ర వరుసకు మేనల్లుడవుతారు. ఆరుద్ర కొంత శ్రీశ్రీ ప్రభావంతోనే తొలి అడుగులు వేసారని చెప్పవచ్చు. ఆరుద్ర తొలి కావ్యాన్ని శ్రీశ్రీ మెచ్చుకొని ఎంతో ప్రోత్సహించారు. ’తెలంగాణ’ అని ఆరుద్ర పెట్టుకొన్న ఆ కావ్య శీర్షికను ’త్వమేవాహం’ గా మార్చింది కూడా శ్రీశ్రీ యే.

అయితే తరువాతి కాలంలో వాళ్ళిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. ఆ పైన ఆరుద్ర స్వతంత్ర భావజాలంతో ఎదిగారు.

అలవాటు ప్రకారం శ్రీశ్రీ అడపాదడపా ఇతర కవుల మీద విసుర్లు విసిరినట్టు ( పింగళి గారి సినిమా పాటను మార్చి " ఎంత ఘాటు ప్రేమయో ... ఇంత లేటు వయసులో ..." అనడం, "ప్రధాన మంత్రి కాగోరు - రబీంద్ర నాథ్ టాగోరు", "సినారె... మూసీ కినారె" అని ప్రాసలు ప్రయోగించడం వంటివి అన్న మాట) ఆరుద్ర పైనా విసిరే వారు.

ఇది తెలియని ఒక సాహితీ మిత్రుడు శ్రీశ్రీ తో " మీ శిష్యుడు ఆరుద్ర ... " అంటూ ఏదో చెప్పబోయాడు. వెంటనే శ్రీశ్రీ గట్టిగా నవ్వి - " వాడు నా శిష్యుడు అంటే ... నేనొప్పుకోను. నేను వాడి గురువంటే వాడొప్పుకోడు." అన్నారు.

31, జులై 2011, ఆదివారం

సరస సల్లాపము - 13










ఒకానొక కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ పోస్టుకు ప్రకటన వెలువడినప్పుడు, కరీంనగరులో కళాశాలలో పనిచేస్తున్న మహాకవి విశ్వనాథ సత్యనారాయణ అప్లై చేసుకొన్నారు. ఇంటర్వ్యూ రోజు తెలుగు శాఖాధిపతి, అభ్యర్థి విశ్వనాథ వారికి ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు.

తెలుగు శాఖాధిపతి : నీ పేరు?
విశ్వనాథ వారు : ( "నన్నే గుర్తించ లేదా? పైగా ఏక వచన ప్రయోగమా ?" అని కోపం వచ్చినా తమాయించుకొని ... ) విశ్వనాథ సత్యనారాయణ
తెలుగు శాఖాధిపతి : ఏమేం కావ్యాలు వ్రాసావు?
విశ్వనాథ వారు : ( పేరు చెప్పాక కూడా అటువంటి ప్రశ్న వేసేసరికి పట్ట లేని కోపంతో ... ) నేనేం కావ్యాలు వ్రాసానో కూడా తెలియకుండానే ఇక్కడ ’తెలుగు శాఖాధిపతి’ ఎలా అయ్యావురా? నీలాంటి వాడు ఉన్నంత కాలం ఈ విశ్వవిద్యాలయం మెట్లపై అడుగిడను. ( అంటూ కోపంగా వెళ్ళిపోయారు.)

తరువాత విశ్వనాథ వారు ఏ విశ్వవిద్యాలయంలోను ’ప్రొఫెసర్’ మెట్టెక్కలేక పోవడం ఆంధ్రుల దురదృష్టం.
ఇంత వరకు చాలా మందికి తెలిసిన కథే. చాలా ఏళ్ళ తరువాత ఈ విషయం విశ్వనాథ వారు కూడ స్వయంగా వ్రాసుకొన్నారు.

కొసమెరుపు : విశ్వనాథ వారు స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాక, రిటైరైన ఆ తెలుగు శాఖాధిపతిని ఒక సాహిత్యాభిమాని " ఇది నిజమేనా? " అని అడిగాడు. దానికి ఆ సాహితీమూర్తి సమాధానం - " ఆయన మహాకవి అని నాకు తెలుసు. కాని ఇంటర్వ్యూలలో పరీక్షకుడు తనకు సమాధానాలు తెలిసి కూడా అభ్యర్థిని ప్రశ్నిస్తాడని ఆయనకు తెలియదు. ఆయనకు ఆ కనీస విషయం తెలియక పోతే  నేనేం చేయను? "

ఆనాటి ఆ తెలుగు శాఖాధిపతి - ఆచార్య బిరుదురాజు రామరాజు గారు.

19, జులై 2011, మంగళవారం

సరస సల్లాపము - 12




కొన్ని దశాబ్దాల క్రితం మాట.
ఒక ప్రముఖ పట్టణంలో తెలుగు సాహిత్య సభలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఆనాటి లబ్ధ ప్రతిష్ఠ మహా కవులనందరినీ ఆహ్వానించి, వారికి పెద్ద హోటల్లో బస, అన్ని వసతులను సమకూర్చారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహాకవి శ్రీశ్రీ లకు ప్రక్క ప్రక్క గదుల్లో బస ఏర్పాటు చేయబడింది.
శ్రీశ్రీ గారు ఫ్రెష్ అప్ అయ్యాక, విశ్వనాథ వారిని పలుకరిద్దామని ఆయన గదికి వెళ్ళారు. విశ్వనాథ వారు అప్పుడే స్నానం చేసి, బాత్ రూమ్ నుండి బయటికి వస్తూ శ్రీశ్రీని చూచి లోపలికి ఆహ్వానించి కూర్చోమన్నారు.
కుశల ప్రశ్నల తరువాత, శ్రీశ్రీ చిలిపిగా "నీళ్ళోసుకొన్నారా?" అని ప్రశ్నించారు.
అప్పుడు విశ్వనాథ అంత కన్నా చిలిపిగా "అవును! మీరు కంటున్నారు కదా!" అని సమాధానం చెప్పారు.

16, జులై 2011, శనివారం

సరస సల్లాపము - 11



విజయవాడలో ఒకప్పుడు ’కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణతోబాటు అనేక లబ్ధ ప్రతిష్ఠులైన సాహితీమూర్తులు ఉండేవారు. వారంతా సాయంత్రం కాగానే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర కలుసుకొని, టిఫిన్ చేస్తూ, సాహిత్య చర్చలతోబాటు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని, చీకటి పడ్డాక ఇళ్ళకు వెళ్ళేవారు.
ఒకనాటి సాయంత్రం విశ్వనాథ వారు టిఫిన్ సెంటర్ వద్దకు కాస్త ఆలస్యంగా చేరుకొన్నారు. ఆలోపే అక్కడకు చేరుకొన్న సాహితీ మిత్రులు ’అట్లు’ వేయించుకొని ఆరగిస్తున్నారు. విశ్వనాథ వారు రాగానే ఒక మిత్రుడు - "మీకూ ’అట్లు’ వేయించమంటారా?" అని అడిగాడు. దానికి విశ్వనాథ వారి సమాధానం - " అట్లే కానిండు! ".

10, జులై 2011, ఆదివారం

సరస సల్లాపము - 10



ఆత్రేయ - వ్రాసి ప్రేక్షకులను, వ్రాయక నిర్మాతలను ఏడిపించేవారని ప్రతీతి.
హీరో కృష్ణంరాజు ’అమర దీపం’ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి. మహాకవి ఆత్రేయను ’హోటల్ చోళ’ అన్న స్టార్ హోటల్లో పెట్టి, సకల సౌకర్యాలు సమకూర్చి, మంచి పాటలు వ్రాసిమ్మని కోరా రాయన.
పది రోజులు గడిచాయి. ఆత్రేయ సకల భోగాలను అనుభవిస్తూ హాయిగా తింటున్నారు, పంటున్నారు గానీ ఒక్క పాటా.. చివరికి ... ఒక్క పల్లవిని కూడా వ్రాసివ్వలేదు. కృష్ణంరాజు మొహమాటానికి మరో ఐదు రోజులు వేచి చూసారు. అయినా, కవిగారి నుండి ఉలుకు లేదు.. పలుకు లేదు. హోటల్ బిల్లు తడిసి మోపెడయింది.
హీరో- కం- నిర్మాత కృష్ణంరాజుకు తెగ కోపం వచ్చింది. వెంటనే ఆత్రేయను ప్రక్కనే ఉన్న అర కొర వసతుల ’పల్లవ హోటల్’ లోని రూమ్ కు మార్చారు.
ఆత్రేయ రెండు రోజుల్లోనే అన్ని పాటలు వ్రాసిచ్చి, రూం ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. అద్భుతమైన ఆ పాటలను చూసుకొన్న కృష్ణంరాజు మనసు నొచ్చుకొని ఆత్రేయ ఇంటికి వెళ్ళి, కృతజ్ఞతలు చెప్పి, ఆసక్తిగా "’చోళ’ లో పదిహేను రోజులున్నా బయటకు రాని పల్లవులు ’పల్లవ’లో రెండు రోజుల్లోనే ఎలా వచ్చాయి మాష్టారూ?" అని అడిగారు. ఆత్రేయ నవ్వుతూ, "చోళులకు, పల్లవులకు పడదురా! చోళ సామ్రాజ్యం నుండి బయట పడ్డాక, పల్లవులు పరుగెత్తి వచ్చాయి" అన్నారు.

8, జూన్ 2011, బుధవారం

సాహిత్యాభిమానులందరికీ ఆహ్వానం

ప్రముఖ సాహిత్య విమర్శకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ డీన్ ఆఫ్ ఆర్ట్స్, ఆచార్య ఎస్వీ. రామారావు గారి సప్తతి అభినందన సభ ఆహ్వాన పత్రిక :

28, మే 2011, శనివారం

పద్య కవితా ప్రేమికులారా! స్వాగతం!

మహా కవులకు నివాళిగా దూరదర్శన్ (సప్త గిరి) ఛానల్ నిర్వహించిన ’కవి సమ్మేళనం’లోని అమూల్యమైన కవితల సంకలనంగా రూపొందిన "మహా కవులకు నీరాజనం" గ్రంథావిష్కరణ మహోత్సవం ఆదివారం 29 మే 2011 నాడు హైదరాబాదులోని ’శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం’లో ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. వేదిక పై అతిథులతోబాటు గ్రంథంలో కవితల నందించిన డా. పుల్లెల శ్రీరామచంద్రుడు, డా. తిరుమల శ్రీనివాసాచార్య, డా. జె. బాపురెడ్డి మొదలైన అనేక లబ్ధ ప్రతిష్ఠ మహా కవులు పాల్గొనే ఈ విశేష సభకు పద్య కవితా ప్రేమికులు తప్పక విచ్చేసి, కార్యక్రమాన్ని దర్శించి, ఆనందించండి.

- డా.ఆచార్య ఫణీంద్ర

24, మే 2011, మంగళవారం

రంజింపజేసిన రాగావధానం

‘నవ్య సాహితీ సమితి‘ వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించబడుతున్న వినూత్న, విలక్షణ కార్య్క్రమాలలో భాగంగా నిన్న నగరంలోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగిన ‘పద్య లీల - గేయ హేల‘ అనే రాగావధాన కార్యక్రమంలో కవి, రాగావధాని ‘చిమ్మపూడి శ్రీరామ మూర్తి‘ పృఛ్ఛకులు ఇచ్చిన గీతమైనా, పద్యమైనా, కోరిన రాగంలోకి అప్పటికప్పుడు మార్చి ఆలపించి, శ్రోతలను ఉర్రూతలూగించారు. రెండు ఆవృత్తులలో జరిగిన ఈ రాగావధానంలో ప్రసిద్ధమైన జయదేవుని అష్టపదులను, అన్నమాచార్య కృతులను, జానపద గేయాలను, తెలుగు గజళ్ళను, లలిత గీతాలను, రంగస్థల పద్యాలను అడిగిన రాగంలో అవధాని అద్భుతంగా గానం చేసి, అతిథులను, సభాసదులను ఆసాంతం అలరించారు. ఈ రోజు ‘సాక్షి‘, ‘ఈనాడు‘ దినపత్రికలలో ప్రచురించబడిన కార్యక్రమ వివరాలు అందిస్తున్నాను.
‘కొత్త పాళీ‘ గారు! మీ కోసం ఈ పోస్టును ప్రత్యేకంగా సమర్పిస్తున్నాను.

- డా. ఆచార్య ఫణీంద్ర

సాక్షి:




ఈనాడు :


22, మే 2011, ఆదివారం

సంగీత, సాహిత్య ప్రేమికులకు స్వాగతం

జంట నగరాలలోని సంగీత సాహిత్య ప్రేమికులకు శుభ వార్త!
ప్రసిద్ధ సంస్థ "నవ్య సాహితీ సమితి" వజ్రోత్సవాల సందర్భంగా
రేపు ( 23 మే 2011 - సోమ వారం ) 6 గం.లకు
నగరంలోని సుల్తాన్ బజార్ లోగల ’శ్రీకృష్ణ దేవ రాయాంధ్ర భాషా నిలయం’ లో
" పద్య లీల - గేయ హేల " అనే ఒక వినూత్న విలక్షణ రాగావధాన ప్రక్రియ

జరుగనుంది.
తప్పక విచ్చేసి, కార్యక్రమాన్ని దర్శించి, ఆనందించండి.
- డా.ఆచార్య ఫణీంద్ర


24, ఏప్రిల్ 2011, ఆదివారం

జంట నగరాల సాహిత్యాభిమానులకు స్వాగతం!

హైదరాబాద్, సికింద్రాబాద్ - జంట నగరాలలో నివాసముంటున్న సాహిత్యాభిమానులారా!
మహాకవి "నండూరి రామకృష్ణమాచార్య" జయంతి మహోత్సవం శుక్రవారం 29 ఏప్రిల్ 2011 నాడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ సుల్తాన్ బజారులోని "శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం"లో నిర్వహించబడును.
మీకందరికీ ఇదే మా ఆహ్వానం.

- డా.ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి
నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం