31, జులై 2011, ఆదివారం

సరస సల్లాపము - 13










ఒకానొక కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ పోస్టుకు ప్రకటన వెలువడినప్పుడు, కరీంనగరులో కళాశాలలో పనిచేస్తున్న మహాకవి విశ్వనాథ సత్యనారాయణ అప్లై చేసుకొన్నారు. ఇంటర్వ్యూ రోజు తెలుగు శాఖాధిపతి, అభ్యర్థి విశ్వనాథ వారికి ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు.

తెలుగు శాఖాధిపతి : నీ పేరు?
విశ్వనాథ వారు : ( "నన్నే గుర్తించ లేదా? పైగా ఏక వచన ప్రయోగమా ?" అని కోపం వచ్చినా తమాయించుకొని ... ) విశ్వనాథ సత్యనారాయణ
తెలుగు శాఖాధిపతి : ఏమేం కావ్యాలు వ్రాసావు?
విశ్వనాథ వారు : ( పేరు చెప్పాక కూడా అటువంటి ప్రశ్న వేసేసరికి పట్ట లేని కోపంతో ... ) నేనేం కావ్యాలు వ్రాసానో కూడా తెలియకుండానే ఇక్కడ ’తెలుగు శాఖాధిపతి’ ఎలా అయ్యావురా? నీలాంటి వాడు ఉన్నంత కాలం ఈ విశ్వవిద్యాలయం మెట్లపై అడుగిడను. ( అంటూ కోపంగా వెళ్ళిపోయారు.)

తరువాత విశ్వనాథ వారు ఏ విశ్వవిద్యాలయంలోను ’ప్రొఫెసర్’ మెట్టెక్కలేక పోవడం ఆంధ్రుల దురదృష్టం.
ఇంత వరకు చాలా మందికి తెలిసిన కథే. చాలా ఏళ్ళ తరువాత ఈ విషయం విశ్వనాథ వారు కూడ స్వయంగా వ్రాసుకొన్నారు.

కొసమెరుపు : విశ్వనాథ వారు స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాక, రిటైరైన ఆ తెలుగు శాఖాధిపతిని ఒక సాహిత్యాభిమాని " ఇది నిజమేనా? " అని అడిగాడు. దానికి ఆ సాహితీమూర్తి సమాధానం - " ఆయన మహాకవి అని నాకు తెలుసు. కాని ఇంటర్వ్యూలలో పరీక్షకుడు తనకు సమాధానాలు తెలిసి కూడా అభ్యర్థిని ప్రశ్నిస్తాడని ఆయనకు తెలియదు. ఆయనకు ఆ కనీస విషయం తెలియక పోతే  నేనేం చేయను? "

ఆనాటి ఆ తెలుగు శాఖాధిపతి - ఆచార్య బిరుదురాజు రామరాజు గారు.

19, జులై 2011, మంగళవారం

సరస సల్లాపము - 12




కొన్ని దశాబ్దాల క్రితం మాట.
ఒక ప్రముఖ పట్టణంలో తెలుగు సాహిత్య సభలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఆనాటి లబ్ధ ప్రతిష్ఠ మహా కవులనందరినీ ఆహ్వానించి, వారికి పెద్ద హోటల్లో బస, అన్ని వసతులను సమకూర్చారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, మహాకవి శ్రీశ్రీ లకు ప్రక్క ప్రక్క గదుల్లో బస ఏర్పాటు చేయబడింది.
శ్రీశ్రీ గారు ఫ్రెష్ అప్ అయ్యాక, విశ్వనాథ వారిని పలుకరిద్దామని ఆయన గదికి వెళ్ళారు. విశ్వనాథ వారు అప్పుడే స్నానం చేసి, బాత్ రూమ్ నుండి బయటికి వస్తూ శ్రీశ్రీని చూచి లోపలికి ఆహ్వానించి కూర్చోమన్నారు.
కుశల ప్రశ్నల తరువాత, శ్రీశ్రీ చిలిపిగా "నీళ్ళోసుకొన్నారా?" అని ప్రశ్నించారు.
అప్పుడు విశ్వనాథ అంత కన్నా చిలిపిగా "అవును! మీరు కంటున్నారు కదా!" అని సమాధానం చెప్పారు.

16, జులై 2011, శనివారం

సరస సల్లాపము - 11



విజయవాడలో ఒకప్పుడు ’కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణతోబాటు అనేక లబ్ధ ప్రతిష్ఠులైన సాహితీమూర్తులు ఉండేవారు. వారంతా సాయంత్రం కాగానే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర కలుసుకొని, టిఫిన్ చేస్తూ, సాహిత్య చర్చలతోబాటు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని, చీకటి పడ్డాక ఇళ్ళకు వెళ్ళేవారు.
ఒకనాటి సాయంత్రం విశ్వనాథ వారు టిఫిన్ సెంటర్ వద్దకు కాస్త ఆలస్యంగా చేరుకొన్నారు. ఆలోపే అక్కడకు చేరుకొన్న సాహితీ మిత్రులు ’అట్లు’ వేయించుకొని ఆరగిస్తున్నారు. విశ్వనాథ వారు రాగానే ఒక మిత్రుడు - "మీకూ ’అట్లు’ వేయించమంటారా?" అని అడిగాడు. దానికి విశ్వనాథ వారి సమాధానం - " అట్లే కానిండు! ".

10, జులై 2011, ఆదివారం

సరస సల్లాపము - 10



ఆత్రేయ - వ్రాసి ప్రేక్షకులను, వ్రాయక నిర్మాతలను ఏడిపించేవారని ప్రతీతి.
హీరో కృష్ణంరాజు ’అమర దీపం’ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి. మహాకవి ఆత్రేయను ’హోటల్ చోళ’ అన్న స్టార్ హోటల్లో పెట్టి, సకల సౌకర్యాలు సమకూర్చి, మంచి పాటలు వ్రాసిమ్మని కోరా రాయన.
పది రోజులు గడిచాయి. ఆత్రేయ సకల భోగాలను అనుభవిస్తూ హాయిగా తింటున్నారు, పంటున్నారు గానీ ఒక్క పాటా.. చివరికి ... ఒక్క పల్లవిని కూడా వ్రాసివ్వలేదు. కృష్ణంరాజు మొహమాటానికి మరో ఐదు రోజులు వేచి చూసారు. అయినా, కవిగారి నుండి ఉలుకు లేదు.. పలుకు లేదు. హోటల్ బిల్లు తడిసి మోపెడయింది.
హీరో- కం- నిర్మాత కృష్ణంరాజుకు తెగ కోపం వచ్చింది. వెంటనే ఆత్రేయను ప్రక్కనే ఉన్న అర కొర వసతుల ’పల్లవ హోటల్’ లోని రూమ్ కు మార్చారు.
ఆత్రేయ రెండు రోజుల్లోనే అన్ని పాటలు వ్రాసిచ్చి, రూం ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. అద్భుతమైన ఆ పాటలను చూసుకొన్న కృష్ణంరాజు మనసు నొచ్చుకొని ఆత్రేయ ఇంటికి వెళ్ళి, కృతజ్ఞతలు చెప్పి, ఆసక్తిగా "’చోళ’ లో పదిహేను రోజులున్నా బయటకు రాని పల్లవులు ’పల్లవ’లో రెండు రోజుల్లోనే ఎలా వచ్చాయి మాష్టారూ?" అని అడిగారు. ఆత్రేయ నవ్వుతూ, "చోళులకు, పల్లవులకు పడదురా! చోళ సామ్రాజ్యం నుండి బయట పడ్డాక, పల్లవులు పరుగెత్తి వచ్చాయి" అన్నారు.