28, మే 2011, శనివారం

పద్య కవితా ప్రేమికులారా! స్వాగతం!

మహా కవులకు నివాళిగా దూరదర్శన్ (సప్త గిరి) ఛానల్ నిర్వహించిన ’కవి సమ్మేళనం’లోని అమూల్యమైన కవితల సంకలనంగా రూపొందిన "మహా కవులకు నీరాజనం" గ్రంథావిష్కరణ మహోత్సవం ఆదివారం 29 మే 2011 నాడు హైదరాబాదులోని ’శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం’లో ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. వేదిక పై అతిథులతోబాటు గ్రంథంలో కవితల నందించిన డా. పుల్లెల శ్రీరామచంద్రుడు, డా. తిరుమల శ్రీనివాసాచార్య, డా. జె. బాపురెడ్డి మొదలైన అనేక లబ్ధ ప్రతిష్ఠ మహా కవులు పాల్గొనే ఈ విశేష సభకు పద్య కవితా ప్రేమికులు తప్పక విచ్చేసి, కార్యక్రమాన్ని దర్శించి, ఆనందించండి.

- డా.ఆచార్య ఫణీంద్ర

24, మే 2011, మంగళవారం

రంజింపజేసిన రాగావధానం

‘నవ్య సాహితీ సమితి‘ వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించబడుతున్న వినూత్న, విలక్షణ కార్య్క్రమాలలో భాగంగా నిన్న నగరంలోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగిన ‘పద్య లీల - గేయ హేల‘ అనే రాగావధాన కార్యక్రమంలో కవి, రాగావధాని ‘చిమ్మపూడి శ్రీరామ మూర్తి‘ పృఛ్ఛకులు ఇచ్చిన గీతమైనా, పద్యమైనా, కోరిన రాగంలోకి అప్పటికప్పుడు మార్చి ఆలపించి, శ్రోతలను ఉర్రూతలూగించారు. రెండు ఆవృత్తులలో జరిగిన ఈ రాగావధానంలో ప్రసిద్ధమైన జయదేవుని అష్టపదులను, అన్నమాచార్య కృతులను, జానపద గేయాలను, తెలుగు గజళ్ళను, లలిత గీతాలను, రంగస్థల పద్యాలను అడిగిన రాగంలో అవధాని అద్భుతంగా గానం చేసి, అతిథులను, సభాసదులను ఆసాంతం అలరించారు. ఈ రోజు ‘సాక్షి‘, ‘ఈనాడు‘ దినపత్రికలలో ప్రచురించబడిన కార్యక్రమ వివరాలు అందిస్తున్నాను.
‘కొత్త పాళీ‘ గారు! మీ కోసం ఈ పోస్టును ప్రత్యేకంగా సమర్పిస్తున్నాను.

- డా. ఆచార్య ఫణీంద్ర

సాక్షి:




ఈనాడు :


22, మే 2011, ఆదివారం

సంగీత, సాహిత్య ప్రేమికులకు స్వాగతం

జంట నగరాలలోని సంగీత సాహిత్య ప్రేమికులకు శుభ వార్త!
ప్రసిద్ధ సంస్థ "నవ్య సాహితీ సమితి" వజ్రోత్సవాల సందర్భంగా
రేపు ( 23 మే 2011 - సోమ వారం ) 6 గం.లకు
నగరంలోని సుల్తాన్ బజార్ లోగల ’శ్రీకృష్ణ దేవ రాయాంధ్ర భాషా నిలయం’ లో
" పద్య లీల - గేయ హేల " అనే ఒక వినూత్న విలక్షణ రాగావధాన ప్రక్రియ

జరుగనుంది.
తప్పక విచ్చేసి, కార్యక్రమాన్ని దర్శించి, ఆనందించండి.
- డా.ఆచార్య ఫణీంద్ర