ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

27, మే 2012, ఆదివారం

దుష్ట సమాసాలు - చర్చ


  గతంలో ఈ బ్లాగు ద్వారా అందించిన 'ఛందస్సు పాఠాలు', 'సమాస ప్రయోగాలలో గమనించవలసిన విషయాలు'... ఇప్పటికీ చాల మంది రిఫర్ చేయడం - ఆనందం కలిగిస్తూ ఉంటుంది. అయితే తరువాతి కాలంలో బిజీ అవడం వలన నేను ఆ పాఠాలను కొనసాగించలేక పోయాను.

ఆ తరువాత మిత్రులు కంది శంకరయ్య గారు అందుకొని, తమ ’శంకరాభరణం’ బ్లాగు ద్వారా ఇలాంటి పాఠాలను, చర్చలను విరివిగా అందిస్తూ విశేషమైన భాషా సేవ చేస్తున్నారు.

ఆరు నెలల క్రితం అలాంటి చర్చ ఒకటి ఆ బ్లాగులో జరిగింది. అందులో నా పాఠాల ప్రసక్తి రావడం.. ఎవరో .. రాంమోహన శర్మగారు (అజ్ఞాత) తమకు తెలిసిందే సర్వస్వమని భావించి వ్యాఖ్యానించడం జరిగింది.

ఆరు నెలల తరువాత... మొన్న నేను దానిని చూసి సమాధానం వ్యాఖ్యగా ఇచ్చాను.

అయితే అందులోని సారాంశం అందరికీ అందవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ చర్చనంతా ఇక్కడ టపా గా అందిస్తున్నాను.

రాం మోహన శర్మ గారూ! మీరు ఎక్కడున్నారో గాని ... మీరు ఇంకా ఏమయినా చర్చించాలనుకొంటే - నేను సిద్ధమే!


- డా. ఆచార్య ఫణీంద్ర"గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు...

    శ్యామలీయము గారూ దయచేసి యీ ప్రయత్నము ఎలా ఉన్నదో పరిశీలిస్తారా !

    మింట నిండగ గాషాయ మిసిమి, పసుపు
    చంద్ర వంకయు పొడచూప జవితి దినము
    కలలు మెదలుచు మది రేప నలల నా ప్ర
    దోష కాల మొసంగు సంతోష గరిమ !
    November 28, 2011 8:50 PM

శ్యామలీయం చెప్పారు...

    నరసింహమూర్తిగారూ, మీ పద్యంలో కాషాయ మిసిమి అని వర్ణాలను విడిగా చెబుతున్నారా? అయినా యీ మాటలతో సమాసం చేయరాదు. కాషాయం సంస్కృతం. మిసిమి తెలుగు. అలాగే పసుపు చంద్రవంక అంటున్నారు. పసుపుపచ్చని చంద్రవంక అని మీ భావం అనుకుంటాను. పచ్చనిచంద్రవంక అనాలికాని పసుపు చంద్రవంక అనరాదనుకుంటాను. ఇంకా బాగా పసిమిచంద్రవంక అంటే భేషుగ్గా ఉంటుంది. చవితిదినము కన్నా చవితనాడు అన్నది బాగుంటుందని నా అభిప్రాయం. మీది గణం ప్రకారం సరైనదే.
    November 28, 2011 10:15 PM


శ్యామలీయం చెప్పారు...

    నరసింహమూర్తిగారు, 'చవితినాడు' అనేది దుష్టసమాసం కాదండీ. చతుర్ధి అనేది సంస్కృతం. చవితి అన్నమాట తెలుగే, చతుర్ధి నుండి పుట్టిన మాట. అయితే, దినము అనేది దినమ్ అనే సంస్కృత పదమే కదా. కా బట్టి చవితదినము అనేది దుష్టసమాసం . కాని చవితినాడు అనేది సరైన ప్రయోగమే.
    November 29, 2011 8:31 AM


అజ్ఞాత చెప్పారు...

    చవితి అనేది తెలుగు కాబట్టి చవితి దినము అనకూడదా ? చూడబోతే ' వినాయక చవితి ' అనేది కూడా దుష్ట సమాసమే అనేలా ఉన్నారు . అయినా తెలుగు పదం తరువాత సంస్కృతం రావచ్చని సారు గారికి తెలీదా ? ఒక వేళ చవితి తెలుగే అనుకున్నా , దినం సంస్కృతమే అయినా , తెలుగు పదం తరువాత సంస్కృతం తో సమాసం చేయవచ్చు . కాబట్టి చవితి దినము అనవచ్చు . ఇలా వచ్చీ రాని పాండిత్యంతో తప్పుడు పాఠాలు చెప్పడం మహా పాపం . అయ్యా శంకరయ్య గారు , మీ బ్లాగు కి నేనో పాఠకుణ్ణి మాత్రమే నాకు పద్యాలు రాయడం రాదు కాని అంతో ఇంతో తెలుగు వచ్చు . దయచేసి ఇలాంటి తప్పుడు పాఠాల్ని బోధింపజేయకండి సార్, మీకు పుణ్యం ఉంటుంది .
    - రాం మోహన్ శర్మ .
    November 30, 2011 12:19 PM

శ్యామలీయం చెప్పారు...

    చాలా ఆలస్యంగా గమనించాను. ఈ అజ్ఞాత గారు నన్ను మహా పాపిని చేయటం చూడటం జరిగింది. నేనేమీ పరమపుణ్యాత్ముడనని భ్రమలో లేను కాబట్టి ఆశ్చర్యపోవటం లేదు. ఎవరిక కైనా అపోహ ఉంటే మన్నించాలి. అజ్ఞాత గారు అనుమాన పడుతున్నట్లు నేనేమీ పాఠాలు చెప్పటం లేదిక్కడ. అలా చెప్పేందుకు నేను కవినీ గాను పండితుడనూ కాను. ఈ విషయం యీ బ్లాగులో వారికి ఇప్పటికే ఒకటి రెండు సార్లు విన్నవించటం జరింగింది. 'నాకు పద్యాలు రాయడం రాదు కాని అంతో ఇంతో తెలుగు వచ్చు'నని అన్నారు అజ్ఞాతగారు. నాకేమీ కవితాధార ఉట్టిపడిపోతోందన్న భ్రమ నాకేమీ లేదు. నాకు పెద్దగా తెలుగురాదని నాకు అజ్ఞాతగారు చెప్పకముందే తెలుసు, బ్లాగుమిత్రులకూ తెలుసు. తెలుగు పదం తరువాత సంస్కృతం తో సమాసం చేయవచ్చునన తెలియజేసినందుకు కృతజ్ఞుడను.
    December 02, 2011 2:11 PM

శ్యామలీయం చెప్పారు...

    సందేహ నివృత్తి కోసం యీ మహాపాపిబిరుదాంకితుడు వెబ్ ప్రపంచాన్ని గాలించటం జరిగింది. " నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం " నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర బ్లాగులో యీ క్రింది టపా సందేహనివృత్తి చేసింది:
    http://dracharyaphaneendra.blogspot.com/2009/03/haaramcom_31.html
    సూక్ష్మంగా అక్కడి సమాచారం:
    ఆ.ఫ.:సంస్కృత పదాలను, తెలుగు పదాలను కలిపి మిశ్రమ సమాసాలు చేయడం తప్పు. పండితులు వీటిని 'దుష్ట సమాసాలు' అంటారు.......
    ఉదాహరణకు ఈ మధ్య ఏ వార్తా పత్రికను చూసినా 'పాలాభిషేకం' అని వ్రాస్తున్నారు. ఇక్కడ 'పాలు'- తెలుగు పదం; 'అభిషేకం'- సంస్కృత పదం. వీటిని సమాసం చేయకూడదు. దీనిని 'క్షీరాభిషేకం' అనాలి. .........
    అజ్ఞాతగారు నాకు పాపవిముక్తి ప్రసాదిస్తారేమో చూడాలి!
    December 02, 2011 3:01 PM

కంది శంకరయ్య చెప్పారు...

    శ్యామల రావు గారూ,
    అజ్ఞాతల వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఇంతకుముందే విజ్ఞప్తి చేసాను. గత కొన్ని రోజులుగా నేనొక సమస్యతో సతమతమౌతూ బ్లాగుకు వచ్చే వ్యాఖ్యలను పరిశీలించలేదు. లేకుంటే ఆ వ్యాఖ్యను అప్పుడే తొలగించి ఉండే వాణ్ణి. ఈ మధ్య మన బ్లాగుమీద అజ్ఞాతల దాడి తరుచుగా జరుగుతున్నది. నిజంగా ఆ రోజు జరిగిన చర్చను నిశితంగా పరిశీలించి ఉంటే అజ్ఞాత అలా వ్యాఖ్యానించి ఉండేవారు కాదేమో? ఆనాటి చర్చావ్యాఖ్యలను అజ్ఞాత పూర్తిగా చదవలేదని కచ్చితంగా చెప్పవచ్చు.
    December 02, 2011 4:38 PM

అజ్ఞాత చెప్పారు...

    పిల్లికి ఎలుక సాక్ష్యం అని ఒకటుందండి . ఈ పై నుదాహరణ అలాంటిది . ఎందుకంటే పాలాభిషేకం ఖచ్చితంగా తప్పు . అక్కడ సంధి తప్పు . అదేం పాలాభిషేకం అని సవర్ణదీర్ఘసంధి ఎలా అవుతుంది ? కాని మర్రి వృక్షము అనవచ్చు- మర్రి తెలుగు , వృక్షము సంస్కృతం , కాని సమాసం తప్పు కాదు . రూపక సమాసం .
    అక్కడ చెప్పినట్టు సంస్కృతం వచ్చిన తరువత తెలుగు పదం తో సమాసం చేస్తేనే తప్పు అవుతుంది . వృక్ష నీడ . అని అంటే అది తప్పు . రెండు వేరు వేరు పదాలైనప్పుడు , తెలుగు ముందు వచ్చిన తరువాత సంస్కృతం రావచ్చని చిన్నప్పుడే నేర్పించే బేసిక్ పాయింటు .

    పెద్ద కుమారుడు , విన్న వాక్యం , కన్న సాక్ష్యం , తీపి జ్ఞాపకం , మంచి వ్యక్తి , ఇంటి దీపం , జంట కవిత్వం ఇలా ఎన్ని పదాలు చెప్పాలండి మీకు ? అన్నింట్లో తెలుగు దాని తరువాత సంస్కృతం తో సమాసం కాలేదా ?

    సంస్కృతం తరువాత తెలుగు తో మాత్రం సమాసం చేయకూడదని తెలుసు , ప్రాణ గొడ్డము , వానర మూక ఇల్లాంటివి .
    ఇవి తెలీకుండా పాఠం చెప్పినందుకే అలా అన్నాను , ఎవరిని నొప్పించాలని కాదు. కావాలంటే మీరింకో తెలుగు పండితుడిని అడిగి సందేహం నివృత్తి చేసుకొండి . అంతే కాని తెలియని వన్ని తప్పులు అనడం తప్పే .
    అన్నట్టు నేను అజ్ఞాత కాదు - నా పేరు రాం మోహన్ శర్మ అని పైనే చెప్పాను . వృత్తిరీత్యా తెలుగు పండితుడిని కాదు కానీ అభిమానం ఈ బ్లాగు రెగ్యులర్ గా చదువుతాను . ఇంక ఇంతకంటే చెప్పడం న వల్ల కాదు. శంకరయ్యగారికి , మనసు నొచ్చుకుని ఉంటే క్షమించండి
    December 02, 2011 7:12 PM

శ్యామలీయం చెప్పారు...
    ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
    December 02, 2011 8:37 PM

శ్యామలీయం చెప్పారు...

    అజ్ఞాత/రాం మోహన్ శర్మగారూ, నా పరిమితులు నాకూ, అందరు బ్లాగు సభ్యులకూ చక్కగా తెలుసు కాబట్టి పాఠం చెబుతున్నానుకోరెవరూ. అలాగే పెద్దలను సంప్రతిస్తాను. నన్ను మహాపాపి అంటే అన్నారు కాని, డా. ఆచార్య ఫణీంద్రగారిని మీరు యెలక అనటం వింతగా ఉంది. ఈ చర్చ సమాప్తం.
    శంకరయ్యగారు: మన్నించాలి, అజ్ఞాతగారు ముఖ్యమైన చర్చనీయాంశం లేవనెత్తినందువలనే నేను స్పందించాను. ఒక రకంగా ఇది నాకు మనస్తాపం మిగిల్చింది. నావల్ల మరొక పెద్దమనిషికి చెడ్డమాట తగిలింది. ఇక ముందు మరింత జాగ్రత్త తీసుకుంటాను.
    December 02, 2011 8:42 PM

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

    గురువుగారూ,

    నాదొక చిన్న సందేహము. పైన జరిగిన చర్చలో చూస్తే, తెలుగు పదము తరువాత, సంస్కృత పదముతో సమాసము చేయవచ్చు కానీ సంస్కృత పదము తరువాత తెలుగు పదముతో సమాసము చేయలేమనివుంది.

    అప్పుడు, "పాలాభిషేకము" అనే సమాసములో "పాలు" తెలుగు పదము, "అభిషేకము" సంస్కృతపదము కదా, మరి ఎందుకు ఇది దుష్టసమాసము అయింది?? వివరించ వలసినదిగా ప్రార్థన. లేదా తెలుగుపదాలతోటి అన్యభాషా పదాలతో (సంస్కృతపదాలతో కూడా ) సమాసమెప్పుడూ దుష్టసమాసమేనా??

    గురువుగారూ, చర్చను తప్పుదోవ పట్టించేలా వుంటే ఇంకెప్పుడైన సందేహనివృత్తి చేసుకొంటాను. ఇంది ఇంతటితో వదిలేద్దాం.
    December 02, 2011 9:16 PM

శ్యామలీయం చెప్పారు...

    సంపత్కుమారులవారూ, సంస్కృతాంధ్రపదాలను యేక్రమంలోనూ కలిపి సమాసం చేయరాదని అలాచేస్తే దుష్టసమాసమని నేనూ, అలాగాక తెలుగు పదము తరువాత, సంస్కృత పదముతో సమాసము చేయవచ్చునని శ్రీ రాం మోహన్ శర్మగారూ అభిప్రాయ పడ్డాము. వాడి-వేడి ప్రక్కన పెడితే, యీ విషయంలో అందరకూ ఆసక్తి ఉంది. అపండితుడనైన నేను కూడా పెద్దలను అడిగి నిష్కర్ష చేసుకోవా లనుకుంటున్నాను. వాదనకు కాదు, అలా చేయటం వలన నా భాష మరింత పరిపుష్టం అవుతుందని.
    December 03, 2011 9:59 AM

శ్యామలీయం చెప్పారు...

    సంపత్కుమారులవారూ,
    పాలు + అభిషేకము --> పాలాభిషేకము సవర్ణదీర్ఘ సంధి. ఇది చెల్లదు.
    ఇలా, తెలుగు సంస్కృత పదామధ్య సంధి చేయటం కుదరదు.
    సవర్ణదీర్ఘ సంధి కేవలం రెండు సంస్కృతపదాల మధ్య జరిగే సంధి.
    December 03, 2011 10:02 AM

మిస్సన్న చెప్పారు...

    శ్రీ శ్యామలీయమ్ గారు శ్రీ రామ్ మోహన శర్మ గార్లు
    కొద్దిగా సంయమనం పాటిస్తే వారి చర్చల ద్వారా మిత్రులందరికీ
    అమూల్యమైన భాషా జ్ఞానాన్ని అందించిన వారవుతారు.
    December 03, 2011 10:12 PM

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

    ఈ చర్చను ఆలస్యంగా ఈరోజే (24-05-2012) చూసాను.
    రాంమోహన శర్మ గారి వాదన కొంత వరకు పండితులు అంగీకరించిందే. అయితే అది పూర్తిగా ఆమోదయోగ్యమయిన వాదన కాదు. "’పాలాభిషేకం’ సవర్ణ దీర్ఘ సంధి కాబట్టి తప్పు - అంతే కాని, తెలుగుపై సంస్కృతం రావడం వలన కాదు" అన్నారు. మరి ఉత్వ సంధి చేసి .. ’పాలభిషేకం’ అంటే సాధువవుతుందా? ’నల్ల బంగారం’ను ’నల్ల స్వర్ణం’ అంటే బాగుంటుందా? ’బుద్ధి హీనులు’ అని కాకుండా ’తెలివి హీనులు’ అంటే అందరూ ఆమోదిస్తారా? ఇవన్నీ తెలుగు సారస్వత రంగంలో -నిక్కచ్చిగా ఉండే పండితులకు, కొంత ఆధునిక దృష్టితో వెసులుబాటు కోరుకొనే పండితులకు మధ్య ఫలితం తేలకుండా  తరతరాలుగా సాగుతున్న చర్చనీయాంశాలు. శ్రవణ సుభగమైతే కొన్ని సార్లు తెలుగుల మీద సంస్కృతాలను కొందరు పండితులు ఆమోదిస్తున్నారు. అందులో నేనూ ఒకణ్ణి. ఎందుకంటే నా దృష్టిలో భాష - నిశ్చల పర్వతం కాదు .. ప్రవహించే జీవ నది. ఈ విషయాన్ని పండితులంతా గమనిస్తే మంచిది.
    అంతో.. ఇంతో పాండిత్యం గల రాంమోహన శర్మ గారు పిల్లులు, ఎలుకల సామెతలు చెప్పడం శోభించదు.
    May 24, 2012 9:20 PM "

12, మే 2012, శనివారం

ఈ మాసం పద్య కవిత : 'భైరవభట్ల' వారి "ముసలి వాని ప్రేమ లేఖ"

గతంలో ఈ బ్లాగులో వివిధ కవుల సత్కవితలను 'ఈ మాసం పద్య కవిత' శీర్షికతో ప్రచురించే వాణ్ణి. ఈ మధ్య కాలంలో అలాంటి కవితలెవరూ అందించక పోవడంతో కొన్నాళ్ళు అంతరాయం ఏర్పడింది.
కాని మొన్నీమధ్య   భైరవభట్ల కామేశ్వర రావు గారి కవితను చదివాక, దానిని మరచి పోలేక పోతున్నాను. అది నన్ను వెంటాడుతూనే ఉంది. దానికి మరింత ప్రచారం కలిగించడం 'ఆంధ్ర పద్య కవితా సదస్సు' ఉపాధ్యక్షునిగా, 'నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం' ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతగా భావిస్తూ ఇక్కడ ప్రచురిస్తున్నాను.
 భైరవభట్ల కామేశ్వర రావు గారికి అభినందన పూర్వక ధన్యవాదాలతో 
డా. ఆచార్య ఫణీంద్ర 

ముసలివాని ప్రేమలేఖ 
రచన: శ్రీ భైరవభట్ల కామేశ్వర రావుప్రియమగు భార్య సన్నిధికి ప్రేమగ నీ పతి వ్రాయు లేఖ, ఆ
దయగల దైవమే మనల దారుణరీతిని వేరు జేసె, యీ
వయసున నొంటిగా బ్రతుకు భారము నీడ్చుట కష్టమే సుమీ!
అయినను నీ స్మృతుల్ కవితలల్లుచు కాలము నెట్టుచుంటి నే

చూచి యేళ్ళు దాటె నీ చిన్నకొడుకుని,
పక్షమయ్య పెద్దవాని గలసి
ఎవరి బ్రతుకు వారి దీ తండ్రి కోసమై
సమయమీయ నెవరి సాధ్యమగును!

కన్నకొడుకులు నన్నింత కనికరించి
వృద్ధ శరణాలయమ్మున వేసినారు
నెలకి చెరి యైదువందల నిచ్చుచుండి
రింత యైనను చేయు వారెంతమంది?

ఐన నదేమొగాని హృదయమ్మున నొక్క విషాదరేఖ, దుః
ఖానల తప్తమైనటుల ఆత్మ తపించుచునుండె, గుండెలో
యే నరమో కలుక్కుమను యే గతజీవిత జ్ఞాపకమ్ములో
మానసవీధిలో నిలచి మాటికి మాటికి గేలిసేయగా!

ప్రక్కచూపులు చూడ పసిగట్టి ఒక మొట్టి
కాయను నెత్తిపై వేయు చేయి,
గోరుచుట్టైనపుడు కొసరి గోర్ముద్దలు
ప్రేమ మీరగ తినిపించు చేయి,
పొలమారినంతనె తలచెనెవరో యంచు
తలపైని పలుమార్లు తట్టు చేయి,
నడిరేయి దడబుట్టి తడబాటుతో లేచి
నప్పుడు గుండెల నద్దు చేయి,

పట్టి వీడననుచు నొట్టు బెట్టిన చేయి
పట్టు వీడె, బ్రతుకు వట్టి పోయె!
ఒక్క చేయి రాదె ఓదార్పు నీయగా
మ్రోడులేమొ! యెదలు బీడులేమొ!

నీడవైన నీవే నను వీడినావు
ఆదరింతురె నన్నింక అయినవారు?
కట్టె ముట్టించుటకె వేచె కన్నకొడుకు
లక్కటా! యేల జీవిత మారిపోదు?

ప్రతి ఉదయము సూర్యుడు నను,
"బ్రతికే ఉన్నావ?" అనుచు ప్రశ్నించినటుల్
మతి దోచును! సతి వీడిన
పతి జీవన్మృతుడు శుష్కవాక్యము రీతిన్!

ఇచట నావంటి వార లనేకమంది
యంత్ర జీవితమనెడి బకాసురునకు
కన్నబిడ్డల బలిజేసి ఖిన్నులగుచు
మూగమనసుల రోదించు ముసలివారు!

ఆదివారము అనుమతింతురు అతిథి జనులను లోనికిన్
ఎదురు జూతురు, ఎదురు జూతురు, ఎదురు
 జూతురు ఆశతో!
చెదరిపోవును ఆశ కాటుక చీకటుల్ చెలరేగగా
ముదుమి మనసుల మరల మరలిటు మోసపుచ్చుట న్యాయమే?

కాటికి కాలుసాచియు నకారణ మీ మమకార బంధముల్
ఏటికి సెప్పు? కాని మనసే వినదాయెను, నాది నాదనున్!
పూటకి పూట కష్టమయి పోయెను లోకపు చీకటింట యీ
నాటక, మింక చాలు, తుది నా గది తల్పులు తట్టుటెన్నడో?

నిన్ను చేరు వేళ యెన్నాళ్ళ కెన్నాళ్ళ
కనుచు, కనుచు నుంటి కాలుని దెస
క్షణము యుగములైన కాలమ్ము సాగదు
మరణమునకునైన కరుణ రాదు!

వెతలు వెళ్ళగ్రక్కి వేదన రగిలించ
వేడ్క కాదు, కాని వెఱ్ఱి మనసు
ఊరుకోదు! బాధ నోరార జెప్పగా
ఎవరు గలరు నాకు, నీవు తప్ప?

ఇప్పటికే నా బాధలు
చెప్పీ చెప్పీ మనస్సు చెడగొట్టితినా?
చప్పున నిక ముగియించక
తప్పదు...

మరి సెలవు,
                                       నీ సదా,
                                       హృదయశ్రీ.

1, మే 2012, మంగళవారం

సరస సల్లాపము - 21

చరిత్రలో దాఖలాలు లేవు గాని, కవయిత్రి మొల్లమాంబకు, తెనాలి రామకృష్ణునికి వాగ్యుద్ధాలు జరిగినట్లుగా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.
అలాంటిదే ఇది.
మొల్ల కుమ్మరి పిల్ల అని జగమెల్ల ఎరిగినదే. ఒకనాడు ఆమె సంతలో కుండలను పెట్టుకొని అమ్ముకొంటుంది. ఆ సమయంలో అటువైపు వచ్చిన తెనాలి రామకృష్ణుడు కొంటెతనంతో ఆమె చెంతకు చేరి, సమాన పరిమాణంలో ఉన్న రెండు కుండలను చేతితో చూపుతూ, కళ్ళతో ఆమె స్థన యుగ్మాన్ని వీక్షిస్తూ - " పిల్లా! నీ కుంభద్వయిని ఎంత కిస్తావు?" అని అడిగినాడు. 
దానికి ఆ కవయిత్రి ఇచ్చిన  సమాధానం - "నేను నీకు అమ్మనురా!"