ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

18, జూన్ 2012, సోమవారం

కరుణశ్రీ పద్యం - హాస్యం / తాత్త్వికత


వేషము వేసి పంపితివి వేదిక మీదికి - ఆడు వేళ, నా
మీసము జారిపోయి విషమించె పరిస్థితి - ప్రేక్షకుల్ పరీ
హాసము సేయుచుండిరి - రహస్యముగా తెర వేయవచ్చు నీ
కోసము జూచితిన్ - కసరుకొంటి, విదెక్కడి దర్శకత్వమో?
’కరుణశ్రీ’ జంధ్యాల పాపయ శాస్త్రి కలం నుండి జాలువారిన కమనీయ పద్యం ఇది. పైకి హాస్య పద్యంలా కనిపించినా, గూఢార్థం గమనిస్తే తాత్త్వికత ఉట్టిపడే శ్లేషార్థ రచన ఇది. 


సామాన్యార్థంలో చూస్తే - ఒక నటుడు తాను నటిస్తున్న నాటకం యొక్క దర్శకుణ్ణి - "నాకు వేషం వేసి వేదిక మీదికి పంపావు. నేను నటిస్తున్నప్పుడు నా పెట్టుడు మీసం జారిపోయింది. ప్రేక్షకులు నన్ను గేలి చేస్తూ ఉన్నారు. నాకు ఏం చేయాలో తోచని అయోమయంలో చిక్కుకొన్నాను. రహస్యంగా తెర వేసి, నన్ను కాపాడుతావేమో... అని చూసాను. నువ్వేమో అందుకు విరుద్ధంగా నన్నే కసరుకొన్నావు. నువ్వు వెలగబెట్టే దర్శకత్వమేమిటో నాకయితే అర్థం కావడం లేదు." అని నిలదీస్తున్నాడు ఈ పద్యంలో. సాధారణంగా నాటక ప్రదర్శనలలో జరిగే హాస్య సంఘటనలా ఇది అనిపించి నవ్వు పుట్టిస్తుంది. 


కానీ, విశేషార్థంలో అవగాహన చేసుకొంటే - ఇది జీవితం మీద విరక్తి పుట్టిన మనిషి, దేవునితో - "నాకు మానవుని వేషం వేసి, ఈ భూమి అనే వేదిక మీదికి పంపావు. నా జీవన గమనంలో ’నేను’ అన్న అహంకారంతో విర్రవీగుతుంటే నాకు తగిన పరాభవమై, నా మీసం జారిపోయినట్టై విషమ పరిస్థితిలో చిక్కుకొన్నాను. ఈ సమాజంలోని ప్రతి ఒక్కరూ నన్ను అవహేళన చేస్తున్నారు. నాకు బ్రతుకు మీద విరక్తి పుట్టి, నువ్వైనా నా జీవితానికి ముగింపు పలుకుతావేమోనని చూసాను. నువ్వూ నన్నే కసరుకొన్నావు. హారి భగవంతుడా! నీ లీల ఏమిటో నా కర్థం కావడం లేదు." అంటూ తన వేదనను వెళ్ళబోసుకొంటున్నట్టుగా అర్థం స్ఫురిస్తుంది. ఈ భావన అవగతం కాగానే హృదయం ఆర్ద్రం అవుతుంది. 


చూసారా? అదీ మహాకవి కరుణశ్రీ భావ శబలత!

- డా. ఆచార్య ఫణీంద్ర