ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

4, డిసెంబర్ 2012, మంగళవారం

సి.డి. ఆవిష్కరణ కార్యక్రమ వివరాలు ...మా గురువు గారు రచించిన ’జ్యోత్స్నాభిసారిక’ నృత్య నాటిక - సి.డి. ఆవిష్కరణ సభ 30-11-2012 నాటి సాయంత్రం  వైభవోపేతంగా జరిగింది. కార్యక్రమారంభంలో జరిగిన కవి సమ్మేళనంలో మా గురువు గారిని స్తుతిస్తూ పలువురు కవులు వినిపించిన కవితలు శ్రోతలను అలరించాయి. ఆ కార్యక్రమ వివరాలు, కవి సమ్మేళనంలో నేను వినిపించిన కవిత ఇక్కడ అందిస్తున్నాను. ఈ కవి సమ్మేళనంలో నాతోబాటు పాల్గొన్న కవి మిత్రులు, "ఆంధ్రామృతం" బ్లాగరు - శ్రీ చింతా రామకృష్ణారావు గారిని మొదటి సారిగా కలుసుకోవడం ఆనందాన్ని కలిగించింది.


- డా. ఆచార్య ఫణీంద్ర
                    ("నమస్తే తెలంగాణ" వార్తా పత్రిక సౌజన్యంతో ...)  


"నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -"  [కవిత]

రచన: 'పద్య కళాప్రవీణ' డా. ఆచార్య ఫణీంద్ర


ఎవ్వాని భావాల కివ్వేళయే గాక 
    భావియున్ తల వంచి ప్రణతు లిడును -
ఎవ్వాని కావ్యాల నిముడగా వస్తువై 
    ధరణిలో అణువణ్వు తపన పడును -
ఎవ్వాని మాటయే ఇలలోన చాటువై
     నరుల నాల్కల పైన నాట్య మాడు -
ఎవ్వాని కీర్తి మహీ మండలమ్ముపై
     దశ దిశాంతమ్ములన్ దాటి సాగు -

అట్టి నండూరి వంశార్ణ వైక సోమ!
రామకృష్ణమాచార్య  సన్నామధేయ!
నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -
ఎత్తి నడయాడి లోకాల నేలుకొనగ!

కువలయమున నున్న కుటిల నీతిని ఎత్తి,
కుండ బ్రద్దలట్లు కొట్టి చూపి, 
అభ్యుదయ పథమ్ము ’నాలోచనము’ పేర
వెలయ జేసితి ’వధి వేమ’నగుచు!

ఎలమి డెబ్బదేండ్లకు పైన ఏకధాటి
పద్య రత్నముల్ సృజియించి ప్రణుతి కెక్కి
నట్టి ’నండూరి రామ కృష్ణా’ఖ్య సుకవి!
మహిని పద్యమ్మునకు నీవు మారు పేరు!

అతుల కవీశ్వరా! సుకవితాంబకు ముద్దుల పట్టి! పండిత
స్తుత ఘన సాహితీ కుసుమ శోభన వాటిక యందు మేటి క
ల్ప తరువునై, సుధా రస మపారము చిప్పిలు పద్య సత్ఫలాల్
శతము లొసంగితో! పలుకు శాసనమౌ గురుదేవ! మ్రొక్కెదన్! 


                       ---***---