10, డిసెంబర్ 2013, మంగళవారం

సాహితీప్రియులకు సాదరాహ్వానం










గురువారం 12 డిసంబర్ 2013 నాడు సాయంత్రం హైదరాబాదులో చిక్కడపల్లి,అశోక్ నగర్ లో ఉన్న 'త్యాగరాయ గాన సభాలో 'ప్రముఖ సాహితీమూర్తి కీ.శే. వేమరాజు నరసింహారావు స్మారక సాహితీ పురస్కారం', ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి గారికి ప్రదానం చేయబడుతుంది. 'నవ్య సాహితీ సమితి' నిర్వహించే  ఈ కార్యక్రమంలో మా సాహితీ మిత్రుల బృందం అంతా కలసి "భువన విజయం" సాహిత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్నాం.
సాహితీ ప్రియులకు అందరికీ ఇదే మా సాదరాహ్వానం.

- డా. ఆచార్య ఫణీంద్ర

  ఉపాధ్యక్షులు

  నవ్య సాహితీ సమితి 

  హైదరాబాద్. 









  

11, జులై 2013, గురువారం

సాహిత్యాభిమానులకు స్వాగతం

"వి.ఎల్.ఎస్. విజ్ఞాన సారస్వత పీఠం" 8వ వార్షికోత్సవ సందర్భంగా "పద్యకవితా పురస్కార ప్రదానోత్సవం" మరియు "గ్రంథావిష్కరణోత్సవం" కార్యక్రమాల సభ ఆదివారం 14 జూలై 2013 నాడు సాయంత్రం 6 గం||లకు హైదరాబాద్ లోని "రవీంద్ర భారతి" సమావేశ మందిరంలో నిర్వహించబడుతోంది.

పురస్కార గ్రహీతలు :
1. ప్రముఖ కవి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు
2. ప్రముఖ కవి, అష్టావధాని శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారు

ఆవిష్కరింపబడనున్న "ఆచార్య వి.ఎల్.ఎస్. భీమశంకరం" గారి గ్రంథాలు :
1. "ఆత్మీయ కవితా కదంబం" (విస్తృతీకృత ద్వితీయ ముద్రణ)
2. "How Sweet Is Thy Name Rama!" ("శ్రీరామ! నీ నామ మేమి రుచిరా!" పద్య కావ్యానికి ఆంగ్లానువాదం) 

సాహిత్యాభిమానులందరికీ ఇదే మా సాదర స్వాగతం!

- డా. ఆచార్య ఫణీంద్ర
  సాహిత్య సలహాదారు
  వి.ఎల్.ఎస్. విజ్ఞాన సారస్వత పీఠం
  

16, జూన్ 2013, ఆదివారం

నవరస భరితం నండూరి పద్యం - 1


లోగడ "నండూరి వారి ముక్తకాలు" శీర్షికతో మా గురువు గారి పద్యాలను కొన్నింటిని నేను ధారావాహికగా ప్రచురించడం జరిగింది. 
ఇప్పుడు మా గురువు గారి రచనలు మరి కొన్నింటిని "నవరస భరితం నండూరి పద్యం" శీర్షికన ధారావాహికగా ప్రచురించ దలచాను. ఆస్వాదించి ఆనందించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర 





1, మే 2013, బుధవారం

మా గురువు గారి 93వ జయంతి సభ



నిన్న ( 29 ఏప్రిల్ 2013) సాయంత్రం ’రవీంద్ర భారతి’ సమావేశ మందిరంలో
మా గురువు గారు దివంగత మహాకవి డా. నండూరి రామ కృష్ణమాచార్యుల వారి 93వ జయంతి సభ క్రిక్కిరిసిన సాహిత్యాభిమానుల సమక్షంలో ఎంతో వైభవోపేతంగా, రమణీయంగా జరిగి పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని పరవశింప జేసింది. ఆ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను, ఆ కార్యక్రమ వివరాలను తెలియజేసే వివిధ తెలుగు వార్తా పత్రికలలో వచ్చిన వార్తా విశేషాలను వీక్షించి ఆనందించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర


ఆహ్వాన పత్రిక :



ఈనాడు :



నమస్తే తెలంగాణ :




సాక్షి :

వార్త :





ఆంధ్ర జ్యోతి :




సూర్య :


2, మార్చి 2013, శనివారం

ఢిల్లీలో "వేటూరి ప్రభాకర శాస్త్రి" జయంతి



దేశ రాజధాని ఢిల్లీలోని "ఏ.పి.భవన్" లో 9 మార్చ్ 2013 నాడు, తెలుగు సాహితీ దిగ్గజం కీ||శే|| వేటూరి ప్రభాకర శాస్త్రి గారి 125వ జయంతి నిర్వహిస్తున్నట్టు సాహితీ మిత్రులు శ్రీ పత్తిపాక మోహన్ తెలియజేసారు.
ఢిల్లీ వాసులైన తెలుగు వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మనవి.

- డా. ఆచార్య ఫణీంద్ర


18, ఫిబ్రవరి 2013, సోమవారం

సరస సల్లాపము - 25



నిన్న ’భక్తి ప్రసూనాలు’, ’పద్య ప్రసాదం’ గ్రంథాల రచయిత వి.వి. సత్యప్రసాద్ గారు కవి మిత్రులందరినీ వారింట్లో భోజనానికి ఆహ్వానించారు. భోజనానికి ముందు అందరు సత్యప్రసాద్ గారి గ్రంథాలలోని పద్య రచనా పాటవాన్ని గురించి మాటాడుతున్నారు.
"సత్య ప్రసాద్ గారి వృత్తి బ్యాంక్ ఉద్యోగమైనా, ప్రవృత్తి అయిన పద్య రచనలో ఎప్పుడూ లెక్క తప్ప లేదు -" అన్నారు సాధన నరసింహాచార్య.
"ఎలా తప్పుతారు? ఆయన చేతిలో ఉండేది ’మని’ అయినా, గుండెలో కొలువుండేది ’ఆమని’ మరి!"  అన్నారు వై. రామకృష్ణారావు గారు!
నాతోబాటు మరి కొందరు కవి మిత్రులు "బాగుంది! బాగా చెప్పారు!" అని స్పందించాం.

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

సరస సల్లాపము - 24

హైదరాబాదులో "రమ్య సాహితీ సంస్థ" వారి సాహిత్య పురస్కారం స్వీకరించేందుకు వెళ్ళాను. కార్యక్రమానికి ముందు సాహితీ మిత్రులు సాధన నరసింహాచార్య, దత్తాత్రేయ శర్మ, వి.వి. సత్య ప్రసాద్, నేను సరదాగా మాటాడుకొంటున్నాం. మాటలు సినిమాల్లో పతనమవుతున్న విలువల పైకి మళ్ళాయి. "నాటి హీరోయిన్లకు, నేటి హీరోయిన్లకు ఎంత తేడా!" అని నిట్టూర్చారు దత్తాత్రేయ శర్మ గారు. వెంటనే సత్య ప్రసాద్ గారు అందుకొని -"అవునవును ... నాటి హీరోయిన్లు చండీ రాణులు! నేటి హీరోయిన్లు చెడ్డీ రాణులు!!" అన్నారు. అందరం నవ్వుల్లో మునిగి తేలాం.

9, ఫిబ్రవరి 2013, శనివారం

సరస సల్లాపము - 23

1980 ప్రాంతంలో "ఆధునిక కవిత - అభిప్రాయ వేదిక" అన్న గ్రంథాన్ని రూపొందిస్తూ, ప్రముఖ కవి డా. ఆచార్య తిరుమల - పలువురు ఆధునిక మహాకవులు రచించిన కావ్యాలపై ఆనాటి మహాకవుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఆ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ రచించిన "ఖడ్గ సృష్టి"  కావ్యంపై తన అభిప్రాయం చెప్పమని మరొక మహాకవి గుంటూరు శేషేంద్రశర్మను అడిగారు. దానికి ఆ కవీంద్రుడు ఇచ్చిన సమాధానం -
" అందులో ఖడ్గమూ లేదు - సృష్టీ లేదు. " *

(* ఈ అభిప్రాయం సరైనదా? కాదా? - ఇక్కడ చర్చనీయాంశం కాదు. ఆ కవి పలుకులోని చమత్కారమే ప్రధానం.)

6, జనవరి 2013, ఆదివారం

సరస సల్లాపము - 22



                   ఒక పండితుడు కిరాణా కొట్టుకు వెళ్లి, "మా ఆవిడ బిర్యానీ చేయాలనుకొంటుంది. శ్రేష్ఠమయిన బియ్యం చూపవయ్యా!" అని అన్నాడట. ఆ కొట్టు యజమాని -"వసుమతి" అన్నాడు. "వసుమతా? బాసుమతా?" అని ప్రశ్నించాడు ఆ పండితుడు. దానికి ఆ 'కొట్టు'వాడు "పండితులు! మీకు చెప్పాలా? ఉత్తరాది వారు 'వ'ని  'బ'గా పలుకుతారు.వసుమతేనండి!" అన్నాడు. ఆ పండితుడు "వీడి పాండిత్యం కూలా!" అని మనసులో అనుకొని, బియ్యం తీసుకొని ఇంటికి వెళ్లాడు.       
                  మరో రోజు... ఆ పండితుడు మళ్ళీ ఆ కొట్టుకే వెళ్లి "మా ఆవిడ నువ్వుల లడ్డులను చేయాలనుకొంటుంది. మేలు రకం నువ్వులను చూపించు" అన్నాడు. వెంటనే ఆ  కొట్టు యజమాని "తిలోత్తమ" అన్నాడు. అర్థం కాక ఆ పండితుడు "అదేమిటి?" అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ కొట్టు యజమాని "పండితులు! మీకు చెప్పలా? తిలలలో ఉత్తమమైనది." అన్నాడు. దానికి ఆ పండితుడు "ఓరి నీ తెలివి మండ!" అని మనసులో అనుకొని, మారు మాట్లాడకుండా నువ్వులను తీసుకొని ఇంటి దారి పట్టాడు.  

(ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభలలో కవి మిత్రులు 'రసరాజు' గారితో సంభాషిస్తుంటే  , నా మస్తిష్కంలో మెరిసిన చిన్న ప్రహసనం ఇది.
- డా.ఆచార్య ఫణీంద్ర )