18, ఫిబ్రవరి 2013, సోమవారం

సరస సల్లాపము - 25



నిన్న ’భక్తి ప్రసూనాలు’, ’పద్య ప్రసాదం’ గ్రంథాల రచయిత వి.వి. సత్యప్రసాద్ గారు కవి మిత్రులందరినీ వారింట్లో భోజనానికి ఆహ్వానించారు. భోజనానికి ముందు అందరు సత్యప్రసాద్ గారి గ్రంథాలలోని పద్య రచనా పాటవాన్ని గురించి మాటాడుతున్నారు.
"సత్య ప్రసాద్ గారి వృత్తి బ్యాంక్ ఉద్యోగమైనా, ప్రవృత్తి అయిన పద్య రచనలో ఎప్పుడూ లెక్క తప్ప లేదు -" అన్నారు సాధన నరసింహాచార్య.
"ఎలా తప్పుతారు? ఆయన చేతిలో ఉండేది ’మని’ అయినా, గుండెలో కొలువుండేది ’ఆమని’ మరి!"  అన్నారు వై. రామకృష్ణారావు గారు!
నాతోబాటు మరి కొందరు కవి మిత్రులు "బాగుంది! బాగా చెప్పారు!" అని స్పందించాం.

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

సరస సల్లాపము - 24

హైదరాబాదులో "రమ్య సాహితీ సంస్థ" వారి సాహిత్య పురస్కారం స్వీకరించేందుకు వెళ్ళాను. కార్యక్రమానికి ముందు సాహితీ మిత్రులు సాధన నరసింహాచార్య, దత్తాత్రేయ శర్మ, వి.వి. సత్య ప్రసాద్, నేను సరదాగా మాటాడుకొంటున్నాం. మాటలు సినిమాల్లో పతనమవుతున్న విలువల పైకి మళ్ళాయి. "నాటి హీరోయిన్లకు, నేటి హీరోయిన్లకు ఎంత తేడా!" అని నిట్టూర్చారు దత్తాత్రేయ శర్మ గారు. వెంటనే సత్య ప్రసాద్ గారు అందుకొని -"అవునవును ... నాటి హీరోయిన్లు చండీ రాణులు! నేటి హీరోయిన్లు చెడ్డీ రాణులు!!" అన్నారు. అందరం నవ్వుల్లో మునిగి తేలాం.

9, ఫిబ్రవరి 2013, శనివారం

సరస సల్లాపము - 23

1980 ప్రాంతంలో "ఆధునిక కవిత - అభిప్రాయ వేదిక" అన్న గ్రంథాన్ని రూపొందిస్తూ, ప్రముఖ కవి డా. ఆచార్య తిరుమల - పలువురు ఆధునిక మహాకవులు రచించిన కావ్యాలపై ఆనాటి మహాకవుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఆ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ రచించిన "ఖడ్గ సృష్టి"  కావ్యంపై తన అభిప్రాయం చెప్పమని మరొక మహాకవి గుంటూరు శేషేంద్రశర్మను అడిగారు. దానికి ఆ కవీంద్రుడు ఇచ్చిన సమాధానం -
" అందులో ఖడ్గమూ లేదు - సృష్టీ లేదు. " *

(* ఈ అభిప్రాయం సరైనదా? కాదా? - ఇక్కడ చర్చనీయాంశం కాదు. ఆ కవి పలుకులోని చమత్కారమే ప్రధానం.)