26, డిసెంబర్ 2015, శనివారం

పడతుల అష్ట కష్టావధానం!

రచన : మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారు

సీ. 
అడు గడుగున నిషేధాజ్ఞ జారీచేయ 
        మగడు నిషిధ్ధాక్షరిగను దోప -
గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వలతోడ 
        మాసమ్ము గడుప సమస్య కాగ -
అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు 
        దత్తుండు దత్త పదంబు కాగ -
ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి 
        వర్ణనీయాంశమై వరలు చుండ -
పాలు కూరలు పండ్ల బండ్ల వారల రాక 
        యాశుధారా కవిత్వార్ధ మనఁగ -
అత్తయ్య వేసెడి యక్షింత లవియన్ని 
        పాత పురాణంపు పఠన మనఁగ -
పోనీని రానీని ఫోను మ్రోతల రోత 
        ఘంటికా గణనమ్ము కరణి దోఁప -
బోరు గొట్టించెడి ధారవాహిక సుత్తి 
        యధిక ప్రసంగమై యడ్డుపడఁగ -

తే.గీ. 
దినము దిన మిట్లు వనితలు తిప్పలుపడి
పూటపూటకు నవధాన పూర్ణసిధ్ధి
తనరుచుండఁగ పురుషావధానులేల? 
వర సహస్రావధానులీ పడతు లెల్ల!

17, డిసెంబర్ 2015, గురువారం

చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గారికి పద్య కవితా పురస్కారం

2016 సంవత్సరానికి గాను మా గురువు గారు - దివంగత మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్య స్మారక పద్య కవితా పురస్కారాన్ని సుప్రసిద్ధ కవయిత్రి శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గారికి ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. 

 


"భద్రాచల రామదాసు", "మాతృభూమి" వంటి కావ్యాలను రచించిన శ్రీమతి లక్ష్మీనరసమ్మ ( ఖమ్మం జిల్లా, భద్రాచలం వాస్తవ్యురాలు) గారికి 29 ఏప్రిల్ 2016 నాడు హైదరాబాదులో నిర్వహించే డా.నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభలో ఈ పురస్కారం ప్రదానం చేయబడుతుంది.  


- డా. ఆచార్య ఫణీంద్ర

  కార్యదర్శి - నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం
  హైదరాబాద్.  


2, మే 2015, శనివారం

నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభా విశేషాలు


29/04/2015 నాడు జరిగిన మహాకవి స్వర్గీయ డా. నండూరి రామకృష్ణమాచార్య 95వ జయంతి సభా విశేషాలు: 
(వివిధ పత్రికల సౌజన్యంతో -)


సాక్షి:


నమస్తే తెలంగాణ: 








ఈనాడు :

ఆంధ్ర జ్యోతి :

వార్త : 

మన తెలంగాణ :

23, ఏప్రిల్ 2015, గురువారం

నండూరి వారి జయంతి సభ

పద్య కవితా తపస్వి, మా గురువు గారు, స్వర్గీయ నండూరి రామకృష్ణమాచార్య  గారి 95 వ జయంతి సభ 29 ఏప్రిల్ 2015 నాడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులో నారాయణగూడ  -  వై.యం.సి.ఏ. ఆడిటోరియంలో నిర్వహించబడుతుంది.. ప్రముఖ కవి డా.జె.బాపురెడ్డి గారికి నండూరి వారి స్మారక పద్య కవితా పురస్కారం ప్రదానం చేయబడుతుంది. సాహిత్యాభిమానులందరికీ  ఇదే మా ఆహ్వానం.

- డా. ఆచార్య ఫణీంద్ర