3, డిసెంబర్ 2020, గురువారం

నండూరి వారి శత జయంతి మహోత్సవాల ప్రారంభ సభ

మా గురువు గారు మహాకవి కీ. శే. నండూరి రామకృష్ణమాచార్య గారి శత జయంతి మహోత్సవాలలో భాగంగా, ప్రారంభ సభ ఆదివారం 24 అక్టోబర్ 2021 నాడు నిర్వహించబడింది. ఆ సమావేశ చిత్రాలు :

వార్తా పత్రికలలో ఆ కార్యక్రమ విశేషాలు :



22, సెప్టెంబర్ 2020, మంగళవారం

సాహితీ సల్లాపాలు - 4 (విన్నవి .. కన్నవి ...)

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు అధ్యక్షత వహించిన ఒక సభలో ఒక వక్త సమయాన్ని గురించి పట్టించుకోకుండా, ధారాళంగా ప్రసంగిస్తున్నాడు. మధునాపంతుల వారు కొంత సేపు ఓపిక పట్టారు. కాని ఆ వక్త తన ప్రసంగ ధోరణి నుండి బయటకు రావడం లేదు. చివరికి మధునాపంతుల వారు ప్రక్కనున్న కార్యకర్తను పిలిచి, ఆ వక్తను - "శివ భారతం" కావ్యకర్త ఇంటి పేరేమిటో .. అడుగుమని కోరారు. ఆ కార్యకర్త ఆ పని చేయగానే ... ఆ వక్త తన చేతికి ఉన్న గడియారాన్ని చూసుకొని, "చాలా సేపు మాట్లాడినట్టున్నాను. క్షమించండి." అంటూ, తన ప్రసంగాన్ని ముగించాడు.


ఇంతకీ - "శివభారతం" కావ్యాన్ని రచించిన మహాకవి పేరు "గడియారం వేంకట శేష శాస్త్రి". అదన్న మాట సంగతి.   

1, ఆగస్టు 2020, శనివారం

సాహితీ సల్లాపాలు - 3 (విన్నవి .. కన్నవి ...)

ఇది పండితులు చెప్పుకోగా విన్నది. ఎంత సత్యమో .. ఏమో ... తెలియదు!
ధిషణాహంకారం అలంకారంగా శోభిల్లిన సుప్రసిద్ధ మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి వద్దకు ఒక సాహిత్యాభిమాని వచ్చి .. మొన్నీ మధ్య ఫలానా సంస్థ వారు మీకూ, గుర్రం జాషువా గారికి కలిపి సన్మానం చేసారట కదా! .. అన్నాడట.
విశ్వనాథ వారు దానికి, తన సహజ ధోరణిలో .. "ఏం చేస్తాం? ఆ సంస్థ వారు గుర్రాన్ని, గాడిదను ఒకే గాటన కట్టారు." అని సమాధాన మిచ్చారట.
ఆ సాహిత్యాభిమాని అంతటితో ఆగక, మహాకవి గుర్రం జాషువా గారి వద్దకు చేరి ఈ విషయాన్ని అంటించాడు.
అప్పుడు గుర్రం జాషువా గారు "నేనయితే "గుర్రం"! మిగితాది ఎవరో మీరే చూసుకోండి." అన్నారట చమత్కారంగా తన ప్రతిస్పందనను తెలుపుతూ.
దీనికి మరో కొసమెరుపు ఉంది. ఆ సాహిత్యాభిమాని మళ్ళీ విశ్వనాథ వారికి ఈ విషయం చెప్పారట. దానికి ఆ మహానుభావుడు ఏమాత్రం నొచ్చుకోకుండా .. "ఏముంది!
నేను‌ అందరినీ తిడుతుంటాను. వాడు నన్ను తిట్టాడు." అన్నారట.
మహా కవుల అహంకార ధోరణులు కూడా ఆహ్లాదకరంగానే ఉంటాయి మరి!


6, మే 2020, బుధవారం

సాహితీ సల్లాపాలు - 2 (విన్నవి .. కన్నవి ...)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది 'కరెంట్' కోతల కాలం.‌ ఒక సభలో మహాకవి డా. సి. నారాయణ రెడ్డి గారు ధారాళంగా ప్రసంగిస్తున్నారు. సడెన్ గా కరెంట్ పోయింది. మైక్ పని చేయడం‌ ఆగిపోయింది. ఆయన ప్రసంగించడం ఆపుచేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కాసేపటికి, మళ్ళీ కరెంట్ వచ్చింది. నారాయణ రెడ్డి గారు తన ప్రసంగాన్ని పునఃప్రారంభిస్తూ - "ఈ రోజుల్లో సభలలో ప్రసంగించాలంటే .. విద్వత్ సహకారం ఉంటే సరిపోదు ... విద్యుత్ సహకారం కూడ కావాలి" అన్నారు. శ్రోతలు ఒక్కపెట్టున కరతాళ ధ్వనులను వినిపించారు.


30, ఏప్రిల్ 2020, గురువారం

నండూరి రామకృష్ణమాచార్యులు గారి శత జయంతి

"కరోనా" సమస్య లేకపోతే ... 27 ఏప్రిల్ 2020  నుండి 29 ఏప్రిల్ 2020 వరకు 3 రోజులపాటు మా గురువు గారు, మహాకవి
డా. నండూరి రామకృష్ణమాచార్యులు గారి శత జయంతి ఉత్సవాలను తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించాలని భావించాం.
గురువు గారి మహోన్నత వ్యక్తిత్వంపై పద్య కవి సమ్మేళనం, గురువు గారి సాహిత్య విశ్లేషణలతో కూడిన సమావేశాలు, గురువుగారి స్మారక పురస్కారాల ప్రదానాలతోబాటు గురువు గారు రచించిన "జ్యోత్స్నాభిసారిక" నృత్య రూపక ప్రదర్శన వంటి అనేక కార్యక్రమాలను ఇరు తెలుగు రాష్ట్రాలలోని ఎందరో లబ్ధ ప్రతిష్ఠ సారస్వత మూర్తుల సమక్షంలో గురువు గారి అభిమానులు, శిష్యులు, బంధువులు, కుటుంబ సభ్యుల సహకారంతో  నిర్వహించాలని ప్రణాళికను రచించాం.
కాని మేమొకటి తలిస్తే, భగవంతుడు మరొకటి తలచాడు.
ఆ కార్యక్రమాలు ఇప్పుడు వాయిదా పడుతున్నందుకు విచారిస్తున్నాం.

ఎవ్వాని భావాల కివ్వేళయే గాక
    భావియున్ తల వంచి ప్రణతు లిడును -
ఎవ్వాని కావ్యాల నిముడగా వస్తువై
    ధరణిలో అణువణ్వు తపన పడును -
ఎవ్వాని మాటయే ఇలలోన చాటువై
     నరుల నాల్కల పైన నాట్య మాడు -
ఎవ్వాని కీర్తి మహీ మండలమ్ముపై
     దశ దిశాంతమ్ములన్ దాటి సాగు -

అట్టి నండూరి వంశార్ణ వైక సోమ!
రామకృష్ణమాచార్య  సన్నామధేయ!
నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -
ఎత్తి నడయాడి లోకాల నేలుకొనగ!

(29/04/2020 నాడు మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యులు గారి శత జయంతి సందర్భంగా ఆ మహాకవి దివ్య స్మృతికి ప్రణమిల్లుతూ ...)

- డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి,
నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం,
హైదరాబాదు.

10, మార్చి 2020, మంగళవారం

సాహితీ సల్లాపాలు - 1 (విన్నవి .. కన్నవి ...)


"ఆంధ్ర కల్హణ" బిరుదాంచితులు, మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఒకనాడు ఆయన శిష్యుని ఇంటికి వెళ్ళారు. ఆ శిష్యుడు సాదరంగా ఆహ్వానించి, కాసేపు ముచ్చటించిన తరువాత, "ఈ మధ్య రిఫ్రిజిరేటర్ కొన్నాం గురువు గారు! చూడండి." అంటూ క్రొత్తగా కొన్న రిఫ్రిజిరేటర్ ను చూపాడు. శాస్త్రి గారు ఆ రిఫ్రిజిరేటర్ ను పరిశీలిస్తూ, మెల్లగా దాని డోరును తెరిచే సరికి, దాని నిండా బీరు బాటిల్స్ కనిపించాయి. అప్పుడు శాస్త్రి గారు "ఇది రిఫ్రిజిరేటరా? లేక 'బీరు'వానా?" అని విసుక్కొన్నారు. పాపం! ఆ శిష్యుని మొహం మాడిపోయింది.