12, నవంబర్ 2010, శుక్రవారం

సరస సల్లాపము - 9



’కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ అవసాన దశలో హాస్పిటల్లో ఉన్నారు. ఇవాళో, రేపో అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ఆయన కాత్మీయుడయిన ఒక శిష్యుడు పరామర్శించడానికి వెళ్ళాడు. ఏదో రకంగా ధైర్యం చెప్పాలి కాబట్టి, ఆ శిష్యుడు గురువుగారితో " డాక్టరు గారితో మాట్లాడాను ... ఏం భయం లేదన్నారు " అన్నాడు. వెంటనే విశ్వనాథ వారన్న మాట - " వాడి బొంద! వాడికేం భయం? పోతే ... నేను పోతాను."
పక్కనే ఉన్న నర్సు కిసిక్కుమంది.

30, అక్టోబర్ 2010, శనివారం

సరస సల్లాపము-8



హైదరాబాదులో ఒకానొక సాహిత్య సమావేశాలలో పాల్గొనడానికి వెళ్ళాను. చాలా మంది రచయిత్రులు, కవులు విచ్చేసారు. సమావేశాల ప్రారంభానికి ముందు పెద్ద సందడిగా ఉంది. నేను, డా. ద్వానాశాస్త్రి గారు కలిసి కబుర్లు చెప్పుకొంటున్నాము. మా చుట్టూ మరో పది మంది చేరారు.
ఇంతలో ఒక రచయిత్రి అందరినీ కలుస్తూ, పలుకరిస్తూ హడావుడి చేస్తున్నది. నేను ద్వానాశాస్త్రి గారితో "ఎవరీవిడ?" అన్నాను. ద్వానాశాస్త్రి గారు నవ్వుతూ "ఆమె ఒక స్త్రీవాద రచయిత్రి. పురుషుణ్ణి ఉతికి ఆరేసి, మడతబెట్ట గలదు." అన్నారు.
వెంటనే నేను "అప్పు డామెను ’స్త్రీవాది’ అనకూడదు. ’ఇస్త్రీ వాది’ అనాలి." అన్నాను.
ఒక్కసారిగా మా చుట్టూ నవ్వులు వెల్లివిరిసాయి.

12, అక్టోబర్ 2010, మంగళవారం

మరణ మంగళాశాసనము

మరణ మంగళాశాసనము
[మరణించేప్పుడు వారసులకు తన ఆస్తులను పంచుతూ వీలునామా వ్రాసేవాళ్ళను ఎంతో మందిని చూస్తుంటాం. కాని మా గురువుగారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య మరణించే ముందు పద్య రూపకంగా వ్రాసిన వీలునామా ఇది. ఒక్కసారి చదివి చూడండి - ]




మరణ సమయమందు మధుర గానము చాలు -
వద్దు - మందులేవి వాడవద్దు !
ఏ గతించినప్పు డేడ్వరా దెవరేని -
ఏడ్పటన్న నాకు ఏవగింపు !

మైల పట్టవద్దు - మంత్ర తంత్రము వద్దు -
స్నాన శౌచ నిరతి చాలు - చాలు !
జరుపవచ్చు సుకవి సత్కార మొకనాడు
దుఃఖ లవము సుంత దొరలకుండ !

భార్య మ్రగ్గ రాదు, పసుపు కుంకుమ వీడి -
పదవ నాటి తంతు వద్దు - వద్దు !
భర్త చావు బాధ భార్య ఓర్చుట చాలు -
వికట కర్మకాండ వేరు నేల ?

జరుప వద్దు నాకు శ్రాద్ధ కర్మల నేవి -
వద్దు పెట్టవద్దు తద్దినాలు !
బాల బాలికలకు బహుమానముల తీర్చి,
ఏ దినముననైన నీయవచ్చు !

అంతము చెందు ఈ భువి సమస్తము, సృష్టియు దిగ్దిగంత వి
శ్రాంత మశాశ్వతము రవిచంద్రులతోడ - మనుష్యు చావు నో
వింత ఉదంతమా ? వికట వేదనలెందుకు ? సర్వ తాప ని
ష్క్రాంత మవశ్య మంగళము ! చావొక స్వస్తి వర ప్రసాదమే !
___ *** ___

10, అక్టోబర్ 2010, ఆదివారం

సరస సల్లాపము - 7



వ్రాసింది పద్య కవిత్వమైనా, మా గురువుగారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య అభ్యుదయకవిగా బహుళ ప్రసిద్ధి చెందారు. ఆయన రచించిన ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’, ’ఆలోచనము’ మొదలైన గ్రంథాలలోని వేలాది ముక్తక పద్యాలలో ఆలోచనాత్మకమైన తాత్త్వికత, హేతువాదంతోబాటు అక్కడక్కడా మార్క్సిస్ట్ దృక్పథం కూడా తొంగి చూస్తుంటాయి. ఆ లక్షణాలే ఆయనను ఆధునిక పద్య కవులలో ఒక విశిష్ట కవిగా అగ్రేసర స్థాయిలో నిలబెట్టాయి.
అలాంటి ఆయన ఒకసారి శ్రీ సత్యసాయిబాబా గారి ఆహ్వానం మేరకు, పుట్టపర్తికి వెళ్ళి ఆయనను సందర్శించుకొన్నారు. ఈ రోజుల్లో విలేకరులకు ఇలాంటి విషయాలలో అంత నిశిత పరిశీలన, వివేచన ఉండడం అరుదు. కాని, ఆ రోజుల్లో ఒక విలేకరి మా గురువుగారు బాబా గారి ఆశ్రమం నుండి బయటకు రాగానే, ఆయనను ఇంటర్వ్యూ పేర పట్టుకొని, ఇరుకునబెట్టే ప్రయత్నంగా - " మీరు బాబాను దైవంగా భావిస్తున్నారా ? " అని ప్రశ్నించాడు. దానికి గురువుగారి సమాధానం : " ఆయన నిజంగా దైవమే అయితే, ఆయనలోని మానవత్వానికి నేను నమస్కరిస్తున్నాను. ఆయన మనలాంటి మానవుడే అయితే ఆయనలోని దైవత్వానికి నేను నమస్కరిస్తున్నాను. " అంతే ... ఆ విలేకరి మరో ప్రశ్న వేయలేకపోయాడు.

2, అక్టోబర్ 2010, శనివారం

సరస సల్లాపము - 6













’చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి’



1950వ దశాబ్దిలోని మాట.
మా గురువుగారు ’నండూరి రామకృష్ణమాచార్య’ గారిని భీమవరంలో ఒక సాహిత్య సంస్థ ఘనంగా సన్మానించాలనుకొంది. మా గురువుగారి గురువుగారు ’పింగళి లక్ష్మీకాంతం’ గారిని సన్మాన కర్తగా ఆహ్వానించారు. అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి ...
ఇంతలో ఒక దుర్వార్త ... మహాకవి, గురువులకే గురువు ’చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి’ గారు పరమపదించారని నిర్వాహకులకు తెలిసింది. వెంటనే ఒక వార్తాహరుని మా గురువుగారి వద్దకు పంపారు. " చెళ్ళపిళ్ళ వారు మరణించిన సందర్భంలో సన్మాన కార్యక్రమం జరుపడం బాగుండదు. ఎలాగు ... లక్ష్మీకాంతం గారు వస్తున్నారు కాబట్టి, వారి ఆధ్వర్యవంలోనే ఆ సభను చెళ్ళపిళ్ళ వారి సంతాప సభగా జరుపాలనుకొంటున్నాం. మీరూ తప్పకుండా రావాలి " అని అతడు చెప్పాడు. నిండు యవ్వనంలో అప్పుడప్పుడే ’కీర్తి’ రుచి చూస్తున్న మా గురువుగారికి ఈ వార్త అశనిపాతంలా తగిలింది.
ఇంతలో లక్ష్మీకాంతం గారు మా గురువుగారి ఇంట్లోనే దిగారు. చిన్నబోయి ఉన్న శిష్యుని నుండి విషయం తెలుసుకొన్న లక్ష్మీకాంతం గారు, " సరే ! నువ్వయితే పద ! చూద్దాం ! " అని శిష్యుని వెంటదీసుకొని బయలుదేరారు.
సభ ప్రారంభమయింది. పింగళి లక్ష్మీకాంతం గారు ప్రసంగిస్తున్నారు ...
" చెళ్ళపిళ్ళ వారు జగద్గురువులు. నేను వారి శిష్యుణ్ణి అయినందుకు గర్విస్తున్నాను. ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ప్రాచీన యుగానికి భరత వాక్యం; నవీన యుగానికి నాందీ వాక్యంలాంటి వారు. వారికి మరణం లేదు. ఆ మాటకు వస్తే, ప్రతిభకు మరణం ఉండదు. అది ఒక జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. నిన్నటి వరకు మా గురువుగారిలో ఉన్న ప్రతిభ, ఈ రోజు నాలో, తరువాత నా శిష్యుడు నండూరి రామకృష్ణమాచార్యలో ప్రకాశిస్తూనే ఉంటుంది. అంచేత మా శిష్యుణ్ణి సన్మానిస్తే, పైనున్న మా గురువుగారు తనను సన్మానించినట్టుగా సంతోషిస్తారు. పాపం ! ఈ నిర్వాహకులు నండూరి రామకృష్ణమాచార్యను సన్మానించుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకొన్నట్టున్నారు. ఇప్పుడా కార్యక్రమాన్ని జరుపుకొందాం ! " అని లక్ష్మీకాంతం గారు నిర్వాహకుల వైపు తిరిగారు. నిర్వాహకులు కాసేపు అవాక్కయి, తరువాత తేరుకొని, సన్మాన సామాగ్రిని ఆయన ముందుంచారు. లక్ష్మీకాంతం గారు శిష్య వాత్సల్యంతో తన చేతుల మీదుగా నండూరి వారిని ఘనంగా సన్మానించారు. తరువాత లక్ష్మీకాంతం గారు, " ఇన్నాళ్ళు నేను ’చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి’ గారి శిష్యునిగా చెప్పుకొని జీవించాను. ఇక ఈ రోజు నుండి ’నండూరి రామకృష్ణమాచార్య’ గురువుగా చెప్పుకొని గర్విస్తాను. " అని తన ప్రసంగానికి ముక్తాయింపు పలికి, కూర్చున్నారు.

15, సెప్టెంబర్ 2010, బుధవారం

పద్య సరస్వతి పరిచారకునికి ప్రణతి




’పద్య రచన’ నేర్పడంతోబాటు, ’సమస్యా పూరణం’ ద్వారా అభ్యాసం చేయించడం వలన మన చేత, వీలయినంత మంది పద్య కవులను తీర్చి దిద్దాలన్న సదాశయంతో, మా గురువుగారి పేర రూపొందించిన ఈ "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" అన్న బ్లాగు ద్వారా ఒక చిరు ప్రయత్నాన్ని ప్రారంభించి, చాలినంత సమయం చిక్కక కొనసాగించలేక పోయాను నేను. మనసులో అది అప్పుడప్పుడూ బాధిస్తూ ఉండేది.
సరిగా ... ఆ సమయంలోనే ’కంది శంకరయ్య’ ( వరంగల్ కు చెందిన విశ్రాంత అధ్యాపకులు ) అనే తెలుగు సాహిత్యారాధకులు ( లోగడ నేనిచ్చే సమస్యలకు క్రమం తప్పకుండా పూరణలు చేసేవారు ) ఉత్సాహంగా ’శంకరాభరణం’ అనే బ్లాగును ప్రారంభించి, దీక్షతో ... "చమత్కార పద్యాలు", "గళ్ళ నుడికట్లు", "సమస్యా పూరణం"లను అనునిత్యం అందిస్తూ భాషాసరస్వతికి ఎనలేని సేవ చేస్తున్నారు. ఈరోజు చాలా మంది బ్లాగర్లు చేయి తిరిగిన రీతిలో పద్యాలు వ్రాస్తున్నారంటే అది వీరి కృషి ఫలితమే. పద్య రచనలో అవసరమైన చోట తగిన సవరణలను మృదుల భాషలో సూచిస్తూ బ్లాగర్లను తీర్చి దిద్దుతున్నారు. వృత్త పద్యాల రచనాభ్యాసానికి తగినంత సమయం అవసరం- అని గుర్తించిన వీరు అలాంటి సమస్యలను "వారాంతపు సమస్యాపూరణం" శీర్షిక ద్వారా అందించడం విశేషం. వీరి దీక్ష ఎంత గొప్పదంటే ... తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా, తను కర్తవ్యంగా భావించిన ఈ భాషా సేవకు అంతరాయం కలుగకుండా శ్రమించారు. తెలుగు బ్లాగర్లలో ఎందరో ఎన్నో విషయాలను వ్రాస్తున్నారు. వాటిలో ఏవి ఎంతవరకు సమాజానికి ఉపయుక్తమో నిర్ణయించే సామర్థ్యం నాకు లేదు గాని, నవతరం యువతీ యువకులలో తెలుగు భాషా సాహిత్య బీజాలను నాటి, అనురక్తిని కలిగించేందుకు ఈ విశ్రాంత జీవితంలో కాలాన్ని సద్వినియోగం చేస్తున్న శంకరయ్య గారిని కొనియాడకుండా ఉండలేం. తెలుగు సాహిత్య సేవలో పునీతమవుతున్న వేళ్ళ మీద లెక్కించబడే బ్లాగర్లలో శంకరయ్య ఒకరు అనే కన్న, వారిలో కూడా ఆయన ముందున్నారనడానికి నాతోబాటు, ’ఆంధ్రామృతం’, ’నరసింహ’ వంటి కొద్ది మంది సహృదయ బ్లాగు నిర్వాహకులకు కూడా అభ్యంతరం ఉండదనుకొంటున్నాను.
ఈ ’వినాయక చవితి’ నాటికి, సాహిత్య స్వారస్యాన్ని విందుగా అందించే 20 "చమత్కార పద్యా"లను; తెలుగు శబ్ద సంపదలో అధికారాన్ని సాధించి పెట్టే 50 "గళ్ళ నుడికట్ల"ను; పద్య రచనలో ప్రావీణ్యాన్ని పొందేందుకు దోహదపడే "వారాంతపు సమస్యా పూరణం" (8), "సమస్యా పూరణం" ( 92)లతో కలిపి మొత్తం 100 "సమస్యా పూరణా"లను అందించి నిరాటంకంగా సాగిపోతున్నారు. ఆ సిద్ధి వినాయకుడు, సరస్వతీ మాత ఆయనకు అనంతమైన శక్తి యుక్తులను ప్రసాదించి, ఈ దీక్ష, ఈ సేవ ఇలాగే కొనసాగేలా దీవించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రణతి .. ప్రణతి ... ప్రణతి ....
పద్య సరస్వతి పరిచారకునికి
ప్రణతి .. ప్రణతి ... ప్రణతి ....
మా కంది శంకరయ్య గారికి
ప్రణతి .. ప్రణతి ... ప్రణతి ....

11, సెప్టెంబర్ 2010, శనివారం

సరస సల్లాపము - 5

నిజాం రాష్ట్రంలో కమ్యూనిస్ట్ భావాలతో ఫ్యూడల్ వ్యతిరేక పోరాట కవిగా అప్పుడప్పుడే ప్రసిద్ధిని పొందుతున్న ’ కాళోజి ’ ని, అప్పటి ’ యాదగిరి గుట్ట ’ దేవస్థానం కార్యవర్గం, ఒక కార్యక్రమంలో కావ్యగానం చేయమని ఆహ్వానించింది. ఆ యువకవి అందిందే అవకాశమనుకొని, తన ’ నిజాం వ్యతిరేక పోరాట కవిత్వం ’ వినిపించి, ప్రజలను ఉర్రూతలూగించాడు.
ఆ తరువాత ఒక కమ్యూనిస్ట్ స్నేహితుడు, కాళోజిని " నువ్వొక అభ్యుదయ కవివైయుండి, దేవస్థానంలో కవిత్వం చదువుతావా ? " అంటూ నిలదీసాడు. దానికి కాళోజి " నేను దేవస్థానంలో చదివినా, చదివింది మాత్రం అభ్యుదయ కవిత్వమే ! " అని చెప్పి, " పైగా ... నాకు నరసింహ స్వామి ఆదర్శం ! " అన్నాడు. ఆశ్చర్యంగా చూసిన ఆమిత్రునికి కాళోజి ఇలా వివరించాడు -
" విశ్వ చరిత్రలో అరాచకాలు చేసిన మొట్టమొదటి నియంతృత్వ చక్రవర్తి - హిరణ్య కశిపుడు ! ఆ నియంత ఎంత వేధించినా, శాంతియుతంగా సత్యాగ్రహం ద్వారా తన స్వాతంత్ర్యం కోసం పోరాడిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు - ప్రహ్లాదుడు ! ఆ నియంతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, చట్టాన్ని చేతిలోకి తీసుకొని, చక్రవర్తినే హత్య చేసిన మొట్టమొదటి విప్లవకారుడు - నరసింహ స్వామి ! "
ఆ సమాధానం విని నిరుత్తరుడయిన సదరు కమ్యూనిస్ట్ మిత్రుడు తోక ముడిచి వెళ్ళిపోయాడు.

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

సరస సల్లాపము - 4



1954 నాటి మాట.
అప్పటికింకా ’ఆంధ్ర ప్రదేశ్’ రాష్ట్రం ఏర్పడలేదు.
మహాకవి దాశరథి విశాలాంధ్ర (ఆయన దానిని ’మహాంధ్ర’ అనడానికి ఇష్టపడేవారు)ను ఆకాంక్షిస్తూ, ’మహాంధ్రోదయం’ కావ్యాన్ని రచిస్తున్నారు.
" నేనురా తెలగాణ నిగళాల తెగద్రొబ్బి
ఆకాశమంత ఎత్తార్చినాను -
నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు
పాడి మానవుని కాపాడినాను -
నేను పోతన కవీశాను గంటములోని
ఒడుపుల కొన్నింటి బడసినాను -
నేను వేస్తంభాల నీడలో నొక తెన్గు
తోట నాటి సుమాల దూసినాను - "
అని సీస పద్యాన్ని ఆయన పూర్తి చేసి, పైన ’ఎత్తు గీత పద్యం’ వ్రాయడానికి ఉపక్రమించారు.
" కోటిమంది తెలంగాణ ప్రజలకు రెండు కోట్ల ఆంధ్రా ప్రజల గురించి వివరాలు తెలియజెప్పి, ఆ మూడు కోట్ల ప్రజల (ఆ రోజుల్లో అక్కడ, ఇక్కడ కలిపి మొత్తం తెలుగు వాళ్ళ జనాభా మూడు కోట్లు) గొంతుల నొక్కటి చేసి, వారి ప్రతినిధిగా తాను ’మహాంధ్ర గీతా’న్ని పాడినట్లు"గా పద్యం వ్రాయాలనుకొన్నాడు. దాశరథి అంతటి వాడికి భావం స్ఫురిస్తే, పద్యం జలపాతంలా ఉబికి గుండె నుండి పొంగిరాదా? ఆయన కవితావేశం అలాంటిది.
" కోటి తమ్ముల కడ రెండు కోట్ల తెలుగు
టన్నల గూర్చి వృత్తాంత మంద జేసి,
మూడు కోట్ల గొంతుల నొక్క ముడి బిగించి
పాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతి ! " అని వ్రాసారు.
వెంటనే తన తమ్ముడు ’దాశరథి రంగాచార్య’ ( ఆ రోజుల్లో తమ్ముడే ఆయనకు ప్రథమ శ్రోత ) కు వినిపించా రాయన. రంగాచార్య శ్రద్ధగా విని, " అంతా బాగుంది గాని, అన్నయ్యా ! ఆ ’మూడు కోట్ల గొంతుల నొక్క ముడి బిగించి’ అన్నదే బాగా లేదు. మూడు కోట్ల గొంతులకు ప్రతినిధిగా నిన్ను చెప్పుకోవాలన్న నీ ఉద్దేశ్యం మంచిదే గాని, దాని అర్థం మరోలా వస్తోంది " అన్నారు. దాశరథి ఆలోచనలో పడ్డారు. మళ్ళీ రంగాచార్య " మూడు కోట్ల ’గొంతుల’కు ముడి ’బిగిస్తే’ చచ్చి ఊరుకొంటారన్నయ్యా ! దాన్ని మార్చు " అన్నారు. అప్పటివరకు కాస్త మౌనంగా ఉన్న దాశరథి వెంటనే, " నిజమేరా ! ఆవేశంలో నేను గమనించనే లేదు " అని, దాన్ని " మూడు కోటుల నొక్కటే ముడి బిగించి " అని మార్చారు.
" ఇప్పుడు బాగుంది ! " అన్నట్టుగా రంగాచార్య కళ్ళు మెరిసాయి.
( రంగాచార్య గారు నాతో స్వయంగా చెప్పిన ఉదంతం - డా. ఆచార్య ఫణీంద్ర )

12, ఆగస్టు 2010, గురువారం

సరస సల్లాపం - 3





1960.. 70 ల నాటి సంగతి. నా చిన్ననాట ... మా పెద్దలు చెప్పుకొంటుంటే విన్న మాట! అప్పటికి ప్రసార సాధనాలుగా ఉన్నవి వార్తా పత్రికలు మరియు ఆకాశవాణి మాత్రమే. అవీ అంతంతమాత్రంగానే ఉండేవి. ఆ రోజుల్లో ప్రసిద్ధ కవి, ’పోతన చరిత్రము’ మహాకావ్య కర్త, డా. వానమామలై వరదాచార్యులు క్షయ వ్యాధి సోకి, చాలా జబ్బుపడ్డారు. అంతలో ఎవరో ఆగంతుకుడు ఆనాటి యువకవి, ఔత్సాహికుడు అయిన సి. నారాయణరెడ్డికి ఆచార్యులవారు పరమపదించినట్టుగా వార్త మోసారు. అశనిపాతంగా తాకిన ఆ వార్తకు ఎంతో కుందిన నారాయణరెడ్డి కవి వెంటనే సంతాప సభకు ఏర్పాట్లు చేసారు. కాని... నిజానికి ఆ వార్త అసత్యం. వరదాచార్యులవారు అప్పుడే కొద్దిగా కోలుకొన్నారు. ఇంతలో మరొక వార్తావహుడు ఈ విషయాన్ని ఆచార్యులవారికి అంటించాడు. ఆచార్యులవారు కోపంతో ఊగిపోతూ, సంతాపసభ కరపత్రాన్ని చేతిలో పట్టుకొని, సరిగ్గా సభామందిరంలోకి అడుగుపెట్టారు. అక్కడ సభాసదులు వక్తలతోబాటు యువకవి నారాయణరెడ్డి ఈ విషయం తెలుసుకొని ఒకింత నిశ్చేష్టులైనా, మళ్ళీ తమాయించుకొని, వానమామలై వారికి ఎదురుగా వెళ్ళారు. వరదాచార్యులు గారు కట్టలు తెంచుకొన్న ఆగ్రహంతో " నారాయణరెడ్డీ! నేను ... పోతనా? " ( " నేను అంత సులభంగా పోతాననుకొన్నావా? " అని.) అన్నారు. అప్పుడు నారాయణరెడ్డి కవి సమయస్ఫూర్తి, చాకచక్యాన్ని రంగరించి " అన్నా! నీవు పోతనే! మా పాలిట అభినవ పోతనవు! " అన్నారు. వెంటనే సినారె ఆ సంతాపసభను సన్మానసభగా మార్చి, వానమామలై వరదాచార్యులు గారికి ’అభినవ పోతన’ బిరుదప్రదానం చేయడంతో ఆ విద్వత్కవి శాంతించారు.

26, జులై 2010, సోమవారం

ఆణిముత్యం ( జులై 2010 )



చదువుకొన్నవాడు, సంపన్నుడగువాడు
చేయ తప్పు - శిక్ష వేయవచ్చు!
పేదవాని తప్పు ఔదార్య హృదితోడ
సైపవలయు మనుజ సంఘమెల్ల!


ఈ ఆణిముత్యం మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య కలం నుండి జాలువారినది.
విద్యావంతుడు, ధనవంతుడు చేసే తప్పు తెలిసి.. తెలిసి చేసే తప్పు. పైగా "నన్నెవడు అడిగేవాడు?" అన్న అహంకారంతో చేసేది. కాబట్టి అది క్షమార్హం కాదు. కానీ ... పేదవాడు చేసే తప్పు, వాడు చేసేది కాదు. వాని ఆర్థిక స్థితి గతులు వానితో తప్పును చేయిస్తాయి. కాబట్టి ఆ ఆర్థిక అసమానతలకు మూల కారణమైన సంఘానిదే ఆ తప్పు. అందుకే అది శిక్షార్హం కాదు. ఆ తప్పును మనుజ సంఘం తనదిగా భావించి, భరించాలంటారు కవి.
సరళ సుందరంగా, అభ్యుదయాత్మక సందేశం ఇమిడిన ఇలాంటి పద్యాలే మా గురువు గారిని ’ఆధునిక వేమన’గా మన్ననలందుకొనేందుకు దోహదపడ్డాయని నా భావన!

- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

21, జులై 2010, బుధవారం

డా. దాశరథి పై డా. సి.నా.రె. వ్రాసిన స్తుతి పద్యాలు

ఈ మాసం పద్య కవిత ( జులై 2010 )




























దాశరథీ! మనోజ్ఞ కవితా శరధీ! శరదిందు చంద్రికా
పేశల కావ్య ఖండముల పిండిన నీ కలమందునన్ మహో
గ్రాశనిపాతముల్ వెలయు నౌర! మహేశుని కంటిలో సుధా
రాశి తరంగముల్, కటు హలాహల కీలలు పొంగినట్లుగాన్!

నా తరుణ కావ్య లతిక లానాడు పైకి
ప్రాక లేక దిక్కులు సూడ, నీ కరాలు
సాచి, లేత రేకులకు కెంజాయ లద్ది,
మించు పందిళ్ళ పైకి ప్రాకించినావు!

రచన : డా. సి. నారాయణ రెడ్డి



సేకరణ : డా. ఆచార్య ఫణీంద్ర

( 22 జులై - డా. దాశరథి గారి జయంతి సందర్భంగా ... )

6, జులై 2010, మంగళవారం

సరస సల్లాపం - 2



మా గురువుగారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య గోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన గురువుగారు డా. కట్టమంచి రామలింగారెడ్డి రాయలసీమకి చెందినవారు. ఒకరోజు నండూరివారు తమ ప్రాంతానికి చెందిన ఆదికవి నన్నయ గురించి గొప్పగా చెప్పుకపోతున్నారు. అది విని కట్టమంచివారు తమ ప్రాంతానికి దగ్గరలో ఉన్న నెల్లూరుకు చెందిన తిక్కన చాలా గొప్పకవి అని వాగ్వివాదానికి దిగారు. చర్చ కొద్దిగా వేడెక్కింది. రామలింగారెడ్డిగారు " ఏమిటయ్యా మీ నన్నయ గొప్ప ?
పద్యమంతా సంస్కృతం పులమడమేనా ? మా తిక్కనను చూడు - తేట తేట తెలుగు మాటలలో ఎంత చక్కగా వ్రాస్తాడో - " అన్నారు. దానికి నండూరివారు తిక్కన వ్రాసిన "దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ ... " అన్న పద్యాన్ని ఉటంకిస్తూ, " ఇది సంస్కృతం పులమడం కాదేమిటి ? " అని అడిగారు. అప్పుడు రామలింగారెడ్డిగారు ఏం మాట్లాడాలో తెలియక కాసేపు నిశ్శబ్దంగా ఉండి, తరువాత తేరుకొని, " ఆహా ! ద్రౌపదీ ! నీ ఊపిరి తిత్తులు ఎంత బలమైనవి ! " అని నవ్వుతూ అన్నారు. దానితో రామకృష్ణమాచార్యులుగారు కూడా నవ్వాపుకోలేక ఆయనతో శ్రుతి కలిపారు. వాతావరణం ఒక్కసారి చల్లబడింది.

2, జులై 2010, శుక్రవారం

సరస సల్లాపము - 1


నిన్న నా పాత మిత్రుడైన ఒక అర్ధజ్ఞాని కలిసాడు. ’జ్ఞాని’ విన్నాం - ’అజ్ఞాని’ విన్నాం. ఈ ’అర్ధజ్ఞాని’ ఏంటి - అనుకొంటున్నారా ? సగం తెలిసి, సగం తెలియనివాణ్ణి ఏమనాలో తెలియక ఆ పదబంధాన్ని సృష్టించాను మరి.
రావడం, రావడమే వాడు నాపై దాడి చేస్తూ, " మీ కవులు - ఎక్కడో ఆకాశంలో ఉన్న సూర్యునికి, నేలపై కొలనులో ఉన్న కమలానికి సంబంధాన్ని అంటగడతారు. వాటి మధ్య ప్రేమ ... దోమ ... అంటూ కథలు చెబుతారు. నిజానికి సూర్యుని దగ్గరగా కమలం వెళితే చచ్చి ఊరుకొంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే, మాడి మసైపోతుంది. " అన్నాడు.
" దాన్ని ’కవి సమయం’ అంటారు నాయనా ! సూర్యుని కిరణాలు సోకి, కమలం ఆనందంగా వికసిస్తుంది కాబట్టి అది సూర్యునికి ప్రేమికురాలుగా మనం భావించాలి. అంతే! " అని వివరించాను. వెంటనే వాడు " కమలం ప్రేమికురాలైతే ... మరి ’పొద్దు తిరుగుడు’ పువ్వు, సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది.- దాన్ని ’కామ పిశాచి’ అనాలా ? " అన్నాడు. ఇక వాడికేమి చెప్పను ?

1, జులై 2010, గురువారం

సమస్యను పరిష్కరించండి ... ( జులై 2010)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని, చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
చాలా రోజులు ఈ శీర్షికను నిర్వహించడంలో ఆటంకం ఏర్పడినందుకు మన్నించండి. మళ్ళీ ఇదివరకులాగే ఈ శీర్షికను విశేషంగా ఆదరిస్తారని ఆశిస్తూ ...



ఈ మాసం సమస్య :
" కోడిని కరకర నమిలె కోడలమ్మ! "
పై సమస్యను పరిష్కరించి, పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

25, ఏప్రిల్ 2010, ఆదివారం

నండూరి వారి జయంతి సభ

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా, మా పీఠం ద్వారా ఈ నెల 29 వ తేది నాడు మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యుల వారి జయంతి సభ హైదరాబాదులో నారాయణగూడ YMCA హాలులో వైభవోపేతంగా నిర్వహించ బోతున్నాం. ఈ సారి ప్రముఖ కవి శ్రీమాన్ 'నల్లాన్ చక్రవర్తుల శేషాచార్యుల' కు నండూరి వారి స్మారక పద్య కవితా పురస్కారం అందజేస్తున్నామని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం. ఈ కవి ప్రముఖ బ్లాగరు 'నల్లాన్ చక్రవర్తుల కిరణ్' ( నచకి ) తాత గారని తెలియజేయడానికి మరింత సంతోషిస్తున్నాం. ఈ మారు నండూరి వారి 90 వ జయంతి ( మహా అమృతోత్సవం ) ని పురస్కరించుకొని, వారి పద్య కవితలు 'శీర్ణ మేఖల', 'అజ్ఞాత కౌంతేయం' రెండింటిని ప్రముఖ గాయకులు శ్రీ అమలాపురం కన్నారావు గారిచే గానం చేయించి C.D. లుగా రూపొందించాం. ఆ C.D.లను ఆ రోజు ఆవిష్కరింపజేయడం జరుగుతుంది. సభకు విచ్చేసే ప్రతి ఒక్కరికీ ఆ C.D. ని ఉచితంగా అందజేయాలని మా సంకల్పం. హైదరాబాదు, ఆ పరిసర ప్రాంతాలలోని సాహితీ, సాంస్కృతిక ప్రియులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మా పీఠం తరపున ఆహ్వానిస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర , ప్రధాన కార్యదర్శి - నం. రా.సాహిత్య పీఠం.

17, ఏప్రిల్ 2010, శనివారం

సులువుగా పద్యం వ్రాయండి ... (ఏప్రిల్ 2010)

చాలా రోజులుగా బ్లాగు మిత్రులకు దూరంగా ఉన్నందుకు మన్నించండి.
ఇతర కార్యకలాపాలలో ఎడతెరపి లేక తప్పలేదు.
ఇక మన పద్య రచన పాఠాలకు వద్దాం.
ఇంతవరకు మనం ’ ఉత్పల మాల ’, ’ చంపక మాల ’ వంటి వృత్త పద్యాల రచన సులువుగా ఎలా చేయాలో తెలుసుకొన్నాం. మరి ఇప్పుడు అంత కన్న సులువైన పద్యాలు నేర్చుకొందాం. వీటిని ’ ఉప జాతులు ’ అన్న పద్యాలుగా పిలిస్తారు. వీటిలో ట్యూన్ కి పదాలు వేయడంలో మరింత వెసులుబాటు ఉంటుంది.
ఇక్కడ ట్యూన్ లో ’ తాన ’ అని ఉన్న చోట ’ తనన ’ అని కూడా వేసుకోవచ్చు. ( మొత్తం 3 మాత్రలు అన్న మాట ).
ఉదాహరణకు ’ తాన ’ అని ఉన్న ట్యూన్ లో ’ కావ్య ’ అనిగాని, లేక ’ కవన ’ అని గాని వేసుకోవచ్చు. వృత్తాలలో అలా కుదరదు.
అలాగే, ’ తానాన ’ అని ఉన్న చోట ’ తనననా ’, ’ తననాన ’, ’ తాననా ’ ( మొత్తం 5 మాత్రలు ) వేసుకోవచ్చు.
అయితే 5 మాత్రలైనా, దీర్ఘం లేకుండా ’ తనననన ’ అని వేయడం కుదరదు. ( ఇది ఒక exemption. )
ఉదాహరణకు ’ తానాన ’ అని ఉన్న చోట ... ’ మా వాడు ’ అని,
’ మనసులో ’ అని,
’ మన వాడు ’ అని,
’ మానవా ’ అని కూడా వేసుకోవచ్చు.
’ మన మనసు ’ అని మాత్రం వేయకూడదు.
ఇక పద్యంలోకి వద్దాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఛందస్సు ’ ఆట వెలది ’.
దీని ట్యూన్ ... (తా)న తాన తాన (తా)నాన తానాన
(తా)న తాన తాన (తా)న తాన
(తా)న తాన తాన (తా)నాన తానాన
(తా)న తాన తాన (తా)న తాన

ఇలా 1, 3 పాదాలు ఒకలాగా, 2, 4 పాదాలు ఒకలాగా ఉంటాయి.
ప్రతి పాదంలో బ్రాకెట్లలో ఉన్న అక్షరాల మధ్య యతి కుదరాలి. ఇక్కడ ఇంకో వెసులుబాటుంది. యతి కుదరక పోతే, ఆ ప్రక్కనే ఉన్న అక్షరాలు ఒకటే అయితే చాలు. అయితే ఈ ఒకే ప్రాస అక్షరాలకు ముందు దీర్ఘముంటే రెండు చోట్లా దీర్ఘమే ఉండాలి. హ్రస్వముంటే రెండు చోట్లా హ్రస్వమే ఉండాలి. దీనిని ’ ప్రాస యతి ’ అంటారు. ఇది వృత్త పద్యాలలో చెల్లదు.
ఈ పద్యంలో మరొక సులువైన పని ... ప్రాస వేయనక్కర లేదు.
ఇక ప్రసిద్ధ పద్యం ఉదాహరణగా చూద్దాం. మనకు బాగా పరిచయమున్న ’ వేమన ’ పద్యాలన్నీ దాదాపుగా ...
ఆట వెలదులే ! ఒక పద్యం చూద్దాం...



(ఉ)ప్పు కప్పురంబు (ఒ)క్క పోలికనుండు
చూ(డ) చూడ రుచుల జా(డ) వేరు
( ప్రాస యతి )
(పు)రుషులందు పుణ్య (పు)రుషులే వేరయా !
(వి)శ్వదాభి రామ ! (వి)నుర వేమ !

చూసారుగా పై ట్యూన్ కి ఎలా సరిపోయిందో ... !
ఇక ఇప్పుడు మీరు మీకు నచ్చిన వస్తువుపై ఆట వెలది పద్యాన్ని వ్రాయడానికి ప్రయత్నిస్తారు కదూ !
మీ పద్యాలను వ్యాఖ్యలుగ పోస్ట్ చేస్తే, తప్పులుంటే సరిదిద్దుతాను ... All the best !