15, సెప్టెంబర్ 2010, బుధవారం

పద్య సరస్వతి పరిచారకునికి ప్రణతి




’పద్య రచన’ నేర్పడంతోబాటు, ’సమస్యా పూరణం’ ద్వారా అభ్యాసం చేయించడం వలన మన చేత, వీలయినంత మంది పద్య కవులను తీర్చి దిద్దాలన్న సదాశయంతో, మా గురువుగారి పేర రూపొందించిన ఈ "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" అన్న బ్లాగు ద్వారా ఒక చిరు ప్రయత్నాన్ని ప్రారంభించి, చాలినంత సమయం చిక్కక కొనసాగించలేక పోయాను నేను. మనసులో అది అప్పుడప్పుడూ బాధిస్తూ ఉండేది.
సరిగా ... ఆ సమయంలోనే ’కంది శంకరయ్య’ ( వరంగల్ కు చెందిన విశ్రాంత అధ్యాపకులు ) అనే తెలుగు సాహిత్యారాధకులు ( లోగడ నేనిచ్చే సమస్యలకు క్రమం తప్పకుండా పూరణలు చేసేవారు ) ఉత్సాహంగా ’శంకరాభరణం’ అనే బ్లాగును ప్రారంభించి, దీక్షతో ... "చమత్కార పద్యాలు", "గళ్ళ నుడికట్లు", "సమస్యా పూరణం"లను అనునిత్యం అందిస్తూ భాషాసరస్వతికి ఎనలేని సేవ చేస్తున్నారు. ఈరోజు చాలా మంది బ్లాగర్లు చేయి తిరిగిన రీతిలో పద్యాలు వ్రాస్తున్నారంటే అది వీరి కృషి ఫలితమే. పద్య రచనలో అవసరమైన చోట తగిన సవరణలను మృదుల భాషలో సూచిస్తూ బ్లాగర్లను తీర్చి దిద్దుతున్నారు. వృత్త పద్యాల రచనాభ్యాసానికి తగినంత సమయం అవసరం- అని గుర్తించిన వీరు అలాంటి సమస్యలను "వారాంతపు సమస్యాపూరణం" శీర్షిక ద్వారా అందించడం విశేషం. వీరి దీక్ష ఎంత గొప్పదంటే ... తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా, తను కర్తవ్యంగా భావించిన ఈ భాషా సేవకు అంతరాయం కలుగకుండా శ్రమించారు. తెలుగు బ్లాగర్లలో ఎందరో ఎన్నో విషయాలను వ్రాస్తున్నారు. వాటిలో ఏవి ఎంతవరకు సమాజానికి ఉపయుక్తమో నిర్ణయించే సామర్థ్యం నాకు లేదు గాని, నవతరం యువతీ యువకులలో తెలుగు భాషా సాహిత్య బీజాలను నాటి, అనురక్తిని కలిగించేందుకు ఈ విశ్రాంత జీవితంలో కాలాన్ని సద్వినియోగం చేస్తున్న శంకరయ్య గారిని కొనియాడకుండా ఉండలేం. తెలుగు సాహిత్య సేవలో పునీతమవుతున్న వేళ్ళ మీద లెక్కించబడే బ్లాగర్లలో శంకరయ్య ఒకరు అనే కన్న, వారిలో కూడా ఆయన ముందున్నారనడానికి నాతోబాటు, ’ఆంధ్రామృతం’, ’నరసింహ’ వంటి కొద్ది మంది సహృదయ బ్లాగు నిర్వాహకులకు కూడా అభ్యంతరం ఉండదనుకొంటున్నాను.
ఈ ’వినాయక చవితి’ నాటికి, సాహిత్య స్వారస్యాన్ని విందుగా అందించే 20 "చమత్కార పద్యా"లను; తెలుగు శబ్ద సంపదలో అధికారాన్ని సాధించి పెట్టే 50 "గళ్ళ నుడికట్ల"ను; పద్య రచనలో ప్రావీణ్యాన్ని పొందేందుకు దోహదపడే "వారాంతపు సమస్యా పూరణం" (8), "సమస్యా పూరణం" ( 92)లతో కలిపి మొత్తం 100 "సమస్యా పూరణా"లను అందించి నిరాటంకంగా సాగిపోతున్నారు. ఆ సిద్ధి వినాయకుడు, సరస్వతీ మాత ఆయనకు అనంతమైన శక్తి యుక్తులను ప్రసాదించి, ఈ దీక్ష, ఈ సేవ ఇలాగే కొనసాగేలా దీవించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రణతి .. ప్రణతి ... ప్రణతి ....
పద్య సరస్వతి పరిచారకునికి
ప్రణతి .. ప్రణతి ... ప్రణతి ....
మా కంది శంకరయ్య గారికి
ప్రణతి .. ప్రణతి ... ప్రణతి ....

7 కామెంట్‌లు:

  1. చక్కగా మరొక్కసారి గుర్తుచేసారు.
    కంది శంకరయ్యగారి కృషికి జోహార్లు.

    రిప్లయితొలగించండి
  2. ఆచార్య,

    కందశంకరయ్యగారి బ్లాగులో వారు చేస్తున్న కృషి గురించి మీరు చక్కగా వివరించారు. ఆ కృషికి సంబంధించిన ఫలాలు అందుకంటున్నవాళ్లలో నేనూ ఒకడిని. మీ బ్లాగ్ముఖముగ వారికి నా నమస్కారములు.

    రిప్లయితొలగించండి
  3. వారు ఇచ్చే సమస్యలను పూరించినా, పూరించలేక పోయినా నేను తప్పనిసరి చూసే బ్లాగుల్లో శంకరాభరణం మెదటిది. వారికి మీ బ్లాగు ముఖంగా ధన్యవాదములు. వారి కృషికి జోహార్లు.

    రిప్లయితొలగించండి
  4. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    నమస్కృతులు. నన్ను, నా బ్లాగును గురించి చాలా గొప్పగా చెప్పారు. ఏదో కాలక్షేపం కోసం మొదలు పెట్టిన బ్లాగు. మీవంటి పెద్దల సలహా, సహకారాలతో నా పరిధిలో కొనసాగిస్తున్నాను. మీరు నా గురించి ప్రత్యేకంగా పెట్టిన పోస్ట్ నాకు నూతనోత్సాహాన్ని కలిగించింది. మీ ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ కోరుకుంటూ ..........
    ధన్యవాదాలతో ........
    మీ
    కంది శంకరయ్య.

    రిప్లయితొలగించండి
  5. అసంఖ్య గారు!
    తెలుగుయాంకి గారు!
    ఫణి ప్రసన్న కుమార్ గారు
    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  6. కంది శంకరయ్య గారు!
    నేను వాస్తవాన్ని వాస్తవంగా వ్రాసాను. అంతే కదా!
    మీ బ్లాగులోని విశేషాలను మరికొన్ని వ్రాయాలనుకొంటున్నాను. అనుమతిస్తారా ?

    రిప్లయితొలగించండి
  7. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    అంతకంటె అదృష్టం మరొకటి ఉంటుందా? మీ అభిప్రాయాలను సంతోషంగా స్వీకరిస్తాను. నా బ్లాగులోని లోపాలను కూడా తెలియజేసి సవరణలను కూడా సూచించండి.

    రిప్లయితొలగించండి