22, జూన్ 2009, సోమవారం

వార్తా విశేషం ... ( జూన్ 2009 )



---------------------------------------------------------------------------------


నండూరి రామకృష్ణమాచార్య 89వ జయంతి సభ


లోగడ ప్రకటించినట్టుగా 29 ఏప్రిల్ 2009 నాడు హైదరాబాదులోని నారాయణగూడలో YMCA హాలులో " నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం " మరియు " నవ్య సాహితీ సమితి " సంస్థల సంయుక్తాధ్వర్యంలో కీ. శే. డా || నండూరి రామకృష్ణమాచార్య 89 వ జయంతి సభ ఎంతో వైభవంగా జరిగింది. సభకు అధ్యక్షత వహించిన " త్రివేణి " ఆంగ్ల పత్రికా సంపాదకులు ఆచార్య ఐ.వి.చలపతి రావు " నండూరి రామకృష్ణమాచార్యులు తెలుగు పద్య కవిత్వ రంగంలో వైతాళికు " లని, అంతే కాకుండా " ఆయన బహుభాషా కోవిదు " లని కీర్తించారు. ఆంగ్లంలో ఆయన రచించిన "మహా భారత " బహుళ ప్రసిద్ధమని ఆయన ప్రశంసించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు శాఖాధిపతి ఆచార్య టి. కిషన్ రావు మాట్లాడుతూ " నండూరి వారు ముక్తక పద్యాలలో ఆధునిక సమాజానికి అద్దం పట్టిన మహాకవి " అని శ్లాఘించారు. సభలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం సంపాదకులు, ప్రముఖ పద్య కవి శ్రీమాన్ ముదివర్తి కొండమాచార్యులను నండూరి వారి స్మారక పద్య కవితా పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ పురస్కారం క్రింద ఆయనకు నాలుగు వేల రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువ ప్రదానం చేసారు. ప్రముఖ విమర్శకులు, ఉస్మానియా విశ్వ విద్యాలయం రిటైర్డ్ డీన్ ఆఫ్ ఆర్ట్స్ ఆచార్య ఎస్.వి.రామారావు నండూరి వారి స్మారక ప్రసంగం చేస్తూ, నండూరి వారి "ఆలోచనం" గ్రంథంలోని రచనా వైశిష్ట్యాన్ని సోదాహరణంగా వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు శ్రీ అమలాపురం కన్నారావు గానం చేసిన నండూరి వారి " శీర్ణ మేఖల " పద్య కవితా గానం "హైలైట్" గా నిలిచింది. సభలో ఇంకా ప్రముఖ పద్య కవులు ఆచార్య వి.ఎల్.ఎస్. భీమ శంకరం , శ్రీ చిల్లర కృష్ణ మూర్తి , నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం గౌరవాధ్యక్షులు శ్రీ కె. సాగర్ రావు, కోశాధికారి శ్రీ ఆత్మకూరి గాంధీ , టి.టి.డి. వేదాంత వర్ధనీ కళాశాల ప్రిన్సిపాల్ డా || నండూరి విద్యారణ్య స్వామి పాల్గొని రామకృష్ణమాచార్యుల సాహితీ మూర్తిమత్వాన్ని ప్రస్తుతించారు. నండూరి వారిచే రచించబడిన పద్యాల పఠన పోటీలో విజేతలైన విద్యార్థులకు ఈ సభలో ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేయబడింది. ఈ మహాసభకు నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి డా || ఆచార్య ఫణీంద్ర , నవ్య సాహితీ సమితి అధ్యక్షులు శ్రీ వేమరాజు విజయకుమార్ సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.

_ డా || ఆచార్య ఫణీంద్ర
( సంపాదకులు )

21, జూన్ 2009, ఆదివారం

ఈ మాసం పద్య కవిత ... ( 2009 )

మహాకవి డా || దాశరథి విరచిత పద్యాన్ని ఈ మాసం పద్య కవితగ అందిస్తున్నాను.
ఒక నిజమైన కవికి కవిత్వమంటే ఎంత పిచ్చి ఉంటుందో , దాని కొరకు తన సర్వస్వాన్ని కోల్పోవడానికి ఎలా సిద్ధ పడతాడో తెలియజెప్పే పద్యం ఇది.

నాదొక వెఱ్ఱిః త్రాగుడున నాడును వీడును అమ్ముకొన్న ఉ
న్మాదివలెన్ కవిత్వమున నా సకలమ్మును కోలుపోయి రా
త్రీ దినముల్ రచించితిని తీయని కావ్య రస ప్రపంచముల్;
వేదన యేదియో కలత పెట్టును గుండియ నెందుచేతనో? ... ( అగ్నిధార )

ఈ నెల పద్య కవిత ... ( సెప్టెంబర్ 2009 )

అవినీతి
రచన : డా. జె. బాపురెడ్డి, IAS (Retd.)

లేదు అవినీతి లేని తావేది ఇలను
కాని, మన ప్రియ భారత ఖండమందు -
దాని అవతారములు లెక్క లేని యన్ని !
పట్టుబడి, పట్టుబడనట్టి గుట్టులెన్నొ !!

అంతొ ఇంతయో తినకయే సంతకమ్ము
చేయు వారల సంఖ్య కాసింత యౌను
ముందు ముందు - ఆఫీసుల యందు ! నీతి
మంతులగుపించు టది గొప్ప వింత యౌనొ !

రౌడీల రాజ్య మిదియని
రౌడీలే చాటుకొనగ, రక్షణ కొరకై
రౌడీల అండ చేరగ
దౌడులు తీసెదరొ ప్రజలు దయనీయముగాన్ !

తెలియక తప్పులు చేసిన
తెలుపుట సాధ్యమ్మె కాని, తెలిసి తెలిసియే
తెలిసిన తప్పులు చేసెడి
తెలివికి తెలుపునది చావు దెబ్బ యొకటియే !

చూడు ! చట్టాలు విలపించుచుండె - వాని
వంచనల, దూషణల, మాన భంగములకు
పాల్పడెడి దుర్మతుల పని బట్టనట్టి
సంఘమున తాము పుట్టిన శాపమునకు !
----- *** -----

19, జూన్ 2009, శుక్రవారం

సంపాదకీయం ... (జూన్ 2009 )

" ఆధ్యక్ష్యము " సాధు రూపమే !

పనుల ఒత్తిళ్ళ వలన ఒక నెల విరామం తరువాత ఈ బ్లాగు నిర్వహణను తిరిగి చేపట్టాను. పాఠకులను నిరీక్షించేలా చేసినందుకు మన్నించగలరు.
ఎప్పటిలాగే "సమస్యను పరిష్కరించండి" , "ఆణిముత్యం" , "సులువుగా పద్యం వ్రాయండి" వంటి శీర్షికలను ఈ వరకే అందించడం జరిగింది. ఇంకా "ఈ మాసం పద్య కవిత" , "వార్తా విశేషం" వంటి శీర్షికలను త్వరలో అందించగలను. అయితే "ఈ మాసం పద్య కవిత" శీర్షికకు ఔత్సాహికులెవరూ పద్య కవితలను పంపక పోవడం విచారకరం. మంచి పద్య కవితలు ( పాతవైనా సరే ) పద్య కవులు dr.acharya_phaneendra@in.com కు mail చేస్తే ప్రచురించగలను. పద్య కవితా వ్యాప్తికి అందరూ నడుము కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ మాసం "సమస్యను పరిష్కరించండి" లో ఇచ్చిన సమస్య _ " కసభాధ్యక్ష్యమ్ము దక్కె కాంతామణికే ".
ఈ సమస్యకు ఒక వారం రోజుల పాటు పూరణలు రాకపోయేసరికి కవులు అందులోని కిటుకును పట్టుకొన్నారో లేదో అని సందేహంలో పడ్డాను. కాని తరువాత "కంది శంకరయ్య" గారు , "హరి దోర్నాల" గారు చక్కని పూరణలను అందించారు. వారికి నా అభినందనలు.
అయితే , శంకరయ్య గారు , హరి గారు సమస్యను _ " కసభాధ్యక్షతను పొందె కాంతామణియే " అని మార్చి పూరించారు. రెండింటి భావం ఒకటే అయినా ,
వారు "ఆధ్యక్ష్యము" సాధు రూపం కాదనుకొని మార్చారా? అన్న అనుమానం కలుగుతున్నది. అలా అయితే ఇది చర్చనీయాంశమే. "ఆధ్యక్ష్యము" అన్న పదం "సూర్యరాయాంధ్ర నిఘంటువు"లో ఉంది. "అధ్యక్షత్వము" అని దానికి అర్థం పేర్కొనబడింది. ఈ విషయాన్ని గ్రహించ వలసిందిగా కోరుతున్నాను.
మరింత మంది ఈ బ్లాగులో పాలు పంచుకొని , పద్య కవితా వ్యాప్తికి , భాషాభివృద్ధికి దోహదపడాలని వేడుకొంటున్నాను.

_ డా || ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

16, జూన్ 2009, మంగళవారం

సులువుగా పద్యం వ్రాయండి ... (జూన్ 2009)

యతి , ప్రాసల సాధనకు ఒక నెల సమయమిచ్చి , నేనే మరో నెల పనుల ఒత్తిళ్ళ వల్ల మీకు కనిపించకుండాపోయాను. అయితే అది మీకు మరింత అధ్యయనానికి , అభ్యాసానికి ఉపకరించిందని భావిస్తున్నాను. ఇక ఈ మాసం పద్య రచనకు ఉపక్రమిద్దాం. అదీ .. ఏకంగా వృత్త పద్యమయిన " ఉత్పల మాల ". మరి మీరు సిద్ధమేనా ?
మీలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు సినిమా పాటలు వ్రాయాలని కలలు కని ఉంటారు. అప్పుడప్పుడు పాత తెలుగు పాటలకు " పేరడీ " గీతా లల్లి ఉంటారు. లేదా హిందీ పాటలకు తెలుగు అనువాద గీతాలు రచించి ఉంటారు. ఇలా ఏదో ఒక " ట్యూన్ " కి పాట వ్రాయడం సులువైన పనే. అదిగో .. అలాగే " ఉత్పల మాల " పద్యం వ్రాయడం కూడా నేర్చుకొందాం.
" ఉత్పల మాలలో మొత్తం 4 పాదాలు ( అంటే , 4 లైన్లు ) ఉంటాయి. ప్రతి పాదంలోనూ ఒకే రకమైన " ట్యూన్ " ఉంటుంది. ఆ " ట్యూన్ " కి పాట వ్రాసినట్లు పదాలు కూర్చుతూ పోవడమే. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి , మళ్ళీ
10 వ అక్షరానికి యతి కుదుర్చాలి. అలాగే ఇంతకు ముందు చెప్పుకొన్నట్లుగా , ప్రతి పాదంలో 2 వ అక్షరాన్ని ప్రాసగా ఒకే హల్లుకు చెందిన అక్షరాన్ని ఉపయోగించాలి.
ఇంతకీ ఆ ట్యూన్ ... ఏంటంటే ..............
" తానన తాననా తనన తానన తానన తాన తాననా "
ఇక్కడ ట్యూన్ లో .. " తానన " అన్న చోట _
" పాటలు " ...
" పద్యము " ...
" అందుకు " ... ఇలా ఏ పదమైనా వేసుకోవచ్చు.
అలాగే " తాననా " అన్న చోట _
" నీ వలెన్ " ...
" చేయగా " ...
" ఇందులో " ...
" పద్ధతుల్ " ... ఇలా ఏమైనా అర్థవంతంగా పదాలు పూరించుకోవచ్చు.
ఇంకా " తనన " అన్న చోట _
" రచన " ...
" నిలయ " ...
" మదిని " ... ఇలా వేసుకోవచ్చు.
ఇప్పుడు మొత్తం పాదానికి ఒక ఉదాహరణ చూడండి _
" పద్యము వ్రాయుటెం తొసుల భమ్మని చెప్పుట కిద్ది సాక్ష్యమౌ " ( ఇక్కడ 1 వ అక్షరమైన " ప " కి , 10 వ అక్షరమైన " భ " కి యతి కుదిరింది.
ఇప్పుడొక ప్రసిద్ధ పద్యాన్ని ఉదాహరణగా చూద్దాం .....
" కాటుక కంటినీ రుచను కట్టుప యింబడ నేల యేడ్చెదో
కైటభ దైత్యమ ర్దనుని గాదిలి కోడల ఓమ దంబయో
హాటక గర్భురా ణినిను నాకటి కింగొని పోయి యల్లక
ర్ణాటకి రాటకీ చకుల కమ్మత్రి శుద్ధిగ నమ్ము భారతీ "
ఇక్కడ పదాలను విడగొట్టి " ట్యూన్ " ప్రకారం చూపిన సంగతి గ్రహించగలరు. అలాగే ప్రతి పాదంలో యతి , ప్రాసలను కూడా గమనించండి.
ఈ పద్ధతి ప్రకారం మీకు తోచిన భావాన్ని పద్యంగా వ్రాసేందుకు అభ్యాసం చేయండి. పూర్తయిన పద్యాన్ని వ్యాఖ్యగా పోస్ట్ చేస్తే , తప్పొప్పులు వివరిస్తాను. ఇంకా ఎందుకు ఆలస్యం ? ప్రారంభించండి.
_ డా || ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

15, జూన్ 2009, సోమవారం

"ఆణిముత్యం" ... జూన్ 2009

"కుమిలి క్రుళ్ళుచు , నిరుపేద గుడిసె లెల్ల
నేడు కంపు గొట్టుచునుండు నిజము ; కాని
అద్యతన నాగరక హృదయాల కంటె
ఎంత పరిశుభ్రమైనవో ఎంచి చూడ !"


మా గురువు గారు డా || నండూరి రామకృష్ణమాచార్య రచించిన పద్యం ఇది.
నాగరకత పేర పతనమవుతున్న మనుషుల హృదయాల కంటె పేదరికంతో
క్రుళ్ళి ఉన్న slum areas ఎంతో పరిశుభ్రమైనవని ఆచార్యుల వారు ఈ పద్యం
ద్వారా తెలియజెప్పారు. ఎంత చక్కని భావన ! ఎంతటి అభ్యుదయం !

10, జూన్ 2009, బుధవారం

సమస్యను పరిష్కరించండి ... (జూన్ 2009)

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.
ఈ మాసం సమస్య :

"కసభాధ్యక్ష్యమ్ము దక్కె కాంతామణికే!"

ఈ సమస్యను పరిష్కరించి పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.
మంచి పద్యాలను సమీక్ష చేస్తూ, మరొక టపా మాసాంతంలో అందించబడును.
పూరణకు చివరి తేది : 25 జూన్ 2009

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)