10, జులై 2011, ఆదివారం

సరస సల్లాపము - 10



ఆత్రేయ - వ్రాసి ప్రేక్షకులను, వ్రాయక నిర్మాతలను ఏడిపించేవారని ప్రతీతి.
హీరో కృష్ణంరాజు ’అమర దీపం’ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి. మహాకవి ఆత్రేయను ’హోటల్ చోళ’ అన్న స్టార్ హోటల్లో పెట్టి, సకల సౌకర్యాలు సమకూర్చి, మంచి పాటలు వ్రాసిమ్మని కోరా రాయన.
పది రోజులు గడిచాయి. ఆత్రేయ సకల భోగాలను అనుభవిస్తూ హాయిగా తింటున్నారు, పంటున్నారు గానీ ఒక్క పాటా.. చివరికి ... ఒక్క పల్లవిని కూడా వ్రాసివ్వలేదు. కృష్ణంరాజు మొహమాటానికి మరో ఐదు రోజులు వేచి చూసారు. అయినా, కవిగారి నుండి ఉలుకు లేదు.. పలుకు లేదు. హోటల్ బిల్లు తడిసి మోపెడయింది.
హీరో- కం- నిర్మాత కృష్ణంరాజుకు తెగ కోపం వచ్చింది. వెంటనే ఆత్రేయను ప్రక్కనే ఉన్న అర కొర వసతుల ’పల్లవ హోటల్’ లోని రూమ్ కు మార్చారు.
ఆత్రేయ రెండు రోజుల్లోనే అన్ని పాటలు వ్రాసిచ్చి, రూం ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. అద్భుతమైన ఆ పాటలను చూసుకొన్న కృష్ణంరాజు మనసు నొచ్చుకొని ఆత్రేయ ఇంటికి వెళ్ళి, కృతజ్ఞతలు చెప్పి, ఆసక్తిగా "’చోళ’ లో పదిహేను రోజులున్నా బయటకు రాని పల్లవులు ’పల్లవ’లో రెండు రోజుల్లోనే ఎలా వచ్చాయి మాష్టారూ?" అని అడిగారు. ఆత్రేయ నవ్వుతూ, "చోళులకు, పల్లవులకు పడదురా! చోళ సామ్రాజ్యం నుండి బయట పడ్డాక, పల్లవులు పరుగెత్తి వచ్చాయి" అన్నారు.

8, జూన్ 2011, బుధవారం

సాహిత్యాభిమానులందరికీ ఆహ్వానం

ప్రముఖ సాహిత్య విమర్శకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ డీన్ ఆఫ్ ఆర్ట్స్, ఆచార్య ఎస్వీ. రామారావు గారి సప్తతి అభినందన సభ ఆహ్వాన పత్రిక :

28, మే 2011, శనివారం

పద్య కవితా ప్రేమికులారా! స్వాగతం!

మహా కవులకు నివాళిగా దూరదర్శన్ (సప్త గిరి) ఛానల్ నిర్వహించిన ’కవి సమ్మేళనం’లోని అమూల్యమైన కవితల సంకలనంగా రూపొందిన "మహా కవులకు నీరాజనం" గ్రంథావిష్కరణ మహోత్సవం ఆదివారం 29 మే 2011 నాడు హైదరాబాదులోని ’శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం’లో ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. వేదిక పై అతిథులతోబాటు గ్రంథంలో కవితల నందించిన డా. పుల్లెల శ్రీరామచంద్రుడు, డా. తిరుమల శ్రీనివాసాచార్య, డా. జె. బాపురెడ్డి మొదలైన అనేక లబ్ధ ప్రతిష్ఠ మహా కవులు పాల్గొనే ఈ విశేష సభకు పద్య కవితా ప్రేమికులు తప్పక విచ్చేసి, కార్యక్రమాన్ని దర్శించి, ఆనందించండి.

- డా.ఆచార్య ఫణీంద్ర

24, మే 2011, మంగళవారం

రంజింపజేసిన రాగావధానం

‘నవ్య సాహితీ సమితి‘ వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించబడుతున్న వినూత్న, విలక్షణ కార్య్క్రమాలలో భాగంగా నిన్న నగరంలోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో జరిగిన ‘పద్య లీల - గేయ హేల‘ అనే రాగావధాన కార్యక్రమంలో కవి, రాగావధాని ‘చిమ్మపూడి శ్రీరామ మూర్తి‘ పృఛ్ఛకులు ఇచ్చిన గీతమైనా, పద్యమైనా, కోరిన రాగంలోకి అప్పటికప్పుడు మార్చి ఆలపించి, శ్రోతలను ఉర్రూతలూగించారు. రెండు ఆవృత్తులలో జరిగిన ఈ రాగావధానంలో ప్రసిద్ధమైన జయదేవుని అష్టపదులను, అన్నమాచార్య కృతులను, జానపద గేయాలను, తెలుగు గజళ్ళను, లలిత గీతాలను, రంగస్థల పద్యాలను అడిగిన రాగంలో అవధాని అద్భుతంగా గానం చేసి, అతిథులను, సభాసదులను ఆసాంతం అలరించారు. ఈ రోజు ‘సాక్షి‘, ‘ఈనాడు‘ దినపత్రికలలో ప్రచురించబడిన కార్యక్రమ వివరాలు అందిస్తున్నాను.
‘కొత్త పాళీ‘ గారు! మీ కోసం ఈ పోస్టును ప్రత్యేకంగా సమర్పిస్తున్నాను.

- డా. ఆచార్య ఫణీంద్ర

సాక్షి:




ఈనాడు :


22, మే 2011, ఆదివారం

సంగీత, సాహిత్య ప్రేమికులకు స్వాగతం

జంట నగరాలలోని సంగీత సాహిత్య ప్రేమికులకు శుభ వార్త!
ప్రసిద్ధ సంస్థ "నవ్య సాహితీ సమితి" వజ్రోత్సవాల సందర్భంగా
రేపు ( 23 మే 2011 - సోమ వారం ) 6 గం.లకు
నగరంలోని సుల్తాన్ బజార్ లోగల ’శ్రీకృష్ణ దేవ రాయాంధ్ర భాషా నిలయం’ లో
" పద్య లీల - గేయ హేల " అనే ఒక వినూత్న విలక్షణ రాగావధాన ప్రక్రియ

జరుగనుంది.
తప్పక విచ్చేసి, కార్యక్రమాన్ని దర్శించి, ఆనందించండి.
- డా.ఆచార్య ఫణీంద్ర


24, ఏప్రిల్ 2011, ఆదివారం

జంట నగరాల సాహిత్యాభిమానులకు స్వాగతం!

హైదరాబాద్, సికింద్రాబాద్ - జంట నగరాలలో నివాసముంటున్న సాహిత్యాభిమానులారా!
మహాకవి "నండూరి రామకృష్ణమాచార్య" జయంతి మహోత్సవం శుక్రవారం 29 ఏప్రిల్ 2011 నాడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ సుల్తాన్ బజారులోని "శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం"లో నిర్వహించబడును.
మీకందరికీ ఇదే మా ఆహ్వానం.

- డా.ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి
నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం

12, నవంబర్ 2010, శుక్రవారం

సరస సల్లాపము - 9



’కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ అవసాన దశలో హాస్పిటల్లో ఉన్నారు. ఇవాళో, రేపో అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ఆయన కాత్మీయుడయిన ఒక శిష్యుడు పరామర్శించడానికి వెళ్ళాడు. ఏదో రకంగా ధైర్యం చెప్పాలి కాబట్టి, ఆ శిష్యుడు గురువుగారితో " డాక్టరు గారితో మాట్లాడాను ... ఏం భయం లేదన్నారు " అన్నాడు. వెంటనే విశ్వనాథ వారన్న మాట - " వాడి బొంద! వాడికేం భయం? పోతే ... నేను పోతాను."
పక్కనే ఉన్న నర్సు కిసిక్కుమంది.