25, ఏప్రిల్ 2010, ఆదివారం

నండూరి వారి జయంతి సభ

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా, మా పీఠం ద్వారా ఈ నెల 29 వ తేది నాడు మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యుల వారి జయంతి సభ హైదరాబాదులో నారాయణగూడ YMCA హాలులో వైభవోపేతంగా నిర్వహించ బోతున్నాం. ఈ సారి ప్రముఖ కవి శ్రీమాన్ 'నల్లాన్ చక్రవర్తుల శేషాచార్యుల' కు నండూరి వారి స్మారక పద్య కవితా పురస్కారం అందజేస్తున్నామని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం. ఈ కవి ప్రముఖ బ్లాగరు 'నల్లాన్ చక్రవర్తుల కిరణ్' ( నచకి ) తాత గారని తెలియజేయడానికి మరింత సంతోషిస్తున్నాం. ఈ మారు నండూరి వారి 90 వ జయంతి ( మహా అమృతోత్సవం ) ని పురస్కరించుకొని, వారి పద్య కవితలు 'శీర్ణ మేఖల', 'అజ్ఞాత కౌంతేయం' రెండింటిని ప్రముఖ గాయకులు శ్రీ అమలాపురం కన్నారావు గారిచే గానం చేయించి C.D. లుగా రూపొందించాం. ఆ C.D.లను ఆ రోజు ఆవిష్కరింపజేయడం జరుగుతుంది. సభకు విచ్చేసే ప్రతి ఒక్కరికీ ఆ C.D. ని ఉచితంగా అందజేయాలని మా సంకల్పం. హైదరాబాదు, ఆ పరిసర ప్రాంతాలలోని సాహితీ, సాంస్కృతిక ప్రియులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మా పీఠం తరపున ఆహ్వానిస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర , ప్రధాన కార్యదర్శి - నం. రా.సాహిత్య పీఠం.

17, ఏప్రిల్ 2010, శనివారం

సులువుగా పద్యం వ్రాయండి ... (ఏప్రిల్ 2010)

చాలా రోజులుగా బ్లాగు మిత్రులకు దూరంగా ఉన్నందుకు మన్నించండి.
ఇతర కార్యకలాపాలలో ఎడతెరపి లేక తప్పలేదు.
ఇక మన పద్య రచన పాఠాలకు వద్దాం.
ఇంతవరకు మనం ’ ఉత్పల మాల ’, ’ చంపక మాల ’ వంటి వృత్త పద్యాల రచన సులువుగా ఎలా చేయాలో తెలుసుకొన్నాం. మరి ఇప్పుడు అంత కన్న సులువైన పద్యాలు నేర్చుకొందాం. వీటిని ’ ఉప జాతులు ’ అన్న పద్యాలుగా పిలిస్తారు. వీటిలో ట్యూన్ కి పదాలు వేయడంలో మరింత వెసులుబాటు ఉంటుంది.
ఇక్కడ ట్యూన్ లో ’ తాన ’ అని ఉన్న చోట ’ తనన ’ అని కూడా వేసుకోవచ్చు. ( మొత్తం 3 మాత్రలు అన్న మాట ).
ఉదాహరణకు ’ తాన ’ అని ఉన్న ట్యూన్ లో ’ కావ్య ’ అనిగాని, లేక ’ కవన ’ అని గాని వేసుకోవచ్చు. వృత్తాలలో అలా కుదరదు.
అలాగే, ’ తానాన ’ అని ఉన్న చోట ’ తనననా ’, ’ తననాన ’, ’ తాననా ’ ( మొత్తం 5 మాత్రలు ) వేసుకోవచ్చు.
అయితే 5 మాత్రలైనా, దీర్ఘం లేకుండా ’ తనననన ’ అని వేయడం కుదరదు. ( ఇది ఒక exemption. )
ఉదాహరణకు ’ తానాన ’ అని ఉన్న చోట ... ’ మా వాడు ’ అని,
’ మనసులో ’ అని,
’ మన వాడు ’ అని,
’ మానవా ’ అని కూడా వేసుకోవచ్చు.
’ మన మనసు ’ అని మాత్రం వేయకూడదు.
ఇక పద్యంలోకి వద్దాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఛందస్సు ’ ఆట వెలది ’.
దీని ట్యూన్ ... (తా)న తాన తాన (తా)నాన తానాన
(తా)న తాన తాన (తా)న తాన
(తా)న తాన తాన (తా)నాన తానాన
(తా)న తాన తాన (తా)న తాన

ఇలా 1, 3 పాదాలు ఒకలాగా, 2, 4 పాదాలు ఒకలాగా ఉంటాయి.
ప్రతి పాదంలో బ్రాకెట్లలో ఉన్న అక్షరాల మధ్య యతి కుదరాలి. ఇక్కడ ఇంకో వెసులుబాటుంది. యతి కుదరక పోతే, ఆ ప్రక్కనే ఉన్న అక్షరాలు ఒకటే అయితే చాలు. అయితే ఈ ఒకే ప్రాస అక్షరాలకు ముందు దీర్ఘముంటే రెండు చోట్లా దీర్ఘమే ఉండాలి. హ్రస్వముంటే రెండు చోట్లా హ్రస్వమే ఉండాలి. దీనిని ’ ప్రాస యతి ’ అంటారు. ఇది వృత్త పద్యాలలో చెల్లదు.
ఈ పద్యంలో మరొక సులువైన పని ... ప్రాస వేయనక్కర లేదు.
ఇక ప్రసిద్ధ పద్యం ఉదాహరణగా చూద్దాం. మనకు బాగా పరిచయమున్న ’ వేమన ’ పద్యాలన్నీ దాదాపుగా ...
ఆట వెలదులే ! ఒక పద్యం చూద్దాం...



(ఉ)ప్పు కప్పురంబు (ఒ)క్క పోలికనుండు
చూ(డ) చూడ రుచుల జా(డ) వేరు
( ప్రాస యతి )
(పు)రుషులందు పుణ్య (పు)రుషులే వేరయా !
(వి)శ్వదాభి రామ ! (వి)నుర వేమ !

చూసారుగా పై ట్యూన్ కి ఎలా సరిపోయిందో ... !
ఇక ఇప్పుడు మీరు మీకు నచ్చిన వస్తువుపై ఆట వెలది పద్యాన్ని వ్రాయడానికి ప్రయత్నిస్తారు కదూ !
మీ పద్యాలను వ్యాఖ్యలుగ పోస్ట్ చేస్తే, తప్పులుంటే సరిదిద్దుతాను ... All the best !

29, నవంబర్ 2009, ఆదివారం

ఆణిముత్యం ( నవంబరు 2009 )



"అరుగుదెంచి ఎపుడొ అవకాశ మొకమారు
ద్వారము కడ నిల్చి తలుపు తట్టు -
తత్క్షణమ్ము వెడలి తలుపు తీయనియెడన్
మరలి పోవు నద్ది - మరల రాదు!"


ఇది మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యుల కలం నుండి జాలువారిన సందేశాత్మకమైన పద్యాలలో ఒకటి. ఆణిముత్యంలాంటి ఈ పద్యానికి వ్యాఖ్యానం అవసరం లేదని భావిస్తాను. అందరూ ( ముఖ్యంగా యువతరం )
అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
- డా.ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

17, నవంబర్ 2009, మంగళవారం

సులువుగా పద్యం వ్రాయండి ... ( నవంబరు 2009 )



'చంపక మాల' పద్యాన్ని వ్రాయడం మరికొంత అభ్యాసం చేద్దాం.
ట్యూన్ గుర్తుందిగా ...
" తననన తాననా తనన తానన తానన తాన తాననా "
యతి - 11 వ అక్షరం.
మొన్ననే [ నవంబరు 14 నాడు ] 'నెహ్రు జయంతి' జరుపుకొన్నాం.
ఇప్పుడు మన ప్రథమ ప్రధాన మంత్రి 'జవహరు లాల్ నెహ్రు' పై 'చంపక మాల' పద్యం వ్రాయాలనుకోండి. ముందుగా ఆయనను తలచుకోగానే మనకేం గుర్తొస్తుంది ? " ఆయన మన జాతికి రత్నం వంటి వాడు " అనాలనుకోండి. ఇప్పుడా విషయం పద్యంలో చెప్పుదాం.
'చంపక మాల' ట్యూన్ ఏంటి ?
" తననన తాననా తనన తానన తానన తాన తాననా "
ఇప్పుడు పైన అనుకొన్న భావం ట్యూన్ లో ఇలా చెప్పవచ్చు.
తననన : జవహరు
తాననా : లాలు నె ( తరువాత ’ హ్రు ’ వస్తుంది కాబట్టి, ’ నె ’ దీర్ఘాక్షరంతో సమాన మవుతుంది. )
తనన : హ్రు ( తనన లో "త" వరకే నింపాము. ఇంకా " నన " మిగిలి ఉంది. )
ఇంత వరకు వ్రాసిందేంటి ?
" జవహరు లాలు నెహ్రు ..."
ముందు ఆయన పేరయితే వచ్చింది. ఇంకా ...
తనన : హ్రు ... మన
తానన : జాతికి ( ఇక్కడ ’ జా ’ 11 వ అక్షరం కాబట్టి, మొదటి అక్షరమైన ’ జ ’ కు యతి కుదిరింది. )
తానన : రత్నము
తాన : వంటి
తాననా : వాడు ... ( ఇంకా ఒక దీర్ఘాక్షరం మిగిలి ఉంది. )
ఇప్పుడు మళ్ళీ పద్యం చూదాం.
" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడు ... "
ఇంకా ఆయన గురించి ఏం చెప్పవచ్చు? ... ఆయన మన ప్రథమ ప్రధానిగా నవ శకానికి నాంది పలికాడు. అయితే పద్యం రెండో పాదంలోకి వెళుతోంది కాబట్టి ప్రాసాక్షరం సరి పోయేలా పదం వేయాలి. " నై నవయుగ " అంటే, " వ " ప్రాసాక్షరంగా పడి సరిపోతుంది. ఎలాగో చూడండి.
తాననా : వాడునై ( ఇక్కడికి మొదటి పాదం పూర్తయింది.)
మళ్ళీ ... రెండో పాదం ప్రారంభిస్తే ...
తననన : నవయుగ
తాననా : భారతా
తనన : వనికి
ఇప్పుడు పద్యం ఎంత వరకు వచ్చిందో చూద్దాం.
" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడునై
నవయుగ భారతావనికి ..."

ఇప్పుడు రాబోయే అక్షరం రెండో పాదంలో 11వ అక్షరం కాబట్టి మళ్ళీ యతి చూసుకోవాలి. రెండో పాదం " నవయుగ " అని ప్రారంభమైంది కాబట్టి " న " కు యతి వేయాలి. అలాగే వేద్దాం.
తానన : నాందిని
తానన : పల్కె ప్ర
తాన : ధాన
తాననా : మంత్రి గాన్ ! ( ఇక్కడికి రెండో పాదం కూడా పూర్తయింది )
ఇప్పుడు పద్యాన్ని చూద్దాం _
" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడునై
నవయుగ భారతావనికి నాందిని పల్కె ప్రధాన మంత్రిగాన్ ! "

నెహ్రూను గూర్చి ఇంకా ఏం చెప్పవచ్చో ఇలాగే ఆలోచిస్తూ మూడు , నాలుగు పాదాలను కూడా ఇలా పూర్తి చేయవచ్చు. ఆయన ఇంకా ఏం చేసాడు ? పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు, భారీ నీటి ప్రాజెక్టులను నెలకొల్పి దేశం ఉన్నతంగా ఎదగడానికి బాట వేసాడు.
తననన : వివిధ ప
తాననా : రిశ్రమల్
తనన : మరియు
తానన : వేల ’ టి. ( ఇక్కడ ’ వే ’ మీద 3వ పాదం మొదటి అక్షరమైన ’ వి ’ కి యతి కుదిరింది. )
తానన : ఎం.సి. ’ ల
తాన : భారి
తాననా : డాములన్ ( దీంతో మూడో పాదం అయిపోయింది. )
ఇక్ నాలుగో పాదం ...
తననన : యువత కు
తాననా : పాధికై
తనన : నిలిపి
తానన : ఉన్నతి ( ’ యు ’ కి, ’ ఉ ’ కి యతి - గమనించండి. )
తానన : నొందగ
తాన : బాట
తాననా : వేసెరా ! ( నాలుగో పాదం కూడా పూర్తయిపోయింది )
ఇప్పుడు మొత్తం పద్యాన్ని చూద్దాం ...

" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడునై
నవయుగ భారతావనికి నాందిని పల్కె ప్రధాన మంత్రిగాన్ !
వివిధ పరిశ్రమల్ మరియు వేల ’ టి.ఎం.సి. ’ ల భారి డాములన్
యువత కుపాధికై నిలిపి, ఉన్నతి నొందగ బాట వేసెరా ! "

చూసారా ? మన ప్రథమ ప్రధానిపై ఎంత చక్కని పద్యం రూపు దిద్దుకొందో ! ఇది నేను ఇప్పటికిప్పుడు పాఠం వ్రాస్తూ అల్లిన పద్యమే ! ఇందులో పెద్ద కష్టమేమీ లేదు. మీరు కూడా మీకిష్టమైన నాయకుని మీద లేక విషయం మీద, ఒక 'చంపక మాల' పద్యం వ్రాయండి ... వ్యాఖ్యగా ప్రచురించండి. తప్పులుంటే సరి దిద్దుతాను. అవసరమైతే సూచనలిస్తాను.

- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

8, నవంబర్ 2009, ఆదివారం

సమస్యను పరిష్కరించండి ... [ నవంబరు 2009 ]

గత నెల ఇచ్చిన సమస్య : " జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "

నెల రోజులకు పైగా వేచి చూసినా, ఒక్కరంటే ఒక్కరు దానిని పూరణ చేయక పోయేసరికి, కించిత్తు నిస్పృహతో నేనే దాన్ని పూరించాను.
నా పూరణ :
" ప్రళయోన్మాదము గల్గెనేమొ అకటా ! పైపైకి పొంగారగా
నల లువ్వెత్తుగ, ’ కృష్ణవేణి ’ నది వీరావేశమే పూనుచున్ -
విలయోత్పాతము జేసి ముంచినదిరా వేలాది గ్రామంబులన్ !
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "


అయితే, చివరలో ’ హరి దోర్నాల ’ గారు మంచి పూరణను అందించి, చీకటిలో ఆనంద రేఖను వెలిగించారు.
ఆ కవి మిత్రుని పూరణ :
" జలమోయంచును చేయు పూజలకు కాస్తంతన్ దయే లేని ఆ
కలియే నాట్యము చేసెనా యనగ, పొంగారెన్ నదీ మాతలే !
కలలోనైనను గాంచ నోపుదుమె ’ హా ’ కారాల ఆర్త ధ్వనుల్ ?
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "


ఎప్పుడూ వెంటనే స్పందించే ’ కంది శంకరయ్య ’ గారికి మాతృ వియోగం కల్గడం బాధాకరం !
ఆ కవి వరేణ్యునికి ఈ టపా ద్వారా, మన బ్లాగు మిత్రులందరి తరుపున, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.



ఇక ఈ నెల సమస్య : " ఒక్కని చావు తెచ్చెను మరొక్కని కందల మెక్కు భాగ్యమున్ ! "
పై సమస్యను పరిష్కరించి, పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

20, అక్టోబర్ 2009, మంగళవారం

సమస్యను పరిష్కరించండి ... ( అక్టోబరు 2009 )

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని,
చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.

ఈ మాసం సమస్య :
" జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "
పై సమస్యను పరిష్కరించి, పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

18, అక్టోబర్ 2009, ఆదివారం

ఆణిముత్యం ( అక్టోబర్ 2009 )

" లేడు దేవుడనెడు వాడెచ్చటను లేడు "
- అనుచు నొక్కి పలికె నాస్తికుండు !
" లేడు ధరణి మీద లేడురా కంసాలి "
- పసిడి ఉంగరమ్ము బదులు పలికె !!



ఇది మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యుల కలం నుండి జాలువారిన తాత్త్వికపరమైన పద్యాలలో ఒక ఆణిముత్యం.
" దేవుడున్నాడా? లేడా ? " అన్నది యుగయుగాలుగా సాగుతున్న మీమాంస. ఈ తర్కం అంతు లేకుండా తరతరాలుగా మానవులు చేస్తూనే ఉన్నారు. కాని ఏ అతీత శక్తి లేకుండా ఈ సృష్టి, ఈ మానవుడు ... ఇంత క్రమ పద్ధతిలో ఎలా నిర్మించ బడుతున్నాయి? ఒక కంసాలి బంగారు ఉంగరాన్ని తయారు చేస్తాడు. ఎవరూ చేయకుండా ఉంగరం తయారు కాదు కదా! కాని, ఆ ఉంగరానికి కంసాలి అనేవాడు ఉన్నాడని రూఢిగా తెలిసే అవకాశం లేదు. అది తన అస్థిత్వం ఒక సహజ పరిణామమనో, లేక ఉంగరాల మనశ్శక్తి ఫలితమనో భావించే అవకాశమూ లేక పోలేదు.ఆ ఉంగరాలలో కొన్ని (ఒక వేళ వాదించే శక్తి ఉంటే), " కంసాలి అనేవాడు లేడు " అని వాదించే అవకాశం ఉండదంటారా? మానవులు అంతే!కాని వైజ్ఞానికంగా ఆలోచించినా, " ఎటువంటి బాహ్య శక్తి ప్రమేయం లేకుండా, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు గమన స్థితిలోనికి గాని, గమన స్థితిలోని వస్తువు నిశ్చల స్థితిలోనికి గాని మారవు " అన్న న్యూటన్ గమన సూత్రాలలో రెండవ సూత్రాన్ని నమ్మితే - ’ఉత్పత్తి’ అనే మార్పుకు కారణభూతమయ్యే ఆ బాహ్య శక్తి ( అదే అతీత శక్తి లేక దైవ శక్తి ) ఉందన్న విషయం ఒప్పుకోక తప్పదు. ఉంగరానికి కంసాలి ఉన్నాడన్న విషయం నిరూపించే శక్తి లేనట్టే, మానవునికి దేవుడున్నాడన్న విషయం నిరూపించే శక్తి లేక పోవచ్చు. అంత మాత్రాన కంసాలి లేడని, దేవుడూ లేడని చెప్పలేము కదా! అందుకే ఆధునిక కాలంలో ఉన్నత విద్యల నభ్యసించి, మేధావులైన వివేకానందుడు,అరవిందుని వంటి వారు ఆస్తికులై, దైవ శక్తి ప్రచారంలో తమ జీవితాలను సార్థకం చేసుకొన్నారు.
ఇంత చిన్న పద్యంలో ఇంత విస్తార విషయాన్ని ఇలా అందించడం నిజంగా విశేషం. పైగా, తరతరాలుగా కొనసాగుతున్న తర్కానికి ఇంత ’కన్విన్సింగ్’గా సమాధానం అందించడం గురువుగారి అసమాన ప్రజ్ఞా ధురీణతకు తార్కాణం.