6, జనవరి 2013, ఆదివారం

సరస సల్లాపము - 22



                   ఒక పండితుడు కిరాణా కొట్టుకు వెళ్లి, "మా ఆవిడ బిర్యానీ చేయాలనుకొంటుంది. శ్రేష్ఠమయిన బియ్యం చూపవయ్యా!" అని అన్నాడట. ఆ కొట్టు యజమాని -"వసుమతి" అన్నాడు. "వసుమతా? బాసుమతా?" అని ప్రశ్నించాడు ఆ పండితుడు. దానికి ఆ 'కొట్టు'వాడు "పండితులు! మీకు చెప్పాలా? ఉత్తరాది వారు 'వ'ని  'బ'గా పలుకుతారు.వసుమతేనండి!" అన్నాడు. ఆ పండితుడు "వీడి పాండిత్యం కూలా!" అని మనసులో అనుకొని, బియ్యం తీసుకొని ఇంటికి వెళ్లాడు.       
                  మరో రోజు... ఆ పండితుడు మళ్ళీ ఆ కొట్టుకే వెళ్లి "మా ఆవిడ నువ్వుల లడ్డులను చేయాలనుకొంటుంది. మేలు రకం నువ్వులను చూపించు" అన్నాడు. వెంటనే ఆ  కొట్టు యజమాని "తిలోత్తమ" అన్నాడు. అర్థం కాక ఆ పండితుడు "అదేమిటి?" అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ కొట్టు యజమాని "పండితులు! మీకు చెప్పలా? తిలలలో ఉత్తమమైనది." అన్నాడు. దానికి ఆ పండితుడు "ఓరి నీ తెలివి మండ!" అని మనసులో అనుకొని, మారు మాట్లాడకుండా నువ్వులను తీసుకొని ఇంటి దారి పట్టాడు.  

(ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభలలో కవి మిత్రులు 'రసరాజు' గారితో సంభాషిస్తుంటే  , నా మస్తిష్కంలో మెరిసిన చిన్న ప్రహసనం ఇది.
- డా.ఆచార్య ఫణీంద్ర )


4, డిసెంబర్ 2012, మంగళవారం

సి.డి. ఆవిష్కరణ కార్యక్రమ వివరాలు ...



మా గురువు గారు రచించిన ’జ్యోత్స్నాభిసారిక’ నృత్య నాటిక - సి.డి. ఆవిష్కరణ సభ 30-11-2012 నాటి సాయంత్రం  వైభవోపేతంగా జరిగింది. కార్యక్రమారంభంలో జరిగిన కవి సమ్మేళనంలో మా గురువు గారిని స్తుతిస్తూ పలువురు కవులు వినిపించిన కవితలు శ్రోతలను అలరించాయి. ఆ కార్యక్రమ వివరాలు, కవి సమ్మేళనంలో నేను వినిపించిన కవిత ఇక్కడ అందిస్తున్నాను. ఈ కవి సమ్మేళనంలో నాతోబాటు పాల్గొన్న కవి మిత్రులు, "ఆంధ్రామృతం" బ్లాగరు - శ్రీ చింతా రామకృష్ణారావు గారిని మొదటి సారిగా కలుసుకోవడం ఆనందాన్ని కలిగించింది.


- డా. ఆచార్య ఫణీంద్ర




                    ("నమస్తే తెలంగాణ" వార్తా పత్రిక సౌజన్యంతో ...)  


"నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -"  [కవిత]

రచన: 'పద్య కళాప్రవీణ' డా. ఆచార్య ఫణీంద్ర


ఎవ్వాని భావాల కివ్వేళయే గాక 
    భావియున్ తల వంచి ప్రణతు లిడును -
ఎవ్వాని కావ్యాల నిముడగా వస్తువై 
    ధరణిలో అణువణ్వు తపన పడును -
ఎవ్వాని మాటయే ఇలలోన చాటువై
     నరుల నాల్కల పైన నాట్య మాడు -
ఎవ్వాని కీర్తి మహీ మండలమ్ముపై
     దశ దిశాంతమ్ములన్ దాటి సాగు -

అట్టి నండూరి వంశార్ణ వైక సోమ!
రామకృష్ణమాచార్య  సన్నామధేయ!
నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -
ఎత్తి నడయాడి లోకాల నేలుకొనగ!

కువలయమున నున్న కుటిల నీతిని ఎత్తి,
కుండ బ్రద్దలట్లు కొట్టి చూపి, 
అభ్యుదయ పథమ్ము ’నాలోచనము’ పేర
వెలయ జేసితి ’వధి వేమ’నగుచు!

ఎలమి డెబ్బదేండ్లకు పైన ఏకధాటి
పద్య రత్నముల్ సృజియించి ప్రణుతి కెక్కి
నట్టి ’నండూరి రామ కృష్ణా’ఖ్య సుకవి!
మహిని పద్యమ్మునకు నీవు మారు పేరు!

అతుల కవీశ్వరా! సుకవితాంబకు ముద్దుల పట్టి! పండిత
స్తుత ఘన సాహితీ కుసుమ శోభన వాటిక యందు మేటి క
ల్ప తరువునై, సుధా రస మపారము చిప్పిలు పద్య సత్ఫలాల్
శతము లొసంగితో! పలుకు శాసనమౌ గురుదేవ! మ్రొక్కెదన్! 


                       ---***---

29, నవంబర్ 2012, గురువారం

"జ్యోత్స్నాభిసారిక" - సి.డి. ఆవిష్కరణ

మా గురువు గారు మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్యుల వారు రచించిన "జ్యోత్స్నాభిసారిక" (నృత్య నాటిక) సి.డి. ఆవిష్కరణ సభ రేపు (నవంబర్ 30 న) సాయంత్రం  5.30 గం||లకు, హైదరాబాదులోని  త్యాగరాయ గాన సభ మినీ హాలులో జరుగుతుంది. ఈ సందర్భంగా నండూరి వారి మహోన్నత వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ పలువురు కవులు కవి సమ్మేళనంలో పాల్గొంటారు. కార్యక్రమానికి విచ్చేసిన సాహిత్యాభిమానులందరికి "జ్యోత్స్నాభిసారిక"  సి.డి.ని నిర్వాహకులు ఉచితంగా అందజేస్తారు. జంట నగరాలలోని సాహిత్యాభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన!

- డా. ఆచార్య ఫణీంద్ర 
కార్యదర్శి, నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం

14, నవంబర్ 2012, బుధవారం

నండూరి వారి ముక్తకాలు - 3


మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య గారి ముక్తక పద్యాలు - 3 భాగం మీ కోసం ... ఆస్వాదించండి.
డా. ఆచార్య ఫణీంద్ర




8, నవంబర్ 2012, గురువారం

నండూరి వారి ముక్తకాలు - 2

మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య గారి ముక్తక పద్యాలు - 2 భాగం మీ కోసం ... ఆస్వాదించండి.

( మా గురువు గారి ఆశీస్సుల వలన ఇది నా ఈ బ్లాగులో 100వ పోస్ట్ ... )


- డా. ఆచార్య ఫణీంద్ర

                                                     
                                                 
                 

(మరి కొన్ని రో  పోస్ట్లో ... )

15, అక్టోబర్ 2012, సోమవారం

నండూరి వారి ముక్తకాలు - 1


మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య గారి ముక్తక పద్యాలను కొన్నింటిని అప్పుడప్పుడూ ధారావాహికంగా అందించబోతున్నాను. మొదటి భాగం మీ కోసం ... ఆస్వాదించండి