10, మార్చి 2009, మంగళవారం

"ఆణిముత్యం" ... మార్చి 2009

మహాకవి కీ.శే. డా. నండూరి రామకృష్ణమాచార్యచే విరచితమైన ఆణిముత్యం వంటి ఈ పద్యాన్ని ఆస్వాదించండి.
'కమ్యూనిజం' మొత్తం సారాన్ని పిండి, ఒక చిన్న పద్యంలో పొదిగి అందించిన ఘనత ఆచార్యుల వారిది.

ఎంత
మంది చెమట, ఎందరి రక్తమ్ము
పీల్చకుండ నెవడు పేర్చె ధనము?
దొరలు చేయునట్టి దోపిడీయే ఆస్తి!
అంతరించ వలయు 'ఆస్తి హక్కు' !!


పద్యంపై మీ మీ స్పందనలను, విశ్లేషణలను వ్యాఖ్యల ద్వారా తెలియజేయండి.

4 కామెంట్‌లు:

  1. కమ్యూనిజాన్ని గురించి నాకు తెలిసినది,నేను పెద్దగా చదివినదీ ఏమీ లేదు.
    కాని ఇంతందంగా కమ్యూనిజం యొక్క ఫిలాసఫీని రంగరించి అతి తక్కువ పదాలతో బహు పొందికగా చిన్న పద్యంలో హృదయంగమంగా చెప్పిన కీ.శే. శ్రీ నండూరి రామకృష్ణమాచార్యగారికి మనసా శిరసా నా సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.ఈ పద్యం వారు ఏ కావ్యం లోనైనా వ్రాసారా లేక విడిగా జాలువారిన ఆణిముత్యమా ఇది.

    రిప్లయితొలగించండి
  2. వారి రచనల వివరాలు తెలియజేయగలరు.ఇంతవరకూ నేను వారి గురించి విని ఉండలేదు.వారిని గురించి తెలుసుకోవాలని ఉంది.పూర్తి వివరాలు అందిస్తే కృతజ్ఞుడనై ఉంటాను.

    రిప్లయితొలగించండి
  3. దయతో వర్డ్ వెరిఫికేషనును తీసివెయ్యగలరు.

    రిప్లయితొలగించండి
  4. వేదుల వారికి నమః

    ’ఆణిముత్యం’ శీర్షికపై అభిప్రాయాలు రావడం లేదే- అని బెంగ పడుతున్న వేళ, మీ అభిప్రాయం కనిపించింది. చాలా సంతోషం. వేమన వలె మా గురువు గారు రచించిన వేలాది ఆటవెలది ముక్తక పద్యాలలో ఇది ఒకటి.
    మా గురువు గారు - స్వర్గీయ ’నండూరి రామకృష్ణమాచార్య’ సాహిత్య లోకంలో బహుళ ప్రసిద్ధి చెందిన మహాకవి. వీరు రచించిన ’శీర్ణ మేఖల’ ఖండ కావ్యం ఏభయ్యేళ్ళ క్రితం ఒక ఊపు ఊపింది. అందులోని కర్ణ, సుయోధన మైత్రికి సంబంధించిన ఘట్టం వీరి స్వీయ కల్పితం. ఈనాటికీ ఇది నీరాజనాలందుకొంటూనే ఉంది. మా గురువు గారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ’అధికార భాషా సంఘం’ అధ్యక్షులుగా 1987- 1990 మధ్య పని చేసారు.
    వీరి ప్రసిద్ధ రచనలలో ’తారా తోరణం’, ’ఆలోచనం’, ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’,’ముత్యాల గొడుగు’, ’కచ్ఛపీ కింకిణీకం’ వంటి కవితా సంపుటులు; ’శివాజీ’, ’ధర్మ చక్రం’, ’జ్యోత్స్నాభిసారిక’, ’గోదావరి’ వంటి నాటికలు; ’కావ్యాలోకం’ అనే లక్షణ గ్రంథం; ’కవిత్రయం’, ’పద్య శిల్పం’ వంటి విమర్శన గ్రంథాలు ప్రముఖమైనవి. ఇవి గాక ఆంగ్లంలో 'Maha Bharata', 'Gandhian Era' ప్రసిద్ధ రచనలు. మహాకవి ’కరుణశ్రీ’, వీరు ఆత్మీయ మిత్రులు. ’కరుణశ్రీ’ గ్రంథాలన్నిటికీ ’నండూరి’ వారే పీఠికలు వ్రాసారు.
    ’కేంద్ర సాహిత్య అకాడమి’ 1955 ప్రాంతంలో ’జాషువ’, ’కరుణశ్రీ’ మరియు మా గురువు గారిని ’నవ్య సంప్రదాయ కవులు’గా గుర్తించింది.
    ఆచార్యుల వారు ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా ఆమరణాంతం పద్య కవితాభివృద్దికై విశేష కృషిని సలిపారు.

    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి