15, సెప్టెంబర్ 2010, బుధవారం

పద్య సరస్వతి పరిచారకునికి ప్రణతి




’పద్య రచన’ నేర్పడంతోబాటు, ’సమస్యా పూరణం’ ద్వారా అభ్యాసం చేయించడం వలన మన చేత, వీలయినంత మంది పద్య కవులను తీర్చి దిద్దాలన్న సదాశయంతో, మా గురువుగారి పేర రూపొందించిన ఈ "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" అన్న బ్లాగు ద్వారా ఒక చిరు ప్రయత్నాన్ని ప్రారంభించి, చాలినంత సమయం చిక్కక కొనసాగించలేక పోయాను నేను. మనసులో అది అప్పుడప్పుడూ బాధిస్తూ ఉండేది.
సరిగా ... ఆ సమయంలోనే ’కంది శంకరయ్య’ ( వరంగల్ కు చెందిన విశ్రాంత అధ్యాపకులు ) అనే తెలుగు సాహిత్యారాధకులు ( లోగడ నేనిచ్చే సమస్యలకు క్రమం తప్పకుండా పూరణలు చేసేవారు ) ఉత్సాహంగా ’శంకరాభరణం’ అనే బ్లాగును ప్రారంభించి, దీక్షతో ... "చమత్కార పద్యాలు", "గళ్ళ నుడికట్లు", "సమస్యా పూరణం"లను అనునిత్యం అందిస్తూ భాషాసరస్వతికి ఎనలేని సేవ చేస్తున్నారు. ఈరోజు చాలా మంది బ్లాగర్లు చేయి తిరిగిన రీతిలో పద్యాలు వ్రాస్తున్నారంటే అది వీరి కృషి ఫలితమే. పద్య రచనలో అవసరమైన చోట తగిన సవరణలను మృదుల భాషలో సూచిస్తూ బ్లాగర్లను తీర్చి దిద్దుతున్నారు. వృత్త పద్యాల రచనాభ్యాసానికి తగినంత సమయం అవసరం- అని గుర్తించిన వీరు అలాంటి సమస్యలను "వారాంతపు సమస్యాపూరణం" శీర్షిక ద్వారా అందించడం విశేషం. వీరి దీక్ష ఎంత గొప్పదంటే ... తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా, తను కర్తవ్యంగా భావించిన ఈ భాషా సేవకు అంతరాయం కలుగకుండా శ్రమించారు. తెలుగు బ్లాగర్లలో ఎందరో ఎన్నో విషయాలను వ్రాస్తున్నారు. వాటిలో ఏవి ఎంతవరకు సమాజానికి ఉపయుక్తమో నిర్ణయించే సామర్థ్యం నాకు లేదు గాని, నవతరం యువతీ యువకులలో తెలుగు భాషా సాహిత్య బీజాలను నాటి, అనురక్తిని కలిగించేందుకు ఈ విశ్రాంత జీవితంలో కాలాన్ని సద్వినియోగం చేస్తున్న శంకరయ్య గారిని కొనియాడకుండా ఉండలేం. తెలుగు సాహిత్య సేవలో పునీతమవుతున్న వేళ్ళ మీద లెక్కించబడే బ్లాగర్లలో శంకరయ్య ఒకరు అనే కన్న, వారిలో కూడా ఆయన ముందున్నారనడానికి నాతోబాటు, ’ఆంధ్రామృతం’, ’నరసింహ’ వంటి కొద్ది మంది సహృదయ బ్లాగు నిర్వాహకులకు కూడా అభ్యంతరం ఉండదనుకొంటున్నాను.
ఈ ’వినాయక చవితి’ నాటికి, సాహిత్య స్వారస్యాన్ని విందుగా అందించే 20 "చమత్కార పద్యా"లను; తెలుగు శబ్ద సంపదలో అధికారాన్ని సాధించి పెట్టే 50 "గళ్ళ నుడికట్ల"ను; పద్య రచనలో ప్రావీణ్యాన్ని పొందేందుకు దోహదపడే "వారాంతపు సమస్యా పూరణం" (8), "సమస్యా పూరణం" ( 92)లతో కలిపి మొత్తం 100 "సమస్యా పూరణా"లను అందించి నిరాటంకంగా సాగిపోతున్నారు. ఆ సిద్ధి వినాయకుడు, సరస్వతీ మాత ఆయనకు అనంతమైన శక్తి యుక్తులను ప్రసాదించి, ఈ దీక్ష, ఈ సేవ ఇలాగే కొనసాగేలా దీవించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రణతి .. ప్రణతి ... ప్రణతి ....
పద్య సరస్వతి పరిచారకునికి
ప్రణతి .. ప్రణతి ... ప్రణతి ....
మా కంది శంకరయ్య గారికి
ప్రణతి .. ప్రణతి ... ప్రణతి ....

11, సెప్టెంబర్ 2010, శనివారం

సరస సల్లాపము - 5

నిజాం రాష్ట్రంలో కమ్యూనిస్ట్ భావాలతో ఫ్యూడల్ వ్యతిరేక పోరాట కవిగా అప్పుడప్పుడే ప్రసిద్ధిని పొందుతున్న ’ కాళోజి ’ ని, అప్పటి ’ యాదగిరి గుట్ట ’ దేవస్థానం కార్యవర్గం, ఒక కార్యక్రమంలో కావ్యగానం చేయమని ఆహ్వానించింది. ఆ యువకవి అందిందే అవకాశమనుకొని, తన ’ నిజాం వ్యతిరేక పోరాట కవిత్వం ’ వినిపించి, ప్రజలను ఉర్రూతలూగించాడు.
ఆ తరువాత ఒక కమ్యూనిస్ట్ స్నేహితుడు, కాళోజిని " నువ్వొక అభ్యుదయ కవివైయుండి, దేవస్థానంలో కవిత్వం చదువుతావా ? " అంటూ నిలదీసాడు. దానికి కాళోజి " నేను దేవస్థానంలో చదివినా, చదివింది మాత్రం అభ్యుదయ కవిత్వమే ! " అని చెప్పి, " పైగా ... నాకు నరసింహ స్వామి ఆదర్శం ! " అన్నాడు. ఆశ్చర్యంగా చూసిన ఆమిత్రునికి కాళోజి ఇలా వివరించాడు -
" విశ్వ చరిత్రలో అరాచకాలు చేసిన మొట్టమొదటి నియంతృత్వ చక్రవర్తి - హిరణ్య కశిపుడు ! ఆ నియంత ఎంత వేధించినా, శాంతియుతంగా సత్యాగ్రహం ద్వారా తన స్వాతంత్ర్యం కోసం పోరాడిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు - ప్రహ్లాదుడు ! ఆ నియంతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, చట్టాన్ని చేతిలోకి తీసుకొని, చక్రవర్తినే హత్య చేసిన మొట్టమొదటి విప్లవకారుడు - నరసింహ స్వామి ! "
ఆ సమాధానం విని నిరుత్తరుడయిన సదరు కమ్యూనిస్ట్ మిత్రుడు తోక ముడిచి వెళ్ళిపోయాడు.

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

సరస సల్లాపము - 4



1954 నాటి మాట.
అప్పటికింకా ’ఆంధ్ర ప్రదేశ్’ రాష్ట్రం ఏర్పడలేదు.
మహాకవి దాశరథి విశాలాంధ్ర (ఆయన దానిని ’మహాంధ్ర’ అనడానికి ఇష్టపడేవారు)ను ఆకాంక్షిస్తూ, ’మహాంధ్రోదయం’ కావ్యాన్ని రచిస్తున్నారు.
" నేనురా తెలగాణ నిగళాల తెగద్రొబ్బి
ఆకాశమంత ఎత్తార్చినాను -
నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు
పాడి మానవుని కాపాడినాను -
నేను పోతన కవీశాను గంటములోని
ఒడుపుల కొన్నింటి బడసినాను -
నేను వేస్తంభాల నీడలో నొక తెన్గు
తోట నాటి సుమాల దూసినాను - "
అని సీస పద్యాన్ని ఆయన పూర్తి చేసి, పైన ’ఎత్తు గీత పద్యం’ వ్రాయడానికి ఉపక్రమించారు.
" కోటిమంది తెలంగాణ ప్రజలకు రెండు కోట్ల ఆంధ్రా ప్రజల గురించి వివరాలు తెలియజెప్పి, ఆ మూడు కోట్ల ప్రజల (ఆ రోజుల్లో అక్కడ, ఇక్కడ కలిపి మొత్తం తెలుగు వాళ్ళ జనాభా మూడు కోట్లు) గొంతుల నొక్కటి చేసి, వారి ప్రతినిధిగా తాను ’మహాంధ్ర గీతా’న్ని పాడినట్లు"గా పద్యం వ్రాయాలనుకొన్నాడు. దాశరథి అంతటి వాడికి భావం స్ఫురిస్తే, పద్యం జలపాతంలా ఉబికి గుండె నుండి పొంగిరాదా? ఆయన కవితావేశం అలాంటిది.
" కోటి తమ్ముల కడ రెండు కోట్ల తెలుగు
టన్నల గూర్చి వృత్తాంత మంద జేసి,
మూడు కోట్ల గొంతుల నొక్క ముడి బిగించి
పాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతి ! " అని వ్రాసారు.
వెంటనే తన తమ్ముడు ’దాశరథి రంగాచార్య’ ( ఆ రోజుల్లో తమ్ముడే ఆయనకు ప్రథమ శ్రోత ) కు వినిపించా రాయన. రంగాచార్య శ్రద్ధగా విని, " అంతా బాగుంది గాని, అన్నయ్యా ! ఆ ’మూడు కోట్ల గొంతుల నొక్క ముడి బిగించి’ అన్నదే బాగా లేదు. మూడు కోట్ల గొంతులకు ప్రతినిధిగా నిన్ను చెప్పుకోవాలన్న నీ ఉద్దేశ్యం మంచిదే గాని, దాని అర్థం మరోలా వస్తోంది " అన్నారు. దాశరథి ఆలోచనలో పడ్డారు. మళ్ళీ రంగాచార్య " మూడు కోట్ల ’గొంతుల’కు ముడి ’బిగిస్తే’ చచ్చి ఊరుకొంటారన్నయ్యా ! దాన్ని మార్చు " అన్నారు. అప్పటివరకు కాస్త మౌనంగా ఉన్న దాశరథి వెంటనే, " నిజమేరా ! ఆవేశంలో నేను గమనించనే లేదు " అని, దాన్ని " మూడు కోటుల నొక్కటే ముడి బిగించి " అని మార్చారు.
" ఇప్పుడు బాగుంది ! " అన్నట్టుగా రంగాచార్య కళ్ళు మెరిసాయి.
( రంగాచార్య గారు నాతో స్వయంగా చెప్పిన ఉదంతం - డా. ఆచార్య ఫణీంద్ర )