రచన : మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారు
సీ.అడు గడుగున నిషేధాజ్ఞ జారీచేయ
మగడు నిషిధ్ధాక్షరిగను దోప -
గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వలతోడ
మాసమ్ము గడుప సమస్య కాగ -
అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు
దత్తుండు దత్త పదంబు కాగ -
ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి
వర్ణనీయాంశమై వరలు చుండ -
పాలు కూరలు పండ్ల బండ్ల వారల రాక
యాశుధారా కవిత్వార్ధ మనఁగ -
అత్తయ్య వేసెడి యక్షింత లవియన్ని
పాత పురాణంపు పఠన మనఁగ -
పోనీని రానీని ఫోను మ్రోతల రోత
ఘంటికా గణనమ్ము కరణి దోఁప -
బోరు గొట్టించెడి ధారవాహిక సుత్తి
యధిక ప్రసంగమై యడ్డుపడఁగ -
తే.గీ.
దినము దిన మిట్లు వనితలు తిప్పలుపడి
పూటపూటకు నవధాన పూర్ణసిధ్ధి
తనరుచుండఁగ పురుషావధానులేల?
వర సహస్రావధానులీ పడతు లెల్ల!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి