ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

8, జూన్ 2021, మంగళవారం

మహాకవి నండూరి రామకృష్ణమాచార్యులు గారికి 'పద్య కవితా నీరాజనం'

కోవిడ్ కారణంగా గత సంవత్సరంలాగే .. ఈ సంవత్సరం కూడ 29 ఏప్రిల్ 2021 నాడు మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యుల జయంతి సభను ప్రత్యక్షంగా ప్రేక్షకుల సమక్షంలో సమావేశ మందిరంలో కాకుండా అంతర్జాల మాధ్యమం ద్వారా నిర్వహించవలసి వచ్చింది. 


ఆ రోజు సాయంత్రం "గూగుల్ మీట్" లో రెండున్నర గంటల పాటు  రసవత్తరంగా జరిగిన "మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్యుల వారి శతజయంతి సభ" లో ప్రముఖ కవులెందరో ఆ మహాకవికి‌ "పద్య కవితా నీరాజనం" సమర్పించారు. ఆ కవితలన్నీ గురువు గారి అభిమానుల కోసం ఈ బ్లాగ్ ద్వారా అందించడానికి సంతోషిస్తున్నాను. 

                           - డా. ఆచార్య ఫణీంద్ర                                   కార్యదర్శి, నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

1.
నడిచే పద్యము నండూరి
~~~~~~~~~~~~~~~~~~~~
నండూరి రామకృష్ణమాచార్యుల శతజయంతి సందర్భంగా జూమ్ సమావేశంలో సమర్పించిన నా కవితా
సుమహారం)
  • మరుమాముల దత్తాత్రేయ శర్మ
విశ్రాంత ప్రధానాచార్యులు, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సూర్యుడవై శుభంకర సుశోభల కావ్యపు కాంతులీను వా
గ్గుర్యుడవై రసోచిత మధూదయ వాఙ్మయ రాశివోసి సౌం
దర్యము గూర్చి భారతికి ; తన్మయమొందిన రామకృష్ణమా
చార్య! త్వదీయ పద్యములు చాలును మ్రోగగ తెల్లు గుండియల్

మంచి మనస్సు; మాధ్విక సమంబు వచస్సు; సితాంబుజాత ర
మ్యాంచితమౌయశస్సు; దరహాస విభాసితమౌమహస్సు; శో
ధించిన మీ వయస్సు ; కవితేందిర మెచ్చ కవిత్వ శీధు వం
దించిన మీ తపస్సునకు హృజ్జనితాదర భక్తి మ్రొక్కెదన్

ఎవ్వాని పద్యమ్ము రవ్వలై రాజిల్లి
ఆంధ్ర వాజ్మయ శోభలవని నిలిపె
ఎవ్వాని సౌహృద మెంతేని రాణించి
పాండితీలోక ప్రభాసమయ్యె
ఎవ్వాని రస కృతుల్ ఏపార చదివిన
కచ్చపీ కింకిణీ కళలనీనే
ఎవ్వాని సరసోక్తి పువ్వులా విరబూసి

అతడు నండూరి రామకృష్ణాఖ్య సుకవి
అతడాచార్య వరయుడై స్తుతులు నంది
సుకవి బృంద బృందారక శోభ నలరె
పద్యమన్నను ప్రాణమై బ్రతుకు నిచ్చె

మీ కవితామృత ధారల
లోకము సుళ్లోక మయ్యె !లోపలి వ్యధలున్
తోకలు ముడిచెన్; కనుకనె
నాకము మిము పిలిచెనేమొ నండూరి కవీ

వడివడిగ సుడులు సుడులుగ
గడబిడ గలిగించు ఆంధ్ర కంటక తతికిన్
వడిగ కుఠారమ వైతివే
నడిచెడు పద్యమ్ము వగుచు నండూరి కవీ! #

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

2.
నండూరి రామకృష్ణమాచార్యులు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
  • శంభుని కుమార్
~~~~~~~~~~~~~~~~~~~
సంస్కృతాంధ్రమాంగ్లాలలో సారమంత
తెలిసి కైతల నద్దిన తీరు గాంచి,
చదువులమ్మయే పులకించె సత్కవీంద్ర!
రామ కృష్ణమాచార్య ! నీరాజనమ్ము!

అనితర సాధ్యమయిన మీ
ఘనమౌ సాహిత్య రాశి ఘనతను చాటెన్!
కన నందు "శీర్ణమేఖల"
మను నాచంద్రార్కము నిల మాన్యత గనుచున్!

పద్య కవిత్వ కల్ప తరువుగా నిల్చి
       పద్య పరిమళముల్ పంచితీవు!
క్రొత్త పుంతలు ద్రొక్కు గొప్ప సుకృతులతో   
      ప్రాజ్ఞుల మెప్పొంది వరలి తీవు!
దీనజనావళి తీరని వ్యధలకు
       కన్నీరు గార్చిన కవిత వీవు!
సాహితీ స్రష్టల సరసన వెలిగిన
     తెలుగు తల్లి నుదుట తిలక మీవు!

ఉత్తముడ, వోర్పరివి, మంచి ఒజ్జ వీవు!
బ్రాహ్మి మానస పుత్ర! శ్రీ స్వర్గ ధామ!
సాహితీ జగ న్నాయక! శాశ్వత యశ!
ప్రణతి గొనుమిదే "నండూరి రామకృష్ణ"! #

@@@@@@@@@@@@@@@@@@@@@@@

3.
తెలుగు వారి అభిమానకవి శ్రీ నండూరి రామకృష్ణమాచార్య గారు...
      ౼  "కవిమిత్ర" వి.వి. సత్యప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కం:
నండూరి కృష్ణ మార్యులు
మెండైన కవిత్వమందు మెరసిన ఘనులై,
కొండంత కీర్తి వడసి,య
ఖండముగా తెలుగు వారి ఘనతను నిలిపెన్!

సీ;
'ఆలోచనము"నందు ఆటవెలదులు వ్రాసి,
సుకుమారశైలిని చూపెనతడు,
ప్రౌఢమౌ పద్యాలు గాఢమై నిలచె,"తా
రాతోరణము"నందు రమ్య కవిత,
బిందుసారుని నాటి ప్రేమ గా థను తెచ్చె
"ధర్మచక్రం"బునందతిశయించె,
ఉత్తమోత్తమమైన "జ్యోత్స్నాభిసారిక"
స్వఛ్ఛమౌ ప్రణయ తత్త్వమ్ము తెలిపె!

తే.గీ:
నృత్యనాటిక"గోదావరి"ని రచించె!
సత్యమగు మాట"శ్రమయేవ జయతె"వ్రాసె!
రేడియో నాటికలవేవి లెక్క లేదు!
ప్రతి పదంబున రసవైభవంబు నిలిపె!!

సీ::
ఆంగ్లంబునందు "మహా మహాభారతము" వ్రాసి
ఫశ్చిమంబున మన ప్రతిభ చాటె!
'గాంధీతరమ్ము"ను కమ్ర రీతిని ఆంగ్ల
మందురచించి ఆనందపరచె!!
"ఛత్రపతి శివాజి"చరితను నాటక
మ్ముగ వ్రాసె!!అనువాద ములను పొందె!!
'"ప్రగతి గీత"నువ్రాసె!రామకృష్ణుని పేర
ఆటవెలదులెన్నొ తేటపరచె!!

తే.గీ;
ఆతని ఆలోచనము లందు హాస్య మలరు!
అతని ఆలోచనము నందు
వ్యంగ్యమలరు!
అతని ఆలోచనము నందు
అమృత వాక్కు
లన్ని సత్యసూక్తములుగ నలరు చుండు!! #

@@@@@@@@@@@@@@@@@@@@@@@

4.
"పూజ్యులు నండూరి రామకృష్ణమాచార్యులకు జయంతి నివాళి! "
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
రచన : కుసుమ కుమారి
~~~~~~~~~~~~~~~~~~~~
సీసము:
తెలుగు భాషా సేవ తీరుగానొనరించి, 
శారదోపాసన సలిపినారు! 
విశ్వనాధార్యుల వినయంపు శిష్యులై, 
సాహితీ సేద్యము జరిపినారు! 
'రసరాజ ధానిలో' రాత్రిపగలనక, 
కావ్యగోష్టుల జన్మ గడపి నారు! 
పదవులు బిరుదులు పర్వెత్తి మిమ్ముల,  
కౌగలించె కనగ కనుల పంట!  

తేటగీతి:
పుత్ర ప్రేమల శిష్యుల ప్రోత్సహించి, 
వారసత్వ సంపదలను వసుధ కిడిరి!    
వందన శతము నండూరి వంశజునకు!
రామ కృష్ణమాచార్య వరా! నమోస్తు! #

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

5.
.......కంద నక్షత్రమాలలో కవికులతిలకుడు.........

..................డాక్టర్ రాధశ్రీ
               94944 81210

నండూరు రామ కృష్ణుడు
నిండగు గోదావరివలె నిర్భర శైలిన్
పండిన తన యనుభవమును
‘పండు’గ నందించినాడు పద్య హృదయుడై !!

ఆతల్లి వెంగమాంబకు
ఆతండ్రికి శోభనాద్రి ఆచార్యునకున్
జాతకుడై జన్మించెను
జాతికి చేతనము నొసగు సత్కవివరుడై  !!

ఆగరపవరమునందున
ప్రాగాకాశమున బాలభానుని పగిదిన్
నాగాభరణుని దయతో
వాగీశ్వరి ప్రియసుతునిగ ప్రభవము నొందెన్  !!

ఆకోరుకొండ యందున
ప్రాకటముగ జదువబూనె ప్రాధమికముగన్
చేకూర్చుకొనగ జ్ఞానము
దూకెను హైస్కూలు లోన దోషాకరుడై  !!

ఆవిజయవాడ నందున
ధీవిభుడగు విశ్వనాథ దీవెన గొనుచున్
పావనమగు పద్యమునకు
జీవిత మంకితము జేసె చిన్మయగుణుడై  !!

స్నాతకుడై,పిమ్మట-చే
యూతల నందించ స్నాతకోత్తరుడగుచున్
జోతలగొని ఏ.యూ.కే
చేతము గలిగించినాడు స్విన్నాత్ముండై  !!

మేదురమగు శోధనకై
వేదిగ మైసూరు విశ్వ విద్యాలయమున్
వేదికగా నిల్పుచు-ప్రతి
పాదించెను విషయచయము పరిశోధనకున్  !!

ఆంధ్రోపన్యాసకునిగ
నాంధ్రా ప్రాంతమ్ములందు నాచార్యుండై
ఆంధ్రముతో బాటుగ-కా
వ్యాంధ్రమ్మును నూరిపోసె నాంధ్రావనికిన్  !!

చీరాల,యనంతపురము
పేరెన్నిక గన్నయట్టి భీమవరంబున్
తీరగు టీ పీ గూడెము
నేరుగ గురుబోధ వినెను నిశ్శబ్దముగన్  !!

చిత్తూరునకు,విశాఖకు
చిత్తము లలరించు రీతి చేతన నిడ-పూ
గుత్తులతో నా నగరము
లత్తరులుగ చిలకరించె నాప్యాయతలన్   !!

అనయమ్మన్నవితరణను
తన విధిగా నెంచి మిగుల తాదాత్మ్యముతో
నొనరించిన గురుపత్నిని
ప్రణతులనిడి కొలిచెదను సుభద్రాదేవిన్   !!

తిక్కన్న భారతమ్మును
మిక్కిలిగా గౌరవించి మించిన ధృతిలో
తిక్కన్న సోమయాజికి
ప్రక్కన నిలుచుండ గలిగె పండిత నుతుడై  !!

శారద కృపతో కవితకు
తారాతోరణ మమర్చి తనదగు శైలిన్
ధీరునిగ ప్రగతిగీతను
తీరుగ వెలయించిన గురు దేవుని గొలుతున్   !!

క్రొత్తగ యాలోచనమును
మెత్తగ వెలయించి శీర్ణ మేఖల వోలెన్
చిత్తరువుగ చిత్రించుచు
మత్తును గలిగించినట్టి మాన్యుని దలతున్  !!

వ్యాసుడు చెప్పని గాధను
భాసురముగ నూహసేసి పాఠకతతికై
మోసులు  వారెడి కవితగ
వ్రాసిన సుకవీశ్వరునకు వందన మిడెదన్   !!

భారతకధ నాంద్లములో
తీరిచి దిద్దిన ఘనునిగ ధీమాన్యునిగా
తీరగు భావములు నుడివి
కీరితి గొన్నట్టి రామకృష్ణుని దలతున్   !!

భీమవరములో నింటికి
ప్రేమగ కవితాప్రభాస పేరిడిన ఘనున్
సామాన్యుని నాలుకపై
తేమగ కవితను నిలిపిన ధీమతి నెంతున్  !!

నిత్యము గొనియాడుచు-నౌ
చిత్యముతో గొలుచు నమరజీవుల కొరకై
ముత్యాల గొడుగు పట్టిన
స్తుత్యుని గొనియాడుచుంటి శోభిత మూర్తిన్  !!

అల గోదావరి తటిలో
కలలో జ్యోత్స్నాభిసారికలతో సతమున్
పలురీతులుగా చర్చలు
సలిపిన భావుకుని ధర్మచక్రము నెంతున్  !!

కారణ జన్ముండు మహా
వీరశివాజీ చరితను ప్రియమగు రీతిన్
ధీరోదాత్తముగ నుడివి
కీరితితో వెలుగు రామకృష్ణుని దలతున్  !!

తిరుమల వాసుని దయతో
పరిపరి విధముల కృతులను పరిరక్షింపన్
తిరుపతి ప్రచురణ లందున
కరసేవ నొనర్చినట్టి కవివరు నెంతున్  !!

వర’పుష్పవిలాపము’తో
కరుణను జిలికించినట్టి కవితిలకుండౌ
కరుణశ్రీ మిత్రుండై
వరలిన విఖ్యాత కవికి వందన మిడెదన్  !!

ఇరువురు రాష్ట్రపతులచే
సరియన్నది లేని రీతి సత్కారములన్
కరివరదుని కృపచే-స్వీ
కరణమ్మొనరించినట్టి కర్మఠు నెంతున్  !!

అధికారాంధ్ర మహాసభ
కధిపతియై నిలచి ప్రజల కతిమధురంబౌ
సుధధిగ పద్య సరస్సు(సదస్సు)ను
ప్రధితము గావించె ననుచు ప్రస్తుతి జేతున్  !!

పాయని నవ భావముగా
“చేయంగా వలయు గురువు శిష్యుని బూజన్
ధీయుతముగ”నని నుడివిన
శ్రేయోగుణనిధిని గొలుతు స్విన్న మనస్కున్ !!

అర్వాచీన కవిత్వపు
నిర్వచనమ్మగుచు నిలచి నేర్పు దలిర్పన్
పర్వతనేని ఉపేంద్రకు
సర్వము బోధించినట్టి స్వామిని గొలుతున్  !!

ప్రగతిని గోరెడి వానిని
తగదీర ఫణీంద్రకవిని తన శిష్యునిగా
జగతి కొసంగిన విబుధుని
అగణిత భావుకుని గొలిచి యంజలు లిడెదన్   !!

               .........

వెలుగొందుత పద్యకవిత !
వెలుగొందుత రామకృష్ణు విఖ్యాతి ధరన్ !!
వెలుగొందు వారి సంతతి !
వెలుగుత శిష్యాళి కవన విశ్వము లోనన్   !!

===============
పద్యమౌళి,పద్యభాషి
డాక్టర్ రాధశ్రీ
9494481210
రసవాహిని
నాగారం 500 083
హైదరాబాద్-83

29-04-2021
నం.రా.కృ.శతజయంతి

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

6.
స్మృత్యంజలి

తే.
తెలుగు సాహిత్యవారిధిం జిలికి చిలికి
యందునంగల యమృతఫలాళి నెల్ల
తెలుగు ప్రజలకు పంచిన ధీవరేణ్య!
కీర్తిచంద్రికాభ్రాజితమూర్తి!నతులు
రామకృష్ణమాచార్య!విలసితసుగుణ!

తే.
తెలుగు పద్యమ్ము స్థిరముగా నిలువ నాంధ్ర
పద్యకవితాసదస్సు స్థాపనముచేసి
జీవితాంతము కృషియెంతొ చేసినట్టి
కవివరేణ్య!యంజలులు విఖ్యాతశీల!

తే.
ఛాత్రులం గాంచుచుం ప్రేమ పుత్రులట్లు
గృహము నందుననుంచి వరిష్ఠవిద్య
నేర్పి మీయంత వారిగా నిలుప ధరణి                              జతనముం జేసితిరి,వారు ప్రతినబూని
మీ మహత్త్వంబు చాటగా భూమి నెపుడు.

శా.
మెండౌ ప్రేమసుధల్ చెలంగ మది పేర్మిం దాల్చకం గర్వమున్,
నిండౌ ధీపటిమమ్ముతో మదిని శాంతిం దాంతి భాసిల్ల ను
ద్దండప్రౌఢిమ భాషపై దనర విద్యావంతులు న్మెచ్చెడిన్
నండూర్యన్వయవార్ధిచంద్ర!గుణసాంద్రా! దేశికా! యంజలుల్.

రచయిత:ముద్దు రాజయ్య,
విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు,
అష్టావధాని, హైదరాబాద్.
చరవాణి సం.7330963281.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

7.

"నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -"  

రచన: 'పద్య కళాప్రవీణ' డా. ఆచార్య ఫణీంద్ర


ఎవ్వాని భావాల కివ్వేళయే గాక 
    భావియున్ తల వంచి ప్రణతు లిడును -
ఎవ్వాని కావ్యాల నిముడగా వస్తువై 
    ధరణిలో అణువణ్వు తపన పడును -
ఎవ్వాని మాటయే ఇలలోన చాటువై
     నరుల నాల్కల పైన నాట్య మాడు -
ఎవ్వాని కీర్తి మహీ మండలమ్ముపై
     దశ దిశాంతమ్ములన్ దాటి సాగు -

అట్టి నండూరి వంశార్ణ వైక సోమ!
రామకృష్ణమాచార్య  సన్నామధేయ!
నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -
ఎత్తి నడయాడి లోకాల నేలుకొనగ!

కువలయమున నున్న కుటిల నీతిని ఎత్తి,
కుండ బ్రద్దలట్లు కొట్టి చూపి, 
అభ్యుదయ పథమ్ము ’నాలోచనము’ పేర
వెలయ జేసితి ’వధి వేమ’నగుచు!

ఎలమి డెబ్బదేండ్లకు పైన ఏకధాటి
పద్య రత్నముల్ సృజియించి ప్రణుతి కెక్కి
నట్టి ’నండూరి రామ కృష్ణా’ఖ్య సుకవి!
మహిని పద్యమ్మునకు నీవు మారు పేరు!

అతుల కవీశ్వరా! సుకవితాంబకు ముద్దుల పట్టి! పండిత
స్తుత ఘన సాహితీ కుసుమ శోభన వాటిక యందు మేటి క
ల్ప తరువునై, సుధా రస మపారము చిప్పిలు పద్య సత్ఫలాల్
శతము లొసంగితో! పలుకు శాసనమౌ గురుదేవ! మ్రొక్కెదన్!

గంగకు నర్ఘ్యం బిడుటకు
గంగా తోయము నొకింత గైకొనినట్లున్ -
మ్రింగగ నీ బోధ మతిని,
పొంగారిన కవితల నిను పూజింతు నిదే! #

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

8.
*సామ్యవాద మహర్షి !*
         -- డా. వెనిగళ్ళ రాంబాబు

నండూరి రామకృష్ణులు
పండిత ప్రాచార్యవరులు ! పద్య కవీంద్రుల్ !
నిండెను యశస్సు తారా
మండలమే !  నోటి వాక్కు మంగళకరమే !!

అమరులౌ స్వాతంత్ర్య సమర యోధుల వంశ
        సంజాతమా ! మిమ్ము సన్నుతింతు !
సంస్కృతాంధ్ర వధాన శక్తి పీఠము మీరు !
        ఆచార్య ధీవరా !  అంజలింతు !
అద్వితీయమ్ము  మీ ఆంగ్ల వైదుష్యమ్ము !
        సంస్కార రసధునీ ! సన్నుతింతు !
భాష్యకార్లను మించు శిష్య సంతతి మీది !
         ‌అధ్యాపకోత్తమా ! అంజలింతు !

స్వర్ణ సౌజన్య శిఖరమా ! సన్నుతింతు !
సౌమ్య సామ్యవాద మహర్షి ! సన్నుతింతు !
ఆత్మ యోగీ ! విరాగి ! మీకంజలింతు !
అరుణకిరణాల  చరణాలకంజలింతు !!


మార్చవచ్చును ఊర్లు ! మార్చవచ్చును కార్లు !
            మార్చరాదన్నారు మాన్య సతిని !
ఆడంబరమె కాని ఆశు కవిత్వమ్ము
             సరసు కాదన్నారు స్నానమాడ !
మరణమైనను గాని ధరణిని మంగళా
              శాసనమన్నారు సాహసించి !
జ్ఞాన దీప్తిని పంచు మానవత్వము చాలు
           మరచిపొమ్మన్నారు మతము నైన !

వేద వాఙ్మయమ్ము, వేమన్న వాదమ్ము,
    కొంత హేతువాద చింతనమ్ము
హాస్య చతురత లనవశ్యమ్ము  సంధించు
    వ్యాస ! శతజయంతి వందనమ్ము !! #

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి