20, ఫిబ్రవరి 2012, సోమవారం

హాలాహల పానం


------------------------------------------------------------------------------
సురాసురుల్ చని, ''పాలవెల్లి మథింప హాలాహలంబు జనించె, ప్రాణి సందోహమున్ బ్రదికింపవే ఈశ్వరా!'' అని పరమేశుని ప్రార్థించగా -
ఆ భక్త రక్షకుడు పార్వతీదేవితో

''శిక్షింతు హాలహలమును,
భక్షింతును మధుర సూక్ష్మ ఫల రసము క్రియన్;
రక్షింతు బ్రాణికోట్లను;
వీక్షింపుము నీవు నేడు వికచాబ్జ ముఖీ!'' యనెను.

అప్పుడు

'' మ్రింగెడు వాడు విభుండని,
మ్రింగెడిదియు గరళమనియు, మేలని ప్రజకున్,
మ్రింగుమనె సర్వ మంగళ -
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో!

తన చుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్
ఘన గంభీర రవంబుతో శివుడు - “లోక ద్రోహి! హుం! పోకు ర“
మ్మని కెంగేల దెమల్చి కూర్చి, కడిగా నంకించి, జంబూఫలం
బన సర్వంకషమున్ మహా విషము నాహారించె హేలాగతిన్!

కదలం బారవు పాప పేరు, లొడలన్ ఘర్మాంబుజాలంబు పు
ట్టదు, నేత్రంబులు నెర్ర గావు, నిజ జూటా చంద్రుడుం గందడున్,
వదనాంభోజము వాడ, దా విషము నాహ్వానించుచో - డాయుచో -
బదిలుండై కడి సేయుచో - దిగుచుచో - భక్షించుచో - మ్రింగుచోన్ -

ఉదరము లోకంబులకును
సదనం బగు టెరిగి శివుడు చటుల విషాగ్నిం
గుదురుకొన గంఠ బిలమున
బదిలంబుగ నిలిపె సూక్ష్మ ఫల రసము క్రియన్!
---------------------------------------------------

ఈ ఘట్టాన్ని ఇంతకన్నా భావుకతతో, ఇంతకన్నా హృద్యంగా ఎవరైనా విరచించగలరా?
బమ్మెర పోతరాజుకు జేజేలు!
అందరికి ‘శివరాత్రి‘ పర్వదిన శుభాకాంక్షలు!

17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

సాహితీ మిత్రులకు స్వాగతం


మిత్రులు బి.ఎస్. రామకృష్ణ గారు [ executive editor, sakshi t.v. ఫోన్ నం.9505555060 ] అందించిన ఈ ఆహ్వానాన్ని మన్నించి సాహితీ ప్రియులంతా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన.
- డా. ఆచార్య ఫణీంద్ర

4, ఫిబ్రవరి 2012, శనివారం

నా స్మృతి పథంలో ..

[మా గురుదేవులు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యులు గారు తమ ఆత్మకథలో వ్రాసుకొన్న విషయం ఇది. చదివి ఆయన పద్య కవితా పారమ్యాన్ని గ్రహించి ఆనందించండి.
- డా. ఆచార్య ఫణీంద్ర ]




ఒకసారి అమలాపురంలో అష్టావధానం చేసేటప్పుడు నన్ను పృచ్ఛకుడు వేసిన ప్రశ్న.
" అవధాని గారూ! మీ స్మృతిపథాన తొలి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకొని పద్యంగా చెప్పండి. "
అది గడ్డు ప్రశ్న. కాని అది అవధాన సభ. కోరినది చెప్పక తప్పదు. అందుకే అప్పటికప్పుడు కొంటెగా ఒక సన్నివేశాన్ని కల్పించి పద్యం చెప్పాను.

" పాటలు పాడి నన్ను పసి బాబును ఊయలలోన ఊచుచున్
ఆటలు నేర్పు దాదిని రహస్యముగా పొదరింటి లోనికిన్
పైట చెరంగు బట్టి పరవాడెవడో తరలించు దృశ్యమున్
మాటలు వచ్చినంతటనె మాతకు చెప్పదలంచినాడనే! "

ఆ పృచ్ఛకుడు అన్నాడు. " అవధాని గారూ! నేను కోరినది అతిశయోక్తి లేని అచ్చమైన సత్యాన్ని. అదే ’ఉత్పలమాల’లో అదే ’ట’కార ప్రాసతో మీ జీవన స్మృతిపథంలోని తొలి సన్నివేశాన్ని ఉటంకిస్తూ మరో పద్యం చెప్పండి. "
అప్పుడు నేను ఆశువుగా చెప్పిన పద్యం -

" స్ఫోటక బాధచే ఒడలు సోలి పరుంటిని తల్లి ప్రక్కలో -
మాటికి మాటికిన్ మరల మంచముపై కెగబ్రాకు తేలు నన్
వ్రేటును వేయకుండ తన వ్రేళులతో విదలించి, ఎన్నియో
కాటులు తిన్న తల్లి కృప - కారణ జన్ముడనై తరించెదన్! "

ఆ సత్యం సభను మిక్కిలి ఆకర్షించింది. తల ఊపుతూ ఒక సదస్యుడు లేచి తన చేతి ఉంగరం నా చేతికి తొడిగాడు హర్షధ్వానాల మధ్య.
---***---

23, జనవరి 2012, సోమవారం

సరస సల్లాపము - 20



చాల నాళ్ళ క్రితం ప్రముఖ కవి 'ఉండేల మాలకొండారెడ్డి'తో ఒక కవి మిత్రుడు - తనకు రావలసిన పురస్కారం ఫలానా వారి సిఫార్సుతో వేరే కవికి వెళ్ళిపోయిందని చెప్పుకొని బాధపడ్డాడట. అప్పుడు మాలకొండారెడ్డి కవి -
'' చూడు నాయనా! ఈ లోకమే అంత! -
క్రింద ఉన్నది భువి -
పైన ఉన్నది రవి -
నడుమ ఉన్నదంతా ‘ పైరవి ’! '' అని ఆ కవిని ఓదార్చారట.

20, జనవరి 2012, శుక్రవారం

సరస సల్లాపము - 19



హైదరాబాదులోని ఆంధ్రమహిళాసభ కళాశాలలో కడిమెళ్ళ వరప్రసాద్ గారి అష్టావధానం జరుగుతున్నది. నాతోబాటు సాహితీమిత్రులు కొందరు పృచ్ఛకులుగా కూర్చొని ఉన్నాం.
దత్తపది అంశం నిర్వహిస్తున్న పృచ్ఛకుడు - ” చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ” అన్న పదాలిచ్చి భారతార్థంలో పద్యం చెప్పమన్నారు.
అవధాని - ” మొదటి మూడు పదాలను గురించి విన్నాను గాని, నాలుగో పదమేంటో నాకు అర్థం కాలేదు ” అన్నారు.
అప్పుడు అవధానికి సభాసమన్వయకర్త ’ ప్రాన్స్ ’ అంటే ఏమిటో చెప్పే ప్రయత్నం చేసారు.
ఇంతలో నేను అందుకొని - ” అదేనండి! ప్రాన్స్ అంటే ప్రాణులు ” అన్నాను.
సభలో అందరూ పగలబడి నవ్వారు.

13, జనవరి 2012, శుక్రవారం

సరస సల్లాపము - 18





1974 - 75ల నాటి మాట -
నల్లని జుత్తు(హెయిర్ డై చేసిందే లెండి), తెల్లని జుబ్బా వేసుకొని ట్రిమ్ గా ఉన్న గీత రచయిత ఆత్రేయ ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఆఫీస్ నుండి రెమ్యూనరేషన్ తీసుకొని బయటకు వస్తున్నారు. బయట అప్పుడప్పుడే ఫీల్డ్ లోకి వస్తున్న నడి వయస్కుడు .. కాస్త నలుపు, తెలుపు జుత్తు ... కొద్దిగా బట్టతల ఉన్న రచయిత కనబడి నమస్కరించారు. ఆయనను వేటూరి సుందరరామమూర్తిగా గుర్తించిన ఆత్రేయ - ” ఏమిట్రా ఆ తెల్ల జుత్తు? కాస్త రంగు రాసుకొని ట్రిమ్ గా కనిపిస్తే నాలుగు చాన్సులొస్తాయి. నన్ను చూడు .. ముసలాడిని - ఎంత ట్రిమ్ గా ఉన్నానో! " అన్నారు. వేటూరి నవ్వుతూ -” మీతో పోటీ పడగలనా గురువుగారు? ” అన్నారు.
రెండేళ్ళ తరువాత ’సిరిసిరి మువ్వ’, ’అడవి రాముడు’ పాటలు ఒక ఊపు ఊపుతున్నాయి. మళ్ళీ ఆ ఇరువురు కవి దిగ్గజాలు ఒక స్టూడియోలో తారసపడ్డారు. ఈ మారు వేటూరి ఉన్న కాస్త జుత్తును చక్కగా డై చేసి ట్రిమ్ గా ఉన్నారు. ఆత్రేయ పూర్తిగా తెల్ల జుత్తు, మాసిన జుబ్బాతో కనిపించారు. వేటూరి ఆత్రేయతో - ” ఏంటి గురువుగారు! నా జుత్తుకు రంగు రాసుకొమ్మని చెప్పి, మీరు రాసుకోలేదే? ” అని అడిగారు. ఆత్రేయ కాస్త పెదవి విరిచి - ” సరే .. ! నువ్వు రాయడం మొదలు పెట్టాక, నేనెక్కడ రాస్తున్నానురా? " అన్నారు. వేటూరి శిరస్సు వంచి నమస్కరించారు.

11, జనవరి 2012, బుధవారం

సరస సల్లాపము - 17



నగరంలోని ’త్యాగరాయ గానసభ’లో ఒక ప్రసిద్ధ సంస్థ నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని, కవులమంతా సరదాగా మాట్లాడుకొంటూ రోడ్డెక్కాం. పక్కనే ఉన్న ’సుధా దర్శని’ హోటల్లో ”టీ త్రాగుదాం రండి” అంటూ కవులందరినీ ఆహ్వానించాను. హోటల్లోకి వెళ్ళాక - ”నేను టీ తీసుకొంటాను. మీకు ’టీ’ యా? ’కాఫీ’ యా?” అని అడిగాను. వెంటనే కవి మిత్రుడు ’దత్తాత్రేయ శర్మ’ - ”మేమంతా ’టీ’చరులమే!” అన్నారు. అందరం నవ్వుకొంటూ ’టీ’ సేవించాం.