22, జులై 2016, శుక్రవారం

చంద్రం గారి చక్కని పద్య కవిత

ఒక పత్రికలో గుడివాడకు చెందిన "హెచ్. ఆర్. చంద్రం" గారు రచించిన ఈ పద్యకవిత నన్ను బాగా ఆకట్టుకొంది. వస్తు నవ్యతతో సహజంగా, హృద్యంగా సాగిన ఈ పద్య కవితను ఆధునిక పద్య కవితాభిమానులు ఆస్వాదించి ఆనందిస్తారని భావిస్తూ ఇక్కడ ప్రచురిస్తున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర

9, జూన్ 2016, గురువారం

వైభవంగా పురస్కారాల ప్రదానం

ప్రముఖ కవి, అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు నెలకొల్పిన వి.యల్.యస్. విజ్ఞాన సారస్వత పీఠం - హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో 8 జూన్ 2016 నాడు "వేము అన్నపూర్ణ జ్ఞాపక పద్యకవితా పురస్కారాల ప్రదానోత్సవం" నిర్వహించింది. ప్రముఖ రచయిత్రి, ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు శ్రీమతి మలయవాసిని గారికి మరియు ప్రముఖ కవి, బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు శ్రీ రావికంటి వసునందన్ గారికి ఈ పురస్కారాలను ప్రదానం చేసారు. ఈ సభలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న నేను ఆచార్య వి. యల్.యస్. భీమశంకరం గారి పద్యకావ్యాలపై ప్రసంగించాను. ఆ కార్యక్రమం గురించి వివిధ పత్రికలలో ప్రచురించబడిన వివరాలు సాహిత్యాభిమానుల కోసం ..
- డా. ఆచార్య ఫణీంద్ర.5, మే 2016, గురువారం

నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభా విశేషాలు


29/4/2016 నాడు హైదరాబాదులో నారాయణగూడలోని వై.యం.సి.ఏ. ఆడిటోరియంలో జరిగిన మహాకవి కీ.శే. డా. నండూరి రామకృష్ణమాచార్యుల  వారి జయంతి సభలో ప్రముఖ కవయిత్రి, భద్రాచలం వాస్తవ్యురాలు శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారికి ఆచార్యుల వారి స్మారక పద్య కవితా పురస్కారాన్ని ప్రదానం చేసారు ఆనాటి ముఖ్య అతిథి - ప్రముఖ పద్యకవి, అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రవేత్త ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు. ఈ సభకు "తెలుగు అకాడమి" పూర్వ సంచాలకులు డా. వెలచాల కొండలరావు గారు అధ్యక్షత వహించారు. సభలో నండూరి వారు రచించిన పద్య పఠన పోటీలలో విజేతలైన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులను అందజేసారు.

- డా. ఆచార్య ఫణీంద్ర


22, ఏప్రిల్ 2016, శుక్రవారం

నండూరి వారి జయంతి సభ

లోగడ ప్రకటించినట్లుగా ప్రముఖ కవయిత్రి "శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ" గారికి "నండూరి రామకృష్ణ మాచార్య స్మారక పద్యకవితా పురస్కార" ప్రదానోత్సవం నండూరి వారి జయంతి సభలో జరుగుతుంది. ఈ నెల 29న జరిగే ఈ సభకు జంట నగరాలలోని‌ సాహిత్యాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం!

- డా. ఆచార్య ఫణీంద్ర


17, ఫిబ్రవరి 2016, బుధవారం

డా. ఎమ్.ఎల్. నరసింహారావు గారి సంతాప సభ


నిజాం వ్యతిరేక స్వాతంత్ర్య సమర యోధులు, ప్రముఖ రచయిత, హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శిగా గత 50 ఏళ్లుగా విశిష్ట సేవలందించిన డా. ఎమ్.ఎల్. నరసింహారావు గారు 12/2/2016 నాడు ఉదయం పరమపదించారు. వారి సంతాప సభ ఈ రోజు భాషానిలయంలోనే .. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కే. వి. రమణాచారి గారి అధ్యక్షతన జరిగింది. ఆచార్య రవ్వా శ్రీహరి గారు, ఆచార్య ఎస్. వి. రామారావు గారు, శ్రీ ఉడయవర్లు గారు, శ్రీ జి.ఎస్. వరదాచారి గారు, శ్రీ సి.వి. చారి గారు, శ్రీ నూతి శంకర రావు గారు, శ్రీ చీకోలు సుందరయ్య గారు, డా. ఆచార్య ఫణీంద్ర తదితరులు పాల్గొని కీర్తిశేషులు ఎమ్. ఎల్ గారికి నివాళులను అర్పించారు.
- డా. ఆచార్య ఫణీంద్ర26, డిసెంబర్ 2015, శనివారం

పడతుల అష్ట కష్టావధానం!

రచన : మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారు

సీ. 
అడు గడుగున నిషేధాజ్ఞ జారీచేయ 
        మగడు నిషిధ్ధాక్షరిగను దోప -
గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వలతోడ 
        మాసమ్ము గడుప సమస్య కాగ -
అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు 
        దత్తుండు దత్త పదంబు కాగ -
ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి 
        వర్ణనీయాంశమై వరలు చుండ -
పాలు కూరలు పండ్ల బండ్ల వారల రాక 
        యాశుధారా కవిత్వార్ధ మనఁగ -
అత్తయ్య వేసెడి యక్షింత లవియన్ని 
        పాత పురాణంపు పఠన మనఁగ -
పోనీని రానీని ఫోను మ్రోతల రోత 
        ఘంటికా గణనమ్ము కరణి దోఁప -
బోరు గొట్టించెడి ధారవాహిక సుత్తి 
        యధిక ప్రసంగమై యడ్డుపడఁగ -

తే.గీ. 
దినము దిన మిట్లు వనితలు తిప్పలుపడి
పూటపూటకు నవధాన పూర్ణసిధ్ధి
తనరుచుండఁగ పురుషావధానులేల? 
వర సహస్రావధానులీ పడతు లెల్ల!