ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

30, ఆగస్టు 2011, మంగళవారం

ఈనాటి ’ఈనాడు’ లో...

మహాకవి, ’అభినవ పోతన’ బిరుదాంకితులు కీ.శే. వానమామలై వరదాచార్యుల శత జయంత్యుత్సవాల ప్రారంభ సభ వివరాలను ఈనాటి ’ఈనాడు’ దిన పత్రికలో ప్రచురించారు. రేపు (31 ఆగస్ట్ 2011) సాయంత్రం 6 గం.లకు ’రవీంద్ర భారతి’ (హైదరాబాదు)లో జరిగే ఈ కార్యక్రమానికి జంట నగరాలలోని సాహిత్యాభిమానులంతా విచ్చేసి, జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.
- డా. ఆచార్య ఫణీంద్ర

22, ఆగస్టు 2011, సోమవారం

sarasa sallaapamu - 161953. అక్కినేని నటించిన 'దేవదాసు' విడుదలై, ఆ చిత్రంలోని పాటలు మారుమ్రోగుతున్నాయి. ఆ చిత్రానికి మాటలు, పాటలు రచించిన సముద్రాల రాఘవాచార్య చెన్నపట్నంలో ఒకరోజు బంధువుల ఇంటికి వెళ్ళడానికి రిక్షా ఎక్కారు. ఆ రిక్షా కార్మికుడు అయ్యవారిని గుర్తించి రిక్షా తొక్కుతున్నంత సేపు ఆ చిత్రంలోని మాటలు, పాటల గురించి ఒకటే పొగుడుతూ ఉన్నాడు. రిక్షా దిగుతున్న సముద్రాల వారితో ఆ రిక్షా కార్మికుడు " అన్నీ బాగా అర్థమయ్యాయి గాని - ఆ 'కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్' అన్న పాటే సరిగా అర్థం కాలేదు బాబయ్య - ఆ పాట అర్థం ఏంటండి? " అని అడిగాడు. ఎంతో తాత్త్విక దృష్టితో వ్రాసిన ఆ పాటకు అర్థం వివరించే ఓపిక, సమయం లేకో, లేక ఆ వివరణను అందుకొనే స్థాయి వాడికి లేదనుకొన్నారో గాని, ఆచార్యుల వారు నవ్వుతూ - " తాగుబోతు పాడే పాటకు అర్థమేముంటుందిరా అబ్బీ!" అంటూ వాడి చేతిలో డబ్బులు పెట్టి, ఇంటిలోకి వెళ్ళిపోయారు.

18, ఆగస్టు 2011, గురువారం

సరస సల్లాపము - 15
చాలా కాలం క్రితం ఆంధ్ర సచిత్ర వార పత్రికలో చదివిన జ్ఞాపకం -
’భక్త కన్నప్ప’ సినిమా షూటింగ్ జరుగుతోంది. కథానాయిక వాణిశ్రీ డైలాగ్ చెబుతున్నారు ...
" నా మావను బ్రతికించు సామీ! "
దర్శకులు బాపు మాటల రచయిత ముళ్ళపూడి వెంకటరమణ వంక చూసారు.
ముళ్ళపూడి వాణిశ్రీతో " చూడమ్మా! ’బ్రతుకు’ కాదు - ’బతుకు’ అనాలి." అన్నారు.
వాణిశ్రీ మళ్ళీ చెబుతూ - " నా మావను బ్రతికించు సామీ! " అన్నారు.
బాపు గారు -" ఇది గిరిజన కన్య పాత్ర కదా! ’బ్రతుకు’ అనకూడదు. ’బతుకు’ అనాలి " అని వివరించారు.
సరేనన్న వాణిశ్రీ మళ్ళీ యథాలాపంగా - " నా మావను బ్రతికించు సామీ! " అనేసారు.
వెంటనే బాపు గారు చిరాకుగా - " చూడమ్మా! ఆ 'బ్ర' తీసేయ్ " అన్నారట.
షూటింగ్ సిబ్బంది పగలబడి నవ్వకుండా ఎలా ఉండగలరు?

1, ఆగస్టు 2011, సోమవారం

సరస సల్లాపము - 14మహాకవి శ్రీశ్రీ కి ప్రసిద్ధ కవి ఆరుద్ర వరుసకు మేనల్లుడవుతారు. ఆరుద్ర కొంత శ్రీశ్రీ ప్రభావంతోనే తొలి అడుగులు వేసారని చెప్పవచ్చు. ఆరుద్ర తొలి కావ్యాన్ని శ్రీశ్రీ మెచ్చుకొని ఎంతో ప్రోత్సహించారు. ’తెలంగాణ’ అని ఆరుద్ర పెట్టుకొన్న ఆ కావ్య శీర్షికను ’త్వమేవాహం’ గా మార్చింది కూడా శ్రీశ్రీ యే.

అయితే తరువాతి కాలంలో వాళ్ళిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. ఆ పైన ఆరుద్ర స్వతంత్ర భావజాలంతో ఎదిగారు.

అలవాటు ప్రకారం శ్రీశ్రీ అడపాదడపా ఇతర కవుల మీద విసుర్లు విసిరినట్టు ( పింగళి గారి సినిమా పాటను మార్చి " ఎంత ఘాటు ప్రేమయో ... ఇంత లేటు వయసులో ..." అనడం, "ప్రధాన మంత్రి కాగోరు - రబీంద్ర నాథ్ టాగోరు", "సినారె... మూసీ కినారె" అని ప్రాసలు ప్రయోగించడం వంటివి అన్న మాట) ఆరుద్ర పైనా విసిరే వారు.

ఇది తెలియని ఒక సాహితీ మిత్రుడు శ్రీశ్రీ తో " మీ శిష్యుడు ఆరుద్ర ... " అంటూ ఏదో చెప్పబోయాడు. వెంటనే శ్రీశ్రీ గట్టిగా నవ్వి - " వాడు నా శిష్యుడు అంటే ... నేనొప్పుకోను. నేను వాడి గురువంటే వాడొప్పుకోడు." అన్నారు.