ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

23, జనవరి 2012, సోమవారం

సరస సల్లాపము - 20చాల నాళ్ళ క్రితం ప్రముఖ కవి 'ఉండేల మాలకొండారెడ్డి'తో ఒక కవి మిత్రుడు - తనకు రావలసిన పురస్కారం ఫలానా వారి సిఫార్సుతో వేరే కవికి వెళ్ళిపోయిందని చెప్పుకొని బాధపడ్డాడట. అప్పుడు మాలకొండారెడ్డి కవి -
'' చూడు నాయనా! ఈ లోకమే అంత! -
క్రింద ఉన్నది భువి -
పైన ఉన్నది రవి -
నడుమ ఉన్నదంతా ‘ పైరవి ’! '' అని ఆ కవిని ఓదార్చారట.

20, జనవరి 2012, శుక్రవారం

సరస సల్లాపము - 19హైదరాబాదులోని ఆంధ్రమహిళాసభ కళాశాలలో కడిమెళ్ళ వరప్రసాద్ గారి అష్టావధానం జరుగుతున్నది. నాతోబాటు సాహితీమిత్రులు కొందరు పృచ్ఛకులుగా కూర్చొని ఉన్నాం.
దత్తపది అంశం నిర్వహిస్తున్న పృచ్ఛకుడు - ” చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ” అన్న పదాలిచ్చి భారతార్థంలో పద్యం చెప్పమన్నారు.
అవధాని - ” మొదటి మూడు పదాలను గురించి విన్నాను గాని, నాలుగో పదమేంటో నాకు అర్థం కాలేదు ” అన్నారు.
అప్పుడు అవధానికి సభాసమన్వయకర్త ’ ప్రాన్స్ ’ అంటే ఏమిటో చెప్పే ప్రయత్నం చేసారు.
ఇంతలో నేను అందుకొని - ” అదేనండి! ప్రాన్స్ అంటే ప్రాణులు ” అన్నాను.
సభలో అందరూ పగలబడి నవ్వారు.

13, జనవరి 2012, శుక్రవారం

సరస సల్లాపము - 18

1974 - 75ల నాటి మాట -
నల్లని జుత్తు(హెయిర్ డై చేసిందే లెండి), తెల్లని జుబ్బా వేసుకొని ట్రిమ్ గా ఉన్న గీత రచయిత ఆత్రేయ ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఆఫీస్ నుండి రెమ్యూనరేషన్ తీసుకొని బయటకు వస్తున్నారు. బయట అప్పుడప్పుడే ఫీల్డ్ లోకి వస్తున్న నడి వయస్కుడు .. కాస్త నలుపు, తెలుపు జుత్తు ... కొద్దిగా బట్టతల ఉన్న రచయిత కనబడి నమస్కరించారు. ఆయనను వేటూరి సుందరరామమూర్తిగా గుర్తించిన ఆత్రేయ - ” ఏమిట్రా ఆ తెల్ల జుత్తు? కాస్త రంగు రాసుకొని ట్రిమ్ గా కనిపిస్తే నాలుగు చాన్సులొస్తాయి. నన్ను చూడు .. ముసలాడిని - ఎంత ట్రిమ్ గా ఉన్నానో! " అన్నారు. వేటూరి నవ్వుతూ -” మీతో పోటీ పడగలనా గురువుగారు? ” అన్నారు.
రెండేళ్ళ తరువాత ’సిరిసిరి మువ్వ’, ’అడవి రాముడు’ పాటలు ఒక ఊపు ఊపుతున్నాయి. మళ్ళీ ఆ ఇరువురు కవి దిగ్గజాలు ఒక స్టూడియోలో తారసపడ్డారు. ఈ మారు వేటూరి ఉన్న కాస్త జుత్తును చక్కగా డై చేసి ట్రిమ్ గా ఉన్నారు. ఆత్రేయ పూర్తిగా తెల్ల జుత్తు, మాసిన జుబ్బాతో కనిపించారు. వేటూరి ఆత్రేయతో - ” ఏంటి గురువుగారు! నా జుత్తుకు రంగు రాసుకొమ్మని చెప్పి, మీరు రాసుకోలేదే? ” అని అడిగారు. ఆత్రేయ కాస్త పెదవి విరిచి - ” సరే .. ! నువ్వు రాయడం మొదలు పెట్టాక, నేనెక్కడ రాస్తున్నానురా? " అన్నారు. వేటూరి శిరస్సు వంచి నమస్కరించారు.

11, జనవరి 2012, బుధవారం

సరస సల్లాపము - 17నగరంలోని ’త్యాగరాయ గానసభ’లో ఒక ప్రసిద్ధ సంస్థ నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని, కవులమంతా సరదాగా మాట్లాడుకొంటూ రోడ్డెక్కాం. పక్కనే ఉన్న ’సుధా దర్శని’ హోటల్లో ”టీ త్రాగుదాం రండి” అంటూ కవులందరినీ ఆహ్వానించాను. హోటల్లోకి వెళ్ళాక - ”నేను టీ తీసుకొంటాను. మీకు ’టీ’ యా? ’కాఫీ’ యా?” అని అడిగాను. వెంటనే కవి మిత్రుడు ’దత్తాత్రేయ శర్మ’ - ”మేమంతా ’టీ’చరులమే!” అన్నారు. అందరం నవ్వుకొంటూ ’టీ’ సేవించాం.