13, జనవరి 2012, శుక్రవారం

సరస సల్లాపము - 18





1974 - 75ల నాటి మాట -
నల్లని జుత్తు(హెయిర్ డై చేసిందే లెండి), తెల్లని జుబ్బా వేసుకొని ట్రిమ్ గా ఉన్న గీత రచయిత ఆత్రేయ ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఆఫీస్ నుండి రెమ్యూనరేషన్ తీసుకొని బయటకు వస్తున్నారు. బయట అప్పుడప్పుడే ఫీల్డ్ లోకి వస్తున్న నడి వయస్కుడు .. కాస్త నలుపు, తెలుపు జుత్తు ... కొద్దిగా బట్టతల ఉన్న రచయిత కనబడి నమస్కరించారు. ఆయనను వేటూరి సుందరరామమూర్తిగా గుర్తించిన ఆత్రేయ - ” ఏమిట్రా ఆ తెల్ల జుత్తు? కాస్త రంగు రాసుకొని ట్రిమ్ గా కనిపిస్తే నాలుగు చాన్సులొస్తాయి. నన్ను చూడు .. ముసలాడిని - ఎంత ట్రిమ్ గా ఉన్నానో! " అన్నారు. వేటూరి నవ్వుతూ -” మీతో పోటీ పడగలనా గురువుగారు? ” అన్నారు.
రెండేళ్ళ తరువాత ’సిరిసిరి మువ్వ’, ’అడవి రాముడు’ పాటలు ఒక ఊపు ఊపుతున్నాయి. మళ్ళీ ఆ ఇరువురు కవి దిగ్గజాలు ఒక స్టూడియోలో తారసపడ్డారు. ఈ మారు వేటూరి ఉన్న కాస్త జుత్తును చక్కగా డై చేసి ట్రిమ్ గా ఉన్నారు. ఆత్రేయ పూర్తిగా తెల్ల జుత్తు, మాసిన జుబ్బాతో కనిపించారు. వేటూరి ఆత్రేయతో - ” ఏంటి గురువుగారు! నా జుత్తుకు రంగు రాసుకొమ్మని చెప్పి, మీరు రాసుకోలేదే? ” అని అడిగారు. ఆత్రేయ కాస్త పెదవి విరిచి - ” సరే .. ! నువ్వు రాయడం మొదలు పెట్టాక, నేనెక్కడ రాస్తున్నానురా? " అన్నారు. వేటూరి శిరస్సు వంచి నమస్కరించారు.

2 కామెంట్‌లు:

  1. ఆచార్యా, మీ కుటుంబానికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. భాస్కర రామిరెడ్డి గారు!
    ధన్యవాదాలు!
    మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాభినందనలు!

    రిప్లయితొలగించండి