ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

29, నవంబర్ 2009, ఆదివారం

ఆణిముత్యం ( నవంబరు 2009 )"అరుగుదెంచి ఎపుడొ అవకాశ మొకమారు
ద్వారము కడ నిల్చి తలుపు తట్టు -
తత్క్షణమ్ము వెడలి తలుపు తీయనియెడన్
మరలి పోవు నద్ది - మరల రాదు!"


ఇది మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యుల కలం నుండి జాలువారిన సందేశాత్మకమైన పద్యాలలో ఒకటి. ఆణిముత్యంలాంటి ఈ పద్యానికి వ్యాఖ్యానం అవసరం లేదని భావిస్తాను. అందరూ ( ముఖ్యంగా యువతరం )
అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
- డా.ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

17, నవంబర్ 2009, మంగళవారం

సులువుగా పద్యం వ్రాయండి ... ( నవంబరు 2009 )'చంపక మాల' పద్యాన్ని వ్రాయడం మరికొంత అభ్యాసం చేద్దాం.
ట్యూన్ గుర్తుందిగా ...
" తననన తాననా తనన తానన తానన తాన తాననా "
యతి - 11 వ అక్షరం.
మొన్ననే [ నవంబరు 14 నాడు ] 'నెహ్రు జయంతి' జరుపుకొన్నాం.
ఇప్పుడు మన ప్రథమ ప్రధాన మంత్రి 'జవహరు లాల్ నెహ్రు' పై 'చంపక మాల' పద్యం వ్రాయాలనుకోండి. ముందుగా ఆయనను తలచుకోగానే మనకేం గుర్తొస్తుంది ? " ఆయన మన జాతికి రత్నం వంటి వాడు " అనాలనుకోండి. ఇప్పుడా విషయం పద్యంలో చెప్పుదాం.
'చంపక మాల' ట్యూన్ ఏంటి ?
" తననన తాననా తనన తానన తానన తాన తాననా "
ఇప్పుడు పైన అనుకొన్న భావం ట్యూన్ లో ఇలా చెప్పవచ్చు.
తననన : జవహరు
తాననా : లాలు నె ( తరువాత ’ హ్రు ’ వస్తుంది కాబట్టి, ’ నె ’ దీర్ఘాక్షరంతో సమాన మవుతుంది. )
తనన : హ్రు ( తనన లో "త" వరకే నింపాము. ఇంకా " నన " మిగిలి ఉంది. )
ఇంత వరకు వ్రాసిందేంటి ?
" జవహరు లాలు నెహ్రు ..."
ముందు ఆయన పేరయితే వచ్చింది. ఇంకా ...
తనన : హ్రు ... మన
తానన : జాతికి ( ఇక్కడ ’ జా ’ 11 వ అక్షరం కాబట్టి, మొదటి అక్షరమైన ’ జ ’ కు యతి కుదిరింది. )
తానన : రత్నము
తాన : వంటి
తాననా : వాడు ... ( ఇంకా ఒక దీర్ఘాక్షరం మిగిలి ఉంది. )
ఇప్పుడు మళ్ళీ పద్యం చూదాం.
" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడు ... "
ఇంకా ఆయన గురించి ఏం చెప్పవచ్చు? ... ఆయన మన ప్రథమ ప్రధానిగా నవ శకానికి నాంది పలికాడు. అయితే పద్యం రెండో పాదంలోకి వెళుతోంది కాబట్టి ప్రాసాక్షరం సరి పోయేలా పదం వేయాలి. " నై నవయుగ " అంటే, " వ " ప్రాసాక్షరంగా పడి సరిపోతుంది. ఎలాగో చూడండి.
తాననా : వాడునై ( ఇక్కడికి మొదటి పాదం పూర్తయింది.)
మళ్ళీ ... రెండో పాదం ప్రారంభిస్తే ...
తననన : నవయుగ
తాననా : భారతా
తనన : వనికి
ఇప్పుడు పద్యం ఎంత వరకు వచ్చిందో చూద్దాం.
" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడునై
నవయుగ భారతావనికి ..."

ఇప్పుడు రాబోయే అక్షరం రెండో పాదంలో 11వ అక్షరం కాబట్టి మళ్ళీ యతి చూసుకోవాలి. రెండో పాదం " నవయుగ " అని ప్రారంభమైంది కాబట్టి " న " కు యతి వేయాలి. అలాగే వేద్దాం.
తానన : నాందిని
తానన : పల్కె ప్ర
తాన : ధాన
తాననా : మంత్రి గాన్ ! ( ఇక్కడికి రెండో పాదం కూడా పూర్తయింది )
ఇప్పుడు పద్యాన్ని చూద్దాం _
" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడునై
నవయుగ భారతావనికి నాందిని పల్కె ప్రధాన మంత్రిగాన్ ! "

నెహ్రూను గూర్చి ఇంకా ఏం చెప్పవచ్చో ఇలాగే ఆలోచిస్తూ మూడు , నాలుగు పాదాలను కూడా ఇలా పూర్తి చేయవచ్చు. ఆయన ఇంకా ఏం చేసాడు ? పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు, భారీ నీటి ప్రాజెక్టులను నెలకొల్పి దేశం ఉన్నతంగా ఎదగడానికి బాట వేసాడు.
తననన : వివిధ ప
తాననా : రిశ్రమల్
తనన : మరియు
తానన : వేల ’ టి. ( ఇక్కడ ’ వే ’ మీద 3వ పాదం మొదటి అక్షరమైన ’ వి ’ కి యతి కుదిరింది. )
తానన : ఎం.సి. ’ ల
తాన : భారి
తాననా : డాములన్ ( దీంతో మూడో పాదం అయిపోయింది. )
ఇక్ నాలుగో పాదం ...
తననన : యువత కు
తాననా : పాధికై
తనన : నిలిపి
తానన : ఉన్నతి ( ’ యు ’ కి, ’ ఉ ’ కి యతి - గమనించండి. )
తానన : నొందగ
తాన : బాట
తాననా : వేసెరా ! ( నాలుగో పాదం కూడా పూర్తయిపోయింది )
ఇప్పుడు మొత్తం పద్యాన్ని చూద్దాం ...

" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడునై
నవయుగ భారతావనికి నాందిని పల్కె ప్రధాన మంత్రిగాన్ !
వివిధ పరిశ్రమల్ మరియు వేల ’ టి.ఎం.సి. ’ ల భారి డాములన్
యువత కుపాధికై నిలిపి, ఉన్నతి నొందగ బాట వేసెరా ! "

చూసారా ? మన ప్రథమ ప్రధానిపై ఎంత చక్కని పద్యం రూపు దిద్దుకొందో ! ఇది నేను ఇప్పటికిప్పుడు పాఠం వ్రాస్తూ అల్లిన పద్యమే ! ఇందులో పెద్ద కష్టమేమీ లేదు. మీరు కూడా మీకిష్టమైన నాయకుని మీద లేక విషయం మీద, ఒక 'చంపక మాల' పద్యం వ్రాయండి ... వ్యాఖ్యగా ప్రచురించండి. తప్పులుంటే సరి దిద్దుతాను. అవసరమైతే సూచనలిస్తాను.

- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )

8, నవంబర్ 2009, ఆదివారం

సమస్యను పరిష్కరించండి ... [ నవంబరు 2009 ]

గత నెల ఇచ్చిన సమస్య : " జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "

నెల రోజులకు పైగా వేచి చూసినా, ఒక్కరంటే ఒక్కరు దానిని పూరణ చేయక పోయేసరికి, కించిత్తు నిస్పృహతో నేనే దాన్ని పూరించాను.
నా పూరణ :
" ప్రళయోన్మాదము గల్గెనేమొ అకటా ! పైపైకి పొంగారగా
నల లువ్వెత్తుగ, ’ కృష్ణవేణి ’ నది వీరావేశమే పూనుచున్ -
విలయోత్పాతము జేసి ముంచినదిరా వేలాది గ్రామంబులన్ !
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "


అయితే, చివరలో ’ హరి దోర్నాల ’ గారు మంచి పూరణను అందించి, చీకటిలో ఆనంద రేఖను వెలిగించారు.
ఆ కవి మిత్రుని పూరణ :
" జలమోయంచును చేయు పూజలకు కాస్తంతన్ దయే లేని ఆ
కలియే నాట్యము చేసెనా యనగ, పొంగారెన్ నదీ మాతలే !
కలలోనైనను గాంచ నోపుదుమె ’ హా ’ కారాల ఆర్త ధ్వనుల్ ?
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "


ఎప్పుడూ వెంటనే స్పందించే ’ కంది శంకరయ్య ’ గారికి మాతృ వియోగం కల్గడం బాధాకరం !
ఆ కవి వరేణ్యునికి ఈ టపా ద్వారా, మన బ్లాగు మిత్రులందరి తరుపున, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.ఇక ఈ నెల సమస్య : " ఒక్కని చావు తెచ్చెను మరొక్కని కందల మెక్కు భాగ్యమున్ ! "
పై సమస్యను పరిష్కరించి, పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)