"సందేశ దీపిక" - నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర, ప్రధాన కార్యదర్శి
17, నవంబర్ 2009, మంగళవారం
సులువుగా పద్యం వ్రాయండి ... ( నవంబరు 2009 )
'చంపక మాల' పద్యాన్ని వ్రాయడం మరికొంత అభ్యాసం చేద్దాం.
ట్యూన్ గుర్తుందిగా ...
" తననన తాననా తనన తానన తానన తాన తాననా "
యతి - 11 వ అక్షరం.
మొన్ననే [ నవంబరు 14 నాడు ] 'నెహ్రు జయంతి' జరుపుకొన్నాం.
ఇప్పుడు మన ప్రథమ ప్రధాన మంత్రి 'జవహరు లాల్ నెహ్రు' పై 'చంపక మాల' పద్యం వ్రాయాలనుకోండి. ముందుగా ఆయనను తలచుకోగానే మనకేం గుర్తొస్తుంది ? " ఆయన మన జాతికి రత్నం వంటి వాడు " అనాలనుకోండి. ఇప్పుడా విషయం పద్యంలో చెప్పుదాం.
'చంపక మాల' ట్యూన్ ఏంటి ?
" తననన తాననా తనన తానన తానన తాన తాననా "
ఇప్పుడు పైన అనుకొన్న భావం ట్యూన్ లో ఇలా చెప్పవచ్చు.
తననన : జవహరు
తాననా : లాలు నె ( తరువాత ’ హ్రు ’ వస్తుంది కాబట్టి, ’ నె ’ దీర్ఘాక్షరంతో సమాన మవుతుంది. )
తనన : హ్రు ( తనన లో "త" వరకే నింపాము. ఇంకా " నన " మిగిలి ఉంది. )
ఇంత వరకు వ్రాసిందేంటి ?
" జవహరు లాలు నెహ్రు ..."
ముందు ఆయన పేరయితే వచ్చింది. ఇంకా ...
తనన : హ్రు ... మన
తానన : జాతికి ( ఇక్కడ ’ జా ’ 11 వ అక్షరం కాబట్టి, మొదటి అక్షరమైన ’ జ ’ కు యతి కుదిరింది. )
తానన : రత్నము
తాన : వంటి
తాననా : వాడు ... ( ఇంకా ఒక దీర్ఘాక్షరం మిగిలి ఉంది. )
ఇప్పుడు మళ్ళీ పద్యం చూదాం.
" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడు ... "
ఇంకా ఆయన గురించి ఏం చెప్పవచ్చు? ... ఆయన మన ప్రథమ ప్రధానిగా నవ శకానికి నాంది పలికాడు. అయితే పద్యం రెండో పాదంలోకి వెళుతోంది కాబట్టి ప్రాసాక్షరం సరి పోయేలా పదం వేయాలి. " నై నవయుగ " అంటే, " వ " ప్రాసాక్షరంగా పడి సరిపోతుంది. ఎలాగో చూడండి.
తాననా : వాడునై ( ఇక్కడికి మొదటి పాదం పూర్తయింది.)
మళ్ళీ ... రెండో పాదం ప్రారంభిస్తే ...
తననన : నవయుగ
తాననా : భారతా
తనన : వనికి
ఇప్పుడు పద్యం ఎంత వరకు వచ్చిందో చూద్దాం.
" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడునై
నవయుగ భారతావనికి ..."
ఇప్పుడు రాబోయే అక్షరం రెండో పాదంలో 11వ అక్షరం కాబట్టి మళ్ళీ యతి చూసుకోవాలి. రెండో పాదం " నవయుగ " అని ప్రారంభమైంది కాబట్టి " న " కు యతి వేయాలి. అలాగే వేద్దాం.
తానన : నాందిని
తానన : పల్కె ప్ర
తాన : ధాన
తాననా : మంత్రి గాన్ ! ( ఇక్కడికి రెండో పాదం కూడా పూర్తయింది )
ఇప్పుడు పద్యాన్ని చూద్దాం _
" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడునై
నవయుగ భారతావనికి నాందిని పల్కె ప్రధాన మంత్రిగాన్ ! "
నెహ్రూను గూర్చి ఇంకా ఏం చెప్పవచ్చో ఇలాగే ఆలోచిస్తూ మూడు , నాలుగు పాదాలను కూడా ఇలా పూర్తి చేయవచ్చు. ఆయన ఇంకా ఏం చేసాడు ? పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు, భారీ నీటి ప్రాజెక్టులను నెలకొల్పి దేశం ఉన్నతంగా ఎదగడానికి బాట వేసాడు.
తననన : వివిధ ప
తాననా : రిశ్రమల్
తనన : మరియు
తానన : వేల ’ టి. ( ఇక్కడ ’ వే ’ మీద 3వ పాదం మొదటి అక్షరమైన ’ వి ’ కి యతి కుదిరింది. )
తానన : ఎం.సి. ’ ల
తాన : భారి
తాననా : డాములన్ ( దీంతో మూడో పాదం అయిపోయింది. )
ఇక్ నాలుగో పాదం ...
తననన : యువత కు
తాననా : పాధికై
తనన : నిలిపి
తానన : ఉన్నతి ( ’ యు ’ కి, ’ ఉ ’ కి యతి - గమనించండి. )
తానన : నొందగ
తాన : బాట
తాననా : వేసెరా ! ( నాలుగో పాదం కూడా పూర్తయిపోయింది )
ఇప్పుడు మొత్తం పద్యాన్ని చూద్దాం ...
" జవహరు లాలు నెహ్రు మన జాతికి రత్నము వంటి వాడునై
నవయుగ భారతావనికి నాందిని పల్కె ప్రధాన మంత్రిగాన్ !
వివిధ పరిశ్రమల్ మరియు వేల ’ టి.ఎం.సి. ’ ల భారి డాములన్
యువత కుపాధికై నిలిపి, ఉన్నతి నొందగ బాట వేసెరా ! "
చూసారా ? మన ప్రథమ ప్రధానిపై ఎంత చక్కని పద్యం రూపు దిద్దుకొందో ! ఇది నేను ఇప్పటికిప్పుడు పాఠం వ్రాస్తూ అల్లిన పద్యమే ! ఇందులో పెద్ద కష్టమేమీ లేదు. మీరు కూడా మీకిష్టమైన నాయకుని మీద లేక విషయం మీద, ఒక 'చంపక మాల' పద్యం వ్రాయండి ... వ్యాఖ్యగా ప్రచురించండి. తప్పులుంటే సరి దిద్దుతాను. అవసరమైతే సూచనలిస్తాను.
- డా. ఆచార్య ఫణీంద్ర
( సంపాదకుడు )
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మన మనమోహనుండు కడు మిక్కిలి నేర్పరి రాజనీతిలో
రిప్లయితొలగించండితన మన భేధమెక్కడను తెల్పక పాలన జేయ సాగెనే !
జనహిత శాసనాలొసగి అర్థపు మంత్రిగ లెస్స జేస్తివే
అనితర సాధ్యమా యనెడు ప్రగ్ఙ్యను కల్గిన నీకు మా సలాం!!
గిరి గారు !
రిప్లయితొలగించండిఇంకా కాస్త కృషి చేస్తే, మీరు దోష రహితంగా పద్యం వ్రాయగలరు.
ఈ చిన్న చిన్న మార్పులను గమనించండి.
మన 'మనమోహనుండు' కడు మాన్యుడు, నేర్పరి రాజనీతిలో -
తన, పర భేదమేది తలదాల్చక పాలన జేయుసాగెనే!
జన హిత శాసనమ్ములనొసంగు ప్రధానిగ సేవజేయుటన్ -
"అనితర సాధ్యమా?" యనెడు ప్రజ్ఞను జూపెడు నీకు మా సలాం!
ఆ ' Little extra effort ' మీ నుండి ఆశిస్తున్నాను.
అభినందనలు !
ధన్యవాదములు. యతి గురించి నాకు సరైన ఇంఫర్మేషన్ లేక పొరపాటు చేసాను. ఇప్పుడే మీ బ్లాగ్ లో April నెలలోని పాఠము చదివిన తరువాత అచ్చు మైత్రి, హల్లు మైత్రి అర్థమయింది.
రిప్లయితొలగించండిఆచార్యులకు,
రిప్లయితొలగించండిఇది నా మొదటి వృత్త పద్యము. కాబట్టి తప్పక తప్పులుంటాయి. మీరు చేయబోవు సవరణలకు ముందస్తు ధన్యవాదములు.
-సురేష్
పిలిచిన తోడనే బలికి, విఘ్నము లెల్లయు రూపు మాపి పొం
గులొసగు ఏక దంతునకు, కోరిన కోర్కెలు దీర్చు నట్టి యా
కలియుగ వేల్పు విశ్వునకు, కాళికి, వాణికి, కాల కంథుకం
జలిడుతు, శాంతి సౌఖ్యములొసంగుమటంచుచు భ క్తి గోరెదన్
ఆశ్చర్యం ! మొదటి పద్యమయినా, ఛందస్సు పరంగా ఒక్క తప్పు లేదు. చాల ఆనందంగా ఉంది.
రిప్లయితొలగించండిఅయితే భాషాపరంగా మెరుగులు దిద్దుకోవలసిన అవసరం ఉంది. మీకు నా హార్దికాభినందనలు !
చదువరి తాననే కనుల చాటున కైతలు నేను రాయగా,
రిప్లయితొలగించండిగడుసరి తానుగా చిలిపి గానము చేసిన రీతి వేడుకే!
తనసరి లేరనే ఆతని తామస చేతలు నాకు కానుకే,
మదనుని భారి నే పడిన మానస వేదన మీకు వాడుకే!
*************************************
ఆచార్యా! నాదీ మొదటి పద్యమే. నాకు చంధస్సు తెలిసిందీ తక్కువే. అందులోనూ గుర్తున్నదీ శూన్యమే. మీ పైన పాఠం చదివి అలవోకగా వ్రాసినదిది. నాకు నా వాడే నాయకుడు. ఇందులో అన్నీ తప్పులేమోనని నా ఊహ. ఎందరికి నవ్వు తెప్పింస్తుందో కానీ. ఈ సంవత్సరాంతానికి ఒక పద్యం వ్రాయాలన్న తపన ఇలా తీరింది. కాసిని మొట్టికాయలేసి దిద్దిపెట్టరూ?
మరికొన్ని వివరాలు, బహుశా మీకు ఈ తప్పుల తడకని సరిదిద్దటానికి ఉపయోగపడతాయని. ముందు నాకు తెలిసిన భాష ఇంగ్లీష్ లో అసలు ఫీల్ వ్రాస్తున్నాను.
రిప్లయితొలగించండి********************
it is just a feel. may be not suitable for a poem as such.
చదువరి తాననే కనుల చాటున కైతలు నేను రాయగా,
i know he could read the language/poetry my eyes express/write
గడుసరి తానుగా చిలిపి గానము చేసిన రీతి వేడుకే!
he reads and sings them too as he is wise and it is my pleasure
తనసరి లేరనే ఆతని తామస చేతలు నాకు కానుకే,
he says none can be comparable to him in 'sarasam', hence that 'taamasa' deeds are like gifts to me [no other woman gets it from her lover]
మదనుని భారి నే పడిన మానస వేదన మీకు వాడుకే!
only when one is lost to thoughts of her lover could see the pain that 'madanuDu' causes like me. And me expressing such is known to all.
ఉష గారు !
రిప్లయితొలగించండిమీరు ప్రాస నియమాన్ని మరిచారు.
మొదటి పద్యమయినా ఇతర ఛందో దోషాలు లేకుండా వ్రాసారు.
మీకు నా హార్దికాభినందనలు !
అయితే, భావ ప్రకటనలో మరి కాస్త స్పష్టత కోసం ఈ మార్పులు చేస్తే బాగుంటుంది.
"చదువరి తానటంచు, కను చాటున కైతలు వ్రాసి చూపగా,
చదువుచు పాడె వానిని విశారదు డాతడు - నాకు వేడుకే !
ఇదె సరసంపు కాన్కలని, ఎవ్వరు నా సరియంచు నీయగా -
మదనుని బారి నే పడిన మానస వేదన మీరెరుంగరే !"
ఆంగ్లంలో మీరిచ్చిన భావాలను పద్య పాదాలలో పొదిగాను.
మీ అందమైన భావాలకు అందమైన రూపం అందిందని భావిస్తున్నాను.
Thanks, aachaarya. With your kind permission i am going to add this to my blog.
రిప్లయితొలగించండిసరుకులు కొందమన్న మరి చాలవు జీతపు డబ్బు లేటికిన్
రిప్లయితొలగించండితిరుగుద మన్న రోడ్లపయి తిప్పలు తప్పవు పాటు హోల్సుతో
ఎరుగము నీటి పంపు ప్రతి యింటికి తప్పక వచ్చు రోజులన్
మరతుము వీటినన్నిటిని మానము వేతుము వోటువారికే
పలికెడు మాటలే పదును బాకుల వోలె ప్రజా సమూహమున్,
రిప్లయితొలగించండిబలమగు కాంగిరేసు నొక బళ్ళెపు పోటున పాతరేసెనే,
పలువురి బాగుయే తనకు పాడిగ పాలన జేసె రాష్ట్రమున్
తెలుగుకు ఖ్యాతి తెచ్చినది ధీరుడు తారక రాముడే కదా!!
ఆచార్య ఫణీంద్రగారికి నమస్కారములు. చంపకమాల పద్యం ఎలా రాయాలో మీరు చెప్పాక ఒకసారి ప్రయత్నించి చూడాలనిపించింది. ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులు చెప్పితే సరిదిద్దుకుంటాను. ధన్యవాదములతో,
రిప్లయితొలగించండిశ్రీలలిత.
జిలిబిలి జుంటి తుమ్మెదల జుమ్మను నాదపు గాన మాధుర్య
మొలికెడి తీపి తేనియను మా మది నిండుగ నింపి కావవే
పలుకులరాణి నీ వలన పాడిన పాటలు వేయి తీరులై
నిలనిటు మాదు కోరికల నిండుగ తీరుచు తల్లి శారదా.
దోర్నాల సోదర ద్వయానికి
రిప్లయితొలగించండిద్విగుణీకృతాభినందన చందనాలు !
శ్రీలలిత గారు !
రిప్లయితొలగించండిమొదటి ప్రయత్నమైనా, మొదటి పాదం ఎంత అందంగా ఎత్తుకొన్నారు !
మీ ప్రతిభా విశేషాన్ని చూస్తుంటే నాకు ఆనందం పొంగుతుంది.
మీకు నా హృదయ పూర్వకాభినందనలు !
అయితే, చిన్న చిన్న దోషాలు సరిదిద్ది, మెరుగులు దిద్దుతాను.
జిలిబిలి జుంటి తుమ్మెదల ఝుమ్మను నాదపు గాన మాధురిన్
ఒలికెడి తీపి తేనె రుచి ఉల్లము నిండుగ నింపి కావవే !
పలుకుల రాణి నీ కృపను పాడిన పాటలు వేయి తీరులై
నెలకొను మాదు కోరికల నిండుగ తీర్చుము తల్లి శారదా !
అచార్యులవారికి కృతఙ్ఞతలు. పద్యాన్ని అందంగా అలంకరించారు. మీ అనుమతితో దీనిని నా బ్లాగులో పెట్టుకుందామనుకుంటున్నాను. అంగీకరిస్తారని ఆశిస్తూ.. శ్రీలలిత..
రిప్లయితొలగించండి"జిలిబిలి జుంటి తుమ్మెదల జుమ్మను నాదపు గాన మాధుర్య..."
రిప్లయితొలగించండిలలిత గారు మొదటి పాదాన్ని చక్కగా ఎత్తుకున్నారు. పట్టి పట్టి చూస్తే తప్ప యతి భంగాన్ని గుర్తించలేము. లలిత గారికి అభినందనలు.
ఒక చిన్న సందేహం.'జి'లి బిలి, 'ఝు'మ్మని కి ఎలా యతి కుదురుతుంది? అచ్చు మైత్రి సరిపోదు కదా? అలాగే 'అ'నితర సాధ్యమా? యనెడు 'ప్ర'జ్ఞను జూపెడు నీకు మా సలాం!" లో అ కి, ప్ర కి యతి ఎలా సరిపోతుంది?
రిప్లయితొలగించండిసత్యనారాయణ గారు !
రిప్లయితొలగించండిబాగా పట్టుకొన్నారు.
గిరి గారు ! మీ సందేహం సరైనదే !
భావ సమన్వయంలో పడ్డ నా చూపు నుండి ఆ రెండూ అలా జారిపోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది.
ముద్రణలో ప్రూఫులు దిద్దేటప్పుడు నా కిలాంటి ప్రమాదాలు అనుభవమే
( నాలుగు తప్పులు పట్టుకొన్నాం అనుకొనేలోపు
ఒకటి, అరా ఇలా జారిపోతాయి ) కానీ, ఇక్కడా ఇలా జరగడం పొరపాటే ! నన్ను క్షమించండి.
పాఠాలు చెప్పే స్థాయిలో ఇలాంటి నిర్లక్ష్యం క్షమార్హం కాదు. ఇక నుండి నేను మరింత జాగ్రత్త వహించాలేమో !
శ్రీ లలిత గారు !
మీ పద్యంలోని మొదటి పాదం అందం చెడినా, ఇలా మార్చక తప్పదు -
" జిలిబిలి జుంటి తుమ్మెదలు చేసెడి నాదపు గాన మాధురిన్ ..."
గిరి గారు !
మీ పద్య పాదం కూడా ఇలా మార్చుకోండి -
" అనితర సాధ్యమా యనెడునట్టుల వెల్గెడి నీకు మా సలాం ! "
జిగురు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు !
baagundi! malli time dorikinappudu chuusi try cheastaa!
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజనులకు లోకసత్త యొక చక్కని మార్పును జూప సల్పగా,
రిప్లయితొలగించండిజనమొక వెంగళప్ప వలె ఝాఢ్యము తోడుగ వోటు దాల్చగన్,
మునుపటి పాత నాయకుల మోసపు రీతులె రాజ్యమేలెనే!
ధన, కుల రాజకీయమున ధర్మము దెప్పుడు వోటమే గదా!!
గిరిగారు!
రిప్లయితొలగించండిపద్యం బాగుంది. భావ స్పష్టత కోసం ఈ చిన్ని మార్పులు చేయవచ్చు -
"జనులకు లోకసత్త యొక చక్కని మార్పును తెచ్చు పార్టి! ఈ
జనమొక వెంగళప్ప వలె జాడ్యము వీడక వోటు వేయగాన్,
మునుపటి పాత నాయకుల మోసపు బుద్ధులె రాజ్యమేలెనే!
ధన, కుల రాజకీయమున ధర్మము కెప్పుడు నోటమే గదా!!"
అభినందనలు!
పద్యమును సరి చేసినందుకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండితెలుఁగునఁ బద్యలేఖన విధిన్ వివరించుచుఁ గ్రొత్తవారికిన్
రిప్లయితొలగించండిసులభము గాగ ఛందమును చొక్కముగా గణముల్ యతుల్ ప్రా
సలు మఱి వృత్తభేదములఁ జక్కఁగఁ జెప్పుచు బ్లాగులోన వా
రలు రచియించు పద్యముల రమ్యముగా సవరింతు వెప్పుడున్.
తెలియక వ్రాయు దోషముల దిద్దుచు సాధుపదప్రయోగ రీ
తుల వివరించి వారలను తృప్తులఁ జేయుచు ప్రోత్సహించి బ్లా
గుల గణమందు పేర్వడసి కూడలి జల్లెడ జాలముల్ గనన్
విలువలు గల్గు పోస్టులను వెల్వడఁ జేసెడి నిన్ను మెచ్చెదన్.
శంకరయ్య గారు !
రిప్లయితొలగించండిమీ అభిమానానికి నా కృతజ్ఞతాభివందనాలు !
మా గురువు గారు మహాకవి కీ.శే.నండూరి రామకృష్ణమాచార్య గారి శిష్య పరమాణువుగా, అనవద్య హృద్య పద్య విద్యా ప్రచార యజ్ఞానికి నేను సైతం ఒక సమిధను ఆహుతిచ్చే చిరు ప్రయత్నమిది.
మీ వంటి సత్కవుల ప్రోత్సాహమే నాకు కొండంత బలం.
నా పై ఆణిముత్యాల్లాంటి రెండు పద్యాలు రచించి ఉపాయనంగా అందించినందుకు మీకు మరోమారు ధన్యవాదాలు !
[ ఒక చిన్న గమనిక : రెండు పద్యాల్లోను చిన్న చిన్న దోషాలున్నాయి-
మొదటి పద్యంలో రెండో పాదంలో చివరి ’ర’ గణంలో ’మధ్య లఘువు’ మిస్సయింది.
రెండో పద్యంలో రెండో పాదంలో ’తి’ కి ’తృ’ కి అయితే యతి కుదురుతుంది గాని, ’తు’ కు, ’తృ’కు కుదరదు.
’తు’ కు ’తు,తూ,తొ,తో,దు,దూ,దొ,దో’ లతో యతి వేయాలి.
మీకు తెలియదని కాదు. అప్పుడప్పుడు కాస్త నిర్లక్ష్యంతో తప్పులు దొర్లుతుంటాయి.
సరి చేయగలరు. ]
Unbelievable sir. It's a nice thing to see so many padyam lovers. These posts will serve convent school persons like me very well. :-)
రిప్లయితొలగించండిThank you Sameera!
రిప్లయితొలగించండిఆచార్య ఫణీంద్రగారికి నమస్కారములు. నేను వ్రాసిన మొదటి పద్యమునకు మీరు ఇచ్చిన ప్రోత్సాహముతో ఈ రెండవ పద్యం కూడా వ్రాసాను. దయచేసి తప్పులు చెప్పగలరు.
రిప్లయితొలగించండినిలుమని యెంత చెప్పినను ఈ మది నీ గతి అన్య భావనల్
నిలవగ వంత చెందిన నను మ్మది నెమ్మది సెయ్య నీవెగా
పలుకులరాణి నీ దయను పుణ్యచరితృల నెయ్యమే నను
న్నెలయగ నిన్ను చేర్చు మది నూరట చెందగ తల్లి శారదా...