8, నవంబర్ 2009, ఆదివారం

సమస్యను పరిష్కరించండి ... [ నవంబరు 2009 ]

గత నెల ఇచ్చిన సమస్య : " జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "

నెల రోజులకు పైగా వేచి చూసినా, ఒక్కరంటే ఒక్కరు దానిని పూరణ చేయక పోయేసరికి, కించిత్తు నిస్పృహతో నేనే దాన్ని పూరించాను.
నా పూరణ :
" ప్రళయోన్మాదము గల్గెనేమొ అకటా ! పైపైకి పొంగారగా
నల లువ్వెత్తుగ, ’ కృష్ణవేణి ’ నది వీరావేశమే పూనుచున్ -
విలయోత్పాతము జేసి ముంచినదిరా వేలాది గ్రామంబులన్ !
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "


అయితే, చివరలో ’ హరి దోర్నాల ’ గారు మంచి పూరణను అందించి, చీకటిలో ఆనంద రేఖను వెలిగించారు.
ఆ కవి మిత్రుని పూరణ :
" జలమోయంచును చేయు పూజలకు కాస్తంతన్ దయే లేని ఆ
కలియే నాట్యము చేసెనా యనగ, పొంగారెన్ నదీ మాతలే !
కలలోనైనను గాంచ నోపుదుమె ’ హా ’ కారాల ఆర్త ధ్వనుల్ ?
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే ! "


ఎప్పుడూ వెంటనే స్పందించే ’ కంది శంకరయ్య ’ గారికి మాతృ వియోగం కల్గడం బాధాకరం !
ఆ కవి వరేణ్యునికి ఈ టపా ద్వారా, మన బ్లాగు మిత్రులందరి తరుపున, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.



ఇక ఈ నెల సమస్య : " ఒక్కని చావు తెచ్చెను మరొక్కని కందల మెక్కు భాగ్యమున్ ! "
పై సమస్యను పరిష్కరించి, పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.

- డా. ఆచార్య ఫణీంద్ర (సంపాదకుడు)

16 కామెంట్‌లు:

  1. లక్కులు పెక్కు భంగులు విలక్షణ విస్మయముల్ విశేషముల్
    తక్కువదేమి కాదితడు దక్షుడు, శిక్షిత సైనికుండు- ఏ
    లెక్కననైన చిక్కులను లెస్సగ తీర్చును, చూడ వింతయౌ
    ఒక్కని చావు తెచ్చెను మరొక్కని కందల మెక్కు భాగ్యమున్!

    రిప్లయితొలగించండి
  2. సత్యనారాయణ గారు !
    అద్భుతం ! చక్కని పద్యాన్ని అందించారు. ద్విరుక్త కకార ప్రాస శబ్దాలను మరికొన్ని అదనంగా ప్రయోగించి, పద్యానికి మరింత సొబగును తెచ్చారు.
    మీకు నా అభినందన పూర్వక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. నిక్కముఁ జూడ లోకమున నేటికి నాటికి రాజకీయమం
    దెక్కడనైన నెవ్వరు గతించిన వారి సతీసుతుల్ సదా
    చక్కఁగ సానుభూతికి ప్రశస్తముగా వినియోగధారులే
    యొక్కని చావు తెచ్చెను మరొక్కని కందల మెక్కు భాగ్యమున్.

    రిప్లయితొలగించండి
  4. శంకరయ్య గారు !
    చక్కని భావంతో పూరణను అందించారు.
    ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  5. మిక్కుట మైన స్వార్థమున మెక్కుచు వేలకు వేలకోట్లు తా
    నొక్కడు చాలదంచు మరియొక్క తరంబును నిల్ప బూనినన్
    ఒక్కటి దల్చెతాను మరి యొక్కటి దల్చెను దైవ మన్నటుల్
    ఒక్కని చావు తెచ్చెను మరొక్కని కందల మెక్కు భాగ్యమున్!

    రిప్లయితొలగించండి
  6. చిక్కని పద్యమందు బలె! చెక్కిన శిల్పములట్లు వాస్తవాల్
    చక్కగ చెప్పినారు - పద చాలనమున్, విషయమ్ము సాగగా
    మిక్కిలి వేగవంతముగ; మీదట సామెతతో బలీయమౌ
    చక్కని పూరణ మ్మిడిన సత్కవి! శ్రీ 'హరి' గారు! మీకు జై!

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. వ్రాసినాను నేను పద్యంబు నొక్కటి
    తమరి సూచనలను తలుచు కొనుచు
    ప్రోత్సహించి నారు పూర్తి పద్యము తోడ
    వందనములు నావి అందు కొనుడు

    ఓరిమి మీరను, దయతో
    నే రాసిన పద్యములను నీరస పడకన్
    తీరుగ సవరణ సేతురు
    ఏ రీతిన తెలుపుదు మీ కింపుగ నెనరుల్

    రిప్లయితొలగించండి
  9. ఒక్కని చావు తెచ్చే మరోక్కని కందలమెక్కు భాగ్యమున్
    ఎక్కడ భాగ్యమందదొయనిన్ తమ కూటమి యంత ఒక్కటై
    ఒక్క జగన్ వినా ఇతర నాయకులెవ్వరు దీటు రారనెన్
    చక్కటి ముందు చూపెరిగి సోనియ కూటమి అట కట్టెనే

    తొలి ప్రయత్నం, యతి సరిపోలేదు

    రిప్లయితొలగించండి
  10. గిరి గారు !
    మీలా తొలి ప్రయత్నం చేసి పద్యాన్ని వ్రాసిన వారంటే నాకు ఎనలేని ప్రేమ. ఒక చిన్ని తమ్ముడు పుట్టినంత సంతోషం.
    మీలాంటి వారు ఒకరిద్దరు తయారయినా నా బ్లాగు నిర్వహణకు ఒక అర్థం, పరమార్థం ఉన్నట్టే ! నా ప్రయాస ఫలప్రదం అయినట్టే !
    మొదటి ప్రయత్నంలోనే మీరు ఎంతో ప్రగతిని సాధించారు. మీకు నా హార్దికాభినందనలు !
    ఈ చిన్నచిన్న మార్పులు చేస్తే, మీ పద్యం దోష రహితమై అలరిస్తుంది.

    " ఒక్కని చావు తెచ్చెను మరొక్కని కందలమెక్కు భాగ్యమం,
    చొక్క జగన్ వినా ఇతరు లొక్కరునైనను దీటు రారటం
    చెక్కడ భాగ్యమందెదరొ ఏమిటొ కూటమి - యంచు సోనియా
    చక్కని ముందుచూపు గల జాణగ, కూటమి ఆట కట్టెనే ! "

    మీకు మరొక్క మారు నా అభినందనలు !
    --- డా. ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  11. సహొదరుదు హరి దొర్నాల ప్రేరణ తో చేసిన చిన్న ప్రయత్నం. తమరి సవరనకు మరియు ప్రొత్సాహానికి ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  12. గిరి గారు !
    శుభారంభం చేసారు. దీనిని ఇలాగే కొనసాగించండి.
    వెయ్యేళ్ళ పద్య కవితా వారసత్వ మహా సామ్రాజ్యంలోనికి
    మీకిదే నా స్వాగతం !

    రిప్లయితొలగించండి
  13. అక్కట! రాజశేఖరుఁ డనన్యసమాన ధరాధిపుండు నే
    డెక్కడికేగెఁ, పాలనమదెట్టుల సాగుచునుండెఁ, జూడగాన్
    లెక్కలవాఁడు నేడు కడు నేర్పున పాలన చేయుచుండడే!
    యొక్కని చావు తెచ్చెను మరొక్కని కందలమెక్కు భాగ్యమున్.

    *పూర్వము ఆయన ఆర్థికమంత్రిగ చేసున్నారు కాబట్టి, వారిని లెక్కలవాఁడు అని అనడం జరిగింది. అంతేగానీ, ఆయనకు పాలానాదక్షత లేదనటం ఆంతర్యం కాదు. గుర్తిస్తారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  14. R.V. చారి గారు !
    పద్యం బాగుంది. అభినందనలు !
    అయితే పద్య భావంలో స్పష్టత పెరిగేందుకు చిన్న చిన్న మార్పులు చేస్తే ఇలా అందగిస్తుంది.

    " అక్కట ! రాజశేఖరు డనన్య సమాన ధరాధిపుండు, నే
    డెక్కడికేగె ? పాలన మదెట్టుల సాగు ? " నటంచు చూడగాన్ -
    లెక్కల మంత్రి నేడు కడు లెస్సగ పాలన చేయుచుండెగా !
    ఒక్కని చావు తెచ్చెను మరొక్కని కందలమెక్కు భాగ్యమున్ !

    రిప్లయితొలగించండి
  15. పెక్కగు దైవలీలలను పేర్కొన నొక్కయుదంతమిద్దనన్
    నక్కియె జంపగా నొకతె నాయక మాన్యుని గాంధివంశజున్
    దక్కెను దేశపాలనము దక్షుడు శ్రీనరసింహరాయుకున్
    ఒక్కని చావు దెచ్చెను మరొక్కని కందలమెక్కు భాగ్యమున్.

    రిప్లయితొలగించండి
  16. ’ఊకదంపుడు’ గారు!
    మీ పద్యం ధారారమ్యంగా ఉంది.
    అభినందనలు!

    రిప్లయితొలగించండి