4, ఫిబ్రవరి 2012, శనివారం

నా స్మృతి పథంలో ..

[మా గురుదేవులు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యులు గారు తమ ఆత్మకథలో వ్రాసుకొన్న విషయం ఇది. చదివి ఆయన పద్య కవితా పారమ్యాన్ని గ్రహించి ఆనందించండి.
- డా. ఆచార్య ఫణీంద్ర ]




ఒకసారి అమలాపురంలో అష్టావధానం చేసేటప్పుడు నన్ను పృచ్ఛకుడు వేసిన ప్రశ్న.
" అవధాని గారూ! మీ స్మృతిపథాన తొలి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకొని పద్యంగా చెప్పండి. "
అది గడ్డు ప్రశ్న. కాని అది అవధాన సభ. కోరినది చెప్పక తప్పదు. అందుకే అప్పటికప్పుడు కొంటెగా ఒక సన్నివేశాన్ని కల్పించి పద్యం చెప్పాను.

" పాటలు పాడి నన్ను పసి బాబును ఊయలలోన ఊచుచున్
ఆటలు నేర్పు దాదిని రహస్యముగా పొదరింటి లోనికిన్
పైట చెరంగు బట్టి పరవాడెవడో తరలించు దృశ్యమున్
మాటలు వచ్చినంతటనె మాతకు చెప్పదలంచినాడనే! "

ఆ పృచ్ఛకుడు అన్నాడు. " అవధాని గారూ! నేను కోరినది అతిశయోక్తి లేని అచ్చమైన సత్యాన్ని. అదే ’ఉత్పలమాల’లో అదే ’ట’కార ప్రాసతో మీ జీవన స్మృతిపథంలోని తొలి సన్నివేశాన్ని ఉటంకిస్తూ మరో పద్యం చెప్పండి. "
అప్పుడు నేను ఆశువుగా చెప్పిన పద్యం -

" స్ఫోటక బాధచే ఒడలు సోలి పరుంటిని తల్లి ప్రక్కలో -
మాటికి మాటికిన్ మరల మంచముపై కెగబ్రాకు తేలు నన్
వ్రేటును వేయకుండ తన వ్రేళులతో విదలించి, ఎన్నియో
కాటులు తిన్న తల్లి కృప - కారణ జన్ముడనై తరించెదన్! "

ఆ సత్యం సభను మిక్కిలి ఆకర్షించింది. తల ఊపుతూ ఒక సదస్యుడు లేచి తన చేతి ఉంగరం నా చేతికి తొడిగాడు హర్షధ్వానాల మధ్య.
---***---

3 కామెంట్‌లు:

  1. అచ్చమైన సత్యంతో చెక్కిన తల్లి కృప నిత్యం అలరారు శిల్పం. తల్లితనపు త్యాగంలో తడిసిన ప్రాణం, అవధాన సమయాన జ్ఞప్తికి తెచ్చుకున్న వైనం బావుంది. పంచుకున్నందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి
  2. ’మరువం’ ఉష గారేనా?
    ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు సోదరీ!
    బాగున్నారా?
    మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాభినందనలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనేనండి, అచ్చెరువుతో వెలికి వచ్చిన ఆదరణకి కృతజ్ఞతలు...

      తొలగించండి