చాలా రోజులుగా బ్లాగు మిత్రులకు దూరంగా ఉన్నందుకు మన్నించండి.
ఇతర కార్యకలాపాలలో ఎడతెరపి లేక తప్పలేదు.
ఇక మన పద్య రచన పాఠాలకు వద్దాం.
ఇంతవరకు మనం ’ ఉత్పల మాల ’, ’ చంపక మాల ’ వంటి వృత్త పద్యాల రచన సులువుగా ఎలా చేయాలో తెలుసుకొన్నాం. మరి ఇప్పుడు అంత కన్న సులువైన పద్యాలు నేర్చుకొందాం. వీటిని ’ ఉప జాతులు ’ అన్న పద్యాలుగా పిలిస్తారు. వీటిలో ట్యూన్ కి పదాలు వేయడంలో మరింత వెసులుబాటు ఉంటుంది.
ఇక్కడ ట్యూన్ లో ’
తాన ’ అని ఉన్న చోట ’
తనన ’ అని కూడా వేసుకోవచ్చు. ( మొత్తం 3 మాత్రలు అన్న మాట ).
ఉదాహరణకు ’
తాన ’ అని ఉన్న ట్యూన్ లో ’ కావ్య ’ అనిగాని, లేక ’ కవన ’ అని గాని వేసుకోవచ్చు. వృత్తాలలో అలా కుదరదు.
అలాగే, ’
తానాన ’ అని ఉన్న చోట ’
తనననా ’, ’
తననాన ’, ’
తాననా ’ ( మొత్తం 5 మాత్రలు ) వేసుకోవచ్చు.
అయితే 5 మాత్రలైనా, దీర్ఘం లేకుండా ’
తనననన ’ అని వేయడం కుదరదు. ( ఇది ఒక exemption. )
ఉదాహరణకు ’
తానాన ’ అని ఉన్న చోట ... ’ మా వాడు ’ అని,
’ మనసులో ’ అని,
’ మన వాడు ’ అని,
’ మానవా ’ అని కూడా వేసుకోవచ్చు.
’ మన మనసు ’ అని మాత్రం వేయకూడదు.
ఇక పద్యంలోకి వద్దాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఛందస్సు ’ ఆట వెలది ’.
దీని ట్యూన్ ...
(తా)న తాన తాన (తా)నాన తానాన
(తా)న తాన తాన (తా)న తాన
(తా)న తాన తాన (తా)నాన తానాన
(తా)న తాన తాన (తా)న తాన ఇలా 1, 3 పాదాలు ఒకలాగా, 2, 4 పాదాలు ఒకలాగా ఉంటాయి.
ప్రతి పాదంలో బ్రాకెట్లలో ఉన్న అక్షరాల మధ్య యతి కుదరాలి. ఇక్కడ ఇంకో వెసులుబాటుంది. యతి కుదరక పోతే, ఆ ప్రక్కనే ఉన్న అక్షరాలు ఒకటే అయితే చాలు. అయితే ఈ ఒకే ప్రాస అక్షరాలకు ముందు దీర్ఘముంటే రెండు చోట్లా దీర్ఘమే ఉండాలి. హ్రస్వముంటే రెండు చోట్లా హ్రస్వమే ఉండాలి. దీనిని ’ ప్రాస యతి ’ అంటారు. ఇది వృత్త పద్యాలలో చెల్లదు.
ఈ పద్యంలో మరొక సులువైన పని ... ప్రాస వేయనక్కర లేదు.
ఇక ప్రసిద్ధ పద్యం ఉదాహరణగా చూద్దాం. మనకు బాగా పరిచయమున్న ’ వేమన ’ పద్యాలన్నీ దాదాపుగా ...
ఆట వెలదులే ! ఒక పద్యం చూద్దాం...
(ఉ)ప్పు కప్పురంబు (ఒ)క్క పోలికనుండు
చూ(డ) చూడ రుచుల జా(డ) వేరు ( ప్రాస యతి )
(పు)రుషులందు పుణ్య (పు)రుషులే వేరయా !
(వి)శ్వదాభి రామ ! (వి)నుర వేమ !చూసారుగా పై ట్యూన్ కి ఎలా సరిపోయిందో ... !
ఇక ఇప్పుడు మీరు మీకు నచ్చిన వస్తువుపై ఆట వెలది పద్యాన్ని వ్రాయడానికి ప్రయత్నిస్తారు కదూ !
మీ పద్యాలను వ్యాఖ్యలుగ పోస్ట్ చేస్తే, తప్పులుంటే సరిదిద్దుతాను ... All the best !