17, ఏప్రిల్ 2010, శనివారం

సులువుగా పద్యం వ్రాయండి ... (ఏప్రిల్ 2010)

చాలా రోజులుగా బ్లాగు మిత్రులకు దూరంగా ఉన్నందుకు మన్నించండి.
ఇతర కార్యకలాపాలలో ఎడతెరపి లేక తప్పలేదు.
ఇక మన పద్య రచన పాఠాలకు వద్దాం.
ఇంతవరకు మనం ’ ఉత్పల మాల ’, ’ చంపక మాల ’ వంటి వృత్త పద్యాల రచన సులువుగా ఎలా చేయాలో తెలుసుకొన్నాం. మరి ఇప్పుడు అంత కన్న సులువైన పద్యాలు నేర్చుకొందాం. వీటిని ’ ఉప జాతులు ’ అన్న పద్యాలుగా పిలిస్తారు. వీటిలో ట్యూన్ కి పదాలు వేయడంలో మరింత వెసులుబాటు ఉంటుంది.
ఇక్కడ ట్యూన్ లో ’ తాన ’ అని ఉన్న చోట ’ తనన ’ అని కూడా వేసుకోవచ్చు. ( మొత్తం 3 మాత్రలు అన్న మాట ).
ఉదాహరణకు ’ తాన ’ అని ఉన్న ట్యూన్ లో ’ కావ్య ’ అనిగాని, లేక ’ కవన ’ అని గాని వేసుకోవచ్చు. వృత్తాలలో అలా కుదరదు.
అలాగే, ’ తానాన ’ అని ఉన్న చోట ’ తనననా ’, ’ తననాన ’, ’ తాననా ’ ( మొత్తం 5 మాత్రలు ) వేసుకోవచ్చు.
అయితే 5 మాత్రలైనా, దీర్ఘం లేకుండా ’ తనననన ’ అని వేయడం కుదరదు. ( ఇది ఒక exemption. )
ఉదాహరణకు ’ తానాన ’ అని ఉన్న చోట ... ’ మా వాడు ’ అని,
’ మనసులో ’ అని,
’ మన వాడు ’ అని,
’ మానవా ’ అని కూడా వేసుకోవచ్చు.
’ మన మనసు ’ అని మాత్రం వేయకూడదు.
ఇక పద్యంలోకి వద్దాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఛందస్సు ’ ఆట వెలది ’.
దీని ట్యూన్ ... (తా)న తాన తాన (తా)నాన తానాన
(తా)న తాన తాన (తా)న తాన
(తా)న తాన తాన (తా)నాన తానాన
(తా)న తాన తాన (తా)న తాన

ఇలా 1, 3 పాదాలు ఒకలాగా, 2, 4 పాదాలు ఒకలాగా ఉంటాయి.
ప్రతి పాదంలో బ్రాకెట్లలో ఉన్న అక్షరాల మధ్య యతి కుదరాలి. ఇక్కడ ఇంకో వెసులుబాటుంది. యతి కుదరక పోతే, ఆ ప్రక్కనే ఉన్న అక్షరాలు ఒకటే అయితే చాలు. అయితే ఈ ఒకే ప్రాస అక్షరాలకు ముందు దీర్ఘముంటే రెండు చోట్లా దీర్ఘమే ఉండాలి. హ్రస్వముంటే రెండు చోట్లా హ్రస్వమే ఉండాలి. దీనిని ’ ప్రాస యతి ’ అంటారు. ఇది వృత్త పద్యాలలో చెల్లదు.
ఈ పద్యంలో మరొక సులువైన పని ... ప్రాస వేయనక్కర లేదు.
ఇక ప్రసిద్ధ పద్యం ఉదాహరణగా చూద్దాం. మనకు బాగా పరిచయమున్న ’ వేమన ’ పద్యాలన్నీ దాదాపుగా ...
ఆట వెలదులే ! ఒక పద్యం చూద్దాం...



(ఉ)ప్పు కప్పురంబు (ఒ)క్క పోలికనుండు
చూ(డ) చూడ రుచుల జా(డ) వేరు
( ప్రాస యతి )
(పు)రుషులందు పుణ్య (పు)రుషులే వేరయా !
(వి)శ్వదాభి రామ ! (వి)నుర వేమ !

చూసారుగా పై ట్యూన్ కి ఎలా సరిపోయిందో ... !
ఇక ఇప్పుడు మీరు మీకు నచ్చిన వస్తువుపై ఆట వెలది పద్యాన్ని వ్రాయడానికి ప్రయత్నిస్తారు కదూ !
మీ పద్యాలను వ్యాఖ్యలుగ పోస్ట్ చేస్తే, తప్పులుంటే సరిదిద్దుతాను ... All the best !

11 కామెంట్‌లు:

  1. చాలా రోజుల తర్వాత పునరాగమనం చేసినందుకు ధన్యవాదాలు.

    నా పద్యం చూడండి.

    ఆశ లేని బ్రతుకు అడవిలో వెన్నెల
    ఆశ యందె కలుగు ఆశయములు
    ఆశ యుండు టెల్ల అత్యాశ కాబోదు
    ఆశ లోనె కలదు దేశ భవిత

    రిప్లయితొలగించండి
  2. హరిగారు!
    మీరు ఆరితేరిన కవి.
    పూర్వ రాష్ట్రపతి డా. అబ్దుల్ కలాం గారి సందేశాన్ని అద్భుతంగా పద్యంలో చెక్కారు.
    మొదటి పాదంలో ’ వెన్నెల ’ అని చతుర్మాత్రా గణం బదులు పంచమాత్రా గణాన్ని ప్రయోగిస్తే, పద్యం మరింత అందగిస్తుంది. ఏం లేదు ... ’ వెన్నెలే ’ అని గాని, ’ వెన్నెలౌ ’ అని గాని అంటే సరిపోతుంది. అభినందనలు!

    రిప్లయితొలగించండి
  3. ఆచార్య ఫణీంద్ర గారు, ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  4. చిన్ని బుజ్జి వీడు, చిరునవ్వు చిందించు
    బోసి నోటి తోటి బాస చెప్పు!
    పెద్ద వారిఓలె ఫిర్యాదు కాబోడు
    కాస్త ప్రేమ చాలు కడుపు నిండు!!

    అనిరుధ్ గురించి...
    http://www.youtube.com/watch?v=C8_zVmwtIc0

    రిప్లయితొలగించండి
  5. చిన్నికన్ని వీడె, చిరునవ్వులొలికించు
    బోసినోరు తోడ బాస చెప్పు!
    పెద్దవారివోళె ఫిర్యాదు చేయడే,
    కాస్త ప్రేమ చాలు కడుపు నిండు!!

    రిప్లయితొలగించండి
  6. Giri garu !
    modati padyamlo 'phiryadu cheyade' ani maariste chalu! migita antaa ade bagundi ! congrats !

    రిప్లయితొలగించండి
  7. ఆచార్య ఫణీంద్రగారికి శ్రీలలిత నమస్కారములు. మీరు ఆటవెలది రాయడానికి చెప్పిన పధ్ధతి బాగుంది. తప్పక ప్రయత్నిస్తాను. ఒక విన్నపం.
    మీరు చంపకమాల వ్రాయడం చెప్పినప్పుడు నేను వ్రాసిన పద్యాన్ని సరిదిద్ది మెచ్చుకొన్నారు. ఆ ప్రోత్సాహముతో మరొకటి మీకు వ్రాసి పంపించాను. కాని ఆ తరువాత మీరు ఇప్పుడే బ్లాగ్ లో కనిపించారు. శ్రమ అనుకోకుండా నేను వ్రాసిన పద్యం సరి చేసి పెట్టగలరా?

    రిప్లయితొలగించండి
  8. లలిత గారు !
    అనేక సాహిత్య కార్యక్రమాలలో busy గా ఉండి, మీకు సకాలంలో సమాధానం ఇవ్వలేకపోయాను. క్షమించండి.
    మీ చంపకమాల పద్యాన్ని సరిచేద్దామంటే, మీ భావం నాకు స్పష్టంగా అవగతం కాలేదు. గణాలంటే సరిచేయవచ్చు. కాని భావం తెలుసుకోవడం ఎలా ? కాబట్టి మీ భావాన్ని స్పష్టంగా తెలియజేస్తే, వీలును బట్టి దాన్ని సరిజేసి అందించగలను.

    రిప్లయితొలగించండి
  9. ఆచార్య ఫణీంద్రగారికి నా సప్రస్రయ నమస్కారములు.......
    నేను చందోబద్దంగా పద్యములు వ్రాయాలని సంకల్పించితిని...ఏ విధంగా వ్రాయాలో తెలుపవలసినదిగా కోరుతున్నాను.. పద్యం వ్రాసేముందు ఏ ఏ అంశాలను దృష్టిలో వుంచుకోవాలో దయచేసి తెలుపగలరు...........
    మాడుగుల చంద్రశేఖర్ శర్మ

    రిప్లయితొలగించండి
  10. చంద్రశేఖర శర్మ గారు!

    మహావధాని 'మాడుగుల' వారి వంశంలో జన్మించాక మీకీ జిజ్ఞాస ఉండడంలో ఆశ్చర్యమేముంది?

    పద్యం వ్రాసేముందు ఏ ఏ అంశాలను దృష్టిలో వుంచుకోవాలో... ఛందోబద్దంగా పద్యాలను సులువుగా ఎట్లా వ్రాయాలో... ఈ బ్లాగులోని నా పాత పోస్టులను చూసి నేర్చుకోండి. కొన్ని పోస్టులలో అభ్యాసం కొరకు 'సమస్యా పూరణా'లను కూడా ఇచ్చాను. వాటిని పూరిస్తూ అభ్యాసం చేయండి. మీ వంటి యువకులను మంచి పద్య కవులుగా తీర్చి దిద్దాలన్న సదాశయంతో నేనా పోస్టులను ప్రచురించడం ప్రారంభించాను. అయితే తరువాతి కాలంలో నాకు తగినంత వీలు చిక్కక కొనసాగించలేక పోయాను. నేను వదలివేసాక, దానిని అందిపుచ్చుకొని 'శంకరాభరణం' బ్లాగులో శంకరయ్య గారు ఈ విషయంలో విశేషమైన కృషి సలుపుతున్నారు. ఆ బ్లాగులో మీరు నిరంతరాయంగా అభ్యాసం చేయవచ్చు.

    శుభం భూయాత్!

    రిప్లయితొలగించండి