మహాకవి డా. నండూరి రామకృష్ణమాచార్య శత జయంతి సమాపన సమావేశం "ఆన్‌లైన్"లో 29 ఏప్రిల్ 2022 నాడు సాయంత్రం "గూగుల్ మీట్" లింక్ ద్వారా నిర్వహించబడింది.
గురువు గారు "నండూరి రామకృష్ణమాచార్యుల" వారి శిష్యులు, ప్రశిష్యులు, అభిమానులు, రెండు తెలుగు రాష్ట్రాలలోని "పద్య కవితా సదస్సు" సభ్యులు, పద్య కవితా ప్రియులు, ఔత్సాహికులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్క మారు గురుస్తుతిలో పరవశిస్తున్నాను.
@@@@@@@@@@@@@@@@@
"నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -"
"""""""""""""""""""""""""""""""""""""""""""""
రచన: 'పద్య కళాప్రవీణ' డా. ఆచార్య ఫణీంద్ర
~~~~~~~~~~~~~~~~~~~~~
ఎవ్వాని భావాల కివ్వేళయే గాక
భావియున్ తల వంచి ప్రణతు లిడును -
ఎవ్వాని కావ్యాల నిముడగా వస్తువై
ధరణిలో అణువణ్వు తపన పడును -
ఎవ్వాని మాటయే ఇలలోన చాటువై
నరుల నాల్కల పైన నాట్య మాడు -
ఎవ్వాని కీర్తి మహీ మండలమ్ముపై
దశ దిశాంతమ్ములన్ దాటి సాగు -
అట్టి నండూరి వంశార్ణ వైక సోమ!
రామకృష్ణమాచార్య సన్నామధేయ!
నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -
ఎత్తి నడయాడి లోకాల నేలుకొనగ!
కువలయమున నున్న కుటిల నీతిని ఎత్తి,
కుండ బ్రద్దలట్లు కొట్టి చూపి,
అభ్యుదయ పథమ్ము ’నాలోచనము’ పేర
వెలయ జేసితి ’వధి వేమ’నగుచు!
ఎలమి డెబ్బదేండ్లకు పైన ఏకధాటి
పద్య రత్నముల్ సృజియించి ప్రణుతి కెక్కి
నట్టి ’నండూరి రామ కృష్ణా’ఖ్య సుకవి!
మహిని పద్యమ్మునకు నీవు మారు పేరు!
అతుల కవీశ్వరా! సుకవితాంబకు ముద్దుల పట్టి! పండిత
స్తుత ఘన సాహితీ కుసుమ శోభన వాటిక యందు మేటి క
ల్ప తరువునై, సుధా రస మపారము చిప్పిలు పద్య సత్ఫలాల్
శతము లొసంగితో! పలుకు శాసనమౌ గురుదేవ! మ్రొక్కెదన్!
గంగకు నర్ఘ్యం బిడుటకు
గంగా తోయము నొకింత గైకొనినట్లున్ -
మ్రింగగ నీ బోధ మతిని,
పొంగారిన కవితల నిను పూజింతు నిదే! #
@@@@@@@@@@@@@@@@@
- డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి
"నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం", హైదరాబాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి