18, అక్టోబర్ 2009, ఆదివారం

ఆణిముత్యం ( అక్టోబర్ 2009 )

" లేడు దేవుడనెడు వాడెచ్చటను లేడు "
- అనుచు నొక్కి పలికె నాస్తికుండు !
" లేడు ధరణి మీద లేడురా కంసాలి "
- పసిడి ఉంగరమ్ము బదులు పలికె !!



ఇది మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యుల కలం నుండి జాలువారిన తాత్త్వికపరమైన పద్యాలలో ఒక ఆణిముత్యం.
" దేవుడున్నాడా? లేడా ? " అన్నది యుగయుగాలుగా సాగుతున్న మీమాంస. ఈ తర్కం అంతు లేకుండా తరతరాలుగా మానవులు చేస్తూనే ఉన్నారు. కాని ఏ అతీత శక్తి లేకుండా ఈ సృష్టి, ఈ మానవుడు ... ఇంత క్రమ పద్ధతిలో ఎలా నిర్మించ బడుతున్నాయి? ఒక కంసాలి బంగారు ఉంగరాన్ని తయారు చేస్తాడు. ఎవరూ చేయకుండా ఉంగరం తయారు కాదు కదా! కాని, ఆ ఉంగరానికి కంసాలి అనేవాడు ఉన్నాడని రూఢిగా తెలిసే అవకాశం లేదు. అది తన అస్థిత్వం ఒక సహజ పరిణామమనో, లేక ఉంగరాల మనశ్శక్తి ఫలితమనో భావించే అవకాశమూ లేక పోలేదు.ఆ ఉంగరాలలో కొన్ని (ఒక వేళ వాదించే శక్తి ఉంటే), " కంసాలి అనేవాడు లేడు " అని వాదించే అవకాశం ఉండదంటారా? మానవులు అంతే!కాని వైజ్ఞానికంగా ఆలోచించినా, " ఎటువంటి బాహ్య శక్తి ప్రమేయం లేకుండా, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు గమన స్థితిలోనికి గాని, గమన స్థితిలోని వస్తువు నిశ్చల స్థితిలోనికి గాని మారవు " అన్న న్యూటన్ గమన సూత్రాలలో రెండవ సూత్రాన్ని నమ్మితే - ’ఉత్పత్తి’ అనే మార్పుకు కారణభూతమయ్యే ఆ బాహ్య శక్తి ( అదే అతీత శక్తి లేక దైవ శక్తి ) ఉందన్న విషయం ఒప్పుకోక తప్పదు. ఉంగరానికి కంసాలి ఉన్నాడన్న విషయం నిరూపించే శక్తి లేనట్టే, మానవునికి దేవుడున్నాడన్న విషయం నిరూపించే శక్తి లేక పోవచ్చు. అంత మాత్రాన కంసాలి లేడని, దేవుడూ లేడని చెప్పలేము కదా! అందుకే ఆధునిక కాలంలో ఉన్నత విద్యల నభ్యసించి, మేధావులైన వివేకానందుడు,అరవిందుని వంటి వారు ఆస్తికులై, దైవ శక్తి ప్రచారంలో తమ జీవితాలను సార్థకం చేసుకొన్నారు.
ఇంత చిన్న పద్యంలో ఇంత విస్తార విషయాన్ని ఇలా అందించడం నిజంగా విశేషం. పైగా, తరతరాలుగా కొనసాగుతున్న తర్కానికి ఇంత ’కన్విన్సింగ్’గా సమాధానం అందించడం గురువుగారి అసమాన ప్రజ్ఞా ధురీణతకు తార్కాణం.

4 కామెంట్‌లు:

  1. కృష్ణమాచార్యులవారి పేరు వినడమే గానీ వారిగురించి నాకు తెలీదు. చక్కని పరిచయం అందించినందుకు ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  2. తె.తూలిక గారు !
    మీ సాహిత్యాభిమానాన్ని గ్రహించాను.
    మీకు నా హార్దికాభినందనలు !

    రిప్లయితొలగించండి
  3. మంచి పద్యం చదివినపుడు కలిగే ఆ రసానందమే అలౌకికమైనది. అటువంటి ఆనందాన్ని కలిగించ గల్గిన రామకృష్ణమాచార్యగారికి వారి పద్యాలను మాకందరికీ అందిస్తున్న మీకూ శతకోటి వందనాలు.

    రిప్లయితొలగించండి
  4. వేదుల బాలకృష్ణమూర్తి గారికి
    అభివందన పూర్వక ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి