గత మాసం ’ చంపక మాల ’ పద్యం గురించి తెలుసుకొన్నాం కదా !
అదే ఛందస్సుకు మరో ఉదాహరణను చూద్దాం.
" అది రమణీయ పుష్పవన; మా వనమందొక మేడ; మేడపై
అదియొక మారుమూల గది; ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల యీడుగల బాలిక - పోలిక రాచపిల్ల - జం
కొదవెడు కాళ్ళ తోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగాన్ ! "
’ చంపక మాల ’ ట్యూన్ -
" తననన తాననా తనన తానన తానన తాన తాననా " అని చెప్పుకొన్నాం. అలాగే ప్రతిపాదంలో 11 వ అక్షరం యతి స్థానం. ప్రాస నియమం ఉంటుంది. పై పద్యంలో ప్రతి పాదంలో ప్రాసాక్షరం ( 2 వ అక్షరం ) - ’ ది ’, ’ ది ’, ’ దు ’ , ’ ద ’ ... ఇలా ’ ద ’ అనే హల్లుకు చెందిన గుణింతాక్షరాలు ఉన్నాయి - గమనించారి కదా !
ఇప్పుడు మొదటి పాదాన్ని ట్యూన్ తో పోల్చి చూద్దామా !
తననన : అది రమ
తాననా : ణీయ పు ( ఇక్కడ ’ పు ’ తరువాత ’ ష్ప ’ అన్న సంయుక్తాక్షరం ఉండడం వలన ’ పు ’ దీర్ఘాక్షరంతో సమానమవుతుంది. )
తనన : ష్ప వన
తానన : మా వన
తానన : మందొక
తాన : మేడ
తాననా : మేడపై
ఇక యతి - మొదటి అక్షరమయిన ’ అ ’ కు, 11 వ అక్షరమయిన ’ మా ’ లోని
’ ఆ ’ ( ము + ఆ ) కు యతి కుదిరింది.
ఇలా అన్ని పాదాలను పోల్చి చూడండి.
పద్యం వ్రాయాలన్న తపన గల ఔత్సాహికులు పై విషయాన్ని అవగాహన చేసుకొని, తొలి ప్రయత్నం చేసి వ్రాసిన పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందజేస్తే నా కృషి ఫలించినట్టుగా భావిస్తాను.
ఫణీంద్ర గారూ, నాకెప్పటినుంచో గణాల్లో ఒక సందేహం
రిప్లయితొలగించండిఋ వత్తు వచ్చే అక్షరాలు గురువులౌతాయా కాదా? ఉదాహరణ కు మిత్రుడు లేదా మితృడు లో "మి" ఏమైనా గురువు అవుతుందా? లేక "తృ" గురువు అవుతుందా? లేక అన్నీ లఘువులేనా?
అలాగే ప్రాసాక్షరాలలో ద కు సమాన ప్రాసగా దృ ను వాడవచ్చా?
నమస్సులతో ...
భారారె గారూ,
రిప్లయితొలగించండిఋ అనేది అ,ఇ,ఉ లాగా ఒక అచ్చు. అ,ఇ,ఉ లకు తలకట్టు, గుడి, కొమ్ము లాగా ఋకు ఋత్వం గుర్తు. క,కి,.కులు గురువులు కావు. వాటి ముందున్న అక్షరాలూ గురువులు కావు. అలాగే అమృతము అన్నప్పుడు మృ గురువు కాదు. దాని ముందున్న అ గురువు కాదు. అలాగే మీరు చెప్పిన మిత్రుడు పదంలో త్రు సంయుక్తాక్షరం. దానికి ముందున్న మి గురువు అవుతుంది. త్రు లో హ్రస్వాచ్చు ఉన్నందున అది గురువు కాదు. మితృడు అనడం తప్పు.
ప్రాస స్థానంలో ద కు సమానంగా దృ ను నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు.
కంది శంకరయ్య గారూ,నా సందేహాన్ని తీర్చినందుకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా ఆనందంగా వుంది. ప్రశ్నలో ప్రశ్నగా మరో ప్రశ్న. క్ష అక్షరం గురువు అవుతుందా? ఉదాహరణగా క్షతము లో క్ష గురువు అవుతుందా?
రిప్లయితొలగించండిఒకవేళ నఖక్షతము అని వుంటే ఖ గురువుగా మారుతుందా? అసలు నఖక్షతము అని కలిపి వ్రాయాలా లేక నఖ క్షతము అని విడిగా వ్రాయాలా? సందెహ నివృత్తికి సహాయపడుతున్నందులకు ముందుగా కృతజ్ఞతలు.
కరువది కృంగ దీసినది; గంపెడు దుఃఖము చేత దీనులై
రిప్లయితొలగించండితెరవును జూపుమా యనుచు దేవుని వేడిరి; అంత లోపలే
వరదలు ముంచి వేసినవి వాకిలి, యిల్లు మిగల్చ కుండగా;
బరువును పంచుకో వలయు పౌరులు మిక్కిలి దొడ్డ బుద్ధితో
భాస్కర రామిరెడ్డి గారు !
రిప్లయితొలగించండిమీ మొదటి ప్రశ్నను నేను చూచేలోపే శంకరయ్య గారు మీ సందేహ నివృత్తి చేసారు. శంకరయ్య గారికి, మీకు నా ధన్యవాదాలు ! ఇక మీ రెండవ ప్రశ్న ...
’ క్షతము ’ లో ’ క్ష ’ లఘువు అవుతుంది. కాని అది వేరే పదంతో కూడి సమాసమైనపుడు, దాని ముందున్న అక్షరం గురువవుతుంది. ఉదాహరణకు ’ నఖ క్షతము ’ లో ’ ఖ ’ గురువవుతుంది. ’ క్ష ’ లఘువవుతుంది.
ఇక ’ నఖక్షతము ’ అని వ్రాయాలా ? లేక ’ నఖ క్షతము ’ అని వ్రాయాలా ? - అన్న దానికి ఎటువంటి సూత్రీకరణలు లేవు. ఒకే సమాసం కాబట్టి కొందరు కలిపి వ్రాస్తారు. ఒకే సమాసమైనా, రెండు పదాలు స్పష్టంగా తెలియడానికి మా గురువుగారు విడిగా వ్రాసేవారు. నేనూ అదే పద్ధతిని ఆచరిస్తున్నాను.
హరి గారు !
రిప్లయితొలగించండిసమకాలీన ఇతివృత్తంతో, రసరమ్య ధారలో చక్కని ’ చంపక మాల ’ ను వ్రాసారు.
’ మిగల్చ ’ సాధు రూపం కాదు. ’ మిగుల్చ ’ అని వ్రాయాలి.
మంచి పద్యాన్ని అందించినందుకు ధన్యవాదాలు !
ఆచార్య ఫణీంద్ర గారు,
రిప్లయితొలగించండిసూచనలకు ధన్యవాదాలు.
ఆచార్యుల వారికి సందేహాలను తీర్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి