12, ఆగస్టు 2010, గురువారం

సరస సల్లాపం - 3





1960.. 70 ల నాటి సంగతి. నా చిన్ననాట ... మా పెద్దలు చెప్పుకొంటుంటే విన్న మాట! అప్పటికి ప్రసార సాధనాలుగా ఉన్నవి వార్తా పత్రికలు మరియు ఆకాశవాణి మాత్రమే. అవీ అంతంతమాత్రంగానే ఉండేవి. ఆ రోజుల్లో ప్రసిద్ధ కవి, ’పోతన చరిత్రము’ మహాకావ్య కర్త, డా. వానమామలై వరదాచార్యులు క్షయ వ్యాధి సోకి, చాలా జబ్బుపడ్డారు. అంతలో ఎవరో ఆగంతుకుడు ఆనాటి యువకవి, ఔత్సాహికుడు అయిన సి. నారాయణరెడ్డికి ఆచార్యులవారు పరమపదించినట్టుగా వార్త మోసారు. అశనిపాతంగా తాకిన ఆ వార్తకు ఎంతో కుందిన నారాయణరెడ్డి కవి వెంటనే సంతాప సభకు ఏర్పాట్లు చేసారు. కాని... నిజానికి ఆ వార్త అసత్యం. వరదాచార్యులవారు అప్పుడే కొద్దిగా కోలుకొన్నారు. ఇంతలో మరొక వార్తావహుడు ఈ విషయాన్ని ఆచార్యులవారికి అంటించాడు. ఆచార్యులవారు కోపంతో ఊగిపోతూ, సంతాపసభ కరపత్రాన్ని చేతిలో పట్టుకొని, సరిగ్గా సభామందిరంలోకి అడుగుపెట్టారు. అక్కడ సభాసదులు వక్తలతోబాటు యువకవి నారాయణరెడ్డి ఈ విషయం తెలుసుకొని ఒకింత నిశ్చేష్టులైనా, మళ్ళీ తమాయించుకొని, వానమామలై వారికి ఎదురుగా వెళ్ళారు. వరదాచార్యులు గారు కట్టలు తెంచుకొన్న ఆగ్రహంతో " నారాయణరెడ్డీ! నేను ... పోతనా? " ( " నేను అంత సులభంగా పోతాననుకొన్నావా? " అని.) అన్నారు. అప్పుడు నారాయణరెడ్డి కవి సమయస్ఫూర్తి, చాకచక్యాన్ని రంగరించి " అన్నా! నీవు పోతనే! మా పాలిట అభినవ పోతనవు! " అన్నారు. వెంటనే సినారె ఆ సంతాపసభను సన్మానసభగా మార్చి, వానమామలై వరదాచార్యులు గారికి ’అభినవ పోతన’ బిరుదప్రదానం చేయడంతో ఆ విద్వత్కవి శాంతించారు.

2 కామెంట్‌లు:

  1. 1971 లో నేను ఉద్యోగప్రయత్నంలో చెన్నూరు బ్లాక్ ప్రెసిడెంట్ ను కలవడానికి వెళ్ళాను. వారు ఊళ్ళో లేరు. రెండు రోజుల తర్వాత వస్తారన్నారు. ఆ ఊళ్ళో నాకు బంధువులు కాని, పరిచయస్తులు కాని లేరు. వానమామలై వరదాచార్యులది ఆ ఊరే అని తెలుసు. వారిని ఒక్కసారే వరంగల్ ఏ.వి.వి.హైస్కూల్ పోతన జయంతి ఉత్సవాల్లో వేదికపై చూసాను. వారి ఇంటికి వెళ్ళి కలిసి విషయం చెప్పాను. ఏమాత్రం పరిచయం లేని నాకు వారు తమ ఇంట్లో రెండు రోజులు ఆశ్రయమిచ్చారు. అప్పుడు వారు నేను వ్రాసిన వరద శతకాన్ని పూర్తిగా విని తమ అభిప్రాయాన్ని వ్రాసి ఇచ్చారు. వారి వాత్సల్యాన్ని నేనెన్నటికీ మరిచిపోను.
    అలాంటి మహానుభావుణ్ణి ప్రస్తావించిన మీకు నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. ఆత్మీయ మిత్రులు శ్రీ కంది శంకరయ్య గారు!
    ఆనాటి మహాకవులు సాహిత్యంలోనే కాక వ్యక్తిత్వంలోనూ తమ ఔన్నత్యాన్ని చూపేవారు.
    వయసులో చిన్నవాణ్ణి కాబట్టి వరదాచార్యుల వారి దర్శన భాగ్యం నాకు లభించ లేదు. కాని వారు పరమపదించాక, వారితో నాకు బంధుత్వం ఏర్పడింది. వారి అన్నగారు, ’రైతు రామాయణం’ కావ్యకర్త - వానమామలై జగన్నాథాచార్యులు గారి జ్యేష్ఠ కుమారులు, నేను తోడల్లుళ్ళం. మా మామగారికి వరదాచార్యుల వారి అన్న కుమారులు అందరి కన్న పెద్ద అల్లుడయితే, నేను అందరి కన్న చిన్న అల్లుణ్ణి.
    ఆత్మీయులుగా మీతో ఈ విషయం పంచుకోవాలనిపించింది.
    మీకు నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి