5, సెప్టెంబర్ 2010, ఆదివారం

సరస సల్లాపము - 4



1954 నాటి మాట.
అప్పటికింకా ’ఆంధ్ర ప్రదేశ్’ రాష్ట్రం ఏర్పడలేదు.
మహాకవి దాశరథి విశాలాంధ్ర (ఆయన దానిని ’మహాంధ్ర’ అనడానికి ఇష్టపడేవారు)ను ఆకాంక్షిస్తూ, ’మహాంధ్రోదయం’ కావ్యాన్ని రచిస్తున్నారు.
" నేనురా తెలగాణ నిగళాల తెగద్రొబ్బి
ఆకాశమంత ఎత్తార్చినాను -
నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు
పాడి మానవుని కాపాడినాను -
నేను పోతన కవీశాను గంటములోని
ఒడుపుల కొన్నింటి బడసినాను -
నేను వేస్తంభాల నీడలో నొక తెన్గు
తోట నాటి సుమాల దూసినాను - "
అని సీస పద్యాన్ని ఆయన పూర్తి చేసి, పైన ’ఎత్తు గీత పద్యం’ వ్రాయడానికి ఉపక్రమించారు.
" కోటిమంది తెలంగాణ ప్రజలకు రెండు కోట్ల ఆంధ్రా ప్రజల గురించి వివరాలు తెలియజెప్పి, ఆ మూడు కోట్ల ప్రజల (ఆ రోజుల్లో అక్కడ, ఇక్కడ కలిపి మొత్తం తెలుగు వాళ్ళ జనాభా మూడు కోట్లు) గొంతుల నొక్కటి చేసి, వారి ప్రతినిధిగా తాను ’మహాంధ్ర గీతా’న్ని పాడినట్లు"గా పద్యం వ్రాయాలనుకొన్నాడు. దాశరథి అంతటి వాడికి భావం స్ఫురిస్తే, పద్యం జలపాతంలా ఉబికి గుండె నుండి పొంగిరాదా? ఆయన కవితావేశం అలాంటిది.
" కోటి తమ్ముల కడ రెండు కోట్ల తెలుగు
టన్నల గూర్చి వృత్తాంత మంద జేసి,
మూడు కోట్ల గొంతుల నొక్క ముడి బిగించి
పాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతి ! " అని వ్రాసారు.
వెంటనే తన తమ్ముడు ’దాశరథి రంగాచార్య’ ( ఆ రోజుల్లో తమ్ముడే ఆయనకు ప్రథమ శ్రోత ) కు వినిపించా రాయన. రంగాచార్య శ్రద్ధగా విని, " అంతా బాగుంది గాని, అన్నయ్యా ! ఆ ’మూడు కోట్ల గొంతుల నొక్క ముడి బిగించి’ అన్నదే బాగా లేదు. మూడు కోట్ల గొంతులకు ప్రతినిధిగా నిన్ను చెప్పుకోవాలన్న నీ ఉద్దేశ్యం మంచిదే గాని, దాని అర్థం మరోలా వస్తోంది " అన్నారు. దాశరథి ఆలోచనలో పడ్డారు. మళ్ళీ రంగాచార్య " మూడు కోట్ల ’గొంతుల’కు ముడి ’బిగిస్తే’ చచ్చి ఊరుకొంటారన్నయ్యా ! దాన్ని మార్చు " అన్నారు. అప్పటివరకు కాస్త మౌనంగా ఉన్న దాశరథి వెంటనే, " నిజమేరా ! ఆవేశంలో నేను గమనించనే లేదు " అని, దాన్ని " మూడు కోటుల నొక్కటే ముడి బిగించి " అని మార్చారు.
" ఇప్పుడు బాగుంది ! " అన్నట్టుగా రంగాచార్య కళ్ళు మెరిసాయి.
( రంగాచార్య గారు నాతో స్వయంగా చెప్పిన ఉదంతం - డా. ఆచార్య ఫణీంద్ర )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి