
వ్రాసింది పద్య కవిత్వమైనా, మా గురువుగారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య అభ్యుదయకవిగా బహుళ ప్రసిద్ధి చెందారు. ఆయన రచించిన ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’, ’ఆలోచనము’ మొదలైన గ్రంథాలలోని వేలాది ముక్తక పద్యాలలో ఆలోచనాత్మకమైన తాత్త్వికత, హేతువాదంతోబాటు అక్కడక్కడా మార్క్సిస్ట్ దృక్పథం కూడా తొంగి చూస్తుంటాయి. ఆ లక్షణాలే ఆయనను ఆధునిక పద్య కవులలో ఒక విశిష్ట కవిగా అగ్రేసర స్థాయిలో నిలబెట్టాయి.
అలాంటి ఆయన ఒకసారి శ్రీ సత్యసాయిబాబా గారి ఆహ్వానం మేరకు, పుట్టపర్తికి వెళ్ళి ఆయనను సందర్శించుకొన్నారు. ఈ రోజుల్లో విలేకరులకు ఇలాంటి విషయాలలో అంత నిశిత పరిశీలన, వివేచన ఉండడం అరుదు. కాని, ఆ రోజుల్లో ఒక విలేకరి మా గురువుగారు బాబా గారి ఆశ్రమం నుండి బయటకు రాగానే, ఆయనను ఇంటర్వ్యూ పేర పట్టుకొని, ఇరుకునబెట్టే ప్రయత్నంగా - " మీరు బాబాను దైవంగా భావిస్తున్నారా ? " అని ప్రశ్నించాడు. దానికి గురువుగారి సమాధానం : " ఆయన నిజంగా దైవమే అయితే, ఆయనలోని మానవత్వానికి నేను నమస్కరిస్తున్నాను. ఆయన మనలాంటి మానవుడే అయితే ఆయనలోని దైవత్వానికి నేను నమస్కరిస్తున్నాను. " అంతే ... ఆ విలేకరి మరో ప్రశ్న వేయలేకపోయాడు.
పద్య కవిత్వమై ఉండి, హేతువాదంగా చెలామణి ఔతున్న విషయాలు తాకకుండా, మార్క్సిజం జోలికి పోకుండా రచనలు సాగించే కవి అభ్యుదయ కవె కాలేడా అన్న అనుమానం నన్ను పీడిస్తున్నది. దయచేసి విపులీకరించగలరు
రిప్లయితొలగించండిశివ గారు!
రిప్లయితొలగించండిమంచి ప్రశ్న వేసారు.
20వ శతాబ్ది ప్రారంభం వరకు ప్రధానంగా పురాణాలు, ఇతిహాసాల నుండి కథావస్తువులను ఎన్నుకొని, పద్యకావ్యాలను రచించేవారు. 20వ శతాబ్దిలో ఆధునిక కవిత్వం ఆరంభమయింది. గేయ, వచన కవిత్వాలు వచ్చాయి. ముఖ్యంగా వచన కవులు సమకాలీన సామాజికాంశాలను తీసుకొని, సమాజానికి ఉపయుక్తమయిన రచనలను చేయడం ప్ర్రారంభించారు. నేటి సమాజంలో ఈ విషయంలో హేతువాదం, మార్క్సిజం ప్రధానంగా మార్గదర్శనం చేస్తుండడం వలన ఆదునిక అభ్యుదయ కవిత్వంలో వాటి ప్రాధాన్యత పెరిగింది. అయితే ఇప్పటికీ పద్య కవులలో 70% మంది ఈ మార్పును గమనించకుండా, పాత పద్ధతిలోనే సాగిపోతున్నారు. అందుచేత ఇప్పుడు రాశిలో అత్యధికంగా ఉన్న వచన కవులు, వాసిలో పద్య కవుల కన్న వెనుకబడి ఉన్నా, చాలామంది పద్య కవుల కవితా దృక్పథ లోపం వలన, వారిని అభ్యుదయ కవులుగా గుర్తించడం లేదు. కాబట్టి ఈనాటి పద్య కవులు ఆధునికతను, అభ్యుదయాన్ని సంతరించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒకవేళ పురాణేతిహాసాల నుండి వారు అంశాలను గ్రహించినా అవి ఈనాటి సమాజానికి ఎంతవరకు ఉపయుక్తమో గ్రహించి, సమకాలీన సామాజిక హితంగా రచనలు చేయాలి. అప్పుడే వారు అభ్యుదయ కవులుగా గుర్తింపబడతారు. ఆధునిక తెలుగు పద్య సాహిత్యంలో ప్రధానంగా జాషువ, దాశరథి, మా గురువుగారు, కరుణశ్రీ లాంటి వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినంత మంది కవులే అభ్యుదయ కవులుగా గుర్తింపు పొంది ఉన్నారు. సమకాలీన పద్య కవితారంగంలో నేను అంతో, ఇంతో గుర్తింపు పొందానంటే దానికి కారణం ... నేను ఆ మహాకవుల మార్గాన్ని అనుసరించడమే. మా గురువుగారు పరమపదించేవరకు ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ అధ్యక్షులుగా ’అభ్యుదయ పద్య కవిత్వ’ ప్రచారానికే అంకితమయ్యారు. వారి శిష్యులుగా నా ప్రయత్నం కూడా అదే.