మరణ మంగళాశాసనము
[మరణించేప్పుడు వారసులకు తన ఆస్తులను పంచుతూ వీలునామా వ్రాసేవాళ్ళను ఎంతో మందిని చూస్తుంటాం. కాని మా గురువుగారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య మరణించే ముందు పద్య రూపకంగా వ్రాసిన వీలునామా ఇది. ఒక్కసారి చదివి చూడండి - ]
మరణ సమయమందు మధుర గానము చాలు -
వద్దు - మందులేవి వాడవద్దు !
ఏ గతించినప్పు డేడ్వరా దెవరేని -
ఏడ్పటన్న నాకు ఏవగింపు !
మైల పట్టవద్దు - మంత్ర తంత్రము వద్దు -
స్నాన శౌచ నిరతి చాలు - చాలు !
జరుపవచ్చు సుకవి సత్కార మొకనాడు
దుఃఖ లవము సుంత దొరలకుండ !
భార్య మ్రగ్గ రాదు, పసుపు కుంకుమ వీడి -
పదవ నాటి తంతు వద్దు - వద్దు !
భర్త చావు బాధ భార్య ఓర్చుట చాలు -
వికట కర్మకాండ వేరు నేల ?
జరుప వద్దు నాకు శ్రాద్ధ కర్మల నేవి -
వద్దు పెట్టవద్దు తద్దినాలు !
బాల బాలికలకు బహుమానముల తీర్చి,
ఏ దినముననైన నీయవచ్చు !
అంతము చెందు ఈ భువి సమస్తము, సృష్టియు దిగ్దిగంత వి
శ్రాంత మశాశ్వతము రవిచంద్రులతోడ - మనుష్యు చావు నో
వింత ఉదంతమా ? వికట వేదనలెందుకు ? సర్వ తాప ని
ష్క్రాంత మవశ్య మంగళము ! చావొక స్వస్తి వర ప్రసాదమే !
___ *** ___
శ్రీ కీ.శే.డా.నండూరి రామకృష్ణమాచార్యుల వారి వీలునామా పద్యాలు మనోవికాసాన్ని కలిగిస్తున్నాయి.ఆయన మహాత్ములు.ఆయనకు శ్రద్ధాంజలి. అందించిన మీకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినరసింహమూర్తి గారు!
రిప్లయితొలగించండిమహనీయులైన మా గురువుగారికి నా ’పద్య ప్రసూనాలు’ గ్రంథాన్ని అంకితమిచ్చాను.
అంకిత పద్యాలలో...
"నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -
ఎత్తి నడయాడి లోకాల నేలుకొనగ ! " అని వ్రాసుకొన్నాను.
మీకు నా ధన్యవాదాలు!