5, ఏప్రిల్ 2009, ఆదివారం

ఈ మాసం పద్య కవిత ...(ఏప్రిల్ 2009)


అంతర్జాతీయ విఖ్యాత భూభౌతిక శాస్త్రజ్ఞులు ఆచార్య వి.ఎల్.ఎస్. భీమ శంకరం గారు సాహిత్య లోకంలో ప్రౌఢ పద్య కవిగా ప్రసిద్ధులు. "రసస్రువు","శివానంద మందహాసం", "ద్రాక్షారామ భీమేశ్వర శతకం" మొదలైన రచనలతో ఆయన ఎనలేని ప్రఖ్యాతిని సాధించారు. ఆయన రచించిన "వసంత సభ" అన్న పద్య కవితను "ఈ మాసం పద్య కవిత"గా అందిస్తున్నాను.
ఈ శీర్షికలో ప్రచురణార్థం పద్య కవులు దయచేసి కొత్త విషయాలపై వ్రాసిన తమ పద్య కవితలను తెలుగు(యూనికోడ్)లో టైపు చేసి, dr.acharya_phaneendra@in.com కు ఈ-మెయిల్ చేయగలరు.
- డా.ఆచార్య ఫణీంద్ర

విరోధి నామ సంవత్సర వసంత సభ
-------------------------------------
రచన: ఆచార్య వి.ఎల్.ఎస్. భీమశంకరం
----------------------------------------

తెలతెలవారుచుండె, మది తీయని స్వప్నము తోడ నిండె, నే
తులుచన లేచి చెంత గల తోటకు నేగితి దైవ పూజకై
అలరులు కోయగా - నచట నబ్బుర మొప్పగ ప్రస్ఫురిల్లె క
న్నులు మిరుమిట్లు గొల్పగ వినూతన దృశ్యము లొక్క పెట్టునన్.

అపుడె ఉదయించు నాదిత్యు నరుణ కాంతి
కొలది కొలదిగ నన్ని దిక్కులకు కవిసి
నేల తల్లికి పారాణి నిమిరె ననగ -
ప్రకృతి కాంత కన్బడె నవ వధువు వోలె.

మొల్ల, సంపంగి, తంగేడు, పొగడ, మల్లె
మొల్లముల నుండి బహువర్ణ పుష్ప వృష్టి
నింగి హరివిల్లు నేలకు వంగుచుండె
ననగ నానంద పరిచె నా మనము నపుడు.

రంగు రంగుల అవనతాంబురుహ కుట్మ
లాంగనలు ఫుల్లమై లేచి భృంగ తతికి
నధర మకరంద నిష్యంద మధురమైన
చెరకు విలుతు లకోరీల బరపె నపుడు.

రంగు రంగుల పువ్వుల రంగశాల ,
రంగశాలను నర్తించు భృంగ చయము
లింపుగా తోచె కమనీయ దృశ్యముగను
హోలి యాడెడు రంగారు యువత వోలె

పిల్లగాలికి పూబాల ప్రేంకణములు,
ప్రేంకణంబుల చెలరేగి ప్రీతి గొల్పు
సరస పరిమళ సుమగంధ సౌరభంబు
లపుడు ప్రకటించె నామని ఆగమనము.

ఏమది! నేడు భూమి వసియించెడు స్థావర జంగమ వ్రజం
బామని శోభ దేలుచు సుఖాయుత దివ్య మనోజ్ఞ నాట్య గీ
తామృత మాస్వదించుటకునై మది నీవిధి నిశ్చితార్థులై
కామనతో వసంత సభ కాముని పండువుగా రచించిరో!

అవిగో - అల్లవిగో - అవే! నవ వసంతారంభ సంరంభముల్
రవిబింబం బరుణ ప్రియంగువులతో ప్రాచీ దిశన్ గప్పెడున్,
శ్రవణానంద మహోదయాగమున సంరావంబు విన్వచ్చెడున్,
భువి నేతెంచె 'విరోధి' ఆంధ్ర జన సమ్మోద ప్రమోదంబుగాన్.

పేరులో 'విరోధి'యె గాని ప్రేమ తోడ
జనుల సాకగా వచ్చిన సౌమ్య మూర్తి ,
మనల కాయురారోగ్య కామనల దీర్చు
వత్సరంబని నా మన ముత్సహించె.
--- *** ---

1 కామెంట్‌: