12, ఏప్రిల్ 2009, ఆదివారం

సులువుగా పద్యం వ్రాయండి ... (ఏప్రిల్ 2009)

ఇప్పుడిక పద్యాలలో యతి, ప్రాసలను ఎలా వేయాలో తెలుసుకొందాం.
మన అక్షరాలను మనం ’అచ్చులు’, ’హల్లులు’ అని రెండు విభాగాలుగా నేర్చుకొన్నాం.
’అ’ నుండి ’ఆః’ వరకు ఉన్నవి అచ్చులు -
’క’ నుండి ’ఱ’ వరకు ఉన్నవి హల్లులు.
మన భాషలోని పదాలలో ప్రతి అక్షరంలో అచ్చు, హల్లు రెండు మిళితమై ఉంటాయి. అందుకే మనం ’గుణింతా’లని నేర్చుకొనేది.
మనం పద్యాలలో ’యతి మైత్రి’ వేసేప్పుడు అటు ’స్వర (అచ్చు) మైత్రి’, ఇటు ’వ్యంజన (హల్లు) మైత్రి’ రెండూ కుదిరేలా చూసుకోవాలి.
అచ్చులలో క్రింద పేర్కొన్న జట్టులలో వాటిలో వాటికే యతి కుదురుతుంది కానీ , వేరే వాటితో కుదరదు.
* అ,ఆ,ఐ,ఔ,అం,ఆః,య,హ
ఉదా|| ’అ’ల్పుడెపుడు పలుకు ’ఆ’డంబరముగాను
* ఇ,ఈ,ఎ,ఏ,ఋ,ౠ,
ఉదా|| ’ఇ’తరులెరుగకున్న ’ఈ’శ్వరు డెరుగడా?
* ఉ,ఊ,ఒ,ఓ
ఉదా|| ’ఉ’ప్పు కప్పురంబు ’ఒ’క్క పోలిక నుండు
పై మూడు జట్టులలోని అక్షరాలను గుర్తుంచుకొని, ఉదాహరణలను పరిశీలిస్తే విషయం బోధపడుతుంది.
’య’,’హ’ హల్లులైనా ఉచ్చారణ దగ్గరగా ఉండడం వలన ’అ’ జట్టులోని అచ్చులతో కూడి ఉంటే, ఆ అచ్చులతో యతి మైత్రి కుదురుతుంది.
ఉదా|| ’అ’ల్లరి మూక నేతలు మ’హా’త్ములటన్నను నమ్మ శక్యమే?
ఇందులో ’అ’కి, ’హా’కి యతి కుదిరింది. అలాగే మరొక
ఉదా|| ’య’జ్ఞ ఫలము నందుకొనిరి ’ఆ’తని పత్నుల్!
ఇక్కడ ’య’కి, ’ఆ’కి యతి మైత్రి కుదిరింది.
ఇక హల్లులలో ఏ ఏ జట్టులలో ఏ ఏ అక్షరాలకు యతి కుదురుతుందో చూద్దాం.
* క, ఖ, గ, ఘ, క్ష
ఉదా|| ’కం’చు మ్రోగినట్లు ’క’నకంబు మ్రోగునా?
ఇలాగే మిగితా జట్టులు ...
* చ, ఛ, జ, ఝ, శ, ష, స, క్ష, జ్ఞ
* ట, ఠ, డ, ఢ
* త, థ, ద, ధ
* న, ణ, o
* ప, ఫ, బ, భ, వ
* మ, oప, oఫ, oబ, oభ (ప్రత్యేకంగా... పు, పూ, పొ, పో, ఫు, ఫూ, ఫొ, ఫో, బు, బూ, బొ, బో, భు, భూ, భొ, భో- లతో ... ము, మూ, మొ, మో లకు యతి కుదురుతుంది.)
ఉదా|| ’మా’దు జనని! దుర్గమ్మ! అ’oబ’! దయ జూడు
అలాగే, మరో ఉదా|| ’పు’లతి అందమైన ’మో’ము జూడు
ఇంకా మిగిలిన జట్టులు ఇవి -
* ర, ఱ
* ల, ళ
* య, హ, అ,ఆ, ఐ, ఔ, అం, ఆః
ఒక ముఖ్య విషయమేమిటంటే, యతి మైత్రి అంటే - అచ్చు మైత్రి, హల్లు మైత్రి రెండూ తప్పకుండా కుదరాలి.
ఉదా|| ’దే’శ భాషలందు ’తె’లుగు లెస్స
ఇందులో ’ద’ కి, ’త’ కి హల్లు మైత్రి, అందులోని ’ఏ’ కి, ఇందులోని ’ఎ’కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి.
ఉదా|| ’స’జ్జనుండు పలుకు ’చ’ల్లగాను
ఇందులో ’స’ కి ’చ’ కి మధ్య హల్లు మైత్రి - మళ్ళీ అందులోని ’అ’ కి, ఇందులోని ’అ’ కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి. మరొక ఉదా||
’చి’త్త శుద్ధి లేని ’శి’వ పూజలేలయా?
ఇందులో ’చ’ కి ’శ’ కి హల్లు మైత్రి మరియు అందులోని ’ఇ’ కి, ఇందులోని ’ఇ’ కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి గదా!
ఇవి గాక ’ప్రాస యతి’ అని ఒకటుంది. ఇది అన్ని ఛందస్సులలో పనికి రాదు. కొన్ని ఛందస్సులలో అంగీకరింపబడుతుంది. ఉదాహరణకు ’సీసము’, ’తేట గీతి’, ’ఆట వెలది’ మొ||వి. పైగా, ఈ ఛందస్సులలో ప్రాస యతి వాడితే ఆ పద్యాలకు మంచి అందం కూడా వస్తుంది.
’ప్రాస యతి’ అంటే, ఆ యా అక్షరాలకు మధ్య యతి బదులు వాటి ప్రక్క అక్షరాలకు ప్రాస వేయడం.
ఉదా|| ’ఇల్లు’ మొత్తమపుడు ’గుల్ల’యయ్యె
ఇందులో ’ఇ’ కి ’గు’ కి యతి కుదర లేదు. కాని వాటి ప్రక్కన రెండు చోట్లా ’ల్ల’ అన్న ప్రాస పడింది. ఇది ’ప్రాస యతి’
’యతి’ గురించి ఈ జ్ఞానం సరిపోతుంది.
ఇక ’ప్రాస’ - ఇది ఇంతకు ముందు పాఠంలో చెప్పుకొన్నట్టు పద్యంలోని ప్రతి పాదంలో రెండవ అక్షరం ఒకటే అదే హల్లుకు సంబంధించినది ఉండడం. అందులోని అచ్చు మారినా ఫరవా లేదు.
ఉదా|| క’oదు’కము వోలె సుజనుడు
క్రి’oదం’బడి మగుడి మీది
కెగయు జుమీ
మ’oదు’డు మృత్పిండము వలె
గ్రి’oదం’బడి యడగి యుండు
గృపణత్వమునన్
ఈ పద్యంలో బిందు పూర్వక దకార( oద) ప్రాస వేయబడింది. గమనించారు కదా!
ఈ విషయాలన్నీ మనసులో ఆకళించుకొని, ఈ మాసమంతా ఎక్కడ ఏ పద్యం కనిపించినా దానిలో యతి ప్రాసలు ఎలా వేసారో గమనిస్తూ, సాధికారతను సాధించండి.
వచ్చే నెలలో సులభంగా వృత్త పద్యాలు వ్రాయడం నేర్చుకొందాం మరి. ఇప్పటికిక సెలవు.
- డా.ఆచార్య ఫణీంద్ర
(సంపాదకుడు)

7 కామెంట్‌లు:

  1. ఫణీంద్ర గారు , మంచి టపానందించినందుకు ధన్యవాదాలు.
    టపా లో
    "న" వర్గ యతి అలాగే "మ" వర్గ యతి అక్షరాలు సరిగా కనిపించడము లేదు. ( Broken zeros ) .

    "మ" గుణింత యతి ని ఇంకొంచెం సోదాహరణ గా వివరిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము.

    రిప్లయితొలగించండి
  2. రామిరెడ్డి గారూ! ధన్యవాదాలు.
    broken 'zero's ని సరి చెసాను.
    ’మ’తో ’మ’కే యతి చెల్లుతుంది. కాకపోతె బిందు పూర్వక ’ప వర్గ అక్షరాలతొ ’మ’కి యతి కుదురుతుంది.
    ఉదా|| ’మా’దు జనని! దుర్గమ్మ! అ’oబ’! దయ జూడు
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  3. గౌరవనీయులైన ఆచార్య ఫణీంద్ర గారూ..

    ఈ పుటని నేను పూర్తిగా చదవలేకపోయ్యాను, అందుకు పలు కారణాలు. కారణాలు ఏవైనా ఒకట్ మాత్రం నిజం అది నాకు అంతగా భావ వ్యక్తీకరించే టాలెంట్ లేక పోవడం. ఇవి ప్రక్కన పెడితే, మీ వివరణా విధానం అనండి లేదా వివరణా శైలి అనండి మరేదైనా అనండి చాలా బాగుంది. మెచ్చుకోకుండా ఉండ లేకపోతున్నాను. వయస్సులోనే కాదు అన్నింటా నేను మీకన్నా చిన్న వాడినే, కాని సహసం చేసి స్పందిస్తున్నాను.

    చాలా బాగా వ్రాస్తున్నారు. ఇలాగే పది కాలాల పాటు పలు విషయాలపై తెలియ జేస్తారని ఆశిస్తాను.

    భవదీయుడు,
    చక్రవర్తి

    రిప్లయితొలగించండి
  4. శ్రీ డా.ఆచార్య ఫణీంద్ర గారూ,
    ఈ నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లోని మీ రంగవల్లి పద్య కవితను చదివాను. మొదటి పద్యం మొదటి పాదం చదవగానే ఉలిక్కిపడి ఖండిక చివర కరుణశ్రీ గారికి కృతజ్ఞతలతో అన్నది చూసి సర్దుకున్నాను. చాలా బాగా రాసారు. అభినందనలు. దీనికి "రంగవల్లీ విలాపము" అని శీర్షిక ఇస్తే ఇంకా బాగుండేదేమో! పేరడీలు హాస్యానికే కాదు సుమధుర భావ స్ఫోరకంగా కూడా రాయవచ్చని చూపించారు. ఇంత మంచి కవితను ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్నట్టు .. కొత్తగా సమస్యాపూరణాలు ఇవ్వడం లేదెందుకు?

    రిప్లయితొలగించండి
  5. ఆంధ్రజ్యోతి ఆ.అ.లో మీ ముగ్గు విలాపం పద్యాలు బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. చక్రవర్తి గారికి, శంకరయ్య గారికి, కొత్త పాళీ గారికి ధన్యవాదాలు.
    పనుల ఒత్తిళ్ళ వలన ఇన్నాళ్ళు బ్లాగును నిర్వహించలేకపోయాను.
    ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించగలరు.
    _ డా|| ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  7. యతి మైత్రి చాలా బాగా అర్థం ఐనది
    మీ వివరణ శైలి అద్భుతం

    రిప్లయితొలగించండి