8, ఏప్రిల్ 2009, బుధవారం

"ఆణిముత్యం" ... ఏప్రిల్ 2009

మెదడులోన ’మార్క్సు’, హృదిలోన బుద్ధుడై -
విప్లవమ్ము, కరుణ వింగడించి
పుట్టవలయు సుకవి భువనైక పౌరుడై
ప్రగతి కొరకు - నూత్న జగతి కొరకు!


వేమన వలె మా గురువు గారు రచించిన వేలాది ఆటవెలది ముక్తక పద్యాలలో ఇది ఒకటి.
మా గురువు గారు - స్వర్గీయ ’నండూరి రామకృష్ణమాచార్య’ సాహిత్య లోకంలో బహుళ ప్రసిద్ధి చెందిన మహాకవి. వీరు రచించిన ’శీర్ణ మేఖల’ ఖండ కావ్యం ఏభయ్యేళ్ళ క్రితం ఒక ఊపు ఊపింది. అందులోని కర్ణ, సుయోధన మైత్రికి సంబంధించిన ఘట్టం వీరి స్వీయ కల్పితం. ఈనాటికీ ఇది నీరాజనాలందుకొంటూనే ఉంది. మా గురువు గారు డా.నండూరి రామకృష్ణమాచార్య ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ’అధికార భాషా సంఘం’ అధ్యక్షులుగా 1987- 1990 మధ్య పని చేసారు.
వీరి ప్రసిద్ధ రచనలలో ’తారా తోరణం’, ’ఆలోచనం’, ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’,’ముత్యాల గొడుగు’, ’కచ్ఛపీ కింకిణీకం’ వంటి కవితా సంపుటులు; ’శివాజీ’, ’ధర్మ చక్రం’, ’జ్యోత్స్నాభిసారిక’, ’గోదావరి’ వంటి నాటికలు; ’కావ్యాలోకం’ అనే లక్షణ గ్రంథం; ’కవిత్రయం’, ’పద్య శిల్పం’ వంటి విమర్శన గ్రంథాలు ప్రముఖమైనవి. ఇవి గాక ఆంగ్లంలో 'Maha Bharata', 'Gandhian Era' ప్రసిద్ధ రచనలు. మహాకవి ’కరుణశ్రీ’, వీరు ఆత్మీయ మిత్రులు. ’కరుణశ్రీ’ గ్రంథాలన్నిటికీ ’నండూరి’ వారే పీఠికలు వ్రాసారు.
’కేంద్ర సాహిత్య అకాడమి’ 1955 ప్రాంతంలో ’జాషువ’, ’కరుణశ్రీ’ మరియు మా గురువు గారిని ’నవ్య సంప్రదాయ కవులు’గా గుర్తించింది.
ఆచార్యుల వారు ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా ఆమరణాంతం పద్య కవితాభివృద్దికై విశేష కృషిని సలిపారు.
మెదడులోని ఆలోచనా విధానంలో ’కార్ల్ మార్క్స్’ ప్రబోధించిన సామ్యవాదాత్మక విప్లవ భావాలను, అంతరంగంలో ’బుద్ధుడు’ బోధించిన కరుణ తత్త్వాన్ని కలిగి - సత్కవియైన వాడు ఈ ప్రపంచంలో ఒక విశిష్ట వ్యక్తిగా అవతరించి, ప్రగతిని సాధించేందుకు పాటుపడుతూ, ఒక నవ సమాజ నిర్మాణానికి దోహదపడాలని ఈ పద్య భావం. వైరుధ్య భావాలలో కూడా ఉన్న ’మంచి’ని గ్రహించి కవి ముందుకు సాగాలని గురువు గారు ఈ పద్యంలో కవిలోకానికి సందేశం అందించారు.
- డా.ఆచార్య ఫణీంద్ర

2 కామెంట్‌లు:

  1. శీర్ణమేఖల-ఎంత,అందమైన పేరు. చిన్నప్పుడు స్చూల్లో ఏ తరగతో గుర్తు లేదు కాని - త్రోసిరాజో లేక ఉయ్యాల త్రోసిరాజో కోరుకొమ్మంచు - ఈ పద బంధం ఇప్పటికీ గుర్తె. ఈ పాఠ్యభాగం అంటె నాకు చాలా ఇష్టం. అందుకె అప్పటినుంచి దుర్యోధనుడు అంటె భారత కధా పరంగా వ్యతిరేక భావం ఉన్నా కాని ఏదో మూల ఓ చిన్న సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  2. ’నరసింహ’ గారు! ధన్యవాదాలు.
    ’శీర్ణ మేఖల’ కృతికర్తకు శిష్యుడైనందుకు నేను గర్విస్తున్నాను. ఆయన జీవన చరమాంకంలో చివరి దశాబ్దంపాటు అనుంగు శిష్యునిగా వర్ధిల్లిన మహద్భాగ్యం నాది. ఆయన పేరిట ఆయన జీవించి ఉండగానే నెలకొల్పబడిన సాహిత్య పీఠానికి నన్ను ఆయనే శాశ్వత ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అది నా అదృష్టంగా భావిస్తాను.
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి