సులువుగా పద్యం వ్రాయండి ... ( జులై 2009 )లఘువులు, గురువులు, గణాల గోల లేకుండా కేవలం ఒక పాటలా ట్యూనిచ్చి, ఆ ట్యూన్ లోని ఒక్కొక్క భాగానికి ఎలాంటి పదాలు ఇముడుతాయో మూడు, నాలుగు పదాలు ఉదాహరణలుగా చూపి, మళ్ళీ మొత్తంగా ఒక ప్రసిద్ధ పద్యాన్ని ఆ ట్యూన్ ప్రకారం ఎలా కుదిరిందో వివరించి, తప్పులున్నా సరే _ సరిదిద్దుతానని హామీ ఇచ్చినా ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఒక్క పద్యాన్ని (తప్పో _ ఒప్పో _ ) వ్రాయక పోవడం నన్ను నిరాశకు గురి చేసింది. వ్రాయలేక పోవడం అనే కన్న అసలు ప్రయత్నమే చేసినట్టుగా కనిపించడం లేదు. ఫరవా లేదు. మరి కొన్ని ఉదాహరణలు చూపుతాను.
ఇప్పుడు మన ప్రధాన మంత్రి " మన్మోహన్ సింగ్ " పై " ఉత్పల మాల " పద్యం వ్రాయాలనుకోండి. ముందుగా ఆయనను తలచుకోగానే మనకేం గుర్తొస్తుంది ? ఆయన ముఖంలో గడ్డం అనుకోండి. ఇప్పుడా విషయం పద్యంలో చెప్పుదాం.
ఉత్పల మాల ట్యూన్ ఏంటి ?
తానన తాననా తనన తానన తానన తాన తాననా
ఇప్పుడు పైన అనుకొన్న భావం ట్యూన్ లో ఇలా చెప్పవచ్చు.
తానన : మోమున
తాననా : గడ్డముం
తనన : డు _ _ ( తనన లో "త" వరకే నింపాము. ఇంకా " నన " మిగిలి ఉంది.
ఇంత వరకు వ్రాసిందేంటి ?
" మోమున గడ్డముండు ..."
మన మనుకొన్న భావం వచ్చింది. ఇంకా ఆయన గురించి ఏం చెప్పవచ్చు? నెత్తి మీద " పగ్డి " ఉంటుంది.
తనన : డు ... శిర
తానన : మున్ ధరి
తానన : యించును
తాన : పగ్డి
ఇప్పుడు మళ్ళీ పద్యం చూదాం.
" మోమున గడ్డముండు _ శిరమున్ ధరియించును పగ్డి _ ... " ( ఇక్కడ మొదటి అక్షరం " మో " కి, పదో అక్షరం _
" మున్ " కి యతి కుదిరింది. గమనించండి. )
ఇంకా ఆయన గురించి ఏం చెప్పవచ్చు? ... ఎప్పుడు చిరునవ్వులను చిందుతుంటాడు. అయితే పద్యం రెండో పాదంలోకి వెళుతోంది కాబట్టి ప్రాసాక్షరం సరి పోయేలా పదం వేయాలి. " మందహాసామృతము " పదమయితే " మృ " ప్రాసాక్షరంగా పడి సరిపోతుంది. ఎలాగో చూడండి.
తాననా : మందహా ( ఇక్కడికి మొదటి పాదం పూర్తయింది.)
మళ్ళీ ... రెండో పాదం ప్రారంభిస్తే ...
తానన : సామృత
తాననా : మున్ సదా
తనన : కురియు
ఇప్పుడు పద్యం ఎంత వరకు వచ్చిందో చూద్దాం.
" మోమున గడ్డముండు _ శిరమున్ ధరియించును పగ్డి _ మంద హా
సామృతమున్ సదా కురియు _ ..."
ఇప్పుడు రాబోయే అక్షరం రెండో పాదంలో పదో అక్షరం కాబట్టి మళ్ళీ యతి చూసుకోవాలి. రెండో పాదం " సామృత " అని ప్రారంభమైనా, అక్కడ సంధి వల్ల " సా " వచ్చింది గాని, నిజానికి అక్కడ ఉన్నది " అమృత " లోని " అ "... కాబట్టి " అ " కే యతి వేయాలి.
సరే ! ఇంతకీ ఆయన గురించి ఇంకేం చెప్పవచ్చు? ఆయన ఆర్థిక శాస్త్రంలో మేటి.
తానన : ఆర్థిక
తానన : శాస్త్రము
తాన : నందు
తాననా : మేటియౌ ( ఇక్కడికి రెండో పాదం కూడా పూర్తయింది )
ఇప్పుడు పద్యాన్ని చూద్దాం _
" మోమున గడ్డముండు _ శిరమున్ ధరియించును పగ్డి _ మంద హా
సామృతమున్ సదా కురియు _ ఆర్థిక శాస్త్రము నందు మేటియౌ "
మన్మోహన్ సింగ్ ను గూర్చి ఇంకా ఏం చెప్పవచ్చో ఇలాగే ఆలోచిస్తూ మూడు , నాలుగు పాదాలను కూడా ఇలా పూర్తి చేయవచ్చు.
తానన : " శ్రీ మన
తాననా : మోహనా "
తనన : ఖ్యుడను
తానన : " సింగు " యె
తానన : " కింగ " యి
తాన : నేడు
తాననా : దీటుగా ( దీంతో మూడో పాదం అయిపోయింది. )
ఇక్ నాలుగో పాదం ...
తానన : క్షేమము
తాననా : గా సుపా
తనన : లనము
తానన : సేయుచు
తానన : నుండెను
తాన : భార
తాననా : తావనిన్ ( నాలుగో పాదం కూడా పూర్తయిపోయింది )
ఇప్పుడు మొత్తం పద్యాన్ని చూద్దాం ...
" మోమున గడ్డముండు _ శిరమున్ ధరియించును పగ్డి _ మంద హా
సామృతమున్ సదా కురియు _ ఆర్థిక శాస్త్రమునందు మేటియౌ
శ్రీ మనమోహనాఖ్యుడను " సింగుయె కింగయి " నేడు దీటుగా,
క్షేమముగా సుపాలనము సేయుచునుండెను భారతావనిన్ ! "
చూసారా ? మన ప్రధానిపై ఎంత చక్కని పద్యం రూపు దిద్దుకొందో ! ఇది నేను ఇప్పటికిప్పుడు పాఠం వ్రాస్తూ అల్లిన పద్యమే ! ఇందులో పెద్ద కష్టమేమీ లేదు. మీరు కూడా మీకిష్టమైన నాయకుని మీద ఒక " ఉత్పల మాల " పద్యం వ్రాయండి ... అది _ ఇందిరా గాంధి కావచ్చు. లేక పోతే వాజపాయి, లేక చంద్రబాబు, ఇంకా ... రాజశేఖర రెడ్డి, కాకపోతే సచిన్ టెండూల్కర్, ధోనీ ... ఎవరైనా కావచ్చు. వ్యాఖ్యగా ప్రచురించండి. తప్పులుంటే సరి దిద్దుతాను. అవసరమైతే సూచనలిస్తాను. ఒక్క పద్యం వ్రాయండి ... తరువాత చూడండి _ ఆ అనిర్వచనీయమైన ఆనందం ఎలా ఉంటుందో !
ALL THE BEST !
_ డా . ఆచార్య ఫణీంద్ర
సంపాదకుడు